Revised Common Lectionary (Semicontinuous)
సంగీత నాయకునికి: అష్టమ శృతిమీద తంతి వాయిద్యాలతో పాడదగిన దావీదు కీర్తన
6 యెహోవా, కోపగించి నన్ను గద్దించవద్దు.
కోపగించి నన్ను శిక్షించవద్దు.
2 యెహోవా, నా మీద దయ ఉంచుము.
నేను రోగిని, బలహీనుడిని నన్ను స్వస్థపరచుము. నా ఎముకలు వణకుతున్నాయి.
3 నా శరీరం మొత్తం వణకుతోంది.
యెహోవా నన్ను నీవు స్వస్థపర్చటానికి ఇంకెంత కాలం పడుతుంది.?
4 యెహోవా, మరల నన్ను విముక్తుని చేయుము.
నీవు చాలా దయగలవాడవు గనుక, నన్ను రక్షించుము.
5 చనిపోయిన వాళ్లు, వారి సమాధుల్లో నిన్ను జ్ఞాపకం చేసుకోరు.
సమాధుల్లోని ప్రజలు నిన్ను స్తుతించరు. అందుచేత నన్ను స్వస్థపరచుము.
6 యెహోవా, రాత్రి అంతా, నిన్ను ప్రార్థించాను.
నా కన్నీళ్లతో నా పడక తడిసిపోయింది.
నా పడకనుండి కన్నీటి బొట్లు రాలుతున్నాయి.
నీకు మొరపెట్టి నేను బలహీనంగా ఉన్నాను.
7 నా శత్రువులు నాకు చాలా కష్టాలు తెచ్చిపెట్టారు.
ఇది నన్ను విచారంతో చాలా దుఃఖపెట్టింది.
ఏడ్చుటవల్ల ఇప్పుడు నా కండ్లు నీరసంగాను, అలసటగాను ఉన్నాయి.
8 చెడ్డ మనుష్యులారా, వెళ్లిపొండి!
ఎందుకంటె నేను ఏడ్వటం యెహోవా విన్నాడు గనుక.
9 యెహోవా నా ప్రార్థన విన్నాడు. మరియు యెహోవా నా ప్రార్థన అంగీకరించి, జవాబు ఇచ్చాడు.
10 నా శత్రువులంతా తలక్రిందులై, నిరాశపడతారు.
వారు త్వరగా సిగ్గుపడతారు కనుక వారు తిరిగి వెళ్లిపోతారు.
15 నయమాను మరియు అతని బృందంవారు దైవజనుడు (ఎలీషా) వద్దకు వచ్చారు. ఎలీషా ఎదుట అతను నిలబడి, “ఇదుగో, ఇశ్రాయేలులో తప్ప యీ ప్రపంచంలో మరెచ్చట కూడా దేవుడు లేడని ఇప్పుడు తెలుసుకున్నాను. ఇప్పుడు నా కానుకను స్వికరింపుము” అని పలికాడు.
16 కాని ఎలీషా, “నేను యెహోవాను సేవిస్తున్నాను. యెహోవా జీవముతోడు, నేను ఎట్టి కానుకను స్వీకరింపనని వాగ్దానం చేస్తున్నాను” అన్నాడు.
నయమాను కష్టతరంగా అతనిని సముదాయించుటకు ప్రయత్నించాడు. కాని ఎలీషా తిరస్కరించాడు. 17 అప్పుడు నయమాను, “ఈ కానుకను కనుక నీవు స్వీకరించపోతే, కనీసం ఇదైనా నా కోసం చేయుము. నారెండు కంచర గాడిదలు మీది గంపలను ఇశ్రాయేలు దేశపు మన్నులో నింపుటకు అనుమతింపుము. ఎందుకనగా, ఇతర దేవతలకు నేను ఎన్నటికీ ఎటువంటి బలులు సమర్పించను, యెహోవాకి మాత్రమే సమర్పిస్తాను. 18 ఇది చేయడం వల్ల నన్ను యెహోవా క్షమించునట్లు యెహోవాని ప్రార్థిస్తున్నాను. భవిష్యత్తులో, నా యజమాని (సిరియా రాజు) రిమ్మోను ఆలయంలోకి వెళ్లి అసత్య దేవతలను పూజిస్తాడు. రిమ్మోను ఆరాధన జరుగునప్పుడు నా సహాయము కొరకు రాజు నా మీద ఆధారపడి వుంటాడు. అందువల్ల నేను రిమ్మోను ఆలయంలో మోకరిల్లుతాను. అలా జరిగినప్పుడు నన్ను క్షమింపుమని యెహోవాని వేడుకొనుచున్నాను” అని పలికాడు.
19 “నెమ్మదికలిగి వెళ్లుము” అని ఎలీషా నయమానుకు చెప్పాడు.
అందువల్ల నయమాను ఎలీషాని విడిచి కొంతదూరం వెళ్లాడు.
పౌలు ప్రయాణానికి సిద్ధపడుట
21 ఆ సంఘటనలు జరిగాక పౌలు మాసిదోనియ, అకయ ప్రాంతాల ద్వారా యెరూషలేము వెళ్ళాలని పరిశుద్ధాత్మ సహాయంతో నిశ్చయించుకున్నాడు. అక్కడికి వెళ్ళాక రోమా నగరాన్ని తప్పక దర్శించాలనుకున్నాడు. 22 తనకు సహాయం చేసేవాళ్ళలో యిద్దర్ని మాసిదోనియకు పంపాడు. వాళ్ళ పేర్లు తిమోతి, ఎరస్తు. అతడు ఆసియ ప్రాంతంలో మరి కొంత కాలం గడిపాడు.
ఎఫెసులో అల్లర్లు
23 ఆ రోజుల్లోనే ప్రభువు చూపిన మార్గాన్ని గురించి పెద్ద గొడవ జరిగింది. 24 “దేమేత్రి” అనే ఒక కంసాలి ఉండేవాడు. ఇతడు అర్తెమి దేవత ఉండే మందిరం యొక్క ప్రతిరూపాలను వెండితో తయారు చేసి అమ్మేవాడు. తద్వారా తన క్రింద పని చేసేవాళ్ళకు చాలినంత డబ్బు సంపాదించేవాడు.
25 తన పనివాళ్ళను, తనలాంటి వృత్తి చేసేవాళ్ళను సమావేశ పరిచి ఈ విధంగా అన్నాడు: “అయ్యలారా! మనమీ వ్యాపారంలో చాలా ధనం గడిస్తున్న విషయం మీకందరికీ తెలుసు. 26 ఈ పౌలు అనేవాడు ఏం చేస్తున్నాడో మీరు చూస్తున్నారు. ఇతడిక్కడ ఎఫెసులో, సుమారు ఆసియ ప్రాంతాలన్నిటిలో మానవుడు సృష్టించిన విగ్రహాలు దేవుళ్ళు కాదంటూ చాలా మంది ప్రజల్ని నమ్మించి తప్పుదారి పట్టిస్తున్నాడన్న విషయం మీరు విన్నారు. 27 ఈ కారణంగా మన వ్యాపారానికున్న మంచి పేరు పోయే ప్రమాదం ఉంది. పైగా అర్తెమి మహాదేవి మందిరానికున్న విలువ పోతుంది. ఆసియ ప్రాంతాల్లోనే కాక ప్రపంచమంతా పూజింపబడుతున్న ఆ దేవత యొక్క గొప్పతనము కూడా నశించి పోతుంది.”
© 1997 Bible League International