Revised Common Lectionary (Semicontinuous)
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
యాజకుల నియామకం, వేడుక
29 “అహరోను, అతని కుమారులు యాజకులుగా ఒక ప్రత్యేక విధానంలో నన్ను సేవిస్తున్నారని తెలియజేసేందుకు నీవు చేయాల్సిన దానిని యిప్పుడు నీకు నేను చెబుతాను. ఒక గిత్తను, కళంకం లేని రెండు పొట్టేళ్లను సంపాదించు. 2 తర్వాత పులియజేసే పదార్థంలేని సన్నని గోధుమ పిండితో రొట్టె చేయాలి. ఒలీవ నూనెతో కలిపి చేసే రొట్టెలకు గూడ అవే వస్తువులు ఉపయోగించాలి. నూనెతో కలిపి చిన్న చిన్న పల్చటి అప్పడాలు చేయాలి. 3 ఈ రొట్టెలు, అప్పడాలు ఒక బుట్టలో పెట్టాలి. ఆ బుట్టను అహరోనుకు, అతని కుమారులకు ఇవ్వాలి. అదే సమయంలో గిత్తను రెండు పొట్టేళ్లను కూడ వారికి ఇవ్వాలి.
4 “తర్వాత అహరోనును అతని కుమారులను సన్నిధి గుడారం ముందటి ద్వారం దగ్గరకు తీసుకు రావాలి. నీళ్లతో వాళ్లకు స్నానం చేయించాలి. 5 అహరోనుకు అతని చొక్కా తొడిగించాలి. ప్రత్యేక ఏఫోదుతో వుండే అంగీని అతనికి ధరింపజేయాలి. అప్పుడు ఏఫోదును, న్యాయతీర్పు పైవస్త్రాన్ని అతనికి కట్టాలి. అందమైన దట్టీని అతనికి కట్టాలి. 6 తర్వాత అతని తలమీద తలపాగ చుట్టాలి. ప్రత్యేక కిరీటాన్ని బంగారు బద్ద తలపాగా చుట్టూరా ఉంచాలి. 7 అభిషేక తైలము తీసుకొని అతని తలమీద పోయాలి. అహరోను ఈ పనికి ఏర్పరచబడ్డాడని ఇది సూచిస్తుంది.
8 “తర్వాత అతని కుమారులను అక్కడికి తీసుకురావాలి. వారికి తెల్ల అంగీలు ధరింపజేయాలి. 9 అప్పుడు వారి నడుములకు దట్టీలు చుట్టాలి. ధరించేందుకు ప్రత్యేక టోపీలను వారికి ఇవ్వాలి. వారు యాజకులుగా ఉండడం అప్పుడు ప్రారంభం అవుతుంది. శాశ్వతంగా కొనసాగే ప్రత్యేక చట్టంవల్ల వారు యాజకులుగా ఉంటారు. ఈ విధంగా అహరోనును, అతని కుమారులను నీవు యాజకులుగా చేయాలి.
పౌలు తన మార్పునుగూర్చి చెప్పటం
6 “నేను డెమాస్కసుకు వెళ్తూ, ఆ పట్టణపు పొలిమేరలకు చేరగానే అకస్మాత్తుగా ఆకాశంనుండి తేజోవంతమైన వెలుగు నా చుట్టూ ప్రకాశించింది. అప్పుడు మధ్యాహ్నం సుమారు పన్నెండు గంటలు. 7 నేను నేలకూలిపొయ్యాను. నాతో ఒక స్వరం, ‘సౌలా! సౌలా! నన్నెందుకు హింసిస్తున్నావు!’ అని అడిగింది.
8 “‘మీరెవరు ప్రభూ!’ అని నేనడిగాను. ‘నేను నజరేతుకు చెందిన యేసును. నీవు హింసిస్తున్నది నన్నే!’ అని ఆ స్వరం జవాబు చెప్పింది. 9 నాతో ఉన్నవాళ్ళు ఆ వెలుగును చూసారు. కాని ఆ స్వరం ఏం మాట్లాడుతోందో వాళ్ళకు అర్థం కాలేదు.
10 “‘నన్నేం చేయమంటారు ప్రభూ!’ అని నేనడిగాను. ‘లేచి డెమాస్కసుకు వెళ్ళు. అక్కడికి వెళ్ళాక నీవు చేయవలసిన పనులు చెప్పబడతాయి’ అని ప్రభువు అన్నాడు. 11 ఆ వెలుగు నన్ను గ్రుడ్డివానిగా చెయ్యటం వల్ల నాతో ఉన్నవాళ్ళు నన్ను నా చేయి పట్టుకొని డెమాస్కసుకు నడిపించుకు వెళ్ళారు.
12 “అననీయ అనే పేరుగల వ్యక్తి నన్ను చూడటానికి వచ్చాడు. అతడు మోషే ధర్మశాస్త్రాన్ని శ్రద్ధతో పాటించే విశ్వాసి. అక్కడ నివసిస్తున్న యూదులందరు అతణ్ణి గౌరవించేవాళ్ళు. అననీయ నా ప్రక్కన నిల్చొని 13 ‘సౌలా! నా సోదరా! నీకు దృష్టి కలుగుగాక!’ అని అన్నాడు. తక్షణం నేను చూడగలిగాను.
14 “ఆ తదుపరి అతడు, ‘మన పూర్వికులు పూజించిన దేవుడు, తాను చేయదలచిన విషయం తెలుపటానికి, నీతిమంతుడైనటువంటి తన సేవకుణ్ణి చూడటానికి, ఆయన నోటిమాటలు వినటానికి నిన్ను ఎన్నుకొన్నాడు. 15 నీవు చూసినవాటిని గురించి, విన్నవాటిని గురించి ఆయన పక్షాన అందరి ముందు సాక్ష్యం చెబుతావు. 16 ఇంకా ఎందుకు చూస్తున్నావు? లే! బాప్తిస్మము పొందు. ఆయన పేరున ప్రార్థించి నీ పాపాలు కడుక్కో!’ అని అన్నాడు.
17 “నేను యెరూషలేమునకు తిరిగి వచ్చి మందిరంలో ప్రార్థనలు చేస్తుండగా నాకు దర్శనం కలిగింది. 18 ఆ దర్శనంలో ప్రభువు, ‘త్వరగా లే! వెంటనే యెరూషలేము వదిలి వెళ్ళిపో! నా గురించి నీవు చెప్పే సత్యాన్ని వాళ్ళు అంగీకరించరు’ అని అనటం విన్నాను.
19 “నేను, ‘ప్రభూ! నేను యూదుల ప్రతి సమాజమందిరంలోకి వెళ్ళి భక్తుల్ని బంధించి శిక్షించిన విషయం అందరికీ తెలుసు. 20 నీ సాక్షి స్తెఫను తన రక్తాన్ని చిందించినప్పుడు నేను నా అంగీకారం చూపుతూ, అతణ్ణి చంపుతున్నవాళ్ళ దుస్తుల్ని కాపలా కాస్తూ అక్కడే నిలుచొని ఉన్నాను’ అని అన్నాను.
21 “అప్పుడు ప్రభువు నాతో, ‘వెళ్ళు! నిన్ను దూరంగా యూదులు కానివాళ్ళ దగ్గరకు పంపుతాను’ అని అన్నాడు.”
© 1997 Bible League International