Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 2

యూదులు కాని ప్రజలకు అంత కోపం ఎందుకు వచ్చింది?
    ఆ రాజ్యాలు తెలివి తక్కువ పథకాలు ఎందుకు వేస్తున్నట్టు?
యెహోవాకు, ఆయన ఏర్పరచుకొన్న రాజుకు,
    వ్యతిరేకంగా ఉండేందుకు ఆ దేశాల రాజులు, నాయకులు ఒకటిగా సమావేశం అవుతున్నారు.
“దేవునికిని, ఆయన ఏర్పాటు చేసికొన్న రాజుకు, వ్యతిరేకంగా మనం తిరుగుబాటు చేద్దాం.
    మనలను బంధించిన తాళ్లను, గొలుసులను తెంపిపారవేద్దాం.” అని ఆ నాయకులు చెప్పుకొన్నారు.

కాని నా ప్రభువు, పరలోకంలో ఉన్న రాజు
    ఆ ప్రజలను చూచి నవ్వుతున్నాడు.
5-6 దేవుడు కోపగించి, ఆ ప్రజలతో చెబుతున్నాడు:
    “రాజుగా ఉండేందుకు నేను ఈ మనిషిని నిర్ణయించాను.
అతడు సీయోను కొండమీద ఏలుబడి చేస్తాడు, సీయోను నా ప్రత్యేక పర్వతం.”
    మరియు అది ఆ యితర నాయకులను భయపడేలా చేస్తుంది.

యెహోవా ఒడంబడికను గూర్చి ఇప్పుడు నేను నీతో చెబుతాను.
యెహోవా నాతో చెప్పాడు, “నేడు నేను నీకు తండ్రినయ్యాను!
    మరియు నీవు నా కుమారుడివి.
నీవు నన్ను అడిగితే నేను నీకు రాజ్యాలనే యిస్తాను.
    భూమి మీద మనుష్యులంతా నీవాళ్లవుతారు!
ఒక ఇనుప కడ్డీ, మట్టి కుండను పగులగొట్టినట్లు
    ఆ రాజ్యాలను నాశనం చేయటానికి నీకు శక్తి ఉంటుంది.”

10 అందుచేత రాజులారా, మీరు తెలివిగా ఉండండి.
    పాలకులారా, మీరంతా ఈ పాఠం నేర్చుకోండి.
11 అధిక భయంతో యెహోవాకు విధేయులుగా ఉండండి.
12 మరియు మీరు దేవుని కుమారునికి విశ్యాస పాత్రులుగా ఉన్నట్టు చూపించండి[a]
    మీరు ఇలా చేయకపోతే అప్పుడాయన కోపగించి, మిమ్ములను నాశనం చేస్తాడు.
యెహోవాయందు విశ్వాసం ఉంచేవారు సంతోషిస్తారు.
    కాని ఇతరులు జాగ్రత్తగా ఉండాలి. ఆయన తన కోపం చూపించడానికి సిద్ధంగా ఉన్నాడు.

