Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 69:1-3

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.

కీర్తనలు. 69:13-16

13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.

కీర్తనలు. 69:30-36

30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

ఆదికాండము 11:1-9

బాబెలు గోపురం

11 జలప్రళయం తర్వాత మానవులంతా ఒకే భాష మాట్లాడారు. ప్రజలంతా ఒకే పదజాలం ఉపయోగించారు. తూర్పు నుండి ప్రజలు కదిలిపోయారు. షీనారు దేశంలో మైదాన భూమిని వారు కనుగొన్నారు. బ్రతుకుదెరువు కోసం ప్రజలంతా అక్కడే ఉండిపోయారు. “మనం ఇటుకలు చేసి, అవి గట్టిపడేందుకు వాటిని కాల్చాలి” అనుకొన్నారు ప్రజలు. ఇళ్లు కట్టుటకు ప్రజలు రాళ్లు కాక ఇటుకలనే ఉపయోగించారు. అలానే అడుసు కాక తారు ఉపయోగించారు.

అప్పుడు ప్రజలు ఇలా అన్నారు: “మన కోసం మనం ఒక పట్టణం కట్టుకోవాలి. ఆకాశం అంత ఎత్తుగా మనం ఒక గోపుర శిఖరం కట్టుకోవాలి. ఇలా గనుక చేస్తే మనం ప్రఖ్యాతి చెందుతాం. ప్రపంచమంతటా మనం చెల్లా చెదురవకుండా ఒకే చోట మనమంతా కలసి ఉంటాం.”

ఆ పట్టణాన్ని, ఆ గోపుర శిఖరాన్ని చూచుటకు యెహోవా దిగి వచ్చాడు. వాటిని ప్రజలు నిర్మిస్తూ ఉండటం యెహోవా చూశాడు. యెహోవా ఇలా అన్నాడు: “ఈ ప్రజలంతా ఒకే భాష మాట్లాడుతున్నారు. వీళ్లంతా కలసి ఉమ్మడిగా ఈ పని చేస్తున్నట్లు నాకు కనబడుతోంది. వారు చేయగలిగిన దానికి ఇది ప్రారంభం మాత్రమే. త్వరలో వాళ్లు యోచించినదేదైనా చేయ గలుగుతారు. అందుచేత మనం క్రిందికి వెళ్లి, వారి భాషను గలిబిలి చేద్దాం. అప్పుడు వాళ్లు ఒకరినొకరు అర్థం చేసుకోలేరు.”

ఆ ప్రజలు భూలోకం అంతటా చెదిరిపోయేటట్లు యెహోవా చేశాడు. కనుక ఆ పట్టణాన్ని కట్టుకోవటం ఆ ప్రజలు ముగించలేకపోయారు. మొత్తం ప్రపంచంలోని భాషను దేవుడు గలిబిలి చేసిన చోటు అదే. కనుక ఆ స్థలం బాబెలు[a] అని పిలువబడింది. కనుక ఆ స్థలం నుండి భూమిమీద ఇతర చోట్లన్నింటికీ ఆ ప్రజలను యెహోవా చెదరగొట్టాడు.

మత్తయి 7:13-20

పరలోకానికి, నరకానికి మార్గాలు

(లూకా 13:24)

13-14 “నరకానికి వెళ్ళే మార్గము సులభంగా ఉంటుంది. దాని ద్వారం విశాలంగా ఉంటుంది. చాలా మంది ఆ ద్వారాన్ని ప్రవేశిస్తారు. పరలోకానికి వెళ్ళే మార్గము కష్టంగా ఉంటుంది. దాని ద్వారం ఇరుకుగా ఉంటుంది. కొద్దిమంది మాత్రమే దాన్ని కనుగొంటారు. ఇది గమనించి, ఇరుకైన ద్వారాన్నే ప్రవేశించండి.

ప్రజలు చేయునది వారేమైయున్నారని చూపుతుంది

(లూకా 6:43-44; 13:25-27)

15 “కపట ప్రవక్తల విషయంలో జాగ్రత్తగా ఉండండి. వాళ్ళు గొఱ్ఱె తోళ్ళు కప్పుకొని మీ దగ్గరకు వస్తారు. కాని లోపల క్రూరమైన తోడేళ్ళలా ఉంటారు. 16 వాళ్ళ వల్ల కలిగిన ఫలాన్ని బట్టి వాళ్ళను మీరు గుర్తించ కలుగుతారు. ముళ్ళపొదల నుండి ద్రాక్షాపండ్లను, పల్లేరు మొక్కల నుండి అంజూరపు పండ్లను పొందగలమా? 17 మంచి చెట్టుకు మంచి పండ్లు కాస్తాయి. పులుపు పండ్లు కాచే చెట్టుకు పులుపు పండ్లు కాస్తాయి. 18 మంచి చెట్టుకు పులుపు పండ్లు కాయవు. పులువు పండ్లు కాచే చెట్టుకు మంచి పండ్లు కాయవు. 19 దేవుడు మంచి ఫలమివ్వని చెట్టును నరికి మంటల్లో వేస్తాడు. 20 అందువల్ల, వాళ్ళవల్ల కలిగిన ఫలాన్ని బట్టి మీరు వాళ్ళను గుర్తించ కలుగుతారు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International