Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 69:1-3

సంగీత నాయకునికి: “పుష్పాల రాగం.” దావీదు కీర్తన.

69 దేవా, నా కష్టాలన్నిటినుండి నన్ను రక్షించుము.
    నా నోటి వరకు నీళ్లు లేచాయి.
నిలబడి ఉండుటకు ఏదీ లేదు.
    నేను మునిగిపోతున్నాను. క్రింద బురదలోకి దిగజారిపోతున్నాను.
లోతైనజలాల్లో నేనున్నాను.
    అలలు నా చుట్టూ కొట్టుకొంటున్నాయి. నేను మునిగిపోబోతున్నాను.
సహాయం కోసం పిలిచి పిలిచి నేను బలహీనుడనౌతున్నాను.
    నా గొంతు నొప్పిగా ఉంది.
నా కళ్లకు నొప్పి కలిగినంతవరకు
    నేను నీ సహాయం కోసం కనిపెట్టి చూశాను.

కీర్తనలు. 69:13-16

13 నా మట్టుకైతే యెహోవా, ఇదే నీకు నా ప్రార్థన.
    నీవు నన్ను స్వీకరించాలని కోరుతున్నాను.
దేవా, ప్రేమతో నీవు నాకు జవాబు ఇవ్వాలని కోరుతున్నాను.
14 బురదలో నుండి నన్ను పైకి లాగుము.
    బురదలోకి నన్ను మునిగిపోనియ్యకు.
నన్ను ద్వేషించే మనుష్యుల నుండి నన్ను రక్షించుము.
    లోతైన ఈ జలాల నుండి నన్ను రక్షించుము.
15 అలలు నన్ను ముంచివేయనీయకుము.
    లోతైన అగాధం నన్ను మ్రింగివేయనీయకుము.
    సమాధి తన నోరును నా మీద మూసికొననీయకుము
16 యెహోవా, నీ ప్రేమ మంచిది. నీ ప్రేమ అంతటితో నాకు జవాబు ఇమ్ము.
    నీ పూర్ణ దయతో నాకు సహాయం చేయుటకు మళ్లుకొనుము.

కీర్తనలు. 69:30-36

30 దేవుని నామమును కీర్తనతో నేను స్తుతిస్తాను.
    కృతజ్ఞతా గీతంతో నేను ఆయన్ని స్తుతిస్తాను.
31 ఆబోతును వధించుట, జంతువునంతటిని బలి అర్పించుటకంటె ఇది ఉత్తమము.
    ఇది దేవుణ్ణి సంతోషింపజేస్తుంది.
32 పేద ప్రజలారా, మీరు దేవుని ఆరాధించుటకు వచ్చారు.
    పేద ప్రజలారా, ఈ సంగతులను తెలుసుకొనేందుకు మీరు సంతోషిస్తారు.
33 నిరుపేదల, నిస్సహాయ ప్రజల ప్రార్థన యెహోవా ఆలకిస్తాడు.
    యెహోవా కారాగారంలో ఉన్న తన వారిని విసర్జించడు.
34 ఆకాశమా, భూమీ, సముద్రమా,
    దానిలోని సమస్తమా, యెహోవాను స్తుతించండి.
35 యెహోవా సీయోనును రక్షిస్తాడు.
    యూదా పట్టణాలను యెహోవా తిరిగి నిర్మిస్తాడు.
ఆ భూమి స్వంతదారులు మరల అక్కడ నివసిస్తారు.
36     ఆయన సేవకుల సంతతివారు ఆ దేశాన్ని పొందుతారు.
    ఆయన నామాన్ని ప్రేమించే ప్రజలు అక్కడ నివసిస్తారు.

ఆదికాండము 4:17-5:5

17 కయీను తన భార్యతో కలిసినప్పుడు ఆమె గర్భవతియై హనోకు అనే కుమారుని కన్నది. కయీను ఒక పట్టణం కట్టించి తన కుమారుడైన హనోకు పేరు దానికి పెట్టాడు.

18 హనోకుకు ఈరాదు అనే కుమారుడు పుట్టాడు. ఈరాదుకు మహూయాయేలు అనే కుమారుడు పుట్టాడు. మహూయాయేలుకు మతూషాయేలు అనే కుమారుడు పుట్టాడు. మతూషాయేలుకు లెమెకు అనే కుమారుడు పుట్టాడు.

19 లెమెకు ఇద్దరు స్త్రీలను వివాహం చేసుకొన్నాడు. ఒక భార్య పేరు ఆదా, మరొక భార్య పేరు సిల్లా. 20 ఆదా యాబాలుకు జన్మనిచ్చింది. గుడారములలో నివసిస్తూ, పశువులను పెంచుట ద్వారా జీవనోపాధి సంపాదించుకొనే ప్రజలందరికి యాబాలు తండ్రి. 21 ఆదాకు యూబాలు అనే మరో కుమారుడు ఉన్నాడు. (యూబాలు యాబాలు సోదరుడు.) సితారాను, పిల్లన గ్రోవిని ఊదేవారందరికిని యూబాలు తండ్రి. 22 సిల్లా తూబల్కయీనుకు జన్మనిచ్చింది. ఇత్తడి, యినుము పనులు చేసే వాళ్లందరికీ తూబల్కయీను తండ్రి. తూబల్కయీను సోదరికి నయమా అని పేరు పెట్టబడింది.