యిర్మీయా 19

పగిలిన జాడీ

19 యెహోవా నాతో ఇలా చెప్పినాడు: “యిర్మీయా, నీవు ఒక కుమ్మరి వాని వద్దకు వెళ్లి ఒక మట్టి జాడీ కొనుగోలు చేయి. యెరూషలేము నగర కుమ్మరి ద్వారానికి[a] ఎదురుగా ఉన్న బెన్‌హిన్నోము లోయలోనికి వెళ్లు. నీతో పాటు కొందరు నాయకులను, యాజకులను తీసికొని వెళ్లు. ఆ స్థలంలో నేను నీకు ఏమి చెపుతానో దానిని వారికి తెలియజేయుము. నీతో ఉన్న వారితో ఇలా చెప్పు, ‘యూదా రాజా, యెరూషలేము వాసులారా, యెహోవా వాక్కు వినండి! ఇశ్రాయేలీయుల దేవుడు, సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెప్పుచున్నాడు: ఈ ప్రదేశానికి త్వరలో నేను ఘోర విపత్తు సంభవించేలా చేస్తాను! దానిని గురించి విన్న ప్రతి ఒక్కడు ఆశ్ఛర్యపడి భయంతో నిండిపోతాడు. నేను ఇదంతా ఎందుకు చేస్తాననగా యూదా ప్రజలు నన్ననుసరించటం మానివేశారు. ఈ ప్రదేశాన్ని వారు పరదేశాల ఇతర దేవుళ్లకు స్థావరంగా మార్చి వేశారు. అన్య దేవతలకు యూదా ప్రజలు ఇక్కడ ధూపనైవేద్యాలు సమర్పించారు. పూర్వ కాలంలో ఆ దేవతలను ప్రజలు ఆరాధించలేదు. వారి పూర్వీకులు ఆ దేవతలను ఆరాధించలేదు. ఇవి ఇతర దేశాల నుండి దిగుమతి అయిన క్రొత్త దేవతలు. యూదా రాజులు ఈ ప్రదేశాన్ని అమాయక పిల్లల రక్తంతో నింపివేశారు. బయలు దేవతకు యూదా రాజులు ఉన్నత (పూజా) స్థలాలను నిర్మించినారు. ఆ స్థలాలను వారు తమ కుమారులను అగ్నిలో కాల్చి బయలు ముందు బలి అర్పించటానికి ఉపయోగించారు. బయలు దేవతకు వారి కుమారులను దహన బలులుగా అర్పించారు. అలా చేయమని నేనెన్నడూ వారికి చెప్పియుండలేదు. మీ కుమారులను బలియివ్వమని నేనెన్నడూ మిమ్మల్ని అడగలేదు. అటువంటి అకృత్యాన్ని నేను మనసులో కూడా ఎన్నడూ తలపోయలేదు. మరియు బెన్‌హిన్నోములో గల ఈ స్థలాన్ని వారిప్పుడు తోఫెతు అని పిలుస్తారు. కాని నేను మీకీ హెచ్చరిక ఇస్తున్నాను: ప్రజలీ స్థలాన్ని కసాయి లోయ అని పిలిచే రోజులు వస్తున్నాయి. ఇది యెహోవా వాక్కు. యూదా ప్రజల, యెరూషలేము వాసుల పథకాలన్నీ నేనీ ప్రదేశంలో వమ్ము చేస్తాను. శత్రువు ఈ ప్రజలను తరిమికొడతాడు. యూదా ప్రజలు ఈ ప్రదేశంలో శత్రువు కత్తికి ఆహుతైపోయేలా నేను చేస్తాను. వారి శవములను పక్షులకు, అడవి మృగాలకు ఆహారమయ్యేలా చేస్తాను. ఈ నగరాన్ని నేను సర్వనాశనం చేస్తాను. యెరూషలేము మీదుగా వెళ్లే ప్రయాణీకులు విభ్రాంతితో చలించి తమ తలలు పంకిస్తారు. నగరం నాశనం చేయబడిన తీరు చూచి వారు విస్మయం చెందుతారు. శత్రు సైన్యాలు నగరాన్ని చుట్టు ముడతాయి. ఆ సైన్యం నగర వాసులను తమ ఆహారం సంపాదించుకోవటానికి బయటికి పోనీయదు. అందువల్ల నగర వాసులు ఆకలితో అలమటిస్తారు. వారు ఆకలి భాధను తట్టుకొలేక తమ పిల్లల శరీరాలనే తినివేస్తారు. ఆ తరువాత వారు ఒకరి నొకరు చంపుకు తింటారు.’

10 “యిర్మీయా, ఈ విషయాలన్నీ వారికి తెలియచెప్పు. వారు చూస్తూ ఉండగా నీ వద్ద నున్న జాడీని క్రింద పడవేసి పగుల గొట్టుము. 11 అప్పుడీ మాటలు చెప్పు: ‘ఒకానొకడు మట్టి జాడీని పగులగొట్టినట్లు నేను యూదా రాజ్యాన్ని, యెరూషలేము నగరాన్నీ విచ్ఛిన్నం చేస్తానని సర్వశక్తిమంతుడగు యెహోవా చెపుతున్నాడు! ఈ ముక్కలను మరల క్రొత్త జాడీగా కూర్చలేము. 12 యూదా రాజ్యం విషయంలో కూడ అలాగే జరుగుతుంది. చనిపోయిన వారంతా తోఫెతులో, సందు లేకుండా పాతిపెట్టిబడతారు. 13 యెరూషలేము లోని ఇండ్లన్నీ తోఫెతువలె “అపవిత్ర” పర్చబడతాయి. తోఫెతువలె యూదా రాజుల రాజభవనాలన్నీ పాడవుతాయి. ఇది ఎందువల్ల జరుగుతుందంటే ప్రజలు వారి ఇండ్లలో కప్పుల మీద బూటకపు దేవతలను ఆరాధించినారు. నక్షత్రాలను వారు ఆరాధించి, వాటి గౌరవార్థం బలులు సమర్పించేవారు. బూటకపు దేవతలకు పానీయార్పణలు సమర్పించారు.’”

