Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 72

సొలొమోను కీర్తన.

72 దేవా, రాజు నీవలె జ్ఞానముగల తీర్మానాలు చేయుటకు సహాయం చేయుము.
    రాజకుమారుడు నీ మంచితనం గూర్చి నేర్చుకొనేందుకు సహాయం చేయుము.
నీ ప్రజలకు న్యాయంగా తీర్పు తీర్చేందుకు రాజుకు సహాయం చేయుము.
    నీ పేద ప్రజలకు ఏది మంచిదో దానిని చేయుటకు అతనికి సహాయం చేయుము.
దేశం అంతటా శాంతి, న్యాయం ఉండనీయుము.
పేద ప్రజలకు రాజు న్యాయంగా ఉండునుగాక.
    నిస్సహాయులకు అతణ్ణి సహాయం చేయనిమ్ము. వారిని బాధించే ప్రజలను అతణ్ణి శిక్షించనిమ్ము.
సూర్యుడు ప్రకాశించునంత వరకు ఆకాశంలో చంద్రుడు ఉన్నంత వరకు
    ప్రజలు రాజుకు భయపడి గౌరవిస్తారని ఆశిస్తున్నాను.
    ప్రజలు అతనికి శాశ్వతంగా భయపడి గౌరవిస్తారని నేను ఆశిస్తున్నాను.
పొలాల మీద కురిసే వర్షంలా రాజు ఉండునట్లు అతనికి సహాయం చేయుము.
    నేలమీద పడే జల్లులా ఉండుటకు అతనికి సహాయం చేయుము.
అతడు రాజుగా ఉండగా మంచితనం వికసించనిమ్ము.
    చంద్రుడున్నంతవరకు శాంతిని కొనసాగనిమ్ము.
సముద్రం నుండి సముద్రానికి, నది నుండి భూమి మీద దూర స్థలాలకు
    అతని రాజ్యాన్ని విస్తరింపనిమ్ము.
అరణ్యంలో నివసించే ప్రజలను అతనికి సాగిలపడనిమ్ము
    అతని శత్రువులందరూ ధూళిలో వారి ముఖాలు పెట్టుకొని అతని యెదుట సాగిలపడనిమ్ము.
10 తర్షీషు రాజులు మరియు దూర తీరాల రాజులు అతనికి కానుకలు సమర్పించుదురు గాక.
    షేబ మరియు సెబా రాజులు అతనికి కప్పం చెల్లించెదరు గాక.
11 రాజులందరూ మన రాజుకు సాగిలపడుదురు గాక.
    రాజ్యాలన్నీ అతన్ని సేవించెదరు గాక.
12 మన రాజు సహాయం లేని వారికి సహాయం చేస్తాడు.
    మన రాజు పేదలకు, నిస్సహాయులకు సహాయం చేస్తాడు.
13 పేదలు, నిస్సహాయులు ఆయన మీద ఆధారపడతారు.
    రాజు వారిని బ్రతికించి ఉంచుతాడు.
14 వారిని బాధించుటకు ప్రయత్నించే కృ-రుల బారినుండి రాజు వారిని రక్షిస్తాడు.
    ఆ పేద ప్రజల ప్రాణాలు రాజుకు చాలా ముఖ్యం.
15 రాజు దీర్ఘాయుష్మంతుడగును గాక.
    షేబ నుండి బంగారం అతడు తీసుకొనును గాక.
రాజుకోసం ఎల్లప్పుడూ ప్రార్థించండి.
    ప్రతిరోజూ అతణ్ణి దీవించండి.
16 పొలాలు పుష్కలంగా ధాన్యం పండించునుగాక.
    కొండలు పంటలతో నిండిపోవునుగాక.
పొలాలు లెబానోనులోని పొలాలవలె సారవంతంగా ఉండును గాక.
    పొలాలు గడ్డితో నిండిపోయినట్లు పట్టణాలు ప్రజలతో నిండిపోవును గాక.
17 రాజు శాశ్వతంగా ప్రసిద్ధినొందునుగాక.
    సూర్యుడు ప్రకాశించునంతవరకు ప్రజలు అతని పేరును జ్ఞాపకం చేసికొందురు గాక.
అతని మూలంగా ప్రజలందరూ ఆశీర్వదించబడుదురు గాక.
    మరియు వారందరూ అతన్ని దీవించెదరుగాక.

