Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 29

దావీదు కీర్తన.

29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
    ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
    మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
    మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
    ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
    లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
    షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
    యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
    ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.

10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
    మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
    యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.

1 సమూయేలు 7:3-17

ఇశ్రాయేలీయులనుద్దేశించి సమూయేలు ఇలా అన్నాడు: “మీ హృదయ పూర్వకంగా మీరంతా యెహోవా దగ్గరకు తిరిగి వస్తున్నట్లయితే, మీరు మీ అన్య దేవుళ్లను విడిచిపెట్టాలి. మీ అష్తారోతు[a] దేవతా విగ్రహాలను విడిచి పెట్టాలి. మిమ్ములను మీరు యెహోవాకు పూర్తిగా సమర్పించుకోండి. ఆయననే ఆరాధించండి. అప్పుడాయన మిమ్మల్ని ఫిలిష్తీయుల బారినుండి తప్పిస్తాడు.”

అది విన్న ఇశ్రాయేలీయులు బయలు[b] అష్తారోతు విగ్రహాలన్నిటినీ పారవేసారు. అప్పుడు ఇశ్రాయేలీయులంతా యెహోవాను మాత్రమే సేవించారు.

“ఇశ్రాయేలు వారంతా మిస్పావద్ద తప్పక సమావేశం కావాలి. అక్కడ వారి కోసం నేను యెహోవాను ప్రార్థిస్తాను” అని సమూయేలు వారితో చెప్పాడు.

ఇశ్రాయేలీయులు మిస్పావద్ద సమావేశం అయ్యారు. వారు నీళ్లు తెచ్చి యెహోవా ముందర పారపోసారు. (ఈ విధంగా వారు ఉపవాసం ప్రారంభించారు.) ఆ రోజు వారు ఏమీ తినకుండా ఉండి, వారి పాపాలు ఒప్పుకోవటం మొదలు పెట్టారు. “మేము యెహోవాకు వ్యతిరేకంగా పాపం చేసాము” అని వారు చెప్పారు. కనుక సమూయేలు ఇశ్రాయేలీయులకు ఒక న్యాయాధిపతిగా సేవ చేయటం మిస్పాలో ప్రారంభించాడు.

ఇశ్రాయేలు ప్రజలు మిస్పావద్ద సమావేశమవుతున్నట్లు ఫిలిష్తీయులు విన్నారు. ఫిలిష్తీయుల పాలకులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి తరలి వచ్చారు. వారు వస్తున్నారని ఇశ్రాయేలీయులు విని, భయపడ్డారు. వారు సమూయేలుతో “మా కొరకు ప్రభువైన దేవుని ప్రార్థించుట ఆపవద్దు. ఫిలిష్తీయుల బారినుండి మమ్మును రక్షించమని యెహోవాను వేడుము!” అని విన్నవించారు.

అప్పుడు సమూయేలు పాలుతాగుతున్న గొర్రెపిల్లను తీసుకుని దానిని పూర్తిగా యెహోవాకు దహన బలిగా దహించాడు. సమూయేలు ఇశ్రాయేలీయుల కోసం యెహోవాను ప్రార్థించాడు. యెహోవా అతనికి జవాబిచ్చాడు. 10 సమూయేలు బలి పశువును దహించుచున్నప్పుడు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులపై యుద్ధానికి సమీపిస్తూ ఉన్నారు. కానీ యెహోవా అకస్మాత్తుగా ఒక భయంకర ఉరుమును ఫిలిష్తీయుల వద్ద కలిగించాడు. ఆ ఉరుము ఫిలిష్తీయులను భయపెట్టగా వారు కలవరపడి చిందర వందర అయ్యారు. అప్పుడు సంభవించిన యుద్ధంలో ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయులను ఓడించారు. 11 ఇశ్రాయేలు జనం మిస్పా నుండి బయటకు వచ్చి ఫిలిష్తీయులను అందిన వారిని అందినట్లు చంపుతూ బేత్కారు వరకూ తరుముకుంటూ పోయారు.

ఇశ్రాయేలులో ప్రశాంతత

12 ఇదంతా జరిగిన తర్వాత సమూయేలు జ్ఞాపకార్థంగా మిస్పాకు, షేనుకు మధ్య ఒక ప్రత్యేక రాతిని నిలబెట్టాడు. దానికి సమూయేలు “సహాయ శిల”[c] అని పేరు పెట్టి, “ఇంతవరకు యెహోవా మనకు సహాయము చేసాడు” అని చెప్పాడు.

13 ఫిలిష్తీయులు ఓడించబడ్డారు. మరల వారు ఇశ్రాయేలు దేశంలోనికి అడుగు పెట్టలేదు. సమూయేలు బ్రతికినంత కాలం యెహోవా ఫిలిష్తీయులకు వ్యతిరేకంగానే వున్నాడు. 14 ఫిలిష్తీయులు ఇశ్రాయేలునుండి పట్టణాలను తీసుకున్నారు. ఎక్రోను నుండి గాతు వరకుగల ప్రాంతాల్లోని పట్టణాలను ఫిలిష్తీయులు తీసుకున్నారు. అయితే ఇశ్రాయేలీయులు ఆ పట్టణాలను తిరిగి గెలుచుకున్నారు. మరియు ఈ పట్టణాల చుట్టు ప్రక్కల ఉన్న స్థలాన్ని కూడా ఇశ్రాయేలీయులు స్వాధీనం చేసుకున్నారు.

