Revised Common Lectionary (Semicontinuous)
10 “వర్షం, మంచు ఆకాశం నుండి కురుస్తాయి.
అవి నేలను తాకి, నేలను తడిచేయకుండా తిరిగి ఆకాశానికి వెళ్లవు.
అప్పుడు నేల మొక్కలను మొలిపించి, ఎదిగింప చేస్తుంది.
ఈ మొక్కలు రైతుకోసం విత్తనాలు సిద్ధం చేస్తాయి. ప్రజలు ఆహారంగా రొట్టెలకోసం ఈ విత్తనాలు వినియోగిస్తారు.
11 అదే విధంగా నా నోటినుండి నా మాటలు బయలు వెళ్తాయి.
అవి సంగతులను సంభవింప చేసేంతవరకు తిరిగి రావు.
నేను ఏ సంగతులు సంభవించాలని అనుకొంటానో వాటిని నా మాటలు సంభవింపచేస్తాయి.
ఏమి చేయాలని నేను నా మాటలను పంపిస్తానో వాటిని నా మాటలు సాధిస్తాయి.
12 “నా మాటలు సంతోషంగా బయలు వెళ్తాయి.
అవి శాంతి కలిగిస్తాయి.
పర్వతాలు, కొండలు సంతోషంగా నాట్యంచేయటం మొదలు పెడతాయి
పొలాల్లోని చెట్లన్నీ చప్పట్లుకొడ్తాయి.
13 పొదలు ఉన్నచోట పెద్ద దేవదారు వృక్షాలు పెరుగుతాయి.
కలుపు మొక్కలు ఉన్నచోట గొంజి వృక్షాలు పెరుగుతాయి.
ఈ సంగతులు యెహోవాను ప్రసిద్ధుని చేస్తాయి.
యెహోవా శక్తిమంతుడు అనేందుకు ఈ సంగతులు రుజువు. ఈ రుజువు ఎన్నటికి నాశనం చేయబడదు.”
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
51 మీకో రహస్యం చెపుతాను వినండి. మనలో ఎవ్వరూ చనిపోరు. అందరూ మారిపోతారు. 52 చివరి బూర ఊదినప్పుడు, మనమందరము ఒక్క క్షణంలో, కనురెప్ప పాటులో మారిపోతాము. ఆ క్షణంలో చనిపోయినవాళ్ళు బ్రతికి వచ్చి చిరంజీవులైపోతారు. మనలో మార్పు కలుగుతుంది. 53 ఎందుకంటే నశించిపోయే ఈ దేహం నాశనం కాని దేహాన్ని ధరించాలి. చనిపోయే ఈ దేహం అమరత్వం పొందాలి. 54 ఇది జరిగినప్పుడు లేఖనాల్లో వ్రాయబడినట్లు జరుగుతుంది:
“మరణం ఓడిపోయి, సంపూర్ణ విజయం కలిగింది.”(A)
55 “ఓ మరణమా! నీ విజయం ఎక్కడ?
ఓ మరణమా! నీ కాటు వేసే శక్తి ఎక్కడ?”(B)
56 మరణం కాటు వేయగల శక్తిని ధర్మశాస్త్రంనుండి పొందుతుంది. 57 కాని దేవుడు మన యేసు ప్రభువు ద్వారా మనకు విజయం యిస్తాడు. కనుక దేవునికి వందనాలు.
58 కనుక నా ప్రియమైన సోదరులారా! ఏదీ మిమ్మల్ని కదిలించలేనంత స్థిరంగా నిలబడండి. ప్రభువుకోసం పడిన మీ శ్రమ వృథాకాదు. ఇది మీకు తెలుసు. కనుక సదా ప్రభువు సేవలో లీనమై ఉండండి.
39 ఆయన ఈ ఉపమానం కూడా చెప్పాడు: “ఒక గ్రుడ్డివాడు మరొక గ్రుడ్డివానికి దారి చూపగలడా? అలా చేస్తే యిద్దరూ గోతిలో పడ్తారు కదా! 40 శిష్యుడు తన గురువుకన్నా గొప్ప కాదు. కాని శిక్ష సంపూర్ణంగా పొందిన తర్వాత అతని గురువుతో సమానమౌతాడు.
41 “నీ కంట్లోవున్న పెద్ద దూలంను నీవు చూడక నీ సోదరుని కంట్లోవున్న చిన్న నలుసును ఎందుకు చూస్తావు? 42 నీ కంట్లో దూలం పెట్టుకొని, ‘నీ కంట్లో ఉన్న నలుసును నన్ను తియ్యనివ్వు’ అని అతనితో ఏలాగు అనగలుగుతున్నావు? ఓ కపటీ! నీ కంట్లో దూలాన్ని ముందు తీసేయి. అప్పుడు నీవు బాగా చూడ కలిగి సోదరుని కంట్లో ఉన్న నలుసును ఏ విధంగా తియ్యాలో తెలుసుకుంటావు.
చెట్టు, దాని ఫలము
(మత్తయి 7:17-20; 12:34-35)
43 “మంచి చెట్టుకు చెడు పండ్లు కాయవు. అదే విధంగా చెడ్డ చెట్టుకు మంచి పండ్లు కాయవు. 44 పండ్లను బట్టి చెట్టు జాతి తెలుస్తుంది. ముండ్ల పొదల నుండి అంజూరపు పండ్లు, గోరింట పొదల నుండి ద్రాక్షాపండ్లు లభించవు. 45 మంచి వాని హృదయం మంచి గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతని నుండి మంచి తనమే బయటకు వస్తుంది. చెడ్డవాని హృదయం చెడు గుణాలతో నిండి ఉంటుంది. కాబట్టి అతనినుండి చెడే బయటకు వస్తుంది. మనిషి తన హృదయములో ఉన్న గుణాలను బట్టి మాట్లాడుతాడు.
తెలివిగలవాడు, తెలివిలేనివాడు
(మత్తయి 7:24-27)
46 “నేను చెప్పింది చెయ్యకుండా నన్ను ‘ప్రభూ! ప్రభూ!’ అని పిలవటం ఎందుకు? 47 నా దగ్గరకు వచ్చి నా మాటలు విని వాటిని అనుసరించే వాడు ఎలాంటి వాడో చెబుతాను వినండి. 48 అలాంటి వాణ్ణి భూమి లోతుగా త్రవ్వి రాళ్ళ పునాది వేసి యిల్లు కట్టుకున్న వానితో పోల్చవచ్చు. ఇతడు తన యింటిని సక్రమమైన పద్దతిలో కట్టాడు కనుక వరదలు వచ్చి నీటి ప్రవాహం ఆ యింటిని కొట్టినా ఆ యిల్లు కూలి పోలేదు.
49 “నా మాటలు విని వాటిని అనుసరించని వాడు పునాది వేయకుండా, నేలపై ఇల్లు కట్టుకొన్న వానితో సమానము. వరదలు వచ్చాయి. ఆ నీటి ప్రవాహానికి ఆ యిల్లు కూలి నేల మట్టమైపోయింది.”
© 1997 Bible League International