Revised Common Lectionary (Semicontinuous)
దేవుడు తన ప్రత్యేక సేవకుణ్ణి పిలవడం
49 దూర ప్రాంతాల్లో ఉన్న ప్రజలారా, మీరంతా నామాట వినండి!
భూమి మీద నివసిస్తున్న ప్రజలారా, మీరంతా వినండి!
నేను పుట్టక మునుపే యెహోవా నన్ను తన సేవకోసం పిలిచాడు.
నేను నా తల్లి గర్భంలో ఉండగానే యెహోవా నాకు పేరు పెట్టాడు.
2 తన పక్షంగా మాట్లాడేందుకు యెహోవా నన్ను వాడుకొంటాడు.
పదునైన ఖడ్గాన్ని ఒక సైనికుడు వాడుకొన్నట్టు ఆయన నన్ను వాడుకొంటాడు.
అయితే ఆయన నన్ను తన చేతిలో దాచిఉంచి కాపాడుతాడు కూడాను.
వాడిగల బాణంలా యెహోవా నన్ను వాడుకొంటాడు.
అయితే ఆయన నన్ను తన బాణాల పొదిలో దాచి ఉంచుతాడు కూడాను.
3 “ఇశ్రాయేలూ, నీవు నా సేవకుడివి.
నీతో నేను అద్భుత కార్యాలు చేస్తాను” అని యెహోవా నాతో చెప్పాడు.
4 నేను చెప్పాను, “వట్టిగానే నేను కష్టపడి పనిచేశాను.
నేను చాలా అలసిపోయాను. కాని ప్రయోజనకరమైనది ఏమీ నేను చేయలేదు.
నా శక్తి అంతటిని ఉపయోగించాను. కానీ వాస్తవానికి నేను చేసింది ఏమీ లేదు.
కనుక నా విషయం ఏమి చేయాలో యెహోవాయే నిర్ణయించాలి.
దేవుడే నా బహుమానం నిర్ణయించాలి.
5 నా తల్లి గర్భంలో యెహోవా నన్ను చేసాడు.
నేను ఆయన సేవకునిగా ఉండుటకు ఆయన అలా చేసాడు.
యాకోబును, ఇశ్రాయేలును నేను తిరిగి ఆయన దగ్గరకు నడిపించునట్లు ఆయన నన్ను అలా చేసాడు.
యెహోవా నన్ను సన్మానిస్తాడు.
నా దేవుని నుండి నేను నా బలం పొందుతాను.”
6 యెహోవా నాతో చెప్పాడు, “నీవు నాకు చాలా ప్రాముఖ్యమైన సేవకుడివి.
ఇశ్రాయేలు ప్రజలు ఖైదీలు. వారు తిరిగి నా వద్దకు తీసుకొని రాబడతారు.
అప్పుడు యాకోబు కుటుంబ దళాలు తిరిగి నా వద్దకు వస్తారు.
అయితే నీకు మరో పని ఉంది; అది దీనికంటె ఇంకా ముఖ్యమయింది.
సమస్త రాజ్యాలకు నిన్ను నేను వెలుగుగా చేస్తాను,
భూమిమీద మనుష్యులందరినీ రక్షించేందుకు నీవే నా మార్గంగా ఉంటావు.”
7 యెహోవా, ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు. ఇశ్రాయేలును కాపాడుతాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, “నా సేవకుడు దీనుడు.
అతడు పాలకులను సేవిస్తాడు. ప్రజలు అతన్ని ద్వేషిస్తారు.
కానీ రాజులు అతన్ని చూచి, అతడ్ని సన్మానించేందుకు నిలబడతారు.
మహానాయకులు అతని ఎదుట సాగిలపడతారు.”
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు, యెహోవా కోరినందుచేత ఇది జరుగుతుంది. మరియు యెహోవా నమ్మదగినవాడు. నిన్ను కోరుకొన్నవాడు ఆయనే.
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
వారు యెహోవాను నమ్ముకొంటారు.
4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
1 దైవేచ్ఛవల్ల యేసు క్రీస్తు అపొస్తలుడుగా వుండటానికి పిలువబడ్డ పౌలు నుండి, మరియు సోదరుడైన సొస్తెనేసు నుండి.
2 కొరింథులోని దేవుని సంఘానికి అంటే యేసు క్రీస్తులో పరిశుద్ధులుగా నుండుటకు పిలువబడిన మీకును, ఇతర ప్రాంతాల్లో నివసిస్తూ, యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న వారందరికి శుభం కలుగు గాక!
3 మన తండ్రియైన దేవుని నుండి, ప్రభువైన యేసు క్రీస్తు నుండి మీకు శాంతి, అనుగ్రహం లభించు గాక!
కృతజ్ఞత
4 యేసు క్రీస్తు ద్వారా మీకు తన అనుగ్రహం ప్రసాదించిన దేవునికి నేను మీ పక్షాన అన్ని వేళలా కృతజ్ఞతలు అర్పిస్తాను. 5 మీరు ఆయనలో ఐక్యత పొందారు. కనుక మీ మాటలో, మీ జ్ఞానంలో అన్ని విధాలా అభివృద్ధి చెందారు. 6 క్రీస్తును గురించి చెప్పబడిన సందేశం మీలో బాగా నాటుకుపోయింది. 7 మరియు ప్రభువైన యేసు క్రీస్తు రెండవ రాకడ కొరకు మీరు కాచుకొని ఉన్నారు. ఆత్మీయ జ్ఞానానికి మీలో ఏ కొరతా లేదు. 8 మన యేసు క్రీస్తు ప్రభువు వచ్చిన రోజున మీరు నిర్దోషులుగా పరిగణింపబడతారు. దానికి తగినట్లు దేవుడు మీకు చివరిదాకా శక్తినిస్తాడు. 9 తన కుమారుడు, మన ప్రభువు అయినటువంటి యేసు క్రీస్తుతో సహవారసులగుటకు దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఆయన నమ్మకస్థుడు.
దేవుని గొఱ్ఱె పిల్ల
29 మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు. 30 నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే! 31 అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.
32 ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను. 33 బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు. 34 నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”
యేసు మొదటి శిష్యులు
35 మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు. 36 అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.
37 ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు. 38 యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు.
వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)
39 యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.
40 యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో 41 అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.
42 తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా[a] అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.
© 1997 Bible League International