Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
40 నేను సహనంగా యెహోవా కోసం వేచియున్నాను. ఆయన తన చెవినిచ్చి, నా మొర ఆలకించెను.
నా వైపుకు ఒంగియున్నాడు. ఆయన నా మొరలు విన్నాడు.
2 నాశనపు గుంటలోనుండి యెహోవా నన్ను పైకిలేపాడు.
ఆ బురద గుంటలోనుండి ఆయన పైకి లేపాడు.
ఆయన నన్ను పైకి లేపి, ఒక బండమీద నన్ను ఉంచాడు.
ఆయన నా పాదాలను స్థిరపరచాడు.
3 ఒక క్రొత్త కీర్తనను, ఒక స్తుతి కీర్తనను
యెహోవా నా నోట ఉంచాడు.
నాకు జరిగిన విషయాలను అనేకమంది చూస్తారు. వారు దేవుని ఆరాధిస్తారు.
వారు యెహోవాను నమ్ముకొంటారు.
4 ఒక మనిషి యెహోవాను నమ్ముకొంటే
ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
ఒక మనిషి సహాయం కోసం దయ్యాల తట్టు మరియు తప్పుడు దేవుళ్ళ తట్టు, విగ్రహాల తట్టు, తిరుగకుండా ఉంటే ఆ మనిషి నిజంగా సంతోషంగా ఉంటాడు.
5 యెహోవా, మా దేవా, నీవు ఎన్నో అద్భుత కార్యాలు చేశావు.
మాకోసం నీ వద్ద అద్భుత పథకాలు ఉన్నాయి. యెహోవా, నీవలె ఎవడూ లేడు.
నీవు చేసిన పనులను గూర్చి నేను మరల మరల చెబుతాను.
నేను లెక్కించగలిగిన వాటికంటే ఎక్కువ విషయాలున్నాయి.
6 యెహోవా, నీవు నాకు ఈ గ్రహింపు కలిగించావు.
బలులు, ధాన్యార్పణలు నిజంగా నీవు కోరలేదు.
దహన బలులు, పాపపరిహారార్థపు బలులు నిజంగా నీవు కోరలేదు.
7 అందుచేత నేను అన్నాను, “ఇదిగో, నేను వస్తున్నాను.
నన్ను గూర్చి గ్రంథంలో ఈలాగువ్రాయబడింది.
8 నా దేవా, నీవు కోరినట్టే నేను చేయగోరుతున్నాను.
నీ ఉపదేశాలు నా హృదయంలో ఉన్నాయి.”
9 మంచితనాన్ని గూర్చిన శుభవార్త మహా సమాజానికి నేను చెబుతాను.
యెహోవా, నేను నా నోరు మూసికొని ఉండనని నీకు తెలుసు.
10 యెహోవా, నీవు చేసిన మంచి కార్యాలను గూర్చి నేను చెబుతాను.
ఆ మంచి కార్యాలను నా హృదయంలోనే రహస్యంగా ఉంచుకోను.
యెహోవా, ప్రజల యెడల నీవు ఎలా వాస్తవంగాను, నమ్మకంగాను ఉన్నావో అది నేను చెబుతాను.
నీవు ప్రజల్ని ఎలా రక్షిస్తావో అది చెబుతాను. నీ దయ, నమ్మకత్వాన్ని గూర్చి సమాజంలోని మనుష్యులకు నేను దాచిపెట్టను.
11 కనుక యెహోవా, నీ కనికరం నాకు మరుగు చేయవద్దు.
నీ దయ, కనికరం ఎల్లప్పుడూ నన్ను కాపాడనిమ్ము.
షెబ్నాకు దేవుని సందేశం
15 నా ప్రభువు, సర్వశక్తిమంతుడైన యెహోవా ఈ సంగతులు నాతో చెప్పాడు: “ఆ సేవక షెబ్నా దగ్గరకు వెళ్లు. ఆ సేవకుడు భవనం అధికారి. 16 నీవు ఇక్కడ ఏమి చేస్తున్నావు? నీ కుటుంబం వారు ఎవరైనా ఇక్కడ సమాధి చేయబడ్డారా? నీవెందుకు ఇక్కడ సమాధి తయారు చేస్తున్నావు?” అని ఆ సేవకుడ్ని అడుగు. యెషయా చెప్పాడు, “ఈ మనిషిని చూడండి! ఎత్తయిన స్థలంలో అతడు తన సమాధి సిద్ధం చేసుకొంటున్నాడు. తన సమాధి కోసం అతడు బండను తొలుస్తున్నాడు.
17-18 “ఓ మనిషీ, యెహోవా నిన్ను చితక గొట్టేస్తాడు. యెహోవా నిన్ను ఒక చిన్న ఉండలా చుట్టేసి, చాలా దూరంలో చేతులు చాచుకొని ఉన్న మరోదేశంలోకి నిన్ను విసరివేస్తాడు. అక్కడ నీవు చస్తావు.”