23 లెమెకు తన భార్యలతో ఇలా అన్నాడు:

“ఆదా, సిల్లా, నా మాట వినండి!
    లెమెకు భార్యలారా, నేను చెప్పే సంగతులను వినండి:
ఒకడు నన్ను గాయపర్చాడు కనుక నేను వాడ్ని చంపేశాను.
    ఒక పిల్లవాడు నన్ను కొట్టగా నేనతనిని చంపేశాను.
24 కయీనును చంపినందుకు శిక్ష చాలా అధికం!
    కనుక నన్ను చంపినందుకు శిక్ష మరి ఎంతో అధికంగా ఉంటుంది.”

ఆదాము హవ్వలకు షేతు పుట్టుట

25 ఆదాము హవ్వతో కలిసినప్పుడు హవ్వ మరో కుమారుణ్ణి కన్నది. ఈ కుమారునికి షేతు అని పేరు పెట్టారు. నాకు ఇంకో కుమారుణ్ణి దేవుడు ఇచ్చాడు. కయీను హేబెలును చంపాడు, అయితే ఇప్పుడు నాకు షేతు ఉన్నాడు అంది హవ్వ. 26 షేతుకు కూడ ఒక కుమారుడు పుట్టాడు. అతనికి ఎనోషు అని అతడు పేరు పెట్టాడు. ఆ సమయంలో ప్రజలు యెహోవాను ప్రార్థించటం మొదలుబెట్టారు.

ఆదాము కుటుంబ చరిత్ర

ఆదాము[a] వంశాన్ని గూర్చిన గ్రంథం ఇది. దేవుడు తన పోలికలో మనిషిని (ఆదామును) చేశాడు. ఒక పురుషుణ్ణి, మరో స్త్రీని దేవుడు చేశాడు. వాళ్లిద్దర్నీ చేసిన రోజున ఆయన వాళ్లను ఆశీర్వదించి, అప్పుడు వాళ్లకు మనుష్యులు అని పేరు పెట్టాడు.

ఆదాముకు 130 సంవత్సరముల వయస్సు వచ్చాక ఇంకో కుమారునికి తండ్రి అయ్యాడు. ఈ కుమారుడు అచ్చం ఆదాములాగే ఉన్నాడు. ఆదాము తన కుమారునికి షేతు అని పేరు పెట్టాడు. షేతు పుట్టిన తర్వాత ఆదాము 800 సంవత్సరములు బ్రతికాడు. ఆ కాలంలో ఆదాముకు ఇంకా కుమారులు, కుమార్తెలు పుట్టారు. కనుక ఆదాము మొత్తం 930 సంవత్సరములు జీవించాడు. అప్పుడు అతడు మరణించాడు.

రోమీయులకు 3:9-22

నీతిమంతుడొక్కడూ లేడు

మరి ఇంతకూ ఏమని నిర్ణయం చేద్దాం? మనం వాళ్ళకంటే ఉత్తమమైనవాళ్ళమనా? ఎన్నటికి కాదు. యూదులు, యూదులుకానివాళ్ళు, అందరూ సమానంగా పాపం చేసారు. దీన్ని నేనిదివరకే రుజువు చేసాను. 10 ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:

“నీతిమంతుడు లేడు. ఒక్కడు కూడా లేడు!
11     అర్థం చేసుకొనేవాడొక్కడూ లేడు.
దేవుణ్ణి అన్వేషించే వాడెవ్వడూ లేడు.
12 అందరూ వెనక్కు తిరిగి వెళ్ళిపోయారు.
    అందరూ కలిసి పనికిరానివాళ్ళైపోయారు.
మంచి చేసే వాడొక్కడూ లేడు. ఒక్కడు కూడా లేడు!”(A)

13 “వాళ్ళ నోళ్ళు తెరుచుకొన్న సమాధుల్లా ఉన్నాయి.
    వాళ్ళ నాలుకలు మోసాలు పలుకుతూ ఉంటాయి.”(B)

“వాళ్ళ పెదాలపై పాము విషం ఉంటుంది!”(C)

14 “వాళ్ళ నోటినిండా తిట్లూ, ద్వేషంతో కూడుకొన్న మాటలు ఉంటాయి!”(D)

15 “వాళ్ళ పాదాలు రక్తాన్ని చిందించటానికి తొందరపడ్తుంటాయి.
16     వాళ్ళు తాము నడిచిన దారుల్లో వినాశనాన్ని, దుఃఖాన్ని వదులుతుంటారు.
17 వాళ్ళకు శాంతి మార్గమేదో తెలియదు!”(E)

18 “వాళ్ళ కళ్ళలో దైవభీతి కనిపించదు.”(F)

19 ధర్మశాస్త్ర నియమాలు ధర్మశాస్త్రాన్ని అనుసరించవలసినవారికి వర్తిస్తాయని మనకు తెలుసు. తద్వారా ప్రపంచంలో ఉన్నవాళ్ళందరూ, అంటే యూదులు కానివాళ్ళేకాక, యూదులు కూడా దేవునికి లెక్క చెప్పవలసి ఉంటుంది. ఎవ్వరూ తప్పించుకోలేరు. 20 ధర్మశాస్త్రం తెలిస్తే పాపాన్ని గురించి జ్ఞానం కలుగుతుంది. అంతేకాని, ధర్మశాస్త్రాన్ని అనుసరించినంత మాత్రాన దేవుని దృష్టిలో నీతిమంతులం కాలేము.

విశ్వాసం ద్వారా నీతిమంతుడు కావటం

21 కాని దేవుడు ఇప్పుడు ధర్మశాస్త్రం ఉపయోగించకుండా నీతిమంతులయ్యే విధానం మనకు తెలియచేసాడు. ఈ విధానాన్ని ప్రవక్తలు ముందే చెప్పారు. ఇది ధర్మశాస్త్రంలోనూ ఉంది. 22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International