Revised Common Lectionary (Semicontinuous)
మొదటి భాగం
(కీర్తనలు 1–41)
1 ఒకడు నిజంగా ఎప్పుడు సంతోషంగా ఉంటాడంటే,
అతడు చెడ్డవారి సలహాలు పాటించనప్పుడు,
అతడు పాపులవలె జీవించనప్పుడు,
దేవునికి విధేయులు కానివారితో అతను కలిసి మెలిసివుండనప్పుడు.
2 ఆ మంచి మనిషి, యెహోవా ఉపదేశాలను ప్రేమిస్తాడు.
ఆ ఉపదేశాలను గూర్చి రాత్రింబవళ్లు అతడు తలపోస్తూంటాడు.
3 కనుక ఆ మనిషి నీటి కాలువల ఒడ్డున చెట్టువలె బలంగా ఉంటాడు.
సకాలంలో ఫలాలు ఫలించే ఒక చెట్టువలె అతడు ఉంటాడు.
అతడు ఆకులు వాడిపోని చెట్టువలె ఉంటాడు.
అతడు చేసేది అంతా సఫలం అవుతుంది.
4 అయితే చెడ్డవాళ్లు అలా ఉండరు.
వాళ్లు గాలి చెదరగొట్టివేసే పొట్టువలె ఉంటారు.
5 ఒక న్యాయ నిర్ణయం చేసేందుకు మంచి మనుష్యులు గనుక సమావేశమైతే, అప్పుడు చెడ్డ మనుష్యులు దోషులుగా రుజువు చేయబడతారు.
ఆ పాపాత్ములు నిర్దోషులుగా తీర్చబడరు.
6 ఎందుకంటే యెహోవా మంచి మనుష్యులను కాపాడుతాడు,
చెడ్డ మనుష్యులు ఆయన చేత నాశనం చేయబడతారు.
10 యెహోవా ఇంకా ఇలా చెపుతున్నాడు: “బబులోను డెబ్బయి సంవత్సరాల పాటు బలమైన రాజ్యంగా ఉంటుంది. ఆ తరువాత బబులోనులో నివసిస్తున్న మీ వద్ధకు వస్తాను. మిమ్మల్ని తిరిగి యెరూషలేముకు తీసుకొని వస్తానని నేను మీకిచ్చిన నా మంచి వాగ్దానాన్ని నేను నెరవేర్చుతాను. 11 ఇది నేనెందుకు చెపుతున్నానంటే మీ అభివృద్ధి కొరకు వేసిన నా ప్రణాళికలన్నీ నాకు తెలుసు.” ఇది యెహోవా నుండి వచ్చిన సందేశం “మీ సంక్షేమం కొరకు నాకు ఎన్నోమంచి ఆలోచనలున్నాయి. మీకు కీడు చేయాలని నేనెన్నడూ ఆలోచించను. మీకు ఆశను, మంచి భవిష్యత్తును కలుగజేయటానికి వ్యూహరచన చేస్తాను. 12 అప్పుడు మీరు నా పేరున నన్ను పిలుస్తారు. మీరు నాదరి చేరి, నన్ను ప్రార్థిస్తారు. నేను మీ ప్రార్థన ఆలకిస్తాను. 13 మీరు నా కొరకు అన్వేషిస్తారు. మీరు మీ హృదయ పూర్వకంగా నా కొరకు వెదకితే, మీరు నన్ను కనుగొంటారు. 14 మీరు నన్ను కనుగొనేలా నేనే చేస్తాను.” ఈ వర్తమానం యెహోవా నుండి వచ్చినది. “పైగా నేను మీకు బంధ విముక్తి కలుగజేసి తిరిగి తీసుకొని వస్తాను. నేనే మిమ్మల్ని ఈ స్థలం వదిలి పెట్టి పోయేలా వత్తిడి చేశాను. కాని మిమ్మల్ని ఏ దేశాలకు, ఏ ప్రాంతాలకు నేను పంపియున్నానో ఆయా ప్రాంతాలనుండి మిమ్మల్నందరినీ నేను తిరిగి కూడదీస్తాను.” ఇదే యెహోవా వాక్కు “మరియు మిమ్మల్ని ఈ ప్రదేశానికి తీసుకొని వస్తాను.”
