Revised Common Lectionary (Semicontinuous)
ఆసాపు ధ్యాన గీతం.
78 నా ప్రజలారా, నా ఉపదేశాలను వినండి.
నేను చెప్పే విషయాలు వినండి.
2 ఈ కథ మీతో చెబుతాను.
ఈ పురాతన కథ నేను మీతో చెబుతాను.
3 ఈ కథ మనం విన్నాము. ఇది మనకు బాగా తెలుసు.
మన తండ్రులు ఈ కథ మనకు చెప్పారు.
4 ఈ కథను మనము మరచిపోము.
మన ప్రజలు చివరి తరం వారి వరకు ఈ కథ చెబుతారు.
మనమంతా యెహోవాను స్తుతిద్దాము.
ఆయన చేసిన అద్భుత కార్యాలను గూర్చి చెబుదాము.
5 యాకోబుతో యెహోవా ఒక ఒడంబడికను చేసుకున్నాడు.
దేవుడు ఇశ్రాయేలీయులకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు.
మన పూర్వీకులకు దేవుడు ఆదేశాలు ఇచ్చాడు.
మన పూర్వీకులు తమ సంతతివారికి న్యాయచట్టం బోధించాలని ఆయన వారితో చెప్పాడు.
6 ఈ విధంగా ప్రజలు, చివరి తరంవారు సహా ధర్మశాస్త్రాన్ని తెలుసుకొంటారు.
క్రొత్త తరాలు పుడతాయి. వారు పెద్దవారిగా ఎదుగుతారు. వారు వారి పిల్లలకు ఈ కథ చెబుతారు.
7 కనుక ఆ ప్రజలంతా దేవుని నమ్ముతారు.
దేవుడు చేసిన పనులను వారు మరచిపోరు.
వారు ఆయన ఆదేశాలకు జాగ్రత్తగా విధేయులవుతారు.
ఆశ్రయ పురాలు
20 అప్పుడు యెహోషువతో యెహోవా ఇలా చెప్పాడు: 2 “నీకు ఒక ఆజ్ఞ ఇచ్చేందుకు నేను మోషేను వాడుకొన్నాను. ప్రత్యేకమైన ఆశ్రయ పురాలను నిర్మించుమని మోషే నీతో చెప్పాడు. 3 ఎవరైనా ఒక వ్యకి మరొక వ్యక్తిని చంపితే, అది ప్రమాదవశాత్తు జరిగిందే తప్ప, ఆ వ్యక్తిని చంపాలనే ఉద్దేశం లేకపోతే, అప్పుడు అతడు దాగుకొనేందుకు ఒక ఆశ్రయ పురానికి వెళ్ల వచ్చును.
4 “ఆ వ్యక్తి ఇలా చేయాలి. అతడు పారిపోయి, ఆ పట్టణాల్లో ఒకదానికి వెళ్లినప్పుడు, ఆ పట్టణ ప్రవేశందగ్గర అతడు ఆగిపోవాలి. అతడు ద్వారం దగ్గర ఆగిపోయి, జరిగిన విషయాన్ని గూర్చి ప్రజానాయకులకు చెప్పాలి. అప్పుడు ఆ ప్రజానాయకులు అతణ్ణి ఆ పట్టణంలో ప్రవేశింప నియ్యవచ్చును. అతడు వాళ్ల మధ్య నివసించేందుకు వారు అతనికి ఒక స్థలం ఇస్తారు. 5 అయితే వానిని తరుముతున్న వాడు అతణ్ణి వెంబడించి ఆ పట్టణానికి రావచ్చును. ఇలా గనుక జరిగితే ఆ పట్టణ నాయకులు వదలిపెట్టకూడదు. ఆశ్రయం కోసం వారి దగ్గరకు వచ్చిన వ్యక్తిని వారు కాపాడాలి. ఆ వ్యకి చంపినవానిని ఉద్దేశ పూర్వకంగా చంపలేదు గనుక వారు అతణ్ణి కాపాడాలి. అది ప్రమాదవశాత్తు జరిగింది. అతడు కోపంతో, ఆ వ్యక్తిని చంపాలని చేసిన నిర్ణయం కాదు. అది ఏదో అలా జరిగిపోయింది. 6 ఆ పట్టణంలోని న్యాయస్థానం అతనికి తీర్పు తీర్చేంతవరకు అతడు ఆ పట్టణంలో ఉండాలి. మరియు ప్రధాన యాజకుడు మరణించేంతవరకు అతడు ఆ పట్టణంలోనే ఉండి పోవాలి. తర్వాత అతడు ఏ పట్టణం నుండి పారిపోయాడో అక్కడి తన స్వంత ఇంటికి తిరిగి వెళ్లవచ్చును.”