యెహోవా చెప్పాడు: “నీ రథాల మూలంగా నీకు చాలా గర్వం. కానీ ఆ దూరదేశంలో నీ క్రొత్త పాలకునికి ఇంకా మంచి రథాలు ఉంటాయి. అతని స్థలంలో నీ రథాలు ఎన్నదగినవిగా కనబడవు. 19 ఇక్కడి నీ ప్రముఖ పదవినుండి నిన్ను నేను వెళ్లగొడతాను. నీ ప్రముఖ పదవినుండి, నీ క్రొత్త పాలకుడు నిన్ను తీసుకొని వెళ్లిపోతాడు. 20 ఆ సమయంలో హిల్కీయా కుమారుడు, నా సేవకుడు ఎల్యాకీమును నేను పిలుస్తాను. 21 నేను నీ అంగీ తీసి ఆ సేవకుని మీద వేస్తాను. నీ నడికట్టు అతనికి ఇస్తాను. నీ ముఖ్య పదవి అతనికి ఇస్తాను. యెరూషలేము ప్రజలకు, యూదా వంశానికి ఈ సేవకుడు ఒక తండ్రిలా ఉంటాడు.
22 “దావీదు ఇంటి తాళపు చెవిని అతని మెడలో నేను కడతాను. అతడు ఒక ద్వారం తెరిస్తే, అది తెరచుకొనే ఉంటుంది. ఏ మనిషీ దాన్ని మూసి వేయలేడు. అతడు ఒక ద్వారం మూసివేస్తే, ఆ ద్వారం మూసికొనే ఉంటుంది. ఏ మనిషీ దానిని తెరవలేడు. ఆ సేవకుడు తన తండ్రి ఇంటిలో ఘనమైన పీఠంలా ఉంటాడు. 23 గట్టిచెక్కకు కొట్టబడిన మేకులా అతణ్ణి నేను బలంగా చేస్తాను. 24 అతని తండ్రి ఇంటిలో ఘనమైన వాటిని, గొప్పవాటిని నేను అతని మీద వేలాడదీస్తాను. పెద్దలు, పిల్లలు అందరూ అతని మీద ఆధారపడతారు. ఆ మనుష్యులు ఆయన మీద వేలాడుతోన్న చిన్న పాత్రల్లా, పెద్ద నీళ్ల చెంబుల్లా ఉంటారు.
25 “ఆ సమయంలో, ప్రస్తుతం గట్టి చెక్కకు కొట్టబడిన మేకు (షెబ్నా) బలహీనమవుతుంది, విరిగిపోతుంది. ఆ మేకు నేలమీద పడిపోతుంది, ఆ మేకుకు వేలాడుతున్న వస్తువులన్నీ నాశనం అవుతాయి. అప్పుడు, ఈ సందేశంలో నేను చెప్పిన సంగతులు అన్నీ సంభవిస్తాయి.” (యెహోవా చెప్పాడు గనుక ఆ సంగతులు జరుగుతాయి.)
ఒకే ఒక సువార్త
6 తనలో దయ వుండటం వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. మీరు ఆయన్ని యింత త్వరలో వదిలివేయటం, మరొక సువార్తవైపు మళ్ళటం నాకు ఆశ్చర్యం కలిగిస్తుంది. 7 నిజానికి మేము మీకు ప్రకటించిన సువార్త కాక వేరొక సువార్త లేనేలేదు. కొందరు మిమ్మల్ని కలవరపెట్టటానికి క్రీస్తు సువార్తను మార్చటానికి ప్రయత్నం చేస్తున్నారు. 8 నేను గాని, లేక పరలోకం నుండి వచ్చిన దేవదూత గాని మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్తను ప్రకటిస్తున్నట్లయితే అలాంటి వాడు నిత్యనాశనానికి గురియగుగాక. 9 మేము యిదివరకు చెప్పినదాన్ని యిప్పుడు నేను మళ్ళీ చెపుతున్నాను. మీరు అంగీకరించిన సువార్త గాక వేరొక సువార్తను ఎవడైనా మీకు భోధిస్తున్నట్లయితే వాడు నిరంతరము శాపగ్రస్తుడవును గాక!
10 నేనిప్పుడు మానవుని మెప్పు పొందటానికి ప్రయత్నిస్తున్నానా లేక దేవుని మెప్పునా? మానవుణ్ణి నేను సంతోషపెట్టాలని చూస్తున్నానా? నేను ఇంకా మానవుణ్ణి సంతోషపెట్టాలని చూస్తున్నట్లయితే క్రీస్తు సేవకుణ్ణి కాదు.
దేవుని పిలుపు
11 సోదరులారా! నేను ప్రకటించిన సువార్త మానవుడు కల్పించింది కాదు. అది మీరు గమనించాలి. 12 నేను ఆ సువార్తను మానవుని ద్వారా పొందలేదు. దాన్ని నాకెవరూ బోధించనూ లేదు. దాన్ని నాకు యేసు క్రీస్తు తెలియచేసాడు.
© 1997 Bible League International