Revised Common Lectionary (Semicontinuous)
14 “కనుక నేను (యెహోవా) ఆమెతో ప్రేమగా మాట్లాడతాను. ఆమెను ఎడారిలోకి నడిపించి, ఆమెతో నేను మృదువుగా మాట్లాడతాను. 15 అక్కడ ద్రాక్షాతోటలను ఆమెకు ఇస్తాను. ఆకోరు (శ్రమగల)లోయను ఒక నిరీక్షణ ద్వారంగా చేస్తాను. అప్పుడు తన యౌవన దశలో ఈజిప్టు దేశం నుండి బయటకు వచ్చినప్పుడు చెప్పినట్టుగా ఆమె జవాబు చెపుతుంది. 16 యెహోవా ఇలాగున చెపుతున్నాడు.
“ఆ సమయంలో ‘నా భర్తవు’ అని నీవు నన్ను పిలుస్తావు. ‘నా బయలు’ అని నీవు నన్ను పిలవవు. 17 ఆమె నోటినుండి బయలు దేవత పేర్లను నేను తొలగించివేస్తాను. అప్పుడు ఆ బయలు దేవతల పేర్లను ప్రజలు మరల ఉపయోగించరు.
18 “ఆ సమయంలో పొలంలోని పశువులతోను, ఆకాశంలోని పక్షులతోను, నేలమీద ప్రాకే ప్రాణులతోను ఇశ్రాయేలీయులకోసం నేను ఒక ఒడంబడిక చేస్తాను. విల్లు, ఖడ్గం, యుద్ధ ఆయుధాలు నేను విరుగగొడతాను. ఆ దేశంలో ఆయుధాలు ఏవీ మిగలవు. ఇశ్రాయేలు ప్రజలు ప్రశాంతంగా పడుకోగల్గునట్లు నేను దేశాన్ని క్షేమంగా ఉంచుతాను. 19 మరియు నేను (యెహోవా) నిన్ను శాశ్వతంగా నా వధువుగా చేసుకొంటాను. మంచితనం, న్యాయం, ప్రేమ, కరుణలతో నిన్ను నేను నా వధువుగా చేసుకొంటాను. 20 నిన్ను నాకు నమ్మకమైన వధువుగా చేసుకొంటాను. అప్పుడు నీవు నిజంగా యెహోవాను తెలుసుకొంటావు.
దావీదు కీర్తన.
103 నా ప్రాణమా! యెహోవాను స్తుతించుము.
నా సర్వ అంగములారా, ఆయన పవిత్ర నామాన్ని స్తుతించండి.
2 నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము.
ఆయన నిజంగా దయగలవాడని మరచిపోకుము.
3 మనం చేసిన పాపాలన్నింటినీ దేవుడు క్షమిస్తున్నాడు.
మన రోగాలన్నింటినీ ఆయన బాగుచేస్తున్నాడు.
4 దేవుడు మన ప్రాణాన్ని సమాధి నుండి రక్షిస్తున్నాడు.
ఆయన ప్రేమ, జాలి మనకు ఇస్తున్నాడు.
5 దేవుడు మనకు విస్తారమైన మంచి వస్తువులు ఇస్తున్నాడు.
ఆయన మనలను యౌవన పక్షిరాజు వలె మరల పడుచువారినిగా చేస్తున్నాడు.
6 యెహోవా న్యాయం కలవాడు.
ఇతర మనుష్యుల ద్వారా గాయపరచబడి దోచుకొనబడిన ప్రజలకు దేవుడు న్యాయం జరిగిస్తాడు.
7 దేవుడు తన న్యాయ చట్టాలను మోషేకు నేర్పాడు.
తాను చేయగల శక్తివంతమైన పనులను ఇశ్రాయేలీయులకు దేవుడు చూపించాడు.
8 యెహోవా జాలిగలవాడు, దయగలవాడు.
దేవుడు సహనంగలవాడు, ప్రేమపూర్ణుడు.
9 యెహోవా ఎల్లప్పుడూ విమర్శించడు.
యెహోవా ఎల్లప్పుడూ మన మీద కోపంతో ఉండడు.
10 మనం దేవునికి విరోధంగా పాపం చేశాం.
కాని మనకు రావలసిన శిక్షను దేవుడు మనకివ్వలేదు.
11 భూమిపైన ఆకాశం ఎంత ఎత్తుగా ఉన్నదో
తన అనుచరుల యెడల దేవుని ప్రేమ అంత ఎత్తుగా ఉన్నది.
12 పడమటినుండి తూర్పు దూరంగా ఉన్నట్లు
దేవుడు మననుండి మన పాపాలను అంత దూరం పారవేశాడు.
13 తండ్రి తన పిల్లల యెడల దయగా ఉంటాడు.
అదే విధంగా, యెహోవా తన అనుచరులపట్ల కూడా దయగా ఉంటాడు.
22 అన్ని చోట్లా అన్నింటినీ యెహోవా చేశాడు. అన్నిచోట్లా సమస్తాన్నీ దేవుడు పాలిస్తాడు.
అవన్నీ యెహోవాను స్తుతించాలి!
నా ప్రాణమా, యెహోవాను స్తుతించుము!