15 “అయితే యెహోవా మాకు ఇక్కడ బబులోనులో ప్రవక్తలనిచ్చియున్నాడు” అని మీరు చెప్పవచ్చు. 16 కాని బబులోనుకు తీసుకొని పోబడకుండా ఇక్కడే ఉన్న మీ బంధువుల గురించి యెహోవా ఈ విషయాలు చెపుతున్నాడు. ఇప్పుడు దావీదు సింహాసనంపై కూర్చున్న రాజును గూరించి, యెరూషలేములో మిగిలి ఉన్న తదితర ప్రజల విషయమై నే మాట్లాడుతున్నాను. 17 సర్వశక్తిమంతుడైన యెహోవా యిలా చెపుతున్నాడు: “యెరూషలేములో ఇంకా మిగిలి ఉన్న ప్రజలపైకి నేను త్వరలో కత్తిని, ఆకలిని, భయంకర రోగాలను పంపుతాను. తినటానికి పనికి రాకుండా కుళ్లిపోయిన అంజూరపు పండ్లవలె వారిని చేస్తాను. 18 యెరూషలేములో ఇంకా వున్న వారిని నేను కత్తితోను, కరువుతోను, రోగాలతోను వెంటాడతాను. ఈ ప్రజలకు సంభవించే భయంకర విపత్తులను చూచి ప్రపంచ రాజ్యాలన్నీ భయభ్రాంతులయ్యేందుకే నేనిది చేయదలచాను. ఆ ప్రజలు నాశనం చేయబడతారు. వారికి సంభవించిన విపత్తును గురించి విన్న ప్రజలంతా సంభ్ర మాశ్ఛర్యాలతో నిండిపోతారు. ప్రజలు తమ శత్రువులకు కీడు తలంచినప్పుడు వీరికి జరిగిన రీతిగా జరగాలని కోరుకుంటారు. నేను వారిని ఎక్కడికి బలవంతంగా పంపితే అక్కడ వార అవమానాల పాలవుతారు. 19 యెరూషలేము ప్రజలు నా సందేశాన్ని పెడచెవిని పెట్టారు గనుక నేనివన్నీ చేయ సంకల్పించాను.” ఇదే యెహోవా వాక్కు. “నా సందేశాన్ని వారికి అనేక పర్యాయాలు పంపియున్నాను. నా సేవకులైన ప్రవక్తలను నా సందేశం ఆ ప్రజలకు అందజేయటానికి వినియోగించాను. కాని ఆ ప్రజలు వినలేదు.” ఇది యెహోవా వాక్కు.
పౌలు తన ఉత్తరాన్ని ముగించటం
13 మెలకువగా ఉండండి. సంపూర్ణంగా విశ్వసించండి. ధైర్యంగా ఉండండి. శక్తిని వదులుకోకండి. 14 చేసే కార్యాలు ప్రేమతో చెయ్యండి.
15 అకయ ప్రాంతంలో విశ్వాసులుగా మారినవాళ్ళలో స్తెఫను కుటుంబం మొదటిది. ఇది మీకు తెలుసు. వాళ్ళు తమ జీవితాన్ని విశ్వాసుల సేవకు అంకితం చేసారు. 16 వాళ్ళను అనుసరించుమని మిమ్మల్ని వేడుకొంటున్నాను. వాళ్ళనే కాక వాళ్ళతో కలిసి సేవ చేస్తున్న ప్రతి ఒక్కణ్ణీ మీరు అనుసరించాలి.
17 స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు వచ్చి మీరు తీర్చలేని కొరత తీర్చారు. వాళ్ళు రావటం వల్ల నాకు ఆనందం కలిగింది. 18 వాళ్ళు మీ ఆత్మలకు, నా ఆత్మకు ఆనందం కలిగించారు. వాళ్ళను గౌరవించటం సమంజసం.
19 ఆసియ ప్రాంతంలోని సంఘాలు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాయి. అకుల, ప్రిస్కిల్ల మరియు వాళ్ళింట్లో సమావేశమయ్యే సంఘము మీకు ప్రభువు పేరిట తమ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నారు. 20 ఇక్కడున్న సోదరులందరు మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. సోదరుల ప్రేమతో ఒకళ్ళనొకళ్ళు హృదయాలకు హత్తుకోండి. పవిత్రమైన ముద్దుతో ఒకరికొకరు వందనాలు చెప్పండి.
21 నేను పౌలును. ఈ శుభాకాంక్షలు నా స్వహస్తాలతో వ్రాస్తున్నాను.
22 ప్రభువును ప్రేమించనివాడు శాపగ్రస్థుడు అవుతాడు!
ప్రభువా రమ్ము![a]
23 యేసు ప్రభువు యొక్క అనుగ్రహము మీకందరికి లభించుగాక.
24 యేసు క్రీస్తు పేరిట నా ప్రేమ మీకందరికీ తెలుపుతున్నాను. ఆమేన్.
© 1997 Bible League International