Revised Common Lectionary (Semicontinuous)
జాయిన్
49 యెహోవా, నాకు చేసిన నీ వాగ్దానం జ్ఞాపకం చేసుకొనుము.
ఆ వాగ్దానం నాకు ఆశనిస్తుంది.
50 నేను శ్రమ పడుతున్నప్పుడు నీవు నన్ను ఆదరించావు
నీ మాటలు నన్ను మరల బ్రతికించాయి.
51 నా కంటే తామే మంచివాళ్లు అనుకొన్న మనుష్యులు ఎడతెగక నన్ను అవమానించారు.
కాని యెహోవా, నీ ఉపదేశాలను అనుసరించటం నేను మానుకోలేదు.
52 జ్ఞానంగల నీ నిర్ణయాలను నేను ఎల్లప్పుడూ జ్ఞాపకం ఉంచుకొంటాను.
యెహోవా, జ్ఞానంగల నీ నిర్ణయాలు నన్ను ఆదరిస్తాయి.
53 నీ ఉపదేశాలను అనుసరించటం మానివేసిన దుర్మార్గులను చూస్తే
నాకు చాలా కోపం వస్తుంది.
54 నీ న్యాయ చట్టాలు
నా ఇంటివద్ద పాడుకొనే పాటలు.
55 యెహోవా, రాత్రివేళ నేను నీ నామం జ్ఞాపకం చేసుకొంటాను.
నీ ఉపదేశాలను నేను జ్ఞాపకం చేసుకొంటాను. నీ న్యాయ చట్టాన్ని నేను అనుసరిస్తాను.
56 నీ ఆజ్ఞలకు నేను జాగ్రత్తగా విధేయుడను అవుతాను
కనుక నాకు ఈలాగు జరుగుతుంది.
ప్రజలు దేవునికి భయపడటం
22 “మీరంతా కలిసి ఆ కొండ దగ్గర ఉన్నప్పుడు మీ అందరికీ ఈ ఆజ్ఞలను యెహోవా యిచ్చాడు. అగ్ని, మేఘం, గాఢాంధకారంలోనుండి వచ్చిన పెద్ద శబ్దంతో యెహోవా మాట్లాడాడు. ఆయన ఈ ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత యింకేమీ చెప్పలేదు. ఆయన తన మాటలను రెండు రాతి పలకలమీద వ్రాసి వాటిని నాకు ఇచ్చాడు.
23 “పర్వతం అగ్నితో మండిపోతున్నప్పుడు అంధకారంలోనుంచి వచ్చిన ఆ స్వరం మీరు విన్నారు. అప్పుడు, మీ వంశాల నాయకులు అందరూ, మీ పెద్దలూ నా దగ్గరకు వచ్చారు. 24 వారు అన్నారు: ‘మన దేవుడైన యెహోవా తన మహిమను, మహాత్యాన్ని మాకు చూపించాడు. ఆయన అగ్నిలోనుండి మాట్లాడటం మేము విన్నాము. ఒక మనిషితో దేవుడు మాట్లాడిన తర్వాత కూడ ఆ మనిషి బ్రతకటం సాధ్యమేనని ఈవేళ మేము చూశాము. 25 కానీ మన దేవుడైన యెహోవా మాతో ఇంకొక్కసారి మాట్లాడటం గనుక మేము వింటే మేము తప్పకుండా చస్తాము. ఆ భయంకర అగ్ని మమ్మల్ని నాశనం చేసేస్తుంది. కానీ మేము చావటం మాకు యిష్టంలేదు. 26 సజీవ దేవుడు మాట్లాడటం మేము విన్నట్టుగా వినికూడ బ్రతికిన మనిషి ఎన్నడూ ఎవ్వడూ లేడు. 27 మోషే, నీవు దగ్గరగా వెళ్లి, మన దేవుడైన యెహోవా చెబుతున్న సంగతులన్నీ విను. తర్వాత, యెహోవా నీకు చెప్పే విషయాలన్నీ నీవు మాకు చెప్పు. మేము నీ మాట వింటాము, నీవు చెప్పేది అంతా చేస్తాము.’
మోషేతో యెహోవా మాట్లాడటం
28 “మీరు నాతో చెప్పిన సంగతులను యెహోవా విన్నాడు. అప్పుడు యెహోవా నాతో అన్నాడు, ‘ఈ ప్రజలు చెప్పిన విషయాలు నేను విన్నాను. వారు చెప్పింది అంతా మంచిదే. 29 వారు ఎల్లప్పుడూ వారి హృదయాల్లో నన్ను గౌరవించి, నా ఆజ్ఞలన్నింటికీ విధేయులైతే బాగుండును అని మాత్రమే నా కోరిక. అప్పుడు వాళ్లకు, వాళ్ల సంతతివారికి సర్వం శుభం అవుతుంది.
