Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 22:1-15

సంగీత నాయకునికి: అయ్యలెత్ షహరు రాగం. దావీదు కీర్తన.

22 నా దేవా, నా దేవా నన్ను ఎందుకు విడిచిపెట్టావు?
    నన్ను రక్షించటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
    సహాయం కోసం నేను వేసే కేకలను వినటానికి నీవు చాలా దూరంగా ఉన్నావు.
నా దేవా, పగలు నేను నీకు మొరపెట్టాను.
    కాని నీవు నాకు జవాబు ఇవ్వలేదు.
మరియు నేను రాత్రిపూట నీకు మొరపెడుతూనే ఉన్నాను.

దేవా, నీవు పవిత్రుడవు.
    నీవు రాజుగా కూర్చున్నావు. ఇశ్రాయేలీయుల స్తుతులే నీ సింహాసనం.
మా పూర్వీకులు నిన్ను నమ్ముకొన్నారు.
    అవును దేవా, వారు నిన్ను నమ్ముకొన్నారు. నీవేమో వారిని రక్షించావు.
మా పూర్వీకులు సహాయంకోసం నిన్ను వేడుకొన్నారు, దేవా, తమ శత్రువుల నుంచి వారు తప్పించుకొన్నారు.
    వారు నిన్ను నమ్ముకొన్నారు. కనుక వారు నిరాశ చెందలేదు.
కాని, నేను మనిషిని కానా, పురుగునా?
    మనుష్యులు నన్ను దూషిస్తారు. ప్రజలు నన్ను ద్వేషిస్తారు.
నన్ను చూచే ప్రతి ఒక్కరూ నన్ను ఎగతాళి చేస్తారు.
    నన్ను చూచి, వారు తలలు ఎగురవేస్తూ, నన్ను వెక్కిరిస్తారు.
వారు నాతో అంటారు: “నీకు సహాయం చేయుమని నీవు యెహోవాను అడగాలి.
    ఒకవేళ ఆయన నిన్ను రక్షిస్తాడేమో!
    నీవంటే ఆయనకు అంత ఇష్టమైతే అప్పుడు ఆయన తప్పక నిన్ను రక్షిస్తాడు.”

దేవా, నిజంగా నేను నీ మీద ఆధారపడియున్నాను. నన్ను గర్భమునుండి బయటకు లాగినవాడవు నీవే.
    నేను యింకా నా తల్లి పాలు త్రాగుతూ ఉన్నప్పుడే నీవు నాకు అభయం ఇచ్చావు, ఆదరించావు.
10 నేను పుట్టిన రోజునుండి నీవు నాకు దేవునిగా ఉన్నావు.
    నేను నా తల్లి గర్భంలోనుండి వచ్చినప్పటినుండి నేను నీ జాగ్రత్తలోనే ఉంచబడ్డాను.

11 కనుక దేవా, నన్ను విడువకు.
    కష్టం దగ్గర్లో ఉంది. పైగా నాకు సహాయం చేసేవారు. ఎవ్వరూ లేరు.
12 మనుష్యులు రంకెవేసే ఆబోతుల్లాగా నా చుట్టూ వున్నారు.
    వారు బలిసిన బాషాను ఆబోతుల వలె నన్ను చుట్టుముట్టియున్నారు.
    (బాషాను అనగా యొర్దాను నది తూర్పు ప్రాంతం. అది పశువులకు ప్రసిద్ధికెక్కిన ప్రాంతం.)
13 ఒక జంతువును చీల్చివేస్తూ, గర్జిస్తున్న సింహాల్లా ఉన్నారు వారు.
    వారి నోళ్లు పెద్దగా తెరచుకొని ఉన్నాయి.

14 నేలమీద పోయబడ్డ నీళ్లలా
    నా బలం పోయినది.
నా ఎముకలు విడిపోయాయి.
    నా ధైర్యం పోయినది.
15 నా నోరు ఎండి, పగిలిపోయిన చిల్ల పెంకులా ఉన్నది.
    నా నాలుక నా అంగిటికి అతుక్కొని పోతోంది.
    “మరణ ధూళిలో” నీవు నన్ను ఉంచావు.

యోబు 17

17 “నా ఆత్మ భగ్నమై పోయింది.
    విడిచి పెట్టే సేందుకు నేను సిద్ధం.
నా జీవితం దాదాపు గతించిపోయింది,
    సమాధి నాకోసం నిరీక్షిస్తోంది.
మనుష్యులు నా చుట్టూరా నిలిచి నన్ను చూసి నవ్వుతున్నారు.
    వారు నన్ను ఆట పట్టిస్తూ అవమానిస్తూ ఉంటే నేను వారిని గమనిస్తున్నాను.

