Revised Common Lectionary (Semicontinuous)
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
17 మోషేతో యెహోవా ఇలా చెప్పాడు: 18 “ఇశ్రాయేలు ప్రజలతో ఈ విషయాలు చెప్పు: నేను మిమ్మల్ని మరో దేశానికి తీసుకొని వెళ్తున్నాను. 19 ఆ దేశంలో పండే ఆహారం మీరు తినేటప్పుడు దానిలో భాగం యెహోవాకు అర్పణగా మీరు ఇవ్వాలి. 20 మీరు ధాన్యం విసిరి, ముద్దగా చేయాలి. దాన్ని రొట్టెలుగా చేయాలి. ఆ రొట్టెల్లో మొదటిది యెహోవాకు ఇవ్వాలి. అది కళ్లం నుండి వచ్చే ధాన్యార్పణ. 21 ఇప్పుడు, రాబోయే కాలమంతా ఈ అర్పణను మీరు యెహోవాకు ఇవ్వాలి. అనగా మీరు ఆహారంగా విసరుకొనే ధాన్యంలో మొదటిది యెహోవాకు ఇవ్వాలని అర్థం.
22 “మోషేకు యెహోవా ఇచ్చిన ఈ ఆజ్ఞలలో దేనికైనా విధేయులవటం మీరు మరచిపోతే మీరేమిచేయాలి? 23 ఇవి మోషే ద్వారా మీకివ్వబడిన ఆజ్ఞలు. వీటిని యెహోవా మీకు ఇచ్చిన రోజే ఈ ఆజ్ఞలు ప్రారంభం అయ్యాయి. ఈ ఆజ్ఞలు రాబోయే కాలమంతా కొనసాగుతాయి. 24 అయితే వీటిలో ఏదైనా ఒక ఆజ్ఞకు మీరు విధేయులు కాకపోవటం జరుగవచ్చు. మీరు ఒక ఆజ్ఞకు విధేయులవటం మరచిపోయినా, ప్రజలంతా ఆ ఆజ్ఞ మరచిపోయి దోషులైనా, ప్రజలంతా ఒక కోడెదూడను యెహోవాకు అర్పణగా ఇవ్వాలి. ఇది దహనబలి, ఇది యెహోవాను సంతోషపెడుతుంది. కోడె దూడతో బాటు ధాన్యార్పణ, పానార్పణం కూడ ఇవ్వాలని జ్ఞాపకం ఉంచుకోండి. మరియు పాప పరిహర బలిగా ఒక మగ మేకనుకూడ మీరు ఇవ్వాలి.
25 “కనుక ఆ పాపం నిమిత్తం ఆ చెల్లింపును యాజకుడు అర్పిస్తాడు. ఇశ్రాయేలు ప్రజలందరి కోసం అతడు ఇలా చేస్తాడు. వారు పాపం చేస్తున్నట్టు ప్రజలకు తెలియదు. అయితే దాన్నిగూర్చి వారు తెలుసుకొన్నప్పుడు, వారి తప్పిదం నిమిత్తం యెహోవాకు అర్పించేందుకు వారు ఒక అర్పణం తెచ్చారు. అది హోమంలో దహించబడిన పాప పరిహారార్థ అర్పణ. 26 ఇశ్రాయేలు ప్రజలందరు, వారి మధ్య నివసిస్తున్న ఇతర ప్రజలంతా క్షమించబడతారు. వారు చేస్తోంది తప్పు అని వారికి తెలియదు గనుక వారు క్షమించబడతారు.
పౌలు తాను నిర్దోషినని వాదించటం
26 అప్పుడు అగ్రిప్ప రాజు పౌలుతో, “నీవు చెప్పుకోదలచింది ఇక చెప్పకోవచ్చు!” అని అన్నాడు. పౌలు తన చేతులెత్తి, తాను నిర్దోషినని నిరూపించుకోవటానికి ఈ విధంగా చెప్పటం మొదలు పెట్టాడు: 2 “అగ్రిప్ప రాజా! ఈ రోజు మీ ముందు నిలుచొని యూదులు నాపై ఆరోపించిన నేరాలు అసత్యమని రుజువు చేసుకోవటానికి అవకాశం కలగటం నా అదృష్టం. 3 మీకు యూదులతో, వాళ్ళ ఆచారాలతో, వాళ్ళు తర్కించే విషయాలతో బాగా పరిచయముంది. కనుక యిది నిజంగా నా అదృష్టం. నేను చెప్పేది మీరు శాంతంగా వినాలని మనవి చేసుకొంటున్నాను.
4 “నేను చిన్ననాటినుండి ఏ విధంగా జీవించానో యూదులందరికీ తెలుసు. నా దేశంలో గడచిన నా బాల్యం మొదలుకొని యెరూషలేములో జరిగిన సంఘటనల దాకా జరిగినదంతా వాళ్ళకు తెలుసు. 5 వాళ్ళు నన్ను ఎన్నో సంవత్సరాలనుండి ఎరుగుదురు. నేను, మన మతంలోని నిష్ఠగల పరిసయ్యుల తెగను అనుసరిస్తూ జీవించానని వాళ్ళకు తెలుసు. కావాలనుకొంటే వాళ్ళే యిది నిజమని సాక్ష్యం చెబుతారు. 6 దేవుడు మన పూర్వికులకు చేసిన వాగ్దానంలో నాకు నమ్మకం ఉంది. అందువల్లే నేను ఈ రోజు ఈ పరీక్షకు నిలబడవలసి వచ్చింది. 7 ఈ వాగ్దానం పూర్తి కావాలని మన పండ్రెండు గోత్రాలవాళ్ళు రాత్రింబగళ్ళు విశ్వాసంతో దేవుణ్ణి సేవిస్తూ ఎదురు చూస్తున్నారు. ఓ రాజా! ఈ ఆశ నాలో ఉండటం వల్లే యూదులు నన్ను నేరస్థునిగా పరిగణిస్తున్నారు. 8 దేవుడు చనిపోయినవాళ్ళను బ్రతికిస్తాడు. ఈ సత్యాన్ని మీరు ఎందుకు కాదంటున్నారు?
9 “ఒకప్పుడు నేను కూడా నజరేతు నివాసి యేసు నామము లేకుండా చెయ్యటం నా కర్తవ్యంగా భావించాను. 10 నేను యెరూషలేములో చేసింది అదే. ప్రధానయాజకులు యిచ్చిన అధికారంతో నేను చాలామంది పరిశుద్ధుల్ని కారాగారంలో వేసాను. వాళ్ళను చంపటానికి నేను అంగీకారం కూడా తెలిపాను. 11 ఎన్నోసార్లు నేను ఒక సమాజమందిరమునుండి మరొక సమాజమందిరానికి వెళ్ళి వాళ్ళను శిక్షించాను. వాళ్ళతో బలవంతంగా యేసును దూషింపచేసాను. పిచ్చి కోపంతో యితర పట్టణాలకు కూడా వెళ్ళి ఆ మార్గాన్ని అనుసరించే వాళ్ళను హింసించాను.
© 1997 Bible League International