Revised Common Lectionary (Semicontinuous)
దావీదు స్తుతి కీర్తన.
110 “నీ శత్రువులను నీ పాదాల కింద పీఠంగా నేను ఉంచేవరకు ఇక్కడ నా కుడి పక్కన కూర్చో.”
అని నా ప్రభువుతో యెహోవా చెప్పాడు.
2 నీ రాజ్యం విస్తరించేలా యెహోవా సహాయం చేస్తాడు. నీ రాజ్యం సీయోను వద్ద మొదలై నీవు నీ శత్రువులను
వారి స్వంత దేశాలలో పాలించునంత వరకు అది విస్తరిస్తుంది.
3 నీవు రాజువైన రోజుననే నీ ప్రజలు నీతో కలుస్తారు.
నీవు పుట్టినప్పటినుండి పవిత్రమైన అందం నీకు ఉంది.
ఇప్పుడు నీ బాల్యం నుండి నీకు ఉన్న ఆ ఆశీర్వాదం
రాజుగా నీ కొత్త జీవితంలోనికి వస్తుంది.[a]
4 యెహోవా ఒక వాగ్దానం చేసాడు.
యెహోవా తన మనస్సు మార్చుకోడు.
“నీవు నిత్యము యాజకుడివే గాని అహరోను కుటుంబ వర్గం నుండి కాదు.
నీది వేరైన యాజకత్వం. అది మెల్కీసెదెక్ వర్గానికి చెందిన యాజకునిలా ఉన్నట్లు ఉంది.”
5 నా ప్రభువు నీ కుడి పక్కన వున్నాడు.
ఆయన కోపముతో రాజులను చితకగొడతాడు.
6 దేవుడు రాజ్యాలకు తీర్పు తీర్చాడు.
చచ్చిన వారి శవాలతో నేలనిండి పోతుంది!
7 మార్గంలోని సెలయేటినుండి[b] రాజు మంచినీరు తాగుతాడు.
శక్తివంతమైన రాజ్యాల నాయకులను దేవుడు శిక్షిస్తాడు.
ఆయన నిజంగా తన తల ఎత్తుతాడు, చాలా శక్తివంతంగా ఉంటాడు.
జ్ఞానపు దీవెన
3 నా కుమారుడా, నా ఉపదేశాన్ని మరచిపోకు. నీవు చేయాలని నేను చెప్పిన సంగతులు జ్ఞాపకం ఉంచుకో. 2 నీకు నేను నేర్పిస్తున్న ఈ సంగతులు నీకు సుదీర్గమైన సంతోష జీవితాన్ని ఇస్తాయి.
3 ప్రేమించటం ఎన్నటికీ చాలించకు. ఎల్లప్పుడూ నమ్మకంగా ఉండు. ఈ విషయాలను నీ జీవితంలో ఒక భాగంగా ఎంచుకో. వాటిని నీ మెడ చుట్టూ కట్టుకో. వాటిని నీ హృదయం మీద వ్రాసుకో. 4 అప్పుడు దేవుని దృష్టియందును, మానవుల దృష్టియందును నీవు దయనొంది మంచివాడవనిపించుకొందువు.
5 పూర్తిగా యెహోవాను నమ్ముకో! నీ స్వంత తెలివి మీద ఆధారపడవద్దు. 6 నీవు చేసే వాటన్నిటిలో దేవుని మీద నమ్మకం ఉంచు. అప్పుడు ఆయన నీకు సహాయం చేస్తాడు. 7 నీ స్వంత జ్ఞానం మీద ఆధార పడవద్దు. కాని యెహోవాను గౌరవించి, దుర్మార్గానికి దూరంగా ఉండు. 8 నీవు ఇలా చేస్తే, అప్పుడు నీ శరీరానికి మంచి ఆరోగ్యమునూ నీ ఎముకలకు సత్తువా కలుగుతుంది.
9 నీ ఆరోగ్యంతో యెహోవాను ఘనపరచు. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలము ఆయనకు ఇమ్ము. 10 అప్పుడు నీకు కావలసినవి అన్నీ నీకు ఉంటాయి. నీ కొట్టాలు ధాన్యంతో నిండి ఉంటాయి, నీ పీపాల్లో ద్రాక్షారసం పొర్లుతూ ఉంటుంది.
11 నా కుమారుడా, నీవు తప్పు చేస్తున్నావని కొన్ని సార్లు యెహోవా నీకు చూపిస్తాడు. కాని ఈ శిక్షను గూర్చి కోపించకు. దాని నుండి నేర్చు కొనేందుకు ప్రయత్నించు. 12 ఎందుకంటే, యెహోవా తాను ప్రేమించే మనుష్యులను ఆయన సరిచేస్తాడు. అవును, తాను ప్రేమించే కుమారుని శిక్షించే ఒక తండ్రిలాంటివాడు దేవుడు.
నీవు న్యాయాధిపతివి కావు
11 సోదరులారా! పరస్పరం దూషించుకోకండి. తన సోదరుల్ని దూషించినవాడు, లేక సోదరునిపై తీర్పు చెప్పినవాడు, ధర్మశాస్త్రాన్ని దూషించినవానిగా పరిగణింపబడతాడు. మీరు అలా చేస్తే ధర్మశాస్త్రాన్ని ఆచరించటానికి మారుగా, న్యాయాధిపతివలె ఆ ధర్మశాస్త్రంపై తీర్పు చెపుతున్నారన్నమాట. 12 ధర్మశాస్త్రాన్నిచ్చిన వాడును, న్యాయాధిపతియు ఆయనే. రక్షించగలవాడు, నాశనం చెయ్యగలవాడు ఆయనే. మరి యితర్లపై తీర్పు చెప్పటానికి నీవెవరు?
ప్రగల్భాలు చెప్పుకోకండి
13 వినండి! “ఈ రోజో లేక రేపో మేము ఈ పట్టణానికో లేక ఆ పట్టణానికో వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం గడిపి వ్యాపారం చేసి డబ్బు గడిస్తాము” అని మీరంటూ ఉంటారు. 14 అంతెందుకు, రేపేమి జరుగబోతుందో మీకు తెలియదు. మీరు కొంతసేపు కనిపించి ఆ తర్వాత మాయమైపోయే పొగమంచు లాంటి వాళ్ళు. 15 మీరు దానికి మారుగా, “ప్రభువు అనుగ్రహిస్తే మేము జీవించి యిదీ అదీ చేస్తాము” అని అనాలి. 16 మీరు గర్వంగా ప్రగల్భాలు పలుకుతూ ఉంటారు. అలా ప్రగల్భాలు పలకటం తప్పు. 17 అందువల్ల మంచి చెయ్యటానికి నేర్చుకొన్నవాడు మంచి పనినే చెయ్యాలి. అలా చెయ్యకపోవటం పాపం అవుతుంది.
© 1997 Bible League International