Revised Common Lectionary (Semicontinuous)
దావీదు స్తుతి కీర్తన.
110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]
4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”
5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.
6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!
7 మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
మోషే తనవారికి సహాయం చేయుట
11 మోషే పెరిగి పెద్దవాడయ్యాడు. తన ప్రజలు అంటే, హీబ్రూవారు బలవంతంగా చాలా కష్టపడి పని చేయాల్సి ఉన్నట్టు మోషే గ్రహించాడు. ఒకరోజు ఈజిప్టు వాడొకడు హీబ్రూవాడ్ని కొట్టడం మోషే చూసాడు. 12 ఎవరైనా గమనిస్తున్నారేమోనని మోషే అటు ఇటు చూసాడు. తర్వాత మోషే ఆ ఈజిప్టువాడ్ని చంపేసి ఇసుకలో పాతిపెట్టాడు.
13 మర్నాడు హీబ్రూవాళ్లే ఇద్దరు పోట్లాడుకోవడం మోషే చూసాడు. వారిలో ఒకడిది తప్పని తెలుసుకొని “అతనితో ఎందుకిలా మీవాడ్ని కొడుతున్నావు?” అని అన్నాడు.
14 దానికి అతను జవాబిస్తూ, “మామీద నీవు అధికారివనిగాని, న్యాయమూర్తివనిగాని ఎవరయినా నియమించారా? నిన్న నీవు ఆ ఈజిప్టువాడ్ని చంపినట్టు నన్నూ చంపుతావా?” అన్నాడు. అప్పుడు మోషే భయపడిపోయాడు.
“అలాగైతే నేను చేసిన ఆ పని ఇప్పుడు అందరికీ తెలిసిపోయిందని” మోషే తనలో తాను అనుకొన్నాడు.
15 మోషే చేసినదాన్ని గూర్చి విని ఫరో మోషేను చంపెయ్యాలనే నిర్ణయానికొచ్చాడు! కానీ ఫరో దగ్గర్నుండి మోషే పారిపోయాడు.
మిద్యానులో మోషే
మోషే మిద్యాను దేశానికి పారిపోయి అక్కడ ఒక బావివద్ద ఆగిపోయాడు. 16 మిద్యానులో ఒక యాజకునికి ఏడుగురు కుమార్తెలు. ఒకరోజు వారు తమ తండ్రిగారి గొర్రెలకు నీళ్లు తీసుకొని రావడానికి ఆ బావి దగ్గరకు వెళ్లారు. వారు ఆ నీళ్ల కుండలను నింపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. 17 కాని అక్కడ ఉన్న కొందరు గొర్రెల కాపరులు ఆ అమ్మాయిలను నీళ్లు చేదుకోనివ్వకుండా వెళ్లగొట్టేస్తున్నారు. కనుక ఆ అమ్మాయిలకు మోషే సహాయం చేసి, వారి గొర్రెల మందకు నీళ్లు పెట్టాడు.
18 తర్వాత వాళ్లు వారి తండ్రి రగూయేలు దగ్గరకు వెళ్లిపోయారు. “ఆయన వారితో ఈ రోజు మీరు చాలా త్వరగా ఇంటికి వచ్చేశారు” అని అన్నాడు.
19 “గొర్రెల కాపరులు కొందరు మమ్మల్ని వెళ్లగొట్టడానికి ప్రయత్నం చేసారు. అయితే ఈజిప్టు మనిషి ఒకతను మాకు సహాయం చేసాడు. అతడే మాకోసం నీళ్లు చేది, మా మందలకు పెట్టాడు” అంటూ జవాబు చెప్పారు ఆ అమ్మాయిలు.
20 అందుకు రగూయేలు “అలాగైతే అతనేడి? అతణ్ణి ఎందుకలా విడిచిపెట్టారు? మీరు అతణ్ణి మనతో భోజనం చేయమని పిలవండి” అన్నాడు తన కూతుళ్లతో.
21 అతనితో కలిసి ఉండటానికి మోషే అంగీకరించాడు. అతను సిప్పోర అనే తన కూతుర్ని మోషేకు భార్యగా ఇచ్చాడు. 22 సిప్పోరాకు కొడుకు పుట్టాడు. అతనికి గెర్షోము[a] అని మోషే పేరు పెట్టాడు. మోషే తనది కాని మరో పరాయి దేశంలో ఉండడం చేత తన కొడుక్కు ఈ పేరు పెట్టాడు.
ఇశ్రాయేలీయులకు సహాయం చేయుటకు దేవుడు నిశ్చయించుకొనుట
23 చాలాకాలం గడచిపోయింది. ఈజిప్టురాజు చనిపోయాడు. అప్పటికి ఇశ్రాయేలు వాళ్లు ఇంకా కష్టతరమైన పనులు చేసేందుకు బలవంత పెట్టబడుతూనే ఉన్నారు. వాళ్లు సహాయం కోసం మొరపెడుతూ ఉన్నారు. దేవుడు వారి మొర విన్నాడు. 24 దేవుడు వారి ప్రార్థనలు విని, అబ్రాహాం, ఇస్సాకు, యాకోబులతో తాను చేసుకొన్న ఒడంబడికను జ్ఞాపకం చేసుకొన్నాడు. 25 ఇశ్రాయేలీయుల కష్టాలను దేవుడు చూచాడు. త్వరలోనే వారి కష్టాలను కడతేర్చాలని ఆయనకు తెలుసు.
27 మోషే దేవుణ్ణి విశ్వసించాడు కనుక, అతడు రాజు యొక్క ఆగ్రహానికి భయపడకుండా ఈజిప్టు దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. అదృశ్యంగా ఉన్నవాణ్ణి చూసినట్లు అతడు భావించటంవల్ల అతని పట్టుదల పెరిగింది. 28 అతడు దేవుణ్ణి విశ్వసించటం మూలంగానే పస్కా పండుగను, రక్తాన్ని ద్వారాలపై ప్రోక్షించాలనే ఆచారాన్ని నియమించాడు. మృత్యు దూత ఇశ్రాయేలు ప్రజల మొదటి సంతానాన్ని తాకరాదని ఈ ఆచారం నియమించాడు.
© 1997 Bible League International