30 “‘వెళ్లి, ప్రజలందరినీ వారి గుడారాలకు వెళ్లి పొమ్మని చెప్పు. 31 అయితే మోషే, నీవు యిక్కడ నాకు దగ్గరగా నిలబడు. నీవు వాళ్లకు నేర్పించాల్సిన ఆజ్ఞలు, చట్టాలు, నియమాలు అన్నీ నీకు నేను చెబుతాను. వారు జీవించేందుకు నేను వారికి ఇస్తున్న దేశంలో వారు ఈ పనులు చేయాలి’.
32 “అందుచేత యెహోవా మీకు ఆజ్ఞాపించిన వాటన్నింటినీ చేసేందుకు మీరు జాగ్రత్తగా వుండాలి. మీరు దేవుణ్ణి అనుసరించటం మానకూడదు. 33 మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన విధంగా మీరు జీవించాలి. అప్పుడు మీరు జీవించడం కొనసాగుతుంది, మీకు అంతా శుభ ప్రదం అవుతుంది. మరియు మీది కాబోతున్న ఆ దేశంలో మీ జీవితం పొడిగించబడుతుంది.
ఎల్లప్పుడూ దేవున్ని ప్రేమించి, లోబడండి.
6 “నేను మీకు ప్రబోధించాలని మీ యెహోవా దేవుడు నాకు చెప్పిన ఆజ్ఞలు, నియమాలు, ఇవి: మీరు నివసించేందుకు ప్రవేశిస్తున్న దేశంలో ఈ ఆజ్ఞలకు లోబడండి. 2 మీరూ, మీ సంతతివారు బ్రతికినంత కాలం మీ దేవుడైన యెహోవాను గౌరవించాలి. నేను మీకు యిచ్చే ఆయన నియమాలు, ఆజ్ఞలు అన్నింటికీ మీరు విధేయులు కావాలి. మీరు ఇలా చేస్తే, ఆ కొత్త దేశంలో మీరు దీర్ఘకాలం బ్రతుకుతారు. 3 ఇశ్రాయేలు ప్రజలారా, జాగ్రత్తగా వినండి. ఈ ఆజ్ఞలకు విధేయులుగా ఉండండి. అప్పుడు మీకు అంతా శుభం అవుతుంది. మరియు మీరు ఒక గొప్ప రాజ్యం అవుతారు. ఐశ్వర్యవంతమైన ఆ మంచి దేశంలో[a] వీటన్నింటినీ మీ పూర్వీకుల దేవుడైన యెహోవా మీకు వాగ్దానం చేసాడు.
17 క్రీస్తులో ఐక్యత పొందినవాడు క్రొత్త జీవితం పొందుతాడు. పాత జీవితం పోయి క్రొత్త జీవితం వస్తుంది. 18 ఇదంతా దేవుడు చేసాడు. శత్రువులుగా ఉన్న మనల్ని క్రీస్తు ద్వారా తన మిత్రులుగా చేసుకొన్నాడు. ఇతరులను కూడా తన మిత్రులుగా చేసే బాధ్యత మనపై ఉంచాడు. 19 క్రీస్తు ద్వారా దేవుడు అందరినీ తన మిత్రులుగా చేసుకొనుచున్నాడన్నదే మా సందేశం. దేవుడు ప్రజలు చేసిన పాపాలను క్షమిస్తాడు. వాళ్ళను తన మిత్రులుగా ఏ విధంగా చేసుకొంటాడన్న సందేశం చెప్పాడు. 20 మేము క్రీస్తు రాయబారులం. దేవుడే మా ద్వారా ఈ విజ్ఞప్తి చేస్తున్న విషయం గ్రహించండి. క్రీస్తు పక్షాన దేవునితో సమాధానపడమని మిమ్మల్ని వేడుకొంటున్నాము. 21 క్రీస్తు పాపం చెయ్యలేదు. కాని మనకోసం దేవుడు ఆయన్ని పాపంగా చేసాడు. మనం క్రీస్తులో ఐక్యత పొంది దేవుని దృష్టిలో నీతిమంతులంగా ఉండాలని ఇలా చేసాడు.
© 1997 Bible League International