Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 135

135 యెహోవాను స్తుతించండి.
    యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
    ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
    యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.

యెహోవా యాకోబును కోరుతున్నాడు.
    యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
    మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
    అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
    మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
    దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
    ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
    బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
    బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
    కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
    దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.

13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
    యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
    కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
    వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
    కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
    ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
    ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.

19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
    అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
    యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
    యెహోవా స్తుతించబడును గాక!

యెహోవాను స్తుతించండి!

యెహెజ్కేలు 14:12-23

యెరూషలేము శిక్షించబడుతుంది

12 పిమ్మట యెహోవా వాక్కు నాకు తిరిగి వినిపించింది. ఆయన ఇలా చెప్పాడు, 13 “నరపుత్రుడా, నన్ను వదిలిపెట్టిన, నా పట్ల పాపంచేసిన ఏ దేశాన్నయినా నేను శిక్షిస్తాను. వారికి ఆహార సరఫరాలను నిలిపి వేస్తాను. వారికి కరువు కాలం రప్పించి, ఆ దేశ జనాభాని పశుసంపదను తొలగిస్తాను. 14 ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు నివసిస్తున్నప్పటికీ దానిని నేను శిక్షిస్తాను. ఆ మనుష్యులు వారి మంచితనం చేత వారి ప్రాణాలను కాపాడుకొనగలరు. కాని మొత్తం దేశాన్ని వారు రక్షించలేరు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

15 దేవుడు ఇంకా ఇలా తెలియజెప్పాడు: “లేదా, నేను ఆ రాజ్యానికి క్రూర మృగాలను పంపవచ్చు. ఆ జంతువులు ప్రజలందరినీ చంపివేయవచ్చు. ఈ క్రూర మృగాల కారణంగా ఆ దేశం గుండా ఎవ్వరూ ప్రయాణం చేయరు. 16 ఒకవేళ ఆ దేశంలో నోవహు, దానియేలు, యోబు[a] నివసిస్తూవుంటే ఆ ముగ్గురు మంచి వ్యక్తులనూ నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మనుష్యులూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. నా జీవ ప్రమాణంగా వారు ఇతరుల ప్రాణాలను గాని, కనీసం వారి కుమారులను, కుమార్తెలను గాని రక్షించలేరని నిశ్చయంగా చెబుతున్నాను! ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

17 దేవుడు ఈ విధంగా చెప్పాడు: “లేదా, నేను శత్రుసైన్యాన్ని ఆ దేశం మీదికి పంపవచ్చు. ఆ సైనికులు ఆ రాజ్యాన్ని నాశనం చేస్తారు. దేశంలో వున్న మనుష్యులను, జంతువులను తొలగించి వేస్తాను. 18 నోవహు, దానియేలు, యోబు అక్కడ వుంటే, ఆ ముగ్గురు మంచి వ్యక్తులను నేను రక్షిస్తాను. ఆ ముగ్గురు మునుష్యులూ వారి ప్రాణాలను కాపాడుకోగలుగుతారు. కాని, నా జీవ ప్రమాణంగా ఇతర ప్రజల ప్రాణాలను గాని, తమ స్వంత కుమారుల, కుమార్తెల ప్రాణాలను గాని కాపాడలేరని చెబుతున్నాను. ఆ చెడ్డదేశం నాశనం చేయబడుతుంది!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

19 దేవుడు ఇంకా ఇలా చెప్పాడు: “లేదా, ఆ దేశం మీద ఒక వ్యాధి ప్రబలేలా నేను చేయవచ్చు. ఆ ప్రజల మీద నా కోపం కుమ్మరిస్తాను. ఆ రాజ్యంనుండి ప్రజలందరినీ, పశువులన్నిటినీ నేను తొలగించి వేస్తాను. 20 ఒకవేళ నొవహు, దానియేలు, యోబు అక్కడ నివసిస్తే, ఆ ముగ్గురు మనుష్యులను నేను రక్షిస్తాను. ఎందువల్లనంటే వారు మంచి వ్యక్తులు. ఆ ముగ్గురూ తమ ప్రాణాలను కాపాడుకోగలరు. కాని, నా ఆత్మ సాక్షిగా వారు ఇతర ప్రజలను గాని, వారి స్వంత కొడుకులను, కుమార్తెలను గాని రక్షించలేరు!” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

21 మళ్లీ నా ప్రభువైన యెహోవా ఈ విధంగా చెప్పాడు: “కావున యెరూషలేము పరిస్థితి ఎంత దారుణంగా వుంటుందో ఆలోచించు. ఆ నాలుగు రకాల శిక్షలనూ ఆ నగరం మీదికి పంపుతాను! ఆ నగరం మీదికి శత్రుసైన్యాలను. క్షామాన్ని, రోగాలను, క్రూర మృగాలను పంపుతాను. ఆ రాజ్యం నుండి ప్రజలను, పశువులను అందరినీ తొలగిస్తాను! 22 కొంతమంది ప్రజలు ఆ దేశంనుండి తప్పించు కుంటారు. వారు తమ కుమారులను, కుమార్తెలను తీసుకొని నీ సహాయం కొరకు వస్తారు. నిజంగా వారెంత చెడ్డవారో నీవప్పుడు తెలుసుకొంటావు. నేను యెరూషలేము మీదకి రప్పించే కష్టాలను గూర్చి నీవప్పుడు యోచించి అవి వారికి తగినవేనని నీవనుకుంటావు. 23 నీవు వారి జీవన విధానాన్ని, వారు చేసే చెడుకార్యాలను చూస్తావు. నేనా ప్రజలను శిక్షించటానికి తగిన కారణమున్నట్లు నీవు అప్పుడు తెలుసుకుంటావు.” నా ప్రభువైన యెహోవా ఈ విషయాలు చెప్పాడు.

మార్కు 7:24-30

యేసు యూదేతర స్త్రీకి సహాయం చేయటం

(మత్తయి 15:21-28)

24 యేసు ఆ ప్రాంతం వదిలి తూరు[a] ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ ఒకరి యింటికి వెళ్ళాడు. తనక్కడ ఉన్నట్లు ఎవ్వరికి తెలియరాదని ఆయన ఉద్దేశ్యం. కాని దాన్ని రహస్యంగా ఉంచలేకపోయాడు. 25 ఒక స్త్రీ వెంటనే యేసును గురించి విన్నది. ఆమె కూతురుకు దయ్యం పట్టివుంది. ఆమె అక్కడికి వచ్చి యేసు కాళ్ళపై పడింది. 26 ఆమె గ్రీసు దేశస్తురాలు. జన్మస్థానం సిరియ దేశంలోని ఫొనీషియా. తన కూతురు నుండి ఆ దయ్యాన్ని వదిలించమని ఆమె యేసును వేడుకొంది.

27 ఆయన ఆమెతో, “మొదట చిన్నపిల్లల్ని వాళ్ళకు కావలసినవి తిననివ్వాలి. ఎందుకంటే చిన్న పిల్లల ఆహారాన్ని తీసుకొని కుక్కలకు వేయటం సమంజసం కాదు”[b] అని అన్నాడు.

28 “ఔను! ప్రభూ! కాని, బల్లక్రిందవున్న కుక్కలు కూడా చిన్నపిల్లలు వదిలివేసిన ముక్కల్ని తింటాయి కదా!” అని ఆమె సమాధానం చెప్పింది.

29 అప్పుడు యేసు ఆమెతో, “అలాంటి సమాధానం చెప్పావు కనుక వెళ్ళు. దయ్యం నీ కూతుర్ని వదిలి వెళ్ళింది” అని అన్నాడు.

30 ఆమె యింటికి వెళ్ళి తన కూతురు పడకపై పడుకొని ఉండటం చూసింది. దయ్యం నిజంగా ఆమె నుండి వెళ్ళిపోయింది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International