Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 130

యాత్ర కీర్తన.

130 యెహోవా, నేను గొప్ప కష్టంలో ఉన్నాను.
    కనుక సహాయం కోసం నిన్ను పిలుస్తున్నాను.
నా ప్రభువా, నా మాట వినుము.
    సహాయం కోసం నేను చేస్తున్న మొర వినుము.
యెహోవా, మనుష్యులను వారి పాపాలన్నిటిని బట్టి నీవు శిక్షిస్తే
    ఒక్క మనిషి కూడా మిగలడు.
యెహోవా, నీ ప్రజలను క్షమించుము.
    అప్పుడు నిన్ను ఆరాధించుటకు మనుష్యులు ఉంటారు.

యెహోవా నాకు సహాయం చేయాలని నేను కనిపెడుతున్నాను.
    నా ఆత్మ ఆయన కోసం కనిపెడుతుంది.
    యెహోవా చెప్పేది నేను నమ్ముతున్నాను.
నా ప్రభువు కోసం నేను కనిపెడుతున్నాను.
    ఎప్పుడు తెల్లారుతుందా అని ఆశతో కనిపెడుతున్న కావలివాండ్లలా నేను ఉన్నాను.
ఇశ్రాయేలూ, యెహోవాను నమ్ముకో.
    నిజమైన ప్రేమ యెహోవా దగ్గర మాత్రమే కనబడుతుంది.
యెహోవా మనలను మరల, మరల రక్షిస్తాడు.
    మరియు యెహోవా ఇశ్రాయేలీయుల పాపాలు అన్నింటి విషయంలో వారిని క్షమిస్తాడు.

2 సమూయేలు 13:37-14:24

37 దావీదు తన కుమారుడైన అమ్నోను కొరకు ప్రతి రోజూ దుఃఖించాడు.

అబ్షాలోము గెషూరుకు తప్పించుకు పోవటం

అబ్షాలోము తల్మయి రాజు[a] వద్దకు పారిపోయాడు. తల్మయి గెషూరుకు రాజు. అతని తండ్రి పేరు అమీహూదు. 38 అబ్షాలోము గెషూరుకు పారిపోయి అక్కడ మూడు సంవత్సరాలు ఉన్నాడు. 39 అమ్నోను మరణం గూర్చి దావీదురాజు క్రమేపీ ఓడార్చబడ్డాడు. కాని అతడు అబ్షాలోమును గూర్చి మిక్కిలి ఆరాట పడసాగాడు.

యోవాబు నేర్పరియైన స్త్రీని దావీదు వద్దకు పంపటం

14 అబ్షాలోమును గూర్చి దావీదు రాజు మిక్కిలి బెంగపెట్టుకున్నాడని సెరూయా కుమారుడైన యోవాబు గ్రహించాడు. యోవాబు తన దూతలను తెకోవకు పంపి, అక్కడి నుండి ఒక నేర్పరియైన స్త్రీని తీసుకొని రమ్మని చెప్పాడు. ఆ స్త్రీతో యోవాబు ఇలా అన్నాడు: “దయచేసి నీవు చాలా దుఃఖంలో ఉన్నట్లు నటించు. విషాదసూ చకమైన బట్టలు వేసుకో, అలంకరణ చేసుకోవద్దు. చనిపోయిన, నీకు ప్రియమైన ఒక వ్యక్తి కోసం చాలా కాలంగా విలపిస్తున్నట్లు ప్రవర్తించు. నేను ఇప్పుడు నీకు చెప్పే మాటలను నీవు రాజు వద్దకు వెళ్లి చెప్పు.” ఈ విధంగా ఆ యుక్తిగల స్త్రీ తో మాట్లాడి, ఆమె రాజుతో ఏమి చెప్పాలో యోవాబు ఆమెకు వివరించాడు.

తరువాత తెకోవ నుండి వచ్చిన స్త్రీ రాజు వద్దకు వెళ్లి మాట్లాడింది. ఆమె రాజు ముందు ప్రణమిల్లింది. ఆమె ముఖం నేలకు తాకింది. వంగి నమస్కరించి, “రాజా, నాకు సహాయం చేయండి!” అని ప్రాధేయ పడింది.

“ఏమిటి నీ సమస్య?” అని దావీదు రాజు ప్రశ్నించాడు.

