Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
వారు యెహోవాను నమ్ముకొంటారు.
4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
ఏశావుకు ఆశీర్వాదం లేకుండుట
30 యాకోబును ఆశీర్వదించటం ముగించాడు ఇస్సాకు. అప్పుడు, తన తండ్రి ఇస్సాకును విడిచి యాకోబు వెళ్తుండగా, వేటనుండి ఏశావు తిరిగి వచ్చాడు. 31 తన తండ్రికి ఇష్టమైన ప్రత్యేక విధానంలో భోజనం తయారు చేశాడు ఏశావు. దానిని ఏశావు తన తండ్రి దగ్గరకు తెచ్చాడు. అతడు తన తండ్రితో, “నాయనా, లేచి నీ కుమారుడు నీ కోసం వేటాడి తెచ్చి వండిన మాంసాన్ని తిను, అప్పుడు నీవు నన్ను దీవించగలవు”.
32 అయితే ఇస్సాకు, “ఎవరు నీవు?” అని అతన్ని అడిగాడు.
“నేను నీ మొదటి కుమారుణ్ణి, ఏశావును” అన్నాడతను.
33 అప్పుడు ఇస్సాకు చాలా బాధపడి, “అలాగైతే నీవు రాకముందు భోజనం వండి, నా దగ్గరకు తీసుకువచ్చినదెవరు? నేను అదంతా శుభ్రంగా భోంచేసి, అతణ్ణి నేను ఆశీర్వదించానుగదా. ఇప్పుడు మళ్లీ నా ఆశీర్వాదాన్ని నేను వెనుకకు తీసుకోవటానికి సమయం మించిపోయిందే” అన్నాడు.
34 తన తండ్రి మాటలు విన్నప్పుడు ఏశావులో కోపం, కక్ష రెచ్చిపోయాయి. అతను గట్టిగా ఏడ్చేసి “అలాగైతే నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అని తన తండ్రితో చెప్పాడు.
35 “నీ సోదరుడు నన్ను మోసం చేశాడు. అతను వచ్చి, నీ ఆశీర్వాదాలు తీసుకొన్నాడు” అన్నాడు ఇస్సాకు.
36 “అతని పేరే యాకోబు (మోసగాడు). అది అతనికి సరైన పేరు. రెండుసార్లు అతడు నన్ను మోసం చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు తీసివేసుకొన్నాడు, ఇప్పుడు నా ఆశీర్వాదాలు తీసివేసుకొన్నాడు” అని చెప్పి ఏశావు, “మరి నా కోసం ఆశీర్వాదాలు ఏమైనా మిగిల్చావా?” అని ప్రశ్నించాడు.
37 “లేదు, ఇప్పుడు చాలా ఆలస్యమైపోయింది. నీ మీద పరిపాలన చేసే అధికారం యాకోబుకు నేనిచ్చాను. అతని సోదరులంతా అతని సేవకులవుతారని కూడా నేను చెప్పాను. ధాన్యం, ద్రాక్షారసం, సమృద్ధిగా కలిగే అశీర్వాదం కూడా నేను అతనికి యిచ్చాను. నీకు ఇచ్చేందుకు యింకేమీ మిగల్లేదు కుమారుడా” అని జవాబిచ్చాడు ఇస్సాకు.
38 ఏశావు తన తండ్రిని బ్రతిమలాడుతూనే ఉన్నాడు. “నాయనా, నీ దగ్గర ఒక్క ఆశీర్వదమే ఉందా? నన్ను కూడా ఆశీర్వదించు నాయనా” అంటూ ఏశావు ఏడ్వటం మొదలుబెట్టాడు.
యెరూషలేములో సమావేశం
1 ప్రియమైన థెయొఫిలాకు,
నేను నా మొదటి గ్రంథంలో యేసు చేసింది, బోధించింది మొదలుకొని ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడిన రోజు వరకు జరిగినదంతా వ్రాసాను. 2 ఆయన పరలోకానికి తీసుకు వెళ్ళబడే ముందు పవిత్రాత్మ మహిమతో తానెన్నుకొన్న అపొస్తలులకు[a] వాళ్ళు చేయవలసిన కర్తవ్యాలను చెప్పాడు. 3 ఆయన చనిపోయిన తర్వాత వాళ్ళకు కనిపించి తాను బ్రతికే ఉన్నానని ఎన్నో నిదర్శనాలను చూపించాడు. వాళ్ళకు నలభై రోజుల దాకా కనిపించి దేవుని రాజ్యాన్ని గురించి బోధించాడు. 4 ఆయన వారిని ఒకసారి కలిసికొని ఈ విధంగా ఆజ్ఞాపించాడు: “యెరూషలేము పట్టణాన్ని వదిలి వెళ్ళకండి. నా తండ్రి వాగ్దానం చేసిన వరం కోసం కాచుకొని ఉండండి. దాన్ని గురించి నేను మీకిదివరకే చెప్పాను. 5 యోహాను నీళ్ళతో బాప్తిస్మమునిచ్చాడు. కాని కొద్ది రోజుల్లో మీరు పవిత్రాత్మలో బాప్తిస్మము పొందుతారు.”
© 1997 Bible League International