Revised Common Lectionary (Semicontinuous)
149 యెహోవాను స్తుతించండి.
యెహోవా చేసిన కొత్త సంగతులను గూర్చి ఒక కొత్త కీర్తన పాడండి!
ఆయన అనుచరులు కూడుకొనే సమావేశంలో ఆయనకు స్తుతి పాడండి.
2 ఇశ్రాయేలును దేవుడు చేశాడు. ఇశ్రాయేలును యెహోవాతో కలిసి ఆనందించనివ్వండి.
సీయోను మీది ప్రజలను వారి రాజుతో కూడా ఆనందించనివ్వండి.
3 ఆ ప్రజలు వారి తంబురాలు, స్వరమండలాలు వాయిస్తూ
నాట్యమాడుతూ దేవుణ్ణి స్తుతించనివ్వండి.
4 యెహోవా తన ప్రజలను గూర్చి సంతోషిస్తున్నాడు.
దేవుడు తన దీన ప్రజలకు ఒక అద్భుత క్రియ చేశాడు.
ఆయన వారిని రక్షించాడు!
5 దేవుని అనుచరులారా, మీ విజయంలో ఆనందించండి.
పడకలు ఎక్కిన తరువాత కూడ సంతోషించండి.
6 ప్రజలు దేవునికి గట్టిగా స్తుతులు చెల్లించెదరుగాక.
ప్రజలు తమ చేతులలో వారి ఖడ్గాలు పట్టుకొని
7 వెళ్లి వారి శత్రువులను శిక్షించెదరుగాక.
వారు వెళ్లి యితర ప్రజలను శిక్షించెదరుగాక.
8 ఆ రాజులకు, ప్రముఖులకు
దేవుని ప్రజలు గొలుసులు వేస్తారు.
9 దేవుడు ఆజ్ఞాపించినట్టే దేవుని ప్రజలు వారి శత్రువులను శిక్షిస్తారు.
దేవుని అనుచరులకు ఆయన ఆశ్చర్యకరుడు.
యెహోవాను స్తుతించండి!
జ్యేష్ఠుల మరణం
11 అప్పుడు యెహోవా మోషేతో ఇలా అన్నాడు: “ఫరో మీదికి, ఈజిప్టు మీదికి నేను ఇంకా ఒక నాశనం తీసుకు రావల్సి ఉంది. దాని తర్వాత అతడు మిమ్మల్ని ఈజిప్టు నుండి పంపించి వేస్తాడు. వాస్తవానికి మీరు ఈ దేశం వదలి వెళ్లిపోవాలని అతడు మిమ్మల్ని బలవంతం చేస్తాడు. 2 ఇశ్రాయేలు ప్రజలకు ఈ సందేశం మీరు చెప్పాలి, ‘మీరు స్త్రీలు పురుషులు అందరూ మీ చుట్టు ప్రక్కల వాళ్ల దగ్గరకు వెళ్లి, వారి వెండి, బంగారు వస్తువులన్నీ మీకు ఇమ్మని అడగాలి. 3 ఈజిప్టు వాళ్లకు మీపై దయ కలిగేటట్టు యెహోవా చేస్తాడు.’” అప్పటికే ఈజిప్టు ప్రజలు మరియు ఫరో అధికారులు కూడా మోషేను ఒక మహాత్మునిగా ఎంచుతున్నారు.
4 మోషే ప్రజలతో ఇలా చెప్పాడు: “ఈ వేళ మధ్యరాత్రి మరణదూత ఈజిప్టులో తిరుగుతాడు. 5 ఫరో పెద్ద కుమారుడు మొదలు ధాన్యం తిరుగలి విసరుతున్న బానిసయొక్క, పెద్ద కుమారుడు వరకు ఈజిప్టులో ప్రతి పెద్ద కుమారుడు మరణిస్తాడు. అలాగే జంతువుల్లో మొదట పుట్టినవన్నీ చస్తాయి. 6 గతంలోకంటె, భవిష్యత్తులోకంటె, ఇప్పుడు ఈజిప్టులోవినబడే ఏడ్పులు మరీ దారుణంగా ఉంటాయి. 7 కాని ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరికీ హాని కలుగదు. కనీసం వారిపై ఒక కుక్క కూడ మొరగడం ఉండదు. ఇశ్రాయేలు ప్రజల్లో ఏ ఒక్కరుగాని, వారి జంతువుల్లో ఏ ఒక్కటిగాని బాధపడవు. ఈ విధంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఈజిప్టు వాళ్లకంటె, ప్రత్యేకంగా నేను చూశానని మీరు తెలుసుకొంటారు. 8 అప్పుడు మీ బానిసలు (ఈజిప్టు వాళ్లు) సాష్టాంగపడి నన్ను ఆరాధిస్తారు. ‘మీ ప్రజలందరినీ తీసుకొని మీరు వెళ్లిపోండి’ అని వాళ్లే అప్పుడు చెబతారు. అప్పుడు నేను కోపంగా ఫరోను విడిచి వెళ్తాను.”
9 యెహోవా మోషేతో, “నీ మాట ఎందుచేత ఫరో వినలేదు? ఈజిప్టులో నా మహత్తర శక్తిని నేను చూపించ గలిగేందుకే” అని చెప్పాడు. 10 ఆ కారణం చేతనే ఫరో యెదుట మోషే, అహరోనులు ఈ మహా అద్భుతాలన్నీ చేసారు. అందుకే ఫరో ఇశ్రాయేలు ప్రజల్ని తన దేశం నుండి వెళ్లనియ్యకుండా అంత మొండికెత్తేటట్టు యెహోవా చేసాడు.
29 “శాస్త్రులారా! పరిసయ్యులారా! మీరు మోసగాళ్ళు. మీకు శిక్ష తప్పదు. మీరు ప్రవక్తల కోసం సమాధుల్ని కడతారు. నీతిమంతుల సమాధుల్ని అలంకరిస్తారు. 30 అంతేకాక ‘మేము మా తాత ముత్తాతల కాలంలో జీవించి ఉంటే, వాళ్ళతో కలసి ప్రవక్తల రక్తాన్ని చిందించి ఉండేవాళ్ళం కాదు’ అని మీరంటారు. 31 అంటే మీరు ప్రవక్తల్ని హత్యచేసిన వంశానికి చెందినట్లు అంగీకరించి మీకు వ్యతిరేకంగా మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారన్నమాట. 32 మీ తాత ముత్తాతలు ప్రారంభించారు. మీరు ముగించండి!
33 “మీరు పాముల్లాంటి వాళ్ళు, మీది సర్పవంశం. నరకాన్ని ఎట్లా తప్పించుకోగలరు? 34 నేను మీ దగ్గరకు ప్రవక్తల్ని, జ్ఞానుల్ని, బోధకులను పంపుతున్నాను. వాళ్ళలో కొందరిని మీరు సిలువకు వేసి చంపుతారు. మరి కొందరిని సమాజమందిరాల్లో కొరడా దెబ్బలు కొడ్తారు. వాళ్ళను వెంటాడుతూ గ్రామ గ్రామానికి వెళ్ళి మీరీ పనులు చేస్తారు.
35 “నీతిమంతుడైన హేబెలు రక్తం నుండి దేవాలయానికి, బలిపీఠానికి మధ్య మీరు హత్యచేసిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తం దాకా ఈ భూమ్మీద కార్చిన నీతిమంతుల రక్తానికంతటికి మీరు బాధ్యులు. 36 ఇది సత్యం. ఈ నేరాలన్నీ ఈ తరం వాళ్ళపై ఆరోపింపబడతాయి.
© 1997 Bible League International