ఆ స్త్రీ యిలా చెప్పింది: “నేనొక విధవ స్త్రీని! నా భర్త చనిపోయాడు. నాకు ఇద్దరు కుమారులున్నారు. వారిద్దరూ పొలాల్లోకి పోయి దెబ్బలాటకు దిగారు. వాళ్లను నివారించటానికి ఒక్కడు కూడా లేక పోయాడు. ఒక కొడుకు, ఇంకొక కొడుకును చంపివేశాడు. ఇప్పుడు కుటుంబమంతా నామీద కత్తిగట్టారు. హత్యకు పాల్పడిన కొడుకును తెమ్మని ఒత్తిడి తెస్తున్నారు. తన సోదరుని చంపిన కారణంగా వారంతా అతనిని చంపుతామంటున్నారు. నా కొడుకును చంపనిస్తే, తన తండ్రికి ఏకైక వారసుడైన వాడు లేకుండా పోతాడు! నా కుమారుడు అగ్నిలో చివరి నిప్పుకణంలాంటివాడు. ఇప్పుడు ఆ చివరి నిప్పుకణం ఆరిపోబోతూవుంది! దానితో మరణించిన నా భర్త పేరు, ఆస్తి నేలపాలవుతాయి.”

ఇది విన్న రాజు, “ఇక నీవు ఇంటికి వెళ్లు. నీ విషయాల పట్ల నేను శ్రద్ధ తీసుకుంటాను” అని ఆమెతో అన్నాడు.

తెకోవ స్త్రీ రాజుతో, “ఈ విషయంలో వచ్చే పరిణామాలకు, పర్యవసానానికి నిందంతా నామీదే పడుగాక! నా ప్రభువైన రాజా! నీవు, నీ సింహాసనం ఈ విషయంలో ఏదోషమూ ఎరుగరు!” అని చెప్పింది.

10 “నిన్ను గురుంచి ఎవరైనా దీనిగూర్చి నిన్నేమైన అనినయెడల నా వద్దకు తీసుకొనిరా. వాడు మరల నిన్ను ఏమీ అనడు” అని దావీదు రాజు అన్నాడు.

11 అది విన్న ఆ స్త్రీ రాజును ఇలా వేడుకున్నది: “దయచేసి నీ దేవుడైన యెహోవాను ప్రార్థించు. హంతకులను శిక్షించాలని చూసే ఆ ప్రజలు నా కుమారునికి కీడుచేయకుండా దేవుడు నివారించగలందులకు ఆయనను ప్రార్థించు.”

దావీదు ఆమెకు ఇలా అభయమిచ్చాడు: “యెహోవా జీవము తోడుగా ఎవ్వడూ నీ కుమారునికి హాని చేయలేడు. నీ కుమారుని తలలోని ఒక్క వెంట్రుక కూడా క్రింద రాలదు.”

12 ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా! నన్నింకా కొన్ని విషయాలు చెప్పనీయండి” అని అన్నది.

చెప్పమన్నాడు రాజు.

13 ఆ స్త్రీ ఇలా అన్నది: “దేవుని ప్రజలకు వ్యతిరేకంగా ఇవన్నీ నీవెందుకు చేస్తున్నావు? అవును. ఇవన్నీ చేస్తూ నీవు దోషివని బహిర్గతం చేసుకుంటున్నావు![b] ఎందువల్లననగా నీవు నీయింటి నుండి పంపివేసిన నీ కుమారుని తిరిగి తీసుకొని రాలేదు. 14 మనమంతా ఏదో ఒక రోజు చనిపోవటమనేది సత్యం. మనమంతా నేల మీద ఒలికిన నీరులాంటివారం. ఈ ఒలికిన నీటిని మట్టిలో నుండి తిరిగి తీయటం ఎవ్వరికీ సాధ్యం కాని పని. కాని దేవుడు ప్రాణాన్ని తీసుకొనడు. ఇండ్లనుండి తరిమి వేయబడిన వారికి దేవుడు ఒక పథకం తయారుచేసి ఉంచుతాడు. అంటే వారు ఆయన నుండి బలవంతంగా దూరం చేయబడలేదు! 15 నా ప్రభువైన రాజా! ఈ మాటలు నీకు చెప్పటానికి నేను వచ్చాను. కారణమేమంటే, ప్రజలు నన్ను భయపెట్టారు! నేను వాళ్లతో నన్ను పోయి రాజుతో మాట్లాడనీయమన్నాను. బహుశః రాజు నా విన్నపం ఆలకింపవచ్చునని అన్నాను. 16 రాజు వింటాడు. విని నన్ను, నా కుమారుణ్ణి చంపజూస్తున్న వారి నుండి రక్షణ కల్పిస్తాడనీ; దేవుడు ప్రసాదించిన ఆస్తిని అనుభవించకుండ చేయజూస్తున్న వారి నుంచి మమ్మల్ని రక్షిస్తాడనీ అనుకున్నాను. 17 నా ప్రభువైన నా రాజు మాటలు మనశ్శాంతినిస్తాయని నాకు తెలుసు. ఎందువల్లనంటే నీవు దేవుని నుండి వచ్చిన దూతలాంటివాడవు. ఏది మంచిదో, ఏది చెడ్డదో నీకు తెలుసు. దేవుడు సదా నీతో వుండు గాక!”