18 ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను స్తుతించండి.
    అలాంటి అద్భుతకార్యాలు చేయగలవాడు దేవుడు ఒక్కడే.
19 ఆయన మహిమగల నామాన్ని శాశ్వతంగా స్తుతించండి.
    ఆయన మహిమ ప్రపంచమంతా వ్యాపించును గాక.
ఆమేన్, ఆమేన్!

20 యెష్షయి కుమారుడు దావీదు ప్రార్థనలు ఇంతటితో సమాప్తం.

ఆదికాండము 28:10-22

బేతేలులో యాకోబు కలగనుట

10 యాకోబు బెయేర్షెబా విడిచి హారాను వెళ్లాడు. 11 యాకోబు ప్రయాణం చేస్తూ ఉండగా సూర్యాస్తమయం అయింది. అందుచేత ఆ రాత్రి ఉండేందుకు యాకోబు ఒక చోటికి వెళ్లాడు. అక్కడ ఒక బండ కనబడింది. నిద్రపోయేందుకు యాకోబు దానిమీద తలపెట్టి పండుకొన్నాడు. 12 యాకోబుకు ఒక కల వచ్చింది. నేలమీద ఒక నిచ్చెన ఉండి, అది ఆకాశాన్ని అంటుకొన్నట్లు అతనికి కల వచ్చింది. దేవుని దూతలు ఆ నిచ్చెన మీద ఎక్కుచు, దిగుచు ఉన్నట్లు యాకోబు చూశాడు.

13 అప్పుడు ఆ నిచ్చెన పైన యెహోవా నిలిచినట్లు యాకోబు చూశాడు. యెహోవా చెప్పాడు: “నీ తాత అబ్రాహాము దేవుణ్ణి, యెహోవాను నేను. నేను ఇస్సాకు దేవుణ్ణి. ఇప్పుడు నీవు నిద్రపోతున్న ఈ దేశాన్ని నీకు నేనిస్తాను. నీకు, నీ పిల్లలకు ఈ స్థలం నేనిస్తాను. 14 నేలమీద ధూళి కణముల్లాగ నీకు కూడా ఎంతోమంది వారసులు ఉంటారు. తూర్పు పడమరలకు, ఉత్తర దక్షిణాలకు వారు విస్తరిస్తారు. నీ మూలంగా, నీ సంతానం మూలంగా భూమిమీదనున్న కుటుంబాలన్నీ ఆశీర్వదించబడతాయి.

15 “నేను నీకు తోడుగా ఉన్నాను, నీవు వెళ్లే ప్రతి చోట నేను నిన్ను కాపాడుతాను. మళ్లీ నిన్ను ఈ దేశానికి నేను తీసుకొని వస్తాను. నేను వాగ్దానం చేసింది నెరవేర్చేవరకు నిన్ను నేను విడువను.”

16 అప్పుడు యాకోబు నిద్రనుండి మేల్కొని, “యెహోవా ఈ స్థలంలో ఉన్నాడని నాకు తెలుసు. అయితే ఆయన ఇక్కడ ఉన్నట్లు, నేను నిద్రపోయేంత వరకు నాకు తెలియదు” అన్నాడు.

17 యాకోబు భయపడి, “ఇది మహా గొప్ప స్థానం. ఇది దేవుని మందిరం. ఇది పరలోక ద్వారం” అన్నాడు అతను.

18 ఉదయం పెందలాడే యాకోబు లేచి, తాను పండుకొన్న రాయి తీసుకొని, దానిని అంచుమీద నిలబెట్టాడు. తర్వాత ఆ రాయిమీద అతడు నూనె పోశాడు. ఈ విధంగా అతడు ఆ రాయిని దేవుని జ్ఞాపకార్థ చిహ్నంగా చేశాడు. 19 ఆ స్థలం పేరు లూజు. అయితే యాకోబు దానికి బేతేలు[a] అని పేరు పెట్టాడు.

