Revised Common Lectionary (Semicontinuous)
135 యెహోవాను స్తుతించండి.
యెహోవా సేవకులారా, యెహోవా నామాన్ని స్తుతించండి.
2 యెహోవా ఆలయంలో నిలిచి ఉండే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
ఆలయ ప్రాంగణంలో నిలబడే ప్రజలారా, ఆయన నామాన్ని స్తుతించండి!
3 యెహోవా మంచివాడు గనుక ఆయనను స్తుతించండి.
యెహోవాను స్తుతించుట ఆనందదాయకం గనుక ఆయన నామాన్ని స్తుతించండి.
4 యెహోవా యాకోబును కోరుతున్నాడు.
యెహోవా ఇశ్రాయేలును తన విశేషమైన సొత్తుగా ఎన్నుకొన్నాడు.
5 యెహోవా గొప్పవాడని నాకు తెలుసు.
మన ప్రభువు ఇతర దేవుళ్లందరికంటె గొప్పవాడు!
6 ఆకాశంలో, భూమి మీద, సముద్రాల్లో,
అగాధపు మహా సముద్రాల్లో యెహోవా ఏది చేయాలనుకొంటే అది చేస్తాడు.
7 భూమికి పైగా మేఘాలను దేవుడు చేస్తాడు.
మెరుపులను, వర్షాన్ని దేవుడు చేస్తాడు.
దేవుడు గాలిని తన నిధిలోనుండి రప్పిస్తాడు.
8 ఈజిప్టు మనుష్యులలో జ్యేష్ఠులందరినీ, జంతువులలో మొదట పుట్టినవాటన్నిటినీ దేవుడు నాశనం చేసాడు.
9 దేవుడు ఈజిప్టులో అనేకమైన ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు చేసాడు.
ఫరోకు, అతని అధికారులకు ఆ సంగతులు సంభవించేలా దేవుడు చేశాడు.
10 దేవుడు అనేక రాజ్యాలను ఓడించాడు.
బలమైన రాజులను దేవుడు చంపేసాడు.
11 అమోరీయుల రాజైన సీహోనును దేవుడు ఓడించాడు.
బాషాను రాజైన ఓగును దేవుడు ఓడించాడు.
కనానులోని జనాంగాలన్నింటినీ దేవుడు ఓడించాడు.
12 వారి దేశాన్ని దేవుడు ఇశ్రాయేలీయులకు ఇచ్చాడు.
దేవుడు ఆ దేశాన్ని తన ప్రజలకు ఇచ్చాడు.
13 యెహోవా, నీ పేరు శాశ్వతంగా ఖ్యాతి కలిగియుంటుంది.
యెహోవా, ప్రజలు నిన్ను ఎప్పటికీ జ్ఞాపకం చేసుకొంటారు.
14 యెహోవా జనాంగాల్ని శిక్షించాడు.
కాని తన సేవకుల యెడల దయ చూపించాడు.
15 ఇతర మనుష్యుల దేవుళ్లు కేవలం వెండి, బంగారు విగ్రహాలే.
వారి దేవుళ్లు కేవలం మనుష్యులు చేసిన విగ్రహాలే.
16 ఆ విగ్రహాలకు నోళ్లు ఉన్నాయి. కాని అవి మాట్లాడలేవు.
కళ్లు వున్నాయి కాని అవి చూడలేవు.
17 ఆ విగ్రహాలకు చెవులు ఉన్నాయి కాని అవి వినలేవు.
ముక్కులు ఉన్నాయి కాని అవి వాసన చూడలేవు.
18 మరియు ఆ విగ్రహాలను తయారు చేసిన మనుష్యులు సరిగ్గా ఆ విగ్రహాల్లాగానే అవుతారు.
ఎందుకంటే వారికి సహాయం చేయాలని వారు ఆ విగ్రహాల మీదనే నమ్మకముంచారు.
19 ఇశ్రాయేలు వంశమా, యెహోవాను స్తుతించు!