18 అది విని ఆశ్చర్యపడిన రాజైన దావీదు, “నేనొక ప్రశ్న అడుగుతాను. నీవు సమాధనం చెప్పాలి” అన్నాడు.

ఆ స్త్రీ, “నా ప్రభువైన రాజా దయచేసి మీ ప్రశ్న అడగండి!” అన్నది.

19 “విషయాలన్నీ మాట్లాడమని యోవాబు నీతో చెప్పాడా?” అని రాజు అడిగాడు.

ఆ స్త్రీ ఇలా అన్నది: “నీ ప్రమాణంగా, నా ప్రభువైన రాజా, నీవు నిజం చెప్పావు. నీ సేవకుడైన యోవాబు ఇవన్నీ చెప్పమని నాతో అన్నాడు. 20 యోవాబు ఇలా ఎందుకు చేశాడంటే నీవు పరిస్థితులు నిష్పక్షపాతంగా, రాగ ద్వేషాలు లేకుండా అవగాహన చేసుకొని యుక్తమైన నిర్ణయం తీసుకుంటావని. నా ప్రభువా, నీవు దేవ దూతలా తెలివిగలవాడవు. ఈ భూమిమీద జరిగేదంతా నీకు తెలుసు.”

అబ్షాలోము యెరూషలేముకు తిరిగి రావటం

21 రాజు యోవాబుతో ఇలా అన్నాడు: “చూడు. నేను మాట ఇచ్చిన విధంగా చేస్తాను. యువకుడైన అబ్షాలోమును దయచేసి తీసుకొని రా.”

22 యోవాబు తన ముఖం నేలనుతాకి సాష్టాంగపడి నమస్కరించాడు. రాజైన దావీదుకు ఆశీర్వచనం పలికి, “ఈ రోజు నాపట్ల మీరు ప్రసన్నులైయున్నారని నాకు తెలుసు! ఎందువల్లనంటే నేను అడిగినదంతా నీవు చేశావు!” అని అన్నాడు.

23 యోవాబు లేచి గెషూరుకు వెళ్లి అబ్షాలోమును యెరూషలేముకు తీసుకొని వచ్చాడు. 24 అయితే దావీదు రాజు మాత్రం, “అబ్షాలోము తప్పక తన స్వంత ఇంటికి వెళ్లిపోవాలి. అతడు నన్ను చూడటానికి రాకూడదు” అని అన్నాడు. కావున అబ్షాలోము తన స్వంత ఇంటికి వెళ్లిపోయాడు. అబ్షాలోము రాజును చూడటానికి వెళ్లలేక పోయాడు.

రోమీయులకు 15:1-6

15 సంపూర్ణ విశ్వాసం గల మనము సంపూర్ణ విశ్వాసం లేనివాళ్ళ బలహీనతల్ని సహించాలి. మనం మన ఆనందం మాత్రమే చూసుకోకూడదు. ప్రతి వ్యక్తి తన సోదరుని మేలు కోసం, అభివృద్ధి కోసం అతనికి అనుగుణంగా నడుచుకోవాలి. క్రీస్తు కూడా తన ఆనందం మాత్రమే చూసుకోలేదు. దీన్ని గురించి ఈ విధంగా వ్రాసారు: “దేవా! నిన్ను అవమానించినవాళ్ళు నన్నూ అవమానించారు.” గతంలో వ్రాసిన లేఖనాలు మనకు బోధించటానికి వ్రాశారు. వాటి ద్వారా సహనము, ప్రోత్సాహము పొంది, రక్షణ లభిస్తుందన్న నమ్మకం మనలో కలగాలని దానిలోని ఉద్దేశ్యం. మనలో సహనము, ప్రోత్సాహము కలుగచేసే దేవుడు, యేసు క్రీస్తు ద్వారా మీ మధ్య ఐకమత్యము కలుగచేయునుగాక! అప్పుడు మనము ఒకే హృదయంతో, ఒకే నాలుకతో మన యేసు క్రీస్తు ప్రభువుకు తండ్రి అయినటువంటి దేవుణ్ణి స్తుతించగలుగుతాము.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International