20 అప్పుడు యాకోబు ఒక ప్రమాణం చేశాడు. “దేవుడు నాకు తోడుగా ఉంటే, నేను ఎక్కడికి వెళ్లినా దేవుడు నన్ను కాపాడుతూ ఉంటే, తినుటకు భోజనం, ధరించుటకు బట్టలు దేవుడు నాకు ఇస్తూ ఉంటే, 21 నా తండ్రి ఇంటికి నేను సమాధానంగా తిరిగి రాగలిగితే, ఇవన్నీ దేవుడు చేస్తే, అప్పుడు యెహోవాయే నా దేవుడు. 22 నేను ఈ రాయిని యిక్కడ నిలబెడతాను. దేవుని కోసం ఇది పరిశుద్ధ స్థలం అని అది తెలియజేస్తుంది. దేవుడు నాకు ఇచ్చే వాటన్నింటిలో పదవ భాగం నేను ఆయనకు ఇస్తాను” అని అతను చెప్పాడు.

హెబ్రీయులకు 11:13-22

13 వీళ్ళందరు దేవుణ్ణి విశ్వసిస్తూ జీవించి, మరణించారు. దేవుడు వాగ్దానం చేసినవి వాళ్ళకు లభించలేదు. వాళ్ళు అవి రావటం దూరం నుండి చూసి ఆహ్వానించారు. ఈ భూమ్మీద తాము పరదేశీయుల్లా జీవిస్తున్నట్లు వాళ్ళు అంగీకరించారు. 14 వాళ్ళు మాట్లాడిన తీరు చూస్తే వాళ్ళు తమ స్వదేశానికోసం వెతుకుతూండేవాళ్ళని అనిపిస్తుంది. 15 ఒక వేళ వాళ్ళు తాము వదిలివచ్చిన దేశాన్ని గురించి ఆలోచిస్తున్నట్లయితే తమ దేశానికి తిరిగి వెళ్ళే అవకాశం వాళ్ళకు ఉండింది. 16 కాని వాళ్ళు యింకా గొప్ప దేశానికి, అంటే పరలోకానికి వెళ్ళాలని ఆశించారు. అందువల్ల దేవుడు యితర్లు తనను “వాళ్ళ దేవుడు” అని పిలిచినందుకు సిగ్గుపడలేదు. పైగా తన వాళ్ళ కోసం ఒక పట్టణం నిర్మించాడు.

17-18 దేవుడు అబ్రాహామును పరీక్షించినప్పుడు అతనిలో విశ్వాసముండటంవల్ల ఇస్సాకును బలిగా అర్పించటానికి సిద్ధం అయ్యాడు. దేవుడు ఇస్సాకు ద్వారా నీ వంశం అభివృద్ధి చెందుతుంది(A) అని యింతకు పూర్వం వాగ్దానం చేశాడు. అయినా అబ్రాహాము తన ఏకైక పుత్రుణ్ణి బలిగా అర్పించబోయాడు. 19 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికించగలడని అబ్రాహాముకు తెలుసు. ఒక విధంగా చూస్తే దేవుడు ఇస్సాకును బ్రతికించి అబ్రాహాముకు ఇచ్చాడనే చెప్పుకోవచ్చు.

20 ఇస్సాకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి, యాకోబును, ఏశావును వాళ్ళ భవిష్యత్తు ప్రకారం దీవించాడు. 21 దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి యాకోబు, తాను మరణించే ముందు యోసేపు కుమారుల్ని దీవించగలిగాడు. అంతేకాక తన చేతి కఱ్ఱపై వ్రాలి దేవుణ్ణి ప్రార్థించాడు.

22 యోసేపు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టి తాను చనిపోయేముందు ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు దేశం నుండి వెళ్ళిపోతారని ముందుగానే చెప్పగలిగాడు. అంతే కాక, అప్పుడు తన ఎముకల్ని ఏమి చెయ్యాలో వాళ్ళకు చెప్పాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International