“దేవా, నీవు నన్ను (యోబు) నిజంగా బలపరుస్తున్నావని చూపించు,
    మరి ఎవ్వరూ నన్ను బలపరచరు.
నా స్నేహితుల మనస్సులను నీవు బంధించేశావు,
    కనుక వారు నన్ను అర్థం చేసుకోరు.
    దయచేసి వారిని జయించనీయకు.
‘ఒకడు[a] తన స్వంత పిల్లలను నిర్లక్ష్యం చేసి తన స్నేహితులకు సహాయం చేస్తాడు
    అని ప్రజలు చెబుతారని నీకు తెలుసా?’
    కాని ఇప్పుడు నా స్నేహితులే నాకు విరోధం అయ్యారు.
దేవుడు నా పేరును (యోబు) ప్రతి ఒక్కరికీ ఒక చెడ్డ పదంగా చేశాడు.
    ప్రజలు నా ముఖం మీద ఉమ్మి వేస్తారు.
నేను చాలా బాధపడుతూ, చాలా విచారంగా ఉన్నాను, కనుక నా కన్నులు దాదాపు గుడ్డివి అయ్యాయి.
    నా మొత్తం శరీరం ఒక నీడలా చాలా సన్నం అయ్యింది.
మంచి మనుష్యులు దీని విషయమై కలవరపడుతున్నారు.
    దేవుని గూర్చి లక్ష్యపెట్టని ప్రజల విషయమై నిర్దోషులు కలవరపడుతున్నారు.
కాని నీతిమంతులు వాళ్ల పద్ధతులనే చేపడతారు.
    నిర్దోషులు మరింత బలవంతులవుతారు.

10 “కానీ రండి, మీరంతా కలసి, మొత్తం తప్పు నాదే అని నాకు చూపించడానికి మరల ప్రయత్నం చేయండి.
    మీలో ఎవరూ జ్ఞానం గలవారు కారు.
11 నా జీవితం గతించి పోతోంది. నా ఆలోచనలన్నీ నాశనం చేయబడ్డాయి.
    నా ఆశ అడుగంటింది.
12 కాని నా స్నేహితులు రాత్రిని పగలు అనుకొంటారు.
    చీకటి పడినప్పుడు వెలుగు వస్తోంది, అని వారు అంటారు.

13 “నేను కనిపెడుతున్న ఒకే గృహం కనుక పాతాళం
    అయితే, అంధకార సమాధిలో నేను నా పడక వేసుకొంటే
14 సమాధిని చూచి, ‘నీవు నా తండ్రివి అని’
    పురుగులను చూసి, ‘నా తల్లివి’ లేక ‘నా సోదరివి’ అని నేను చెప్పవచ్చు
15 కాని అదే నాకు ఆశ అయితే నాకు ఎలాంటి ఆశలేదు.
    మరియు ప్రజలు నాయందు ఏ ఆశ చూడలేరు.
16 (నా ఆశ నాతోనే చనిపోతుందా?) అది నేను చనిపోయే స్థలంయొక్క లోతుల్లోకి వెళ్తుందా?
    మనమంతా చేరి బురదలోకి వెళ్తామా?”

హెబ్రీయులకు 3:7-19

దేవుని ప్రజలకు విశ్రాంతి

7-8 అందువల్ల పరిశుద్ధాత్మ ఈ విధంగా అంటున్నాడు:

“ఆనాడు ఎడారిలో మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు.
    ఆయన సహనాన్ని పరీక్షించారు.
    కాని నేడు మీరాయన మాట వింటే మీ హృదయాలు కఠిన పర్చుకోవద్దు.
నేను నలభై సంవత్సరాలు చేసినదంతా చూసి కూడా
    మీ పూర్వికులు నన్నూ, నా సహనాన్ని పరీక్షించారు.
10 ఆ కారణంగానే, ఆ ప్రజలంటే నాకు కోపం వచ్చింది,
    ‘వాళ్ళ హృదయాలు పెడదారులు పట్టాయి,
    నేను చూపిన దారుల్ని వాళ్ళు చూడ లేదు’ అని అన్నాను.
11 అందుకే, ‘నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వనని
    కోపంతో ప్రమాణం చేశాను.’”(A)

12 సోదరులారా! సజీవంగా ఉన్న దేవునికి దూరమైపోయే హృదయంకాని, విశ్వాసంలేని హృదయంకాని, మీలో ఉండకుండా జాగ్రత్త పడండి. 13 ఆ “నేడు” అనేది యింకా ఉంది గనుక, పరస్పరం ప్రతి రోజు ప్రోత్సాహపరచుకొంటూ ఉండండి. అప్పుడు పాపం మిమ్మల్ని మోసం చెయ్యలేదు. మీలో మూర్ఖత్వం ఉండదు. 14 మనలో మొదటినుండి ఉన్న విశ్వాసాన్ని చివరిదాకా గట్టిగా పట్టుకొనివుంటే, మనం క్రీస్తుతో కలిసి భాగం పంచుకొంటాం. 15 ఇంతకు ముందు చెప్పబడినట్లు:

“ఆనాడు మూర్ఖులై మీరాయనకు ఎదురు తిరిగారు
    కాని, నేడు మీరాయన మాట వింటే అలా చెయ్యకండి.”(B)

16 వీళ్ళందరూ ఈజిప్టు దేశంనుండి మోషే పిలిచుకొని వచ్చిన ప్రజలే కదా! దేవుని స్వరం విని ఎదురు తిరిగింది వీళ్ళే కదా! 17 నలభై సంవత్సరాలు దేవుడు కోపగించుకొన్నది ఎవరిమీద? పాపం చేసి ఎడారిలో పడి చనిపోయినవాళ్ళమీదనే కదా! 18 “నా విశ్రాంతిలోనికి వాళ్ళను రానివ్వను” అని, అవిధేయతగా ప్రవర్తించినవాళ్ళ విషయంలో దేవుడు ప్రమాణం చేయలేదా? 19 వాళ్ళు విశ్వసించలేదు గనుక ఆ విశ్రాంతిలో ప్రవేశించలేకపొయ్యారు. ఇది మనం గమనిస్తూనే ఉన్నాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International