Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 5:1-8

సంగీత నాయకునికి: పిల్లన గ్రోవులతో పాడదగిన దావీదు కీర్తన

యెహోవా, నా మాటలు ఆలకించుము.
    నేను నీకు చెప్పటానికి ప్రయత్నిస్తున్నదాన్ని వినుము.
నా రాజా, నా దేవా
    నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, ప్రతి ఉదయం నేను నా కానుకను నీ ముందు ఉంచుతాను.
    సహాయం కోసం నేను నీ వైపు చూస్తాను.
మరి నీవు నా ప్రార్థనలు వింటావు.

యెహోవా, నీవు దుష్టులను నీ దగ్గర ఉండడానికి ఇష్టపడవు,
    చెడ్డవాళ్లు నీ మందిరంలో నిన్ను ఆరాధించేందుకు రావటం నీకు ఇష్టం లేదు.
గర్విష్ఠులు, అహంకారులు నీ దగ్గరకు రాలేరు.
    ఎప్పుడూ చెడ్డపనులు చేసే మనుష్యులను నీవు అసహ్యించుకొంటావు.
అబద్ధాలు చెప్పే మనుష్యులను నీవు నాశనం చేస్తావు.
    ఇతరులకు హాని చేయుటకు రహస్యంగా పథకాలు వేసే మనుష్యులను యెహోవా అసహ్యించుకొంటాడు.

యెహోవా, నేను నీ మందిరానికి వస్తాను. నీవు చాలా దయగల వాడవని నాకు తెలుసు.
    యెహోవా, నీ పవిత్ర మందిరం వైపు నేను వంగినప్పుడు, నీకు నేను భయపడతాను. నిన్ను గౌరవిస్తాను.
యెహోవా, ప్రజలు నాలో బలహీనతల కోసం చూస్తున్నారు.
    కనుక నీ నీతికరమైన జీవిత విధానం నాకు చూపించుము.
నేను ఎలా జీవించాలని నీవు కోరుతావో
    అది నాకు తేటగా చూపించుము.

1 రాజులు 20:23-34

బెన్హదదు తిరిగి యుద్ధానికి వచ్చుట

23 రాజైన బెన్హదదు సేవకులు కొందరు వచ్చి అతనికి ఇలా సలహా ఇచ్చారు, “ఇశ్రాయేలు దేవతలు కొండ దేవతలు. మనం యుద్ధం పర్వత ప్రాంతంలో నిర్వహించాం. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలు గెలిచారు. కావున ఈ సారి మనం మైదాన ప్రాంతంలో యుద్ధం నిర్వహించాలి. అప్పుడు మనం గెలుస్తాం. 24 ఇప్పుడు నీవొకటి చేయాలి. ఈ ముప్పది యిద్దరు పాలకులను సైన్యాలను నడిపించేందుకు అనుమతించద్దు. వారి స్థానంలో దళాధిపతులను నియమించు. 25 తర్వాత నీవు పోగొట్టుకున్నటువంటి సైన్యాన్ని మళ్లీ నీవు భర్తీ చేయాలి. పూర్వపు సైన్యంలో వున్నట్లుగా గుర్రాలను, రథాలను మళ్లీ సేకరించు. అప్పుడు ఇశ్రాయేలు సైన్యాన్ని మైదాన ప్రాంతంలో మనం ఎదుర్కొందాం. అప్పుడు విజయం మనదే!” బెన్హదదు వారి సలహా పాటించాడు. వారు చెప్పిందంతా చేశాడు.

26 వసంత కాలం వచ్చే సరికి బెన్హదదు అరాము ప్రజలను సమీకరించాడు. ఇశ్రాయేలుతో యుద్ధం చేయటానికి అతడు ఆఫెకు నగరానికి వెళ్లాడు.

27 ఇశ్రాయేలీయులు కూడా యుద్ధానికి తయారైనారు. ఇశ్రాయేలు ప్రజలు అరాము సైన్యంతో పోరాడటానికి వెళ్లారు. అరాము సైనికులు దిగిన చోటికి ఎదురుగానే ఇశ్రాయేలు సైనికులు మకాంవేశారు. అరామీయులు ఆ ప్రదేశాన్నంతా ఆక్రమించియుండగా, ఇశ్రాయేలీయులు కేవలం రెండు మేకల మందలవలెవున్నారు.

28 ఇశ్రాయేలు రాజు వద్దకు దైవజనుడొకడు వర్తమానాన్ని తెచ్చాడు. యెహోవా ఇలా చెప్పాడు: “అరాము ప్రజలు ప్రభువునైన నన్ను ఒక కొండ దేవతగా చిత్రీకరించారు. నేను లోయలకు కూడ దేవుడనేనని వారు భావించలేదు. కావున నీవు ఈ పెద్ద సైన్యాన్ని ఓడించేలా చేస్తాను. అప్పుడు సర్వత్రా నేనే ప్రభువునని నీవు తెలుసుకుంటావు.”

29 ఇరు సైన్యాలు ఎదురెదురుగా ఏడు రోజుల పాటు మోహరించి వున్నాయి. ఏడవరోజు యుద్ధం మొదలయ్యింది. ఇశ్రాయేలీయులు ఒక్క రోజులో ఒక లక్ష మంది అరాము సైనికులను చంపేశారు. 30 మిగిలిన వారు ఆఫెకు నగరానికి పారిపోయారు. నగర ప్రాకారపు గోడ విరిగి పడగా ఇరవై ఏడువేల మంది సైనికులు చనిపోయారు. బెన్హదదు కూడ నగరానికి పారిపోయాడు. అతడొక గదిలో దాక్కున్నాడు. 31 ఈ లోపు కొందరు సేవకులు అతనితో ఇలా అన్నారు: “ఇశ్రాయేలు రాజులు కనికరం చూపనున్నట్లు మేము విన్నాం. మనం గోనెబట్టలు ధరించి, తాళ్లు తలకు చుట్టుకుని[a] ఇశ్రాయేలు రాజు వద్దకు వెళ్దాం. బహుశః అతడు మనల్ని బ్రతకనివ్వొచ్చు.”

