Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 89:5-37

యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
    పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
    “దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
    ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
    వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
    మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
    దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
    నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
    ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
    తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
    నీ శక్తి గొప్పది!
    విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
    ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
    వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
    వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
    వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
    ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
19 కనుక నిజమైన నీ అనుచరులతో దర్శనంలో నీవు మాట్లాడావు.
నీవు చెప్పావు: “ప్రజల్లోనుండి నేను ఒక యువకుని ఏర్పాటు చేసికొన్నాను.
    ఆ యువకుని నేను ప్రముఖుణ్ణి చేసాను. నేను యుద్ధ వీరునికి శక్తిని అనుగ్రహించాను.
20 నా సేవకుడైన దావీదును నేను కనుగొన్నాను.
    నా ప్రత్యేక తైలంతో నేను అతన్ని అభిషేకించాను.
21 నా కుడిచేతితో నేను దావీదును బలపరచాను.
    మరి నా శక్తితో నేను అతన్ని బలముగల వానిగా చేశాను.
22 ఏర్పాటు చేసికోబడిన రాజును శత్రువు ఓడించలేకపోయాడు.
    దుర్మార్గులు అతన్ని ఓడించలేక పోయారు.
23 అతని శత్రువులను నేను అంతం చేసాను.
    ఏర్పరచబడిన రాజును ద్వేషించిన వారిని నేను ఓడించాను.
24 ఏర్పరచబడిన రాజును నేను ఎల్లప్పుడూ ప్రేమిస్తాను. బలపరుస్తాను.
    నేను ఎల్లప్పుడూ అతన్ని బలవంతునిగా చేస్తాను.
25 ఏర్పరచబడిన నా రాజును సముద్రం మీద నాయకునిగా ఉంచుతాను.
    నదులను అతడు అదుపులో ఉంచుతాడు.
26 ‘నీవు నా తండ్రివి నీవు నా దేవుడవు, నా బండవు, నా రక్షకుడవు’
    అని అతడు నాతో చెబుతాడు.
27 మరి నేను అతనిని నా ప్రథమ సంతానంగా చేసుకొంటాను.
    భూరాజులకంటె అతడు ఉన్నతంగా చేయబడుతాడు.
28 ఏర్పరచబడిన రాజును నా ప్రేమ శాశ్వతంగా కాపాడుతుంది.
    అతనితో నా ఒడంబడిక ఎప్పటికీ అంతంకాదు.
29 అతని వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    ఆకాశాలు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
30 అతని సంతతివారు నా ధర్మశాస్త్రాన్ని పాటించటం మానివేస్తే,
    నా ఆదేశాలను పాటించటం వారు మానివేస్తే అప్పుడు నేను వారిని శిక్షిస్తాను.
31 ఏర్పరచబడిన రాజు సంతతివారు నా ఆజ్ఞలను ఉల్లంఘించి,
    నా ఆదేశాలను పాటించకపోతే
32 అప్పుడు నేను వారిని కఠినంగా శిక్షిస్తాను.
33 కాని వారిపట్ల నా ప్రేమను మాత్రం నేను ఎన్నటికీ తీసివేయలేను.
    నేను ఎల్లప్పుడూ వారికి నమ్మకంగా ఉంటాను.
34 దావీదుతో నా ఒడంబడికను నేను ఉల్లంఘించను.
    మా ఒడంబడికను నేను మార్చను.
35 నా పరిశుద్ధత మూలంగా, దావీదుకు నేను ఓ ప్రత్యేక వాగ్దానం చేసాను.
    మరి నేను దావీదుకు అబద్ధం చెప్పను.
36 దావీదు వంశం శాశ్వతంగా కొనసాగుతుంది.
    సూర్యుడు ఉన్నంతవరకు అతని రాజ్యం కొనసాగుతుంది.
37     చంద్రునిలా అది శాశ్వతంగా కొనసాగుతుంది.
ఒడంబడిక సత్యమనేందుకు ఆకాశాలు సాక్ష్యం. ఆ సాక్ష్యం నమ్మదగినది.”