అహరోను వంశమా, యెహోవాను స్తుతించు.
20 లేవీ వంశమా, యెహోవాను స్తుతించు!
యెహోవాను ఆరాధించే ప్రజలారా, యెహోవాను స్తుతించండి.
21 సీయోనులో నుండి, తన నివాసమైన యెరూషలేములో నుండి,
యెహోవా స్తుతించబడును గాక!
యెహోవాను స్తుతించండి!
విగ్రహారాధనకు విరోధంగా హెచ్చరికలు
14 ఇశ్రాయేలు పెద్దలలో కొంతమంది నా వద్దకు వచ్చారు. వారు నాతో మాట్లాడాలని నావద్ద కూర్చున్నారు. 2 ఆ సమయంలో యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఈ విధంగా చెప్పాడు. 3 “నరపుత్రుడా, ఈ మనుష్యులు నీతో మాట్లాడాలని వచ్చారు. వారు నా సలహా కోరమని నిన్ను అడగటానికి వచ్చారు. కాని ఈ మనుష్యులు ఇంకా హేయమైన విగ్రహాలను కలిగివున్నారు. వారు పాపం చేయటానికి కారణమైన వస్తువులను వారింకా విడనాడలేదు. ఆ విగ్రహాలను వారింకా పూజిస్తూనే వున్నారు. అందువల్ల వారు నా సలహా కొరకు రావలసిన అవసరం ఏముంది? వారి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాలా? అవసరం లేదు! 4 అయినా నేను వారికి ఒక సమాధానం ఇస్తాను. ఆది నేను వారిని శిక్షించటం! ఈ విషయాలు నీవు వారికి చెప్పాలి, ‘నా ప్రభువైన యెహోవా ఇలా అంటున్నాడు: ఇశ్రాయేలుకు చెందిన వాడెవడైనా ఒక ప్రవక్త వద్దకు వచ్చి నా సలహా కోరితే, ఆ ప్రవక్త వానికి సమాధానం చెప్పడు. నాకై నేనే ఆ వ్యక్తి ప్రశ్నకు సమాధానమిస్తాను. ఆ వ్యక్తి తన హేయమైన విగ్రహాలను కలిగివున్నా, తన పాపాలకు కారణమైన వస్తువులను దాచివుంచినా, అతడా విగ్రహారాధన చేసినా, నేనతనికి సమాధానమిస్తాను. వానివద్ద అపవిత్ర విగ్రహాలున్నా నేనతనితో మాట్లాడతాను. 5 ఎందుకనగా నేను వారి హృదయాలను తాకకోరుచున్నాను. వారి నీచమైన విగ్రహాల కొరకు వారు నన్ను విడిచిపెట్టినా, నేను వారిని ప్రేమిస్తున్నట్లు చూపదలిచాను.’