7 కనుక, “ఆశ్రయ పురాలుగా” పిలువబడేందుకు కొన్ని పట్టణాలను ఇశ్రాయేలు ప్రజలు నిర్ణయించారు. ఆ పట్టణాలు: నఫ్తాలి కొండ దేశంలోని గలిలయలో కెదెషు, ఎఫ్రాయిము కొండ దేశంలో షెకెము, యూదా కొండ దేశంలో కిర్యత్ అర్బ (హెబ్రోను.) 8 యొర్దాను నది తూర్పు దిక్కున, యెరికో దగ్గర రూబేను దేశంలోని అరణ్యంలో బేసెరు, గాదు దేశంలోని గిలాదులో రామోతు, మనష్షే దేశంలోని బాషానులో గోలాను.
9 ఏ ఇశ్రాయేలీయులు అయినా, వారి మధ్య నివసిస్తున్న ఏవ్యక్తి అయినా ప్రమాదవశాత్తు ఒకరిని చంపినట్లయితే, ఆ వ్యక్తి భద్రతకోసం ఈ ఆశ్రయ పురాలలో ఒక దానికి పారిపోవచ్చును. అప్పుడు ఆ వ్యక్తి అక్కడ క్షేమంగా ఉంటాడు, అతణ్ణి తరుముతున్న ఎవరిచేతగాని అతడు చంపబడడు. ఆ పట్టణ న్యాయస్థానం, ఆ పట్టణంలో అతనికి న్యాయం తీరుస్తుంది.
యేసు అంత్య కాలాన్ని గురించి హెచ్చరించటం
(మార్కు 13:1-31; లూకా 21:5-33)
24 యేసు దేవాలయాన్ని వదిలి వెళ్తుండగా ఆయన శిష్యులు దగ్గరకు వచ్చి ఆ దేవాలయపు కట్టడాన్ని ఆయన దృష్టికి తెచ్చారు. 2 యేసు, “ఇవన్నీ చూస్తున్నారుగా! ఇది సత్యం. రాయి మీద రాయి నిలువకుండా వాళ్ళు అన్నీ పడగొడ్తారు” అని అన్నాడు.
3 యేసు ఒలీవ చెట్ల కొండ మీద కూర్చొన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు ప్రత్యేకంగా వచ్చి, “చెప్పండి; ఇది ఎప్పుడు సంభవిస్తుంది? మీరు రావటానికి ముందు, ఈ యుగం అంతమవటానికి ముందు ఏ సూచన కనిపిస్తుంది?” అని అడిగారు.
4 యేసు సమాధానంగా, “మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్త పడండి. 5 ఎందుకంటే చాలా మంది నా పేరిట వచ్చి ‘నేను క్రీస్తును’ అని చెప్పుకొంటూ అనేకుల్ని మోసం చేస్తారు. 6 యుద్ధాలను గురించి, యుద్ధముల వదంతుల్ని గురించి విన్నప్పుడు మీరు దిగులు పడకండి. అవి తప్పక సంభవిస్తాయి. కాని ‘అంతం’ అప్పుడే రాదు. 7 దేశం మీదికి దేశం యుద్ధానికి వస్తుంది. రాజ్యం మీదికి రాజ్యం యుద్ధానికి వస్తుంది. పలుప్రాంతాల్లో క్షామాలు, భూకంపాలు సంభవిస్తాయి. 8 అంటే, ప్రసవవేదనలు ఆరంభం అయ్యాయన్నమాట.
9 “ఆ తర్వాత వాళ్ళు మిమ్మల్ని అధికారులకు అప్పగిస్తారు. ఆ అధికారులు మిమ్మల్ని హింసించి చంపుతారు. నా కారణంగా దేశాలన్నీ మిమ్మల్ని ద్వేషిస్తాయి. 10 ఆ సమయంలో అనేకులు ఈ విశ్వాసాన్ని వదిలి వేస్తారు. పరస్పరం ద్వేషించు కొంటారు. 11 దొంగ ప్రవక్తలు అనేకులు వచ్చి ప్రజల్ని మోసం చేస్తారు. 12 పాపం పెరగటంవల్ల అనేకుల్లో ప్రేమ చల్లారిపోతుంది. 13 కాని చివరి దాకా పట్టుదలతో నిలుచున్న వాణ్ణి దేవుడు రక్షిస్తాడు. 14 ఈ రాజ్యాన్ని గురించి చేప్పే సువార్త ప్రపంచమంతా ప్రకటింప బడుతుంది. ఆ సువార్త దేశాలన్నిటికిని ఒక ఋజువుగా ఉంటుంది. అప్పుడు అంతం వస్తుంది.
© 1997 Bible League International