యెషయా 51:1-16

ఇశ్రాయేలు అబ్రాహాము వలె ఉండాలి

51 “మీలో కొంతమంది ప్రజలు మంచి జీవితాలు జీవించాలని కష్టపడి ప్రయత్నిస్తారు. సహాయంకోసం మీరు యెహోవా దగ్గరకు వెళ్తారు. నా మాట వినండి. మీ తండ్రి అబ్రాహామును మీరు చూడాలి. మీరు ఏ బండనుండి చెక్కబడ్డారో, ఆ బండ ఆయనే. అబ్రాహాము మీ తండ్రి, మీరు ఆయన్ని చూడాలి. మీకు జన్మనిచ్చిన మాతృమూర్తి శారాను మీరు చూడాలి. అబ్రాహామును నేను పిలిచినప్పుడు అతడు ఒంటరిగా ఉన్నాడు. అప్పుడు నేను అతణ్ణి ఆశీర్వదించాను, అతడు ఒకగొప్ప వంశాన్ని ప్రారంభించాడు. అనేకానేక మంది అతనినుండి ఉద్భవించారు.”

అదే విధంగా సీయోనును[a] యెహోవా ఆశీర్వదిస్తాడు. ఆమెను గూర్చి, ఆమె ప్రజలను గూర్చి యెహోవా విచారించి, ఆమెకోసం ఒక గొప్ప కార్యం చేస్తాడు. అరణ్యాన్ని యెహోవా మార్చేస్తాడు. అరణ్యం ఏదెను వనంలా ఒక వనం అయిపోతుంది. ఆ దేశం ఖాళీగా ఉంది గాని అది యెహోవా తోటలా తయారవుతుంది. అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటారు. అక్కడ ప్రజలు వారి ఆనందాన్ని ప్రదర్శిస్తారు. కృతజ్ఞత, విజయాలను గూర్చి వారు పాటలు పాడుతారు.

“నా ప్రజలారా, నా మాట వినండి!
    ప్రజలు ఎలా జీవించాలో అది వారికి చూపించే దీపాల్లాంటివి నా నిర్ణయాలు.
నేను న్యాయవంతుడనని త్వరలోనే నేను చూపిస్తాను. త్వరలోనే నేను నిన్ను రక్షిస్తాను.
    నేను నా శక్తిని ప్రయోగించి, రాజ్యాలన్నింటికి తీర్పు తీరుస్తాను.
దూర ప్రదేశాలన్నీ నాకోసం కనిపెట్టుకొని ఉన్నాయి.
    నా శక్తి వారికి సహాయం చేయాలని అవి కనిపెట్టుకొని ఉన్నాయి.
ఆకాశాలవైపు చూడండి.
    మీ చుట్టూ క్రింద ఉన్న భూమిని చూడండి.
ఆకాశాలు పొగ మేఘాల్లా మాయమైపోతాయి.
    భూమి పనికి మాలిన పాత గుడ్డల్లా అవుతుంది.
భూమి మీద మనుష్యులు మరణిస్తారు.
    అయితే నా రక్షణ శాశ్వతంగా కొనసాగుతుంది.
    నా దయ ఎప్పటికీ అంతంకాదు.
దయను అవగాహన చేసికొనే ప్రజలారా, మీరు నా మాట వినాలి.
    నా ఉపదేశాలను పాటించే ప్రజలారా నేను చెప్పే మాటలు మీరు వినాలి.
దుష్ట ప్రజలు విషయం భయపడకండి.
    వారు మీకు చెప్పే చెడ్డ విషయాలను గూర్చి భయపడకండి.
ఎందుకంటే వారు పాత గుడ్డల్లా ఉంటారు గనుక. చిమ్మెటలు వాటిని తినివేస్తాయి.
    వారు గొర్రెబొచ్చులా ఉంటారు. పురుగులు వాటిని తినివేస్తాయి.
అయితే నా దయ శాశ్వతంగా కొనసాగుతుంది.
    నా రక్షణ శాశ్వతంగా సదా కొనసాగుతుంది.”