6 “కావున ఇశ్రాయేలు వంశం వారికి ఈ విషయాలు చెప్పు. వారితో ఇలా అనాలి, ‘నా ప్రభువైన యెహోవా ఏమి చెబుతున్నాడనగా: నా వద్దకు తిరిగి రండి. మీ అపవిత్ర విగ్రహాలను వదిలివేయండి. ఆ బూటకపు దేవుళ్ళ నుండి దూరంకండి. 7 ఏ ఇశ్రాయేలీయుడు గాని, ఇశ్రాయేలులో నివసించే పరదేశీయుడుగాని నా వద్దకు సలహా కోరివస్తే, వానికి నేను సమాధానమిస్తాను. అతను అపవిత్ర విగ్రహాలను కలిగియున్నా, తను పాపాలు చేయటానికి కారకమైన వస్తువులను అతను దాచుకున్నా, అతను విగ్రహాలను ఆరాధించినా, అతనికి నేను సమాధానమిస్తాను. నేను వారికిచ్చే సమాధాన మిది: 8 నేనా వ్యక్తికి వ్యతిరేకినవుతాను. నేను వానిని నాశనం చేస్తాను. ఇతర ప్రజలకు అతడొక ఉదాహరణగా మిగులుతాడు. ప్రజలతనిని చూసి నవ్వుతారు. నా ప్రజల మధ్యనుండి అతనిని తొలగిస్తాను. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకొంటారు! 9 ఏ ప్రవక్తయేగాని మూర్ఖంగా తన స్వంత సమాధానమిస్తే, అతడెంత మూర్ఖుడో నేనతనికి నిరూపిస్తాను! అతనికి వ్యతిరేకంగా నా శక్తిని వినియోగిస్తాను. అతనని నాశనం చేసి, నా ప్రజలైన ఇశ్రాయేలీయుల నుండి అతనిని తొలగిస్తాను. 10 కావున, సలహా కొరకు వచ్చిన వ్యక్తి, సమాధాన మిచ్చిన ప్రవక్త, ఇద్దరూ ఒకే శిక్షకు గురియవుతారు. 11 ఎందుకంటే, దానివల్ల ఆ ప్రవక్తలు నా ప్రజలను నాకు దూరం చేయకుండా ఆగిపోతారు. తద్వారా, నా ప్రజలు వారి పాపాలలో అపవిత్రము కాకుండా ఆగిపోతారు. అప్పుడు వారు నా ప్రత్యేక ప్రజలవుతారు. నేను వారి దేవుడనవుతాను.’” ఈ విషయాలన్నీ ప్రభువైన యెహోవా చెప్పాడు.
పేతురు కుంటివానిని నయం చెయ్యటం
3 ఒక రోజు పేతురు, యోహాను పగలు మూడు గంటలప్పుడు మందిరానికి వెళ్తున్నారు. అది ప్రార్థనా సమయం. 2 కొందరు ఒక పుట్టు కుంటివాణ్ణి ప్రతిరోజూ మోసుకొని వెళ్ళి ఒక ద్వారం ముందు దించేవాళ్ళు. దీన్నే సౌందర్య ద్వారం అనేవాళ్ళు. మందిరంలోకి ప్రవేశించేవాళ్ళనుండి ఆ కుంటివాడు భిక్షమెత్తుకొంటూ ఉండేవాడు. 3 ఈ కుంటివాడు పేతురు యోహానులు ఆలయంలోకి ప్రవేశించబోతుండగా చూసి వాళ్ళను భిక్షమడిగాడు.
4 పేతురు అతనివైపు ఏక దృష్టితో చూసాడు. యోహాను కూడా అలాగే చూసాడు. పేతురు ఆ కుంటివానితో, “మా వైపు చూడు!” అని అన్నాడు. 5 ఆ కుంటివాడు వాళ్ళేదైనా యిస్తారని వాళ్ళ వైపు చూసాడు. 6 అప్పుడు పేతురు, “నా దగ్గర వెండి, బంగారాలు లేవు కాని నా దగ్గరున్నదాన్ని నీకిస్తాను. నజరేతు నివాసి యేసు క్రీస్తు పేరిట నడువు!” అని అంటూ,
7 అతని కుడి చేయి పట్టుకొని లేపాడు. వెంటనే ఆ కుంటివాని చీలమండలకు, పాదాలకు బలం వచ్చింది. 8 అతడు గంతేసి నిలబడి నడవటం మొదలు పెట్టాడు. తదుపరి అతడు నడుస్తూ గంతులేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వాళ్ళతో సహా మందిరంలోకి ప్రవేశించాడు. 9 మందిరంలో ఉన్నవాళ్ళంతా అతడు నడవటం, దేవుణ్ణి స్తుతించటం చూసారు. 10 భిక్షమెత్తుకోవటానికి మందిరంలోని సౌందర్య ద్వారం ముందు కూర్చునేవాడు అతడేనని గుర్తించారు. జరిగింది చూసి వాళ్ళు భయపడి దిగ్భ్రాంతి చెందారు.
© 1997 Bible League International