Revised Common Lectionary (Semicontinuous)
నోవహు—జలప్రళయం
9 ఇది నోవహు కుటుంబ కథ. నోవహు తన తరం వారిలోనే నీతిమంతుడు. అతడు ఎల్లప్పుడు దేవునిని అనుసరించాడు. 10 నోవహుకు షేము, హాము, యాఫెతు అని ముగ్గురు కుమారులు.
11-12 దేవుడు భూమిని చూసి, మనుష్యులు దానిని పాడుచేసినట్లు కనుగొన్నాడు. ఎక్కడ చూసినా చెడుతనం ప్రజలు చెడ్డవారై పోయి, క్రూరులై, భూమిమీద వారి జీవితాన్ని నాశనం చేసుకొన్నారు.
13 కనుక నోవహుతో దేవుడు ఇలా చెప్పాడు: “మనుష్యులంతా ఈ భూమిని కోపంతో హింసతో నింపేశారు. కనుక జీవిస్తున్న వాటన్నింటిని నేను నాశనం చేస్తాను. ఈ భూమిమీద నుండి వారిని నేను తీసివేస్తాను. 14 చితిసారకపు చెక్కతో నీ కోసం ఒక ఓడను నిర్మించు, ఓడలో గదులను చేసి ఓడకు తారు పైపూత పూయి.
15 “నీవు చేయాల్సిన ఓడ కొలత ఇలా ఉండాలి. 300 అ. పొడవు, 50 అ. వెడల్పు, 30 అ. ఎత్తు. 16 కప్పుకు సుమారు 18 అంగుళాల క్రింద ఓడకు ఒక కిటికీ చేయి. ఓడకు ఒక ప్రక్క తలుపు పెట్టు. ఓడలో మూడు అంతస్తులు చేయి. పై అంతస్తు, మధ్య అంతస్తు, క్రింది అంతస్తు.
17 “నేను నీతో చెబుతోంది గ్రహించు. ఈ భూమి మీదికి ఒక మహాగొప్ప జలప్రళయాన్ని నేను తీసుకొస్తున్నాను. ఆకాశం క్రింద జీవిస్తున్న సకల ప్రాణులను నేను నాశనం చేస్తాను. భూమిమీద ఉండే ప్రతీ ప్రాణి చస్తుంది. భూమిమీద ఉన్న అన్నీ చస్తాయి. 18 అయితే నిన్ను నేను రక్షిస్తాను. అప్పుడు నీతో నేను ఒక ప్రత్యేక ఒడంబడిక చేస్తాను. నీవు, నీ కుమారులు, నీ భార్య, నీ కోడళ్లు అందరు ఓడలో ఎక్కాలి. 19 భూమిమీద జీవిస్తోన్న ప్రాణులన్నింటిలో రెండేసి చొప్పున నీవు సంపాదించాలి. ఆడ, మగ చొప్పున వాటిని ఓడలోనికి తీసుకొని రావాలి. వాటిని నీతో కూడా సజీవంగా ఉండనివ్వు. 20 భూమిమీద ఉన్న ప్రతీ జాతి పక్షుల్లోనుంచి రెండేసి తీసుకురా. భూమిమీద ఉన్న అన్ని రకాల జంతువుల్లోనుంచి రెండేసి తీసుకురా. నేలమీద ప్రాకు ప్రతి ప్రాణులలో రెండేసి చొప్పున తీసుకురా, భూమిమీద ఉండే అన్ని రకాల జంతువులు మగది, ఆడది నీతో ఉండాలి. ఓడలో వాటిని సజీవంగా ఉంచు. 21 అలాగే భూమి మీద ఉండే ప్రతి విధమైన ఆహారాన్ని ఓడలోనికి తీసుకొనిరా. అది నీకు, జంతువులకు భోజనం అవుతుంది.”
22 వీటన్నింటినీ నోవహు చేశాడు. దేవుడు ఆజ్ఞాపించినట్లే నోవహు వాటన్నిటినీ చేశాడు.
24 150 రోజుల పాటు నీళ్లు భూమిని కప్పేశాయి.
14 రెండవ నెల 27వ రోజుకు నేల పూర్తిగా ఆరిపోయింది.
15 అప్పుడు యెహోవా నోవహుతో అన్నాడు: 16 “ఓడ నేలకు దిగింది. నీవు, నీ భార్య, నీ కుమారులు, నీ కోడళ్లు ఇప్పుడు బయటకు వెళ్లాలి. 17 జీవమున్న ప్రతి జంతువును, పక్షులన్నింటిని, భూమిమీద ప్రాకు ప్రాణులన్నిటిని నీతోబాటు బయటకు తీసుకొనిరా. ఆ జంతువులు సంతానాభివృద్ధి చెంది, అవి మరల భూమిని నింపుతాయి.”
18 తన కుమారులు, తన భార్య, తన కోడళ్లతో నోవహు బయటకు వెళ్లాడు. 19 జంతువులన్నీ ప్రాకు ప్రాణులన్నీ, ప్రతి పక్షి ఓడను విడచి వెళ్లాయి. జంతువులన్నీ వాటి జాతి ప్రకారం గుంపులుగా బయటకు వచ్చాయి.
సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.
46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
2 అందుచేత భూమి కంపించినప్పుడు,
మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
3 సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.
4 ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
5 ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
6 రాజ్యాలు భయంతో వణకుతాయి.
యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
7 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
8 యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
9 భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.
10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
భూమిమీద మహిమపర్చబడతాను.”
11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.
16 సువార్త విషయంలో నేను సిగ్గుపడను. ఎందుకంటే, విశ్వాసమున్న ప్రతి ఒక్కరికీ, అంటే యూదులకే కాక ఇతరులకు కూడా రక్షణను కలిగించే దేవుని శక్తి అది. 17 ఈ సువార్తలో దేవుడు మానవుల్ని నీతిమంతులుగా పరిగణించే విధానాన్ని గురించి చెప్పబడి ఉంది. అది విశ్వాసంతో మొదలై విశ్వాసంతో అంతమౌతుంది. దీన్ని గురించి లేఖనాల్లో, “విశ్వాసంవల్ల నీతిమంతుడైనవాడు అనంతజీవితం పొందుతాడు”[a] అని వ్రాయబడి ఉంది.
22 దీని ప్రకారం యేసు క్రీస్తులో మనకున్న విశ్వాసంవల్ల దేవుడు మనల్ని నిర్దోషులుగా పరిగణిస్తున్నాడని విదితమౌతుంది. ఆయనను విశ్వసించిన ప్రతి ఒక్కనికి ఈ విధానం వర్తిస్తుంది. 23 అందరూ పాపం చేసారు, కనుక దేవుని తేజస్సు[a] పంచుకోవటానికి ఎవ్వరికీ అర్హత లేదు. అందువల్ల ఈ విధానం అందరికీ వర్తిస్తుంది. వ్యత్యాసం లేదు. 24 కాని, దేవుడు వాళ్ళను తన ఉచితమైన కృపవల్ల నీతిమంతులుగా చేస్తున్నాడు. ఇది యేసు క్రీస్తు వల్ల కలిగే విముక్తి ద్వారా సంభవిస్తుంది. 25 దేవుడు ఇదివరలో ప్రజలు చేసిన పాపాల్ని లెక్క చెయ్యకుండా సహనం వహించాడు. ఆయన తన నీతిని నిరూపించాలని యేసు క్రీస్తు రక్తాన్ని విశ్వసించే ప్రజలకోసం ఆయనను కరుణాపీఠంగా చేసాడు. 26 అలా చేసి ఇప్పుడు తన నీతిని ప్రదర్శిస్తున్నాడు. ప్రజలు తనను నీతిమంతునిగా పరిగణించాలని, యేసును విశ్వసించే ప్రజలను నీతిమంతులుగా చెయ్యాలని ఆయన ఉద్దేశ్యం.
27 మరి, మనం గర్వించటానికి కారణం ఉందా? ఖచ్చితంగా లేదు. ఏ న్యాయం ప్రకారం కారణం లేదని చెప్పగలుగుతున్నాము? విశ్వాసానికి సంబంధించిన న్యాయంవల్ల కారణం లేదని చెపుతున్నాము. కాని క్రియా న్యాయం వల్లకాదు. 28 మనిషిలో ఉన్న విశ్వాసం అతణ్ణి నీతిమంతునిగా చేస్తుంది. ధర్మశాస్త్రం ఆదేశించిన క్రియలు చేసినందుకు కాదు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను.
29 దేవుడు యూదులకు మాత్రమే దేవుడా? దేవుడొక్కడే కనుక ఆయన యూదులు కానివాళ్ళకు కూడా దేవుడే. 30 దేవుడు సున్నతి పొందినవాళ్లను వాళ్ళలో విశ్వాసం ఉంది కనుక నీతిమంతులుగా పరిగణిస్తాడు. సున్నతి పొందనివాళ్ళను కూడా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి నీతిమంతులుగా పరిగణిస్తాడు. 31 మరి అలాగైతే, ఈ విశ్వాసాన్ని స్థాపించి మనం ధర్మశాస్త్రాన్ని రద్దు చేస్తున్నామా? కాదు. దాని విలువను ఎత్తి చూపిస్తున్నాము.
21 “నన్ను ప్రభూ! ప్రభూ! అని పిలిచినంత మాత్రాన దేవుని రాజ్యంలోకి ప్రవేశింపగలమని అనుకోకండి. నా తండ్రి ఇష్టానుసారం నడచుకున్న వాళ్ళు మాత్రమే ప్రవేశింపగలరు. 22 ఆ రోజు చాలా మంది నాతో, ‘ప్రభూ! ప్రభూ! నీపేరిట మేము దైవ సందేశాన్ని ప్రకటించలేదా? దయ్యాల్ని పారద్రోలలేదా? ఎన్నో అద్భుతాలు చెయ్యలేదా?’ అని అంటారు. 23 అప్పుడు నేను వాళ్ళతో, ‘మీరెవరో నాకు తