Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 110

దావీదు స్తుతి కీర్తన.

110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
    అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.

నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
    వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
    నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
    రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]

యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
    యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
    నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”

నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
    ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.

దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
    చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!

మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
    శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
    ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.

నిర్గమకాండము 3:7-15

యెహోవా “ఈజిప్టులో నా ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు నేను చూశాను. ఈజిప్టు వాళ్లు నా ప్రజల్ని బాధపెట్టినప్పుడు వారు మొర పెట్టడం నేను విన్నాను. వారి బాధ నాకు తెలుసు ఈజిప్టు వాళ్ల బారినుండి నా ప్రజల్ని రక్షించేందుకు ఇక నేను దిగి వస్తాను. ఆ దేశం నుండి వాళ్లను బయటకు తెచ్చి, మరో మంచి దేశానికి నడిపిస్తాను. అక్కడ వాళ్లు ఏ కష్టాలూ లేకుండా స్వేచ్ఛగా ఉంటారు.[a] అది మంచి మంచి వాటితో నిండిన చాలా మంచి దేశం.[b] కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, యోబూసీయులు, రకరకాల మనుష్యులు అక్కడ నివసిస్తున్నారు. ఇశ్రాయేలీయుల మొరలు నేను విన్నాను. వాళ్ల జీవితాన్ని ఈజిప్టు వాళ్లు ఎంత కష్టతరం చేసారో నేను చూశాను. 10 అందుచేత నేను ఇప్పుడు ఫరో దగ్గరకు నిన్ను పంపిస్తున్నాను. వెళ్లు, నా ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈజిప్టు నుంచి బయటకు తీసుకువెళ్లు” అని చెప్పాడు.

11 అయితే మోషే, “నేనేమీ అంతగొప్ప వాణ్ణి కాదే. ఫరో దగ్గరకు వెళ్లేందుకుగాని, ఈజిప్టు నుండి ఇశ్రాయేలీయులను బయటకు నడిపించేందుకుగాని నేను ఎంతటివాణ్ణి?” అంటూ దేవుణ్ణి అడిగాడు.

12 “నేను నీకు తోడుగా ఉంటాను గనుక నీవు చేయగలవు. నేనే నిన్ను పంపిస్తున్నాను అనేందుకు రుజువు ఏమిటంటే, నీవు ఈ ప్రజల్ని ఈజిప్టు నుండి బయటికి నడిపించిన తర్వాత నీవు మళ్లీ వచ్చి ఈ కొండమీదనే నన్ను ఆరాధిస్తావు!” అని దేవుడు చెప్పాడు.

13 దానికి మోషే, “నేను ఇశ్రాయేలీయుల దగ్గరకు వెళ్లి ‘మీ పూర్వీకుల దేవుడు నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని చెబితే, ‘ఆ దేవుడి పేరేమిటి’ అని వాళ్లు నన్ను అడుగుతారు గదా! మరి నేనేమని చెప్పాలి,” అని దేవుణ్ణి అడిగాడు.

14 “‘నేను ఉన్నవాడను’[c] (అని వారితో చెప్పు) అన్నాడు దేవుడు మోషేతో. ఇశ్రాయేలీయుల దగ్గరకు నీవు వెళ్లినప్పుడు, ‘ఉన్నవాడను,’ అనువాడు నన్ను మీ దగ్గరకు పంపించాడు అని చెప్పు” అన్నాడు దేవుడు మోషేతో. 15 దేవుడు మోషేతో ఇలా చెప్పాడు: “మీ పూర్వీకులు, అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులకు ఎల్లప్పుడూ నా పేరు యెహోవాగానే[d] ఉంటుంది. తరతరాల ప్రజలు ఆ పేరుతోనే నన్ను తెలుసుకొంటారు. ‘యెహోవా నన్ను మీ దగ్గరకు పంపించాడు’ అని వాళ్లతో చెప్పు.

యోహాను 8:39-59

39 “అబ్రాహాము మా తండ్రి” అని వాళ్ళు సమాధానం చెప్పారు.

యేసు, “మీరు అబ్రాహాము సంతానమైతే అబ్రాహాము చేసినట్లు చేసేవాళ్ళు! 40 నేను చేసిందల్లా దేవుని నుండి విన్న సత్యాన్ని చెప్పటమే! దానికి మీరు నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నారు. అబ్రాహాము మీలా ప్రవర్తించలేదు. 41 మీరు మీ తండ్రి చేసినట్లు చేస్తున్నారు” అని అన్నాడు.

వాళ్ళు, “మేము అక్రమంగా పుట్టలేదు. మాకు దేవుడొక్కడే తండ్రి” అని అన్నారు.

42 యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “దేవుడు మీ తండ్రి అయినట్లయితే నేను దేవునినుండి వచ్చానని నమ్మేవాళ్ళు. కనుక మీరు నన్ను ప్రేమించే వాళ్ళు. స్వతహాగా నేను యిక్కడికి రాలేదు. దేవుడే నన్ను పంపాడు. 43 మీరు నా సందేశం అంగీకరించటం లేదు కనుక నేను చెప్పేది మీకు అర్థం కావటం లేదు. 44 మీరు సైతానుకు చెందిన వాళ్ళు. వాడే మీ తండ్రి. మీ తండ్రి కోరికల్ని తీర్చడమే మీ అభిలాష. వాడు మొదటి నుండి హంతకుడు. వాడు సత్యాన్ని అనుసరించడు. వాడిలో సత్యమనేది లేదు. అబద్ధమాడటం వాడి స్వభావము. కనుక వాడు అన్ని వేళలా అబద్ధమాడుతాడు. వాడు అబద్ధానికి తండ్రి.

45 “నేను నిజం చెప్పటంవల్ల మీరు నమ్మటంలేదు. 46 నేను పాపం చేశానని మీలో ఎవరైనా నిరూపించగలరా? నేను నిజం చెబుతున్నాను కదా! నన్నెందుకు విశ్వసించరు. 47 దేవుని సంతానం దేవుని మాట వింటుంది. మీరు దేవుని సంతానం కాదు కనుక నేను చెప్పింది వినటంలేదు.”

యేసు, అబ్రాహాము

48 “నీవు సమరయ దేశస్థుడవని, నీకు దయ్యం పట్టిందని మేమనటంలో నిజం లేదా?” అని వాళ్ళు ప్రశ్నించారు.

49 యేసు, “నాకు దయ్యం పట్టలేదు. నేను నా తండ్రిని గౌరవిస్తాను. మీరు నన్ను అగౌరవ పరుస్తున్నారు. 50 నేను నా కీర్తిని కోరటం లేదు. కాని నా కీర్తి కోరేవాడొకాయన ఉన్నాడు. ఆయనే న్యాయాధిపతి. 51 ఇది నిజం. నా బోధ అనుసరించిన వాడు ఎన్నటికీ చావుచూడడు” అని అన్నాడు.

52 ఇది విని యూదులు బిగ్గరగా, “నీకు దయ్యం పట్టిందని మాకిప్పుడు తెలిసింది! అబ్రాహాము చనిపోయాడు. అలాగే ప్రవక్తలు చనిపోయారు. అయినా నీ బోధన అనుసరించిన వాడు చనిపోడని అంటున్నావు. 53 నీవు మా తండ్రి అబ్రాహాము కన్నాగొప్ప వాడవా? అతడు చనిపొయ్యాడు. ప్రవక్తలు కూడా చనిపొయ్యారు. నీ మనస్సులో నీవెవరవనుకుంటున్నావు?” అని అన్నారు.

54 యేసు, “నన్ను నేను పొగుడుకుంటే ఆ పొగడ్తకు అర్థం లేదు. నన్ను పొగిడేవాడు నా తండ్రి. ఆయన మీ దేవుడని మీరే అంటున్నారు. 55 ఆయన మీకు తెలియదు. కాని నాకాయన తెలుసు. ఆయన నాకు తెలియదని అంటే, నేను మీలాగే అబద్ధాలాడినట్లవుతుంది. కాని ఆయన నాకు తెలుసు. ఆయన మాట నేను పాటిస్తాను. 56 మీ తండ్రి అబ్రాహాము నా కాలాన్ని చూడగలనని గ్రహించిన వెంటనే ఆనందపడ్డాడు. అతడు చూశాడు: ఆనంద పడ్డాడు” అని అన్నాడు.

57 ఆ కారణంగా యూదులు, “నీకింకా యాభై ఏళ్ళైనా నిండలేదు. నీవు అబ్రాహామును చూసావా?” అని అన్నారు.

58 యేసు, “ఇది నిజం. అబ్రాహాము పుట్టక ముందే నేను ఉన్నాను” అని అన్నాడు. 59 ఇది విని వాళ్ళు ఆయన్ని కొట్టాలని రాళ్ళు ఎత్తి పట్టుకున్నారు. కాని యేసు వాళ్ళకు కనిపించకుండా దాక్కొని ఆ గుంపు నుండి వెళ్ళి పోయాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International