దేవుని స్వంత శక్తి తన ప్రజలను రక్షిస్తుంది

యెహోవా హస్తమా (శక్తి) మేలుకో!
    మేలుకో! నీ బలం సిద్ధం చేయి.
చాలాకాలం క్రిందట నీవు చేసినట్టు పూర్వకాలాల్లో నీవు చేసినట్టు నీ బలాన్ని ప్రయోగించు.
    రాహాబును ఓడించిన శక్తి నీవే. మకరాన్ని నీవే ఓడించావు.
10 సముద్రం ఎండిపోయేట్టు నీవే చేశావు. మహా అగాధ జలాలను ఎండిపోయేట్టు నీవు చేశావు.
    సముద్రపు అతి లోతైన స్థలాలను నీవు త్రోవగా చేశావు.
    నీ ప్రజలు ఆ మార్గాన వెళ్లి రక్షించబడ్డారు.
11 యెహోవా తన ప్రజలను రక్షిస్తాడు.
    వారు ఆనందంగా సీయోనుకు తిరిగి వస్తారు.
వారు ఎంతో ఎంతో సంతోషంగా ఉంటారు.
    వారి ఆనందం వారి తలలమీద శాశ్వత కిరీటంలా ఉంటుంది.
ఆనందంతో వారు పాటలు పాడుతూంటారు.
    దుఃఖం అంతా దూరమైపోతుంది.

12 యెహోవా చెబుతున్నాడు, “నిన్ను ఆదరించే వాడను నేనే.
    కనుక ఇతరులను గూర్చి నీవెందుకు భయపడాలి?
    వాళ్లు కేవలం బ్రతికి, చచ్చే మనుష్యులు మాత్రమే. వాళ్లు కేవలం మానవ మాత్రులు. వారు కూడా గడ్డిలాగే చస్తారు.”

13 యెహోవా మిమ్మల్ని చేశాడు.
తన శక్తితో ఆయన భూమిని చేశాడు.
    తన శక్తితో ఆకాశాలను భూమికి పైగా ఆయన విస్తరింపజేసాడు.
కానీ ఆయనను, ఆయన శక్తిని మీరు మరచిపోతారు.
    కనుక మీకు హాని చేసే కోపిష్ఠులైన మనుష్యులను గూర్చి ఎల్లప్పుడు మీరు భయపడుతుంటారు.
ఆ మనుష్యులు మిమ్మును నాశనం చేయాలని పథకం వేసారు.
    కానీ ఇప్పుడు వాళ్లెక్కడ? వాళ్లంతా పోయారు.

14 చెరసాలలోని మనుష్యులు త్వరలోనే విడుదల చేయబడతారు.
    వాళ్లు చెరసాలలోనే మరణించి, కుళ్లిపోరు.
    ఆ మనుష్యులకు సరిపడినంత ఆహారం ఉంటుంది.

15 “నేను యెహోవాను, మీ దేవుడను.
    నేను సముద్రాన్ని కదలిస్తాను, కెరటాలు పుట్టిస్తాను.”
(ఆయన పేరు సర్వశక్తిమంతుడైన యెహోవా.)

16 “నా సేవకా, నీవు చెప్పాలని నేను కోరే మాటలను నేనే నీకు ఇస్తాను. నా చేతులతో నిన్ను నేను కప్పిఉంచి కాపాడుతాను. క్రొత్త ఆకాశాన్ని, క్రొత్త భూమిని చేసేందుకు నిన్ను నేను ఉపయోగించుకొంటాను. ‘మీరు నా ప్రజలు అని ఇశ్రాయేలుతో చెప్పేందుకు నిన్ను నేను వాడుకొంటాను.’”

మత్తయి 12:15-21

యేసు దేవునిచేత ఎన్నుకొనబడిన సేవకుడు

15 యేసు ఇది తెలుసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. చాలా మంది ఆయన్ని అనుసరించారు. ఆయన వాళ్ళ వ్యాధుల్ని నయం చేసాడు. 16 తనను గురించి ఎవ్వరికీ చెప్పవద్దని వాళ్ళను హెచ్చరించాడు. 17 యెషయా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ వాక్యాలు నిజం కావటానికి ఈ విధంగా జరిగింది:

18 “ఆయన నేనెన్నుకున్న
    నా సేవకుడు!
ఆయన పట్ల నాకు ప్రేమవుంది.
    ఆయన నా ఆత్మకు చాలా ఆనందం కలిగించాడు.
నా ఆత్మ ఆయన పైకి రప్పించుదును.
    ఆయన జనములకు న్యాయం చేకూరుతుందని ప్రకటిస్తాడు.
19 ఆయన పోట్లాడడు: కేకలు పెట్టడు,
    ఆయన ధ్వని వీధిలోని వాళ్ళకెవ్వరికి వినిపించదు.
20 న్యాయం చేకూరే వరకు నలిగిన రెల్లును ఆయన విరువడు.
    ఆరిపోతున్న దీపాన్ని ఆయన ఆర్పడు.
21 ఈయన పేరుమీద ఇతర జనాలకు నిరీక్షణ కలుగుతుంది.”(A)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International