Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 83

ఆసాపు స్తుతి గీతం.

83 దేవా, మౌనంగా ఉండవద్దు!
    నీ చెవులు మూసికోవద్దు!
    దేవా, దయచేసి ఊరుకోవద్దు.
దేవా, నీ శత్రువులు నీకు వ్యతిరేకంగా పథకాలు వేస్తున్నారు.
    నీ శత్రువులు త్వరలోనే దాడి చేస్తారు.
నీ ప్రజలకు వ్యతిరేకంగా వారు రహస్య పథకాలు వేస్తారు.
    నీవు ప్రేమించే ప్రజలకు విరోధంగా నీ శత్రువులు పథకాలను చర్చిస్తున్నారు.
“ఆ మనుష్యులను పూర్తిగా నాశనం చేద్దాం. రమ్ము.
    అప్పుడు ‘ఇశ్రాయేలు’ అనే పేరు తిరిగి ఎవ్వరూ జ్ఞాపకంచేసుకోరు,” అని శత్రువులు చెబుతున్నారు.
దేవా, నీకు విరోధంగా పోరాడేందుకు నీవు మాతో చేసిన
    ఒడంబడికకు విరోధంగా పోరాడేందుకు ఆ ప్రజలంతా ఏకమయ్యారు.
6-7 ఆ శత్రువులు మనకు విరోధంగా పోరాడేందుకు ఏకమయ్యారు. ఎదోము, ఇష్మాయేలు ప్రజలు; మోయాబు, హగ్రీ సంతతివారు;
    గెబలువారు; అమ్మోను, అమాలేకీ ప్రజలు;
    ఫిలిష్తీ ప్రజలు; తూరులో నివసించే ప్రజలంతా మనతో పోరాడుటకు ఏకమయ్యారు.
అష్షూరు సైన్యం లోతు వంశస్థులతో చేరి,
    వారంతా నిజంగా బలముగలవారయ్యారు.

దేవా, మిద్యానును నీవు ఓడించినట్టు, కీషోను నది దగ్గర సీసెరాను,
    యాబీనును నీవు ఓడించినట్టు శత్రువును ఓడించుము.
10 ఫన్దోరు వద్ద నీవు వారిని ఓడించావు.
    వారి దేహాలు నేల మీద కుళ్లిపోయాయి.
11 దేవా, శత్రువుల నాయకులను ఓడించుము. ఓరేబుకు, జెయేబుకు నీవు చేసిన వాటిని వారికి చేయుము.
    జెబహు, సల్మున్నా అనేవారికి నీవు చేసిన వాటిని వారికి చేయుము.
12 దేవా, మేము నీ దేశం విడిచేందుకు
    ఆ ప్రజలు మమ్మల్ని బలవంత పెట్టాలని అనుకొన్నారు.
13 గాలికి చెదరిపోయే కలుపు మొక్కవలె[a] ఆ ప్రజలను చేయుము.
    గాలి చెదరగొట్టు గడ్డిలా ఆ ప్రజలను చేయుము.
14 అగ్ని అడవిని నాశనం చేసినట్టు
    కారుచిచ్చు కొండలను తగులబెట్టునట్లు శత్రువును నాశనం చేయుము.
15 దేవా, తుఫానుకు ధూళి ఎగిరిపోవునట్లు ఆ ప్రజలను తరిమివేయుము.
    సుడిగాలిలా వారిని కంపింపజేసి, విసరివేయుము.
16 దేవా, వారి ముఖాలను సిగ్గుతో కప్పుము.
    అప్పుడు వారు నీ నామం ఆరాధించాలని కోరుతారు.
17 దేవా, ఆ ప్రజలు శాశ్వతంగా భయపడి సిగ్గుపడునట్లు చేయుము.
    వారిని అవమానించి, నాశనం చేయుము.
18 అప్పుడు నీవే దేవుడవు అని ఆ ప్రజలు తెలుసుకొంటారు.
    నీ పేరు యెహోవా అని వారు తెలుసుకొంటారు.
నీవే లోకమంతటిపై మహోన్నతుడవైన దేవుడవు
    అని వారు తెలుసుకొంటారు.

2 సమూయేలు 19:31-43

బర్జిల్లయిని తనతో యెరూషలేముకు రమ్మని దావీదు అడగటం

31 గిలాదీయుడగు బర్జిల్లయి రోగెలీ నుండి వచ్చాడు. అతడు రాజుతో యొర్దాను నదివద్దకు వచ్చాడు. రాజును నది దాటించటానికి ఆయనతో కూడ వెళ్లాడు. 32 బర్జిల్లయి పండు ముదుసలి. అతనికి ఎనభై సంవత్సరాలు. మహనయీములో దావీదువుండగా, బర్జిల్లయి ఆయనకు ఆహారాన్ని, తదితర వస్తువులను సమకూర్చాడు. బర్జిల్లయి గొప్ప ధనవంతుడు గనుక ఇవన్నీ చేయగలిగాడు. 33 దావీదు బర్జిల్లయితో ఇలా అన్నాడు, “నాతో నది దాటిరా, నాతో నీవు యెరూషలేములో నివసిస్తే నీ పోషణ బాధ్యత నేను తీసుకుంటాను.”

