Revised Common Lectionary (Semicontinuous)
సబ్బాతుకోసం స్తుతి కీర్తన.
92 యెహోవాను స్తుతించుట మంచిది.
సర్వోన్నతుడైన దేవా, నీ నామాన్ని కీర్తించుట మంచిది.
2 ఉదయం నీ ప్రేమను గూర్చి పాడటం,
రాత్రివేళ నీ నమ్మకత్వాన్ని గూర్చి పాడటం మంచిది.
3 దేవా, పదితంత్రుల వాయిద్యాలను స్వరమండల ములను నీ కోసం వాయించటం మంచిది.
సితారా మీద నీ కోసం సంగీతనాదం చేయటం మంచిది.
4 యెహోవా, నీవు చేసిన పనుల మూలంగా నిజంగా నీవు మమ్మల్ని సంతోషింపచేస్తావు.
నీవు చేసిన వాటిని గూర్చి మేము సంతోషంగా పాడుకొంటాం.
12 నీతిమంతులు ఖర్జూరపు చెట్టులా అభివృద్ధి చెందుతారు.
వారు లెబానోనులోని దేవదారు వృక్షంలా పెరుగుతారు.
13 మంచి మనుష్యులు యెహోవా ఆలయంలో నాటబడిన మొక్కలవలె బలంగా ఉంటారు.
వారు మన దేవుని ఆలయంలో బలంగా ఎదుగుతారు.
14 వారు వృద్ధులైన తరువాత కూడా ఫలిస్తూనే ఉంటారు.
వారు ఆరోగ్యంగా ఉన్న పచ్చని మొక్కల్లా వుంటారు.
15 యెహోవా మంచివాడని నేను చెబుతున్నాను.
ఆయనే నా బండ.
ఆయనలో అవినీతి లేదు.
13 ఒక తెలివిగల కుమారుడు అతడు ఏమి చేయాలని అతని తండ్రి చెబుతాడో, దానిని జాగ్రత్తగా వింటాడు. కాని గర్విష్ఠి వినడు. తనది తప్పు అని అతడు ఎన్నడూ నమ్మడు.
2 మంచి వాళ్లు, తాము చెప్పే మంచి విషయాలకు బహుమానం పొందుతారు. కాని దుర్మార్గులు ఎల్లప్పుడూ చెడు చేయాలని ఆలోచిస్తారు.
3 తాను చెప్పే విషయాలను గూర్చి జాగ్రత్తగా ఉండే మనిషి తన ప్రాణం కాపాడుకొంటాడు. కాని ఆలోచన లేకుండా మాట్లాడే మనిషి నాశనం చేయబడతాడు.
4 బద్ధకస్తునికి వస్తువులు కావాలి, కాని అతడు వాటిని ఎన్నటికీ పొందలేడు. కాని కష్టపడి పని చేసేవాళ్లు, తాము కోరుకొనే వాటిని పొందుతారు.
5 మంచివాళ్లు అబద్ధాలను అసహ్యించుకొంటారు. దుర్మార్గులు అవమానించబడతారు.
6 మంచితనం, నిజాయితీగల మనిషిని మంచితనం కాపాడుతుంది. కాని పాపం చేయాలని ఇష్టపడేవాడికి కీడు కలుగుతుంది.
7 కొంతమంది మనుష్యులు ధనికుల్లా నటిస్తారు, కాని వారికి ఏమి వుండదు. ఇతరులు పేదవాళ్లలా నటిస్తారు, కాని వాస్తవానికి వారు ధనికులు.
8 ఒక ధనికుడు తనప్రాణం కాపాడుకొనేందుకు వెల చెల్లించాల్సి వస్తుందేమో. కాని పేదవాళ్లకు అలాంటి బెదిరింపులు ఏమీ వుండవు.
9 ఒక మంచి మనిషి ప్రకాశవంతంగా వెలిగే దీపంలా ఉంటాడు. కాని దుర్మార్గుడు ఆరిపోయే దీపంలా ఉంటాడు.
10 ఇతరులకంటె తామే మంచివాళ్లము అనుకొనే మనుష్యులు కష్టం మాత్రమే కలిగిస్తారు. అయితే ఇతరులు తమకు చెప్పే విషయాలను వినేవారు జ్ఞానము గలవారు.
11 డబ్బు సంపాదించటంకోసం ఒక వ్యక్తి మోసం చేస్తే, ఆ డబ్బు త్వరలోనే పోతుంది. అయితే తన డబ్బును కష్టపడి సంపాదించే మనిషి దానిని మరీ ఎక్కువగా పెంచుకొంటాడు.
12 నిరీక్షణ లేకపోతే హృదయానికి దు: ఖం. నీవు కోరుకొన్నది సంభవిస్తే, అప్పుడు ఆనంద భరితుడవు.
ఆదాము వల్ల మరణం, క్రీస్తు వల్ల జీవం
12 పాపం ఈ ప్రపంచంలోకి ఆదాము ద్వారా ప్రవేశించింది. పాపం ద్వారా మరణం సంభవించింది. అంతేకాక అందరూ పాపం చేసారు కనుక అందరికీ మరణం ప్రాప్తించింది. 13 ధర్మశాస్త్రానికి ముందే పాపం ఈ ప్రపంచంలో ఉండేది. కాని ధర్మశాస్త్రం లేక పోయినట్లైతే పాపం లెక్కలోకి వచ్చేది కాదు. 14 అయినా, ఆదాము కాలంనుండి మోషే కాలం వరకు మానవులపై మరణం రాజ్యం చేసింది. ఆదాము దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. కాని అతనివలే పాపం చెయ్యనివాళ్ళపై కూడా మరణం రాజ్యం చేసింది.
ఆదాముకు, రానున్నవానికి కొంత పోలిక ఉంది. 15 కాని దేవుడు ఇచ్చిన వరానికి, ఆదాము చేసిన పాపానికి పోలిక లేదు. ఒకడు చేసిన పాపం వల్ల చాలా మంది మరణించారు. మరొకని అనుగ్రహం వల్ల, అంటే యేసు క్రీస్తు అనుగ్రహంవల్ల, దేవునిలో వరము, ఆయన అనుగ్రహము ఉచితంగా లభించాయి. 16 పైగా ఆదాము ఒక్కసారి చేసిన పాపానికి నేరస్థుడుగా తీర్పు ఇవ్వబడింది. కాని ఎన్నో పాపాలు చేసిన మనకు దేవుని నుండి నీతిమంతులముగా అయ్యే వరం లభించింది. అందువల్ల ఆదాము పాపాన్ని దేవుని వరంతో పోల్చలేము. 17 ఆదాము పాపం చేసాడు. ఆ ఒక్కని పాపంవల్ల మరణం రాజ్యం చేసింది. కాని ఆ “ఇంకొకని” ద్వారా అంటే యేసు క్రీస్తు ద్వారా ఆధ్యాత్మిక జీవితం పొంది రాజ్యం చెయ్యటం తథ్యం. ఇది దేవుని నుండి నీతియను వరాన్ని, సంపూర్ణమైన ఆయన అనుగ్రహాన్ని పొందినవాళ్ళకు సంభవిస్తుంది.
18 అందువల్ల ఒకడు చేసిన పాపంవల్ల ప్రజలందరికీ శిక్ష విధించబడింది. అదే విధంగా ఒకడు ఒక నీతికార్యాన్ని చేయటంవల్ల, అందరూ శిక్షను తప్పించుకొని అనంతజీవితం పొందుటకు మార్గమేర్పడింది. 19 ఒకని అవిధేయతవల్ల అనేకులు పాపులుగా చేయబడిరి. అలాగే ఒకని విధేయతవల్ల అనేకులు నీతిమంతులగుదురు. 20 పాపం అధికం కావాలని దేవుడు ధర్మశాస్త్రాన్నిచ్చాడు. కాని పాపం అధికమైన చోటే అనుగ్రహం ఇంకా అధికమయ్యింది. 21 పాపం మరణం ద్వారా రాజ్యం చేసినట్లు దైవానుగ్రహం నీతిద్వారా రాజ్యం చేసింది. మన యేసు క్రీస్తు ప్రభువుద్వారా అది మనకు అనంత జీవం కలిగిస్తుంది.
పాపం విషయంలో మరణించాము గాని క్రీస్తులో బ్రతికినాము
6 దైవానుగ్రహం అధికం కావాలని మనం పాపం చేసుకొంటూ పోదామంటారా? 2 ఎన్నటికి కాదు. పాపపు జీవితం విషయంలో మనం మరణించినవారము. అలాంటప్పుడు మనం పాపంలో జీవించుకొంటూ ఎట్లా ఉండగలము?
© 1997 Bible League International