14 తోఫెతును వదిలి, దేవుడు తనను బోధించమన్న చోటికి యిర్మీయా వెళ్లాడు. యిర్మీయా దేవాలయానికి వెళ్లి, గుడి ఆవరణలో నిలబడినాడు. అక్కడి ప్రజలనుద్దేశించి యిర్మీయా ఇలా అన్నాడు: 15 “ఇశ్రాయేలు దేవుడు. సర్వశక్తిమంతుడగు యెహోవా యిలా సెలవిచ్చినాడు: ‘యెరూషలేముకు, దాని చుట్టు పట్ల గ్రామాలకు చాలా విపత్తులను కలుగజేస్తానని చెప్పియున్నాను. త్వరలోనే నేనీ విషయాలను జరిపిస్తాను. ఎందువల్లననగా ప్రజలు మొండి వారయ్యారు. నేను చెప్పేది వారు వినటం లేదు. నాకు విధేయులై వుండటానికి నిరాకరిస్తున్నారు.’”

1 తిమోతికి 4:6-16

మంచి సేవకునిగా ఉండుము

నీవీ బోధలు సోదరులకు చెబితే యేసు క్రీస్తు యొక్క మంచి సేవకునిగా పరిగణింపబడతావు. నీవు విశ్వసించిన సత్యాలను, సుబోధలను నీవు అనుసరిస్తున్నావు కనుక నీకు అభివృద్ధి కల్గుతుంది. ఆత్మీయత లేని కాకమ్మ కథలకు, ముసలమ్మ కథలకు దూరంగా ఉండు. భక్తితో ఉండటానికి అభ్యాసం చెయ్యి. శారీరక శిక్షణ వల్ల కొంత ఉపయోగం ఉంది. దైవభక్తివల్ల ప్రస్తుత జీవితంలోనూ, రానున్న జీవితంలోనూ మంచి కల్గుతుంది. కనుక అది అన్ని విషయాల్లో ఉపయోగపడుతుంది. ఇది నమ్మదగిన విషయం. సంపూర్ణంగా అంగీకరించదగినది. 10 మానవ జాతి రక్షకుడైన దేవుణ్ణి, ముఖ్యంగా తనను నమ్మినవాళ్ళను రక్షించే సజీవుడైన దేవుణ్ణి మనం విశ్వసించాము. కనుకనే మనము సహనంతో కష్టించి పని చేస్తున్నాము.

11 ఈ విషయాలు మిగతావాళ్ళకు బోధించి, వాటిని ఆచరించుని ఆజ్ఞాపించు. 12 నీవు వయస్సులో చిన్నవాడైనందుకు నిన్నెవ్వడూ చులకన చెయ్యకుండా జాగ్రత్త పడు. క్రీస్తును విశ్వసించేవాళ్ళకు మాటల్లో, జీవిత విధానంలో, ప్రేమలో, విశ్వాసంలో, పవిత్రతలో ఆదర్శంగా ఉండు.

13 నేను వచ్చేవరకు నీ కాలాన్ని దైవవాక్యాలు బహిరంగంగా చదవటానికి, వాటిని ఉపదేశించటానికి ఉపయోగించు. ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందింప చేయి. 14 పెద్దలు తమ చేతుల్ని నీపై ఉంచినప్పుడు ప్రవక్తలు చెప్పిన భవిష్యత్తు ప్రకారం నీకు వరం లభించింది. దాన్ని నిర్లక్ష్యం చెయ్యవద్దు. 15 నేను చెప్పిన విషయాలపై నీ మనస్సు లగ్నం చేయి. అప్పుడు అందరూ నీ అభివృద్ధిని గమనిస్తారు. 16 నీ వ్యక్తిగత జీవితాన్నీ, నీవు బోధించే వాటినీ జాగ్రత్తగా గమనించు. వాటిని పట్టుదలతో సాధించు. అలా చేస్తే నిన్ను నీవు రక్షించుకొన్నవాడవౌతావు. నీ బోధన విన్నవాళ్ళను రక్షించినవాడవౌతావు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International