34 కాని బర్జిల్లయి రాజుతో ఇలా అన్నాడు: “నేను ఎంత వయో వృద్ధుడనో నీకు తెలుసా? నేను నీతో యెరూషలేముకు రాగాలనని నీవనుకుంటున్నావా? 35 నాకు ఎనుబది ఏండ్లు! మంచి చెడుల విచక్షణాజ్ఞానం కూడా తెలియనంత ముసలి వాడినయ్యాను. తినటానికి, తాగటానికి రుచులు కూడ తెలియనంత వయసు మళ్లిన వాడను. గాయనీ గాయకుల స్వరము వినలేనివాడిని. అటువంటి నన్ను గురించి నీవెందుకు చింత చేస్తున్నావు? 36 నీ నుండి నేను బహుమతులు కోరను! నీతో పాటు యోర్దాను నదిని దాటుతాను. 37 తరువాత దయచేసి నన్ను తిరిగి వెళ్లి పోనిమ్ము. అలా నేను నా స్వంత నగరంలో చనిపోయి, నాతల్లిదండ్రుల సమాధిలో వుంచబడతాను. నీ సేవకుడు కింహాము ఇక్కడే వున్నాడు. అతనిని నా ప్రభువైన నీతో తీసుకొని వెళ్లు. అతనితో నీకు ఏ పని కావాలంటే అది చేయించుకో.”

38 “కింహాము నాతోనే వస్తాడు. నీ కొరకు అతని పట్ల నేను దయగలిగి వుంటాను. నీ కొరకు నేనేమైనా చేస్తాను.” అని రాజు సమాధానమిచ్చాడు.

దావీదు ఇంటికి తిరిగి వెళ్లటం

39 రాజు బర్జిల్లయిని ముద్దు పెట్టుకుని ఆశీర్వదించాడు. బర్జిల్లయి తిరిగి ఇంటికి వెళ్లిపోయాడు. రాజు, అతని పరివారం నదిని దాటారు.

40 గిల్గాలుకు వెళ్లటానికి రాజు యొర్దాను నదిని దాటినప్పుడు, కింహాము కూడ అతనితో వెళ్లాడు. యూదా ప్రజలంతా, ఇశ్రాయేలు ప్రజలలో సగంమంది, దావీదును నది దాటించారు.

ఇశ్రాయేలీయులు యూదా వారితో వాదించటం

41 ఇశ్రాయేలీయులంతా రాజు వద్దకు వచ్చి, “యూదావారైన మా సోదరులు నిన్ను ఎత్తుకు పోయారు. మళ్లీ నిన్ను, నీ కుటుంబాన్ని, నీ పరివారాన్నీ తిరిగి తీసుకొని వచ్చారు! ఎందువలన?” అని ప్రశ్నించారు.

42 యూదా ప్రజలంతా ఇశ్రాయేలీయులకు ఇలా సమాధానం చెప్పారు: “మేము ఆ విధంగా ఎందుకు చేశామంటే రాజు మాకు దగ్గర బంధువు కాబట్టి ఈ విషయంలో మీరు మా పట్ల ఎందుకు కోపంగావున్నారో తెలియటం లేదు. అయినా రాజు చేత ఖర్చు పెట్టించి మేము ఏమి తినలేదు! పైగా రాజు మాకు ఏమీ బహుమానాలు ఇవ్వనూలేదు!”

43 అప్పుడు ఇశ్రాయేలీయులు ఇలా అన్నారు “రాజును ఎంపిక చేసుకోవటంలో మేము అత్యధిక సంఖ్యలో పాల్గొన్నాము. దావీదులో మాకు పది భాగాలున్నాయి.[a] కావున దావీదుతో వ్యవహారానికి మీకంటె మాకే ఎక్కువ హక్కు వుంది! కాని మీరు మమ్మల్ని లక్ష్యపెట్టలేదు! ఎందువల్ల? నిజానికి రాజును తిరిగి తీసుకొని రావాలని మేము ముందుగా అనుకున్నాము!”

కాని యూదా ప్రజలు ఇశ్రాయేలీయులతో బాగా నిందారోపణ చేస్తూ చెడుగా మాట్లాడారు. యూదా వారి మాటలు ఇశ్రాయేలీయులు అన్నవాటికంటె చాలా తీవ్రంగా వున్నాయి.

గలతీయులకు 3:10-14

10 ధర్మశాస్త్రంపై ఆధారపడిన వాళ్ళందరి మీద శాపం ఉంది. “ధర్మశాస్త్ర గ్రంథంలో వ్రాయబడిన వాటన్నిటిని అన్ని వేళలా ఆచరిస్తూ జీవించని వాడు దేవుని శాపానికి గురి ఔతాడు”(A) అని వ్రాయబడి ఉంది. 11 ధర్మశాస్త్రం ద్వారా దేవుడు ఎవ్వరినీ నీతిమంతునిగా చెయ్యడని మనకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే, “విశ్వాసం ద్వారా నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని ప్రవచనంలో వ్రాయబడి ఉంది.

12 ధర్మశాస్త్రానికి విశ్వాసం పునాది కాదు. పైగా, “ధర్మశాస్త్రం చెప్పినట్లు అన్నీ చేసినవాడు మాత్రమే అనంత జీవితం పొందుతాడు”[b] అని వ్రాయబడి ఉంది. 13 “చెట్టుకు వ్రేలాడవేయబడిన ప్రతి ఒక్కడూ శాపగ్రస్తుడు!”(B) అని ధర్మశాస్త్రంలో వ్రాయబడింది. కనుక మనకు ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విముక్తి కలిగించాలని క్రీస్తు ఆ శాపానికి గురి అయ్యాడు. 14 దేవుడు అబ్రాహాముకు చేసిన వాగ్దానం తన ద్వారా యూదులు కానివాళ్ళకు కూడా లభించాలని క్రీస్తు మనకు విముక్తి కలిగించాడు. వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మనకు విశ్వాసం ద్వారా లభించాలని ఆయన ఉద్దేశ్యం.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International