Revised Common Lectionary (Semicontinuous)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
దేవుడు సమూయేలును పిలుచుట
3 ఆ రోజుల్లో యెహోవా ఎవరితోనూ ప్రత్యక్షంగా తరచు మాట్లాడేవాడు కాడు. స్వప్న దర్శనాలూ చాలా తక్కువే. ఏలీ పర్యవేక్షణలో బాలకుడైన సమూయేలు యెహోవా సేవలో ఉన్నాడు.
2 ఏలీ కళ్లు బలిహీనమై ఇంచుమించు గుడ్డివాడైపోయాడు. ఒకరోజు అతడు పడుకుని వున్నాడు. 3 సమూయేలు యెహోవా పవిత్ర గుడారంలో పడుకున్నాడు. దేవుని పవిత్ర పెట్టె[a] కూడా గుడారంలోనే వుంది. గుడారంలో యెహోవా దీపం ఇంకా వెలుగుతూనే వుంది. 4 యెహోవా సమూయేలును పిలిచాడు. “ఇక్కడే వున్నాను” అంటూ 5 (ఏలీ తనను పిలిచాడని అనుకొని) సమూయేలు ఏలీ వద్దకు పరుగున పోయాడు. “మీరు పిలిచారుగా అందుకే, వచ్చాను” అన్నాడు.
“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
సమూయేలు పోయి పడుకున్నాడు. 6 దేవుడు మళ్లీ, “సమూయేలూ!” అని పిలిచాడు. సమూయేలు ఏలీ వద్దకు వెళ్లి, “నేనిక్కడే ఉన్నాను, నన్ను పిలిచారా?” అని అడిగాడు.
“నేను నిన్ను పిలవలేదు. పోయి పడుకో” అన్నాడు ఏలీ.
7 సమూయేలుకు ఇంకా యెహోవాతో అనుభవంలేదు. అతనితో యెహోవా ఇంతవరకూ ప్రత్యక్షంగా మాట్లాడి వుండలేదు.[b]
8 మూడవసారి యెహోవా సమూయేలును పిలిచాడు. సమూయేలు లేచి ఏలీ వద్దకు వెళ్లి, “నేను ఇక్కడే వున్నాను; నన్ను పిలిచారా?” అని అన్నాడు.
యెహోవా ఆ బాలుని పిలుస్తున్నాడని అప్పుడు ఏలీకి అర్థమయింది. 9 ఏలీ సమూయేలుతో, “నీవు పోయి పడుకో. మళ్లీ ఎవరైనా నిన్ను పిలిస్తే ‘యెహోవా, సెలవియ్యండి! నేను తమ దాసుణ్ణి. నేను వింటున్నాను’” అని చెప్పమన్నాడు.
తరువాత సమూయేలు వెళ్లి పక్కమీద పడుకున్నాడు.
సౌలు మార్పునొందటం
9 సౌలు ప్రభువు అనుచరుల్ని చంపిస్తానని ఇంకా ఎగిరిపడ్తూనే ఉన్నాడు. 2 ప్రధానయాజకుని దగ్గరకు వెళ్ళి డెమాస్కసు పట్టణంలోని సమాజ మందిరాలకు ఉత్తరాలు వ్రాసి యివ్వమని అడిగాడు. ప్రభువు మార్గాన్ని అనుసరించేవాళ్ళు కనిపిస్తే స్త్రీ, పురుష భేదం లేకుండా వాళ్ళను బంధించి యెరూషలేముకు తీసుకు రావాలని అతని ఉద్దేశ్యం.
3 అతడు డెమాస్కసు పొలిమేరలు చేరుకున్నాడు. అకస్మాత్తుగా ఆకాశంనుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. 4 అతడు నేలకూలిపొయ్యాడు. ఒక స్వరం, “సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు?” అని వినబడింది.
5 “ప్రభూ! మీరెవరు?” అని సౌలు అడిగాడు. “నేను నీవు హింసిస్తున్న యేసును. 6 లేచి పట్టణంలోకి వెళ్ళు. నీవేం చెయ్యాలో అక్కడ నీకు చెప్పబడుతుంది” అని ఆయన సమాధానం చెప్పాడు.
7 సౌలుతో ప్రయాణం చేస్తున్నవాళ్ళు మూగవాళ్ళలా నిల్చున్నారు. వాళ్ళు ఆ స్వరం విన్నారే కాని వాళ్ళకెవ్వరూ కనపడలేదు. 8 క్రింద పడ్డ సౌలు లేచి నిలుచొని కళ్ళు తెరిచాడు. కాని అతనికి ఏమీ కనిపించలేదు. వాళ్ళతని చేయి పట్టుకొని డెమాస్కసులోనికి నడిపించారు. 9 మూడు రోజుల దాకా అతడు గ్రుడ్డివానిగానే ఉండిపోయాడు. ఆహారం కాని, నీళ్ళు కాని ముట్టలేదు.
© 1997 Bible League International