Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 119:33-40

హే

33 యెహోవా, నీ న్యాయచట్టాలు నాకు నేర్పించుము.
    నేను ఎల్లప్పుడూ వాటికి విధేయుడనౌతాను.
34 గ్రహించుటకు నాకు సహాయం చేయుము.
    నేను నీ ఉపదేశాలకు విధేయుడనవుతాను.
    నేను వాటికి పూర్తిగా విధేయుడనవుతాను.
35 యెహోవా, నీ ఆజ్ఞల మార్గంలో నన్ను నడిపించు.
    నేను నీ ఆజ్ఞలను నిజంగా ప్రేమిస్తున్నాను.
36 నేను ఏ విధంగా ధనికుడను కాగలనో అని తలచుటకు బదులు
    నీ ఒడంబడికను గూర్చి తలచుటకు నాకు సహాయం చేయుము.
37 యెహోవా, అయోగ్యమైన విషయాలనుండి నా కళ్లను మరలించుము.
    నీ మార్గంలో జీవించుటకు నాకు సహాయం చేయుము.
38 యెహోవా, నేను నీ సేవకుడను కనుక నీవు వాగ్దానం చేసిన వాటిని జరిగించుము.
    నిన్ను ఆరాధించే ప్రజలకు నీవు వాటిని వాగ్దానం చేశావు.
39 యెహోవా, నేను భయపడుతున్న అవమానాన్ని తొలగించు.
    జ్ఞానం గల నీ నిర్ణయాలు మంచివి.
40 చూడుము, నీ ఆజ్ఞలను నేను ప్రేమిస్తున్నాను.
    నా యెడల మంచితనం చూపించి నన్ను బ్రతుకనిమ్ము.

లేవీయకాండము 6:1-7

ఇతర పాపాలకు అపరాధ పరిహారార్థబలి

యెహోవా మోషేతో ఇలా చెప్పాడు: “ఒకడు యిలాంటి పాపాలు చేసి, యెహోవాకు విరోధంగా అపరాధం చేయవచ్చు, ఒక వ్యక్తి మరొకరి పక్షంగా దేనికైనా కాపలా కాస్తూండగా దానికి జరిగిన దాన్ని గూర్చి అతడు అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు తాను చేసిన ప్రమాణం విషయంలో అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు దేనినైనా దొంగిలించవచ్చు, లేక ఎవర్నయినా మోసం చేయవచ్చు, లేక ఒకడు పోయింది దొరికినప్పుడు దాన్ని గూర్చి అబద్ధం చెప్పవచ్చు, లేక ఒకడు ఏదో చేస్తానని వాగ్దానం చేసి తర్వాత అతడు వాగ్దాన ప్రకారం చేయకపోవచ్చు, లేక ఒకడు ఇంకేదైనా చెడుకార్యం చేయవచ్చు. ఒక వ్యక్తి వీటిలో ఏదైనా చేస్తే, అప్పుడు ఆ వ్యక్తి అపరాధి అవుతాడు. అతడు దొంగతనంగా తీసుకొన్నదిగాని, మోసంచేసి తీసుకొన్నదిగాని, మరోవ్యక్తి భద్రంగా ఉంచమని ఇవ్వగా అతడు తీసుకొన్నదిగాని, దొరికినా అబద్ధం చెప్పినదాన్ని, లేక దేన్ని గూర్చి అతడు అబద్ధ ప్రమాణం చేసాడో దాన్ని అతడు తిరిగి ఇచ్చివేయాలి. దాని పూర్తివిలువను అతడు చెల్లించాలి. తర్వాత దాని విలువలో అయిదోవంతు అదనంగా అతడు చెల్లించాలి. దాని అసలైన సొంతదారునికి అతడు ఆ మొత్తాన్ని ఇవ్వాలి. అతడు తన అపరాధ పరిహారార్థ బలి తెచ్చిననాడే దీన్ని చెల్లించాలి. ఆ వ్యక్తి అపరాధ పరిహారార్థ బలిని యాజకుని దగ్గరకు తీసుకొని రావాలి. అది మందలోనుంచి తెచ్చిన పొట్టేలు. ఆ పొట్టేలుకు ఏదోషమూ ఉండకూడదు. అది యాజకుడు నిర్ణయించిన ధరకు తగినదిగా ఉండాలి. అది యెహోవాకు అపరాధ పరిహారార్థ బలి. అప్పుడు యాజకుడు యెహోవా దగ్గరకు వెళ్లి, ఆ వ్యక్తి చేసిన పాపాన్ని నిర్మూలిస్తాడు. అప్పుడు అతణ్ణి దేవుడు క్షమిస్తాడు.”

గలతీయులకు 5:2-6

నా మాట వినండి. మీరు సున్నతి చేయించుకోవటానికి అంగీకరిస్తే క్రీస్తు వల్ల మీకు ఏ మాత్రమూ ప్రయోజనంలేదని పౌలను నేను చెపుతున్నాను. సున్నతి చేయించుకోవటానికి అంగీకరించినవాడు ధర్మశాస్త్రాన్నంతా పాటించవలసి వస్తుందని నేను మళ్ళీ ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా చెపుతున్నాను. ధర్మశాస్త్రం ద్వారా నీతిమంతులుగా కావాలనుకొంటున్న మీరు స్వయంగా క్రీస్తులోనుండి విడిపోయారు. తద్వారా దైవానుగ్రహాన్ని పోగొట్టుకొన్నారు. కాని, మనము పరిశుద్ధాత్మ ద్వారా ఆశిస్తున్న నీతి, విశ్వాసం ద్వారా లభిస్తుందని సంపూర్ణంగా విశ్వసించి దానికోసం నిరీక్షిస్తున్నాము. ఎందుకంటే యేసుక్రీస్తు దృష్టిలో సున్నతికి విలువ లేదు. సున్నతి చేసుకొన్నా, చేసుకోకపోయినా ఒకటే. ప్రేమ ద్వారా వ్యక్తమయ్యే విశ్వాసానికి మాత్రమే విలువ ఉంటుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International