క్రొత్త నిబంధన యొక్క సేవకులు
3 ఇలా మాట్లాడటం మమ్మల్ని మేము పొగడుకొంటున్నట్లు అనిపిస్తోందా? మీ నుండి మాకు పరిచయపత్రాలు కావాలా? లేక మీ దగ్గరకు వచ్చినప్పుడు యితరులవలే పరిచయ పత్రాలు తీసుకురావాలా? 2 మీరే మా పరిచయ పత్రం. మిమ్మల్ని గురించి మా హృదయాలపై వ్రాయబడి ఉంది. ఇది అందరికీ తెలుసు. దాన్ని అందరూ చదివారు. 3 మీరు క్రీస్తును గురించి వ్రాసిన పత్రంలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ఈ పత్రం సిరాతో కాక, సజీవమైన దేవుని ఆత్మతో వ్రాయబడింది. అది రాతి పలకపై కాక, మానవుల హృదయాలపై వ్రాయబడింది. మీరు మా సేవా ఫలితం.
4 మేము దేవుణ్ణి క్రీస్తు ద్వారా విశ్వసిస్తున్నాము. కనుక మాకానమ్మకం ఉంది. 5 మేము చేస్తున్న కార్యాలు చేయగల సామర్థ్యం మాలో ఉందని చెప్పటం లేదు. ఆ శక్తి మాకు దేవుడు ప్రసాదించాడు. 6 దేవుడు మేము క్రొత్త నిబంధనకు సేవకులుగా ఉండేటట్లు మాకు శక్తినిచ్చాడు. ఈ నిబంధన వ్రాత రూపంలో లేదు. అది దేవుని ఆత్మ రూపంలో ఉంది. వ్రాత రూపంలో ఉన్న నియమాలు మరణాన్ని కలిగిస్తాయి. కాని దేవుని ఆత్మ జీవాన్నిస్తాడు.
లేవి (మత్తయి) యేసును వెంబడించటం
(మత్తయి 9:9-13; లూకా 5:27-32)
13 యేసు మళ్ళీ సముద్రం ఒడ్డుకు వెళ్ళాడు. చాలామంది ప్రజలు ఆయన చుట్టూ చేరారు. ఆయన వాళ్ళకు బోధించటం మొదలుపెట్టాడు. 14 అక్కడి నుండి బయలుదేరి ముందుకు నడుస్తూండగా అల్ఫయి కుమారుడైన లేవి[a] పన్నులు వసూలు చేసే పాకలో కూర్చుని వుండటం చూసాడు. యేసు అతనితో, “నా వెంటరా” అని అన్నాడు. లేవి లేచి ఆయన్ని అనుసరించాడు.
15 యేసు, ఆయన శిష్యులు లేవి యింట్లో భోజనం చేస్తూ ఉన్నారు. ఆయనతో సహా చాలామంది పన్నులు వసూలు చేసేవాళ్ళు, పాపం చేసిన వాళ్ళు భోజనం చేస్తూ ఉన్నారు. వీళ్ళలో చాలామంది యేసు అనుచరులు. 16 పరిసయ్యులలోని శాస్త్రులు యేసు పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో భోజనం చెయ్యటం చూసారు. వాళ్ళు ఆయన శిష్యులతో, “ఆయన పాపం చేసిన వాళ్ళతో, పన్నులు వసూలు చేసే వాళ్ళతో ఎందుకు కలసి తింటాడు?” అని అడిగారు.
17 ఇది విని యేసు వాళ్ళతో, “ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకు వైద్యుని అవసరం ఉండదు. రోగంతో ఉన్న వాళ్ళకే వైద్యుని అవసరం ఉంటుంది. నేను నీతిమంతులను పిలవటానికి రాలేదు. పాపులను పిలవటానికి వచ్చాను” అని అన్నాడు.
యేసు ఇతర మతనాయకులవలె కాదు
(మత్తయి 9:14-17; లూకా 5:33-39)
18 యోహాను శిష్యులు, పరిసయ్యులు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు. కొందరు యేసు దగ్గరకు వచ్చి, “యోహాను శిష్యులు, పరిసయ్యుల శిష్యులు ఉపవాసాలు చేస్తారు కదా! మీ శిష్యులు ఎందుకు చెయ్యరు?” అని అడిగారు.
19 యేసు, “పెళ్ళికుమారుడు వాళ్ళతో ఉన్నంత కాలం వాళ్ళు ఉపవాసం చెయ్యరు, 20 కాని, వాళ్ళనుండి పెళ్ళికుమారుణ్ణి తీసుకు వెళ్ళేరోజు వస్తుంది. ఆ రోజు వాళ్ళు ఉపవాసం చేస్తారు” అని అన్నాడు.
21 “పాత వస్త్రంపై ఉన్న చిరుగుకు క్రొత్త వస్త్రంతో ఎవరు కుడ్తారు? అలా చేస్తే క్రొత్త వస్త్రం గుంజుకుపోయి మొదటి చిరుగు ఇంకా పెద్దదౌతుంది. 22 పాత తోలు సంచుల్లో క్రొత్త ద్రాక్షారసం ఎవరూ దాచారు. అలా దాస్తే క్రొత్త ద్రాక్షరసం ఆ తోలు సంచిని చినిగేటట్లు చేస్తుంది. తోలుసంచీ, ద్రాక్షారసం రెండూ నాశనమౌతాయి. అందువల్ల క్రొత్త ద్రాక్షారసం క్రొత్త తోలు సంచుల్లోనే దాచాలి” అని కూడా యేసు అన్నాడు.
© 1997 Bible League International