అంతేకాకుండా ఇశ్రాయేలీయులకు, అమోరీయులకు మధ్య శాంతి నెలకొన్నది.

15 సమూయేలు తన జీవిత కాలమంతా న్యాయాధిపతిగా ఇశ్రాయేలీయులను నడిపించాడు. 16 ప్రతి సంవత్సరం సమూయేలు దేశవ్యాప్తంగా సంచారం చేసేవాడు. ఇశ్రాయేలు ప్రజలకు తీర్పు చెబుతూ ఒక స్థలంనుండి మరో స్థలానికి వేళ్లేవాడు. బేతేలు, గిల్గాలు, మిస్పాకు అతడు వెళ్లాడు. కనుక ఈ స్థలాలన్నింటిలో అతడు ఇశ్రాయేలీయులకు తీర్పు చెబుతూ, వారిని పాలించాడు. 17 కానీ సమూయేలు తన ఇల్లు ఉన్న రామాకు తిరిగి వెళ్లేవాడు. రామాలో వున్న ప్రజలను కూడ సమూయేలు పాలిస్తూ, తీర్పు చెప్పేవాడు. రామాలో యెహోవాకు ఒక బలిపీఠాన్ని సమూయేలు నిర్మించాడు.

అపొస్తలుల కార్యములు 9:19-31

19 ఆ తర్వాత కొంత ఆహారాన్ని పుచ్చుకొన్నాక అతనికి బలం వచ్చింది.

సౌలు డెమాస్కసులో బోధించుట

సౌలు డెమాస్కసులో ఉన్న విశ్వాసులతో కొద్ది రోజులు గడిపాడు. 20 ఆ తర్వాత, యూదుల సమాజ మందిరాల్లో, “యేసు దేవుని కుమారుడు” అని బోధించటం మొదలు పెట్టాడు.

21 అతని మాటలు విన్న వాళ్ళందరూ ఆశ్చర్యపడి, “యెరూషలేములో యేసును నమ్మిన వాళ్ళను చంపినవాడు ఇతడే కదా! ఇక్కడికి వచ్చింది యేసు శిష్యులను బంధించటానికే కదా! అలా బంధించి వాళ్ళను ప్రధాన యాజకుల దగ్గరకు తీసుకొని వెళ్ళాలనే కదా అతని ఉద్దేశ్యం!” అని అనుకొన్నారు.

22 కాని సౌలు ఇంకా ఎక్కువ ఆత్మబలంతో డెమాస్కసులో నివసించే యూదులకు, “యేసు ప్రభువే క్రీస్తు” అని రుజువు చేసి వాళ్ళను ఆశ్చర్యపరిచాడు.

సౌలు యూదులనుండి తప్పించుకొనుట

23 చాలా రోజులు గడిచిపోయాయి. యూదులు అతణ్ణి చంపాలని కుట్రపన్నారు. 24 కాని సౌలుకు వాళ్ళ కుట్ర తెలిసిపోయింది. యూదులు అతణ్ణి చంపాలని రాత్రింబగళ్ళు పట్టణ ద్వారాలను జాగ్రత్తగా కాపలా కాచారు. 25 కాని అతని శిష్యులు రాత్రివేళ అతణ్ణి ఒక బుట్టలో దాచి కోట గోడనుండి క్రిందికి దింపారు.

యెరూషలేములో సౌలు

26 సౌలు యెరూషలేముకు వచ్చాక శిష్యులతో కలిసిపోవటానికి ప్రయత్నించాడు. కాని వాళ్ళు అతడంటేనే భయపడిపోయారు. 27 కాని బర్నబా అతణ్ణి పిలుచుకొని అపొస్తలుల దగ్గరకు వచ్చి, వాళ్ళతో సౌలు ప్రయాణంలో ప్రభువును చూసిన విషయము, ప్రభువు అతనితో మాట్లాడిన విషయము, అతడు డెమాస్కసులో యేసు పేరును ధైర్యంగా ప్రకటించిన విషయము చెప్పాడు.

28 స్వేచ్ఛగా తిరుగుతూ ప్రభువు పేరును ధైర్యంగా ప్రకటిస్తూ సౌలు వాళ్ళతో కలిసి యెరూషలేములో ఉండిపోయాడు. 29 గ్రీకు మాట్లాడే యూదులతో మాట్లాడి వాదించాడు. వాళ్ళు అతణ్ణి చంపాలని నిశ్చయించారు. 30 సోదరులకు యిది తెలియగానే అతణ్ణి కైసరియకు తీసుకెళ్ళి అక్కడినుండి తార్సుకు పంపారు.

31 ఆ తర్వాత యూదయ, గలిలయ, సమరయలోని సంఘాలు కొద్ది రోజులు ప్రశాంతంగా గడిపాయి. ఆయా ప్రాంతాలలోని సంఘాలకు చెందిన సభ్యులు ఆధ్యాత్మికంగా అభివృద్ధి చెందుతూ ప్రభువంటే భయభక్తులు కలిగి, పవిత్రాత్మ ద్వారా ప్రోత్సాహం పొందుతూ జీవించారు. సభ్యుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International