32 వారు గోనెపట్టలు చుట్టుకుని, తలపై తాళ్లు వేసుకున్నారు. వారు ఇశ్రాయేలు రాజు వద్దకు వచ్చి, “మీ సేవకుడు బెన్హదదు దయచేసి తనను బ్రతకనివ్వమని అడుగుతున్నాడు” అని చెప్పారు.

“అయితే అతడింకా బ్రతికే వున్నాడా? అతడు నా సహోదరుడే!” అన్నాడు అహాబు.

33 బెన్హదదు మనుష్యులు రాజైన అహాబు నిజంగా దయచూపి బెన్హదదును చంపనని నిరూపించే విధంగా ఏదైనా చెప్పాలని కోరుకున్నారు. ఎప్పుడయితే బెన్హదదును నా సహోదరుడని అహాబు అన్నాడో, వచ్చిన మనుష్యులు వెంటనే,

“అవును! బెన్హదదు నీ సోదరుడే!” అని అన్నారు. “అతనిని నా వద్దకు తీసుకుని రండి” అని అహాబు అన్నాడు. తరువాత బెన్హదదు రాజైన అహాబు ముందుకు వచ్చాడు. అహాబు అతనిని తనతో తన రథం ఎక్కమన్నాడు.

34 బెన్హదదు అతనితో ఇలా అన్నాడు: “అహాబూ, నా తండ్రి నీ తండ్రి వద్ద నుండి తీసుకున్న పట్టణాలన్నిటినీ నేను నీకు తిరిగి ఇస్తాను. నా తండ్రి షోమ్రోనులో చేసిన విధంగా, దమస్కులో నీవు కొన్ని వీధులను నిర్మించి, వ్యాపార కేంద్రాలను ఏర్పాటు చేయవచ్చు.” అది విన్న అహాబు,

“నీవు ఇందుకు ఒప్పుకుంటే నేను నిన్ను వదిలి పెడతాను” అని అన్నాడు. తరువాత ఆ రాజులిద్దరూ ఒక శాంతి ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజైన అహాబు రాజైన బెన్హదదును స్వేచ్ఛగా వదిలాడు.

రోమీయులకు 11:1-10

దేవుని దయ

11 “మరి దేవుడు తన ప్రజల్ని నిరాకరించాడా?” అని నేను అడుగుతున్నాను. లేదు, నేను స్వయంగా ఇశ్రాయేలు వంశీయుణ్ణి. బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. అబ్రాహాము మా మూలపురుషుడు. తనకు ముందే తెలిసిన ప్రజల్ని దేవుడు నిరాకరించలేదు. లేఖనాల్లో ఏలీయాను గురించి ఏమని వ్రాసారో మీకు తెలియదా? అతడు ఇశ్రాయేలు వంశీయులపై నేరారోపణ చేస్తూ దేవునితో ఈ విధంగా విన్నవించుకొన్నాడు: “ప్రభూ! వాళ్ళు నీ ప్రవక్తల్ని చంపివేసారు. నీ బలిపీఠాన్ని నేలమట్టం చేసారు. మిగిలినవాణ్ణి నేనొక్కణ్ణే. నన్ను కూడా చంపాలని ప్రయత్నిస్తున్నారు.”(A) అప్పుడు దేవుని స్వరం ఈ విధంగా అన్నది: “బయలు ముందు మోకరించని ఏడువేల మందిని నా కోసం ప్రత్యేకంగా ఉంచుకొన్నాను.”(B)

అదే విధంగా ఇప్పుడు కూడా దేవుడు కరుణించిన కొద్దిమంది మిగిలిపొయ్యారు. ఇది దేవుని అనుగ్రహం వల్ల జరిగింది. అంటే, అది మానవులు చేసిన కార్యాలపై ఆధారపడింది కాదన్నమాట. అలా కాకపోయినట్లైతే అనుగ్రహానికి అర్థం ఉండేది కాదు.[a]

7-8 అంటే ఏమిటి? ఇశ్రాయేలు ప్రజలకు వాళ్ళు మనసారా కోరుకొన్నది లభించలేదు. కాని దేవుడు ఎన్నుకొన్నవాళ్ళకు అది లభించింది. ఇశ్రాయేలు దేశంలోని మిగతా ప్రజలు సువార్తను నిరాకరించారన్న విషయమై ఈ విధంగా వ్రాయబడి ఉంది:

“దేవుడు వాళ్ళకు మత్తుగల ఆత్మను.”(C)

“చూడలేని కళ్ళను,
    వినలేని చెవుల్ని ఇచ్చాడు.
ఈనాడు కూడా వాళ్ళు అదే స్థితిలో ఉన్నారు.”(D)

ఈ సందర్భాన్ని గురించి దావీదు ఈ విధంగా అంటున్నాడు:

“వాళ్ళు విందులు చేస్తున్నప్పుడు వేసుకొన్న బల్లలు బోనులవలె, వలలవలె మారుగాక!
    వాళ్ళు క్రిందపడి శిక్షను అనుభవించుదురు గాక!
10 వాళ్ళ కన్నులు చీకటితో నిండిపోయి, వాళ్ళ దృష్టి నశించుగాక!
    వాళ్ళ నడుములు కష్టాలతో వంగిపోయివాళ్ళు ఎప్పుడూ అదే స్థితిలో ఉండిపోవుదురు గాక!”(E)

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International