Revised Common Lectionary (Semicontinuous)
మరియ పాడిన భక్తి గీతం
46 మరియ ఈ విధంగా అన్నది:
47 “నా ఆత్మ ప్రభువును కొలిచింది.
దేవుడు చేసిన ఈ మంచికి నా మనస్సు ఆనందం పొందింది. ఆయనే నా రక్షకుడు.
48 దీనురాల్ని నేను!
ఆయన దాసీని నేను, నన్ను కరుణించాడు!
ఇకనుండి అందరూ
నన్ను ధన్యురాలంటారు!
49 దేవుడు సర్వశక్తి సంపన్నుడు.
ఆయన నాకు ఎంతో మంచి చేశాడు! ఆయన నామం పవిత్రం!
50 తనంటే భయపడే వాళ్ళపై తరతరాలు దయ చూపుతాడు.
51 తన బలమైన హస్తాన్ని జాపి
గర్వించే వాళ్ళను వాళ్ళ ఆలోచనల్ని అణిచి వేస్తాడు.
52 రాజుల్ని, వాళ్ళ సింహాసనాల నుండి దింపి వేస్తాడు.
దీనులకు గొప్ప స్థానాలిస్తాడు.
53 పేదవాళ్ళ అవసరాలన్నీ తీరుస్తాడు.
ధనవంతుల్ని వట్టి చేతుల్తో పంపేస్తాడు.
54 తరతరాల నుండి మన పూర్వీకులతో, అబ్రాహాముతో,
అతని సంతతితో చెప్పినట్లు
55 దేవుని ఇష్టానుసారం జీవించిన ఇశ్రాయేలు ప్రజలకు సహాయం చేశాడు. మరవకుండా వాళ్ళపై దయ చూపాడు.”
హన్నా కృతజ్ఞతలు
2 హన్నా దేవుని ఇలా కీర్తించెను:
“నా హృదయం దేవునిలో పరవశించి పోతూవుంది.
నా దేవుని ద్వారా నాకు బలము కలిగెను.
నా శత్రువులను నేను పరిహసించగలను.
నా విజయానికి మురిసిపోతున్నాను.
2 యెహోవా వంటి మరో పరిశుద్ధ దేవుడు లేడు.
నీవు తప్ప మరో దేవుడు లేడు!
మన దేవుని వంటి బండ[a] మరొకడు లేడు.
3 ఇక డంబాలు పలుకవద్దు!
గర్వపు మాటలు కట్టి పెట్టండి!
ఎందువల్లనంటే యెహోవా దేవునికి అంతా తెలుసు దేవుడు మనుష్యులను నడిపిస్తాడు,
వారికి తీర్పు తీరుస్తాడు.
4 మహా బలశాలుల విల్లులు విరిగిపోతాయి!
బలహీనులు బలవంతులవుతారు!
5 ఇది వరకు సమృద్ధిగా భోజనం ఉన్నావారు
భోజనం కోసం పని చేయాలి ఇప్పుడు
కాని ఇదివరకు ఆకలితో కుమిలేవారికి
ఇప్పుడు సమృద్ధిగా భోజనం!
గొడ్రాలుకు ఏడుగురు పిల్లలు!
సంతానవతికి పుత్రనాశనంతో దుఃఖపాటు.
6 యెహోవా జనన మరణ కారకుడు!
దేవుడు నరులను చావుగోతికి తోసివేయ గలడు.
ఆయన వారిని మరల బ్రతికించగలడు.
7 యెహోవా కొందరిని పేద వారిగా చేస్తాడు,
మరికొందరిని ధనవంతులుగా చేస్తాడు.
పతనానికీ, ఉన్నతికీ కారకుడు యెహోవాయే.
8 మట్టిలో ఉండే వారిని యెహోవా ఉన్నతికి తీసుకొని వస్తాడు ఆయన వారి దుఃఖాన్ని నిర్ములిస్తాడు.
యెహోవా పేదవారిని ప్రముఖులుగా చేస్తాడు.
యువ రాజుల సరసన కూర్చుండబెడ్తాడు.
యెహోవా వారిని ఘనులతో బాటు ఉన్నతాసీనులను చేస్తాడు.
పునాదుల వరకూ ఈ సర్వజగత్తూ యెహోవాదే!
యెహోవా ఈ జగత్తును ఆ పునాదులపై నిలిపాడు.
9 యెహోవా తన పరిశుద్ధ ప్రజలను కాపాడుతాడు.
వారు పడిపోకుండా ఆయన వారిని కాపాడుతాడు.
కాని దుష్టులు నాశనం చేయబడతారు.
వారు అంధకారంలో పడిపోతారు.
వారి శక్తి, వారు జయించేందుకు తోడ్పడదు.
10 యెహోవా తన శత్రువులను నాశనం చేస్తాడు.
సర్వోన్నతుడైన దేవుడు ప్రజల గుండెలదిరేలా పరలోకంలో గర్జిస్తాడు.
సర్వలోకానికీ యెహోవా తీర్పు ఇస్తాడు!
యెహోవా తన రాజుకు శక్తి ఇస్తాడు.
ఆయన నియమించిన రాజును బలవంతునిగా చేస్తాడు.”
యేసు యెరూషలేము ప్రవేశించటం
(మత్తయి 21:1-11; లూకా 19:28-40; యోహాను 12:12-19)
11 వాళ్ళు యెరూషలేము పట్టణాన్ని సమీపించారు. ఒలీవలకొండ దగ్గరున్న బేత్పగే మరియు బేతనియ గ్రామాలకు రాగానే యేసు తన శిష్యుల్లో యిద్దరిని పంపుతూ, 2 వాళ్ళతో, “ముందున్న గ్రామానికి వెళ్ళండి. మీరాగ్రామంలోకి వెళ్ళిన వెంటనే అక్కడ వయస్సులో ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడుతుంది. అది ఒక వాకిలి ముందు కట్టబడి ఉంటుంది. దాని మీద ఇది వరకెవ్వరూ స్వారి చెయ్యలేదు. దాన్ని విప్పి యిక్కడకు తీసుకొని రండి. 3 అలా ఎందుకు చేస్తున్నారని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, ‘ప్రభువుకు కావాలి, త్వరలోనే తిరిగి పంపుతాము’[a] అని సమాధానం చెప్పండి” అని అన్నాడు.
4 శిష్యులు వెళ్ళి, ఇంటి ముందు వీధిలో ఒక గాడిద ఉండటం చూసారు. వాళ్ళు దాన్ని విప్పుతుండగా 5 అక్కడ నిలుచున్న కొందరు మనుష్యులు, “గాడిదను ఎందుకు విప్పుతున్నారు?” అని అడిగారు. 6 వాళ్ళు యేసు చెప్పమన్న సమాధానం చెప్పారు. ఆ మనుష్యులు వాళ్ళను పోనిచ్చారు.
7 వాళ్ళా గాడిదను యేసు దగ్గరకు తీసుకొని వచ్చి, తమ వస్త్రాల్ని దాని మీద పరిచారు. యేసు దానిపై కూర్చున్నాడు. 8 చాలా మంది ప్రజలు తమ వస్త్రాలను దారిమీద పరిచారు. మరికొందరు తోటలనుండి తెచ్చిన చెట్ల రెమ్మల్ని దారి మీద పరిచారు. 9 ముందు నడుస్తున్న వాళ్ళు, వెనుక నడుస్తున్న వాళ్ళు,
10 “రానున్న మన తండ్రి
దావీదు రాజ్యం ధన్యమైనది.
మహోన్నతుడైన వానికి హోసన్నా!”
అని బిగ్గరగా కేకలు వేసారు.
11 యేసు యెరూషలేం పట్టణం ప్రవేశించి అక్కడున్న ఆలయానికి[c] వెళ్ళాడు. చుట్టూ ఉన్న వాటిని చూసాడు. అప్పటికే ప్రొద్దు పోయి ఉండటం వల్ల పన్నెండుగురితో కలిసి బేతనియకు వెళ్ళాడు.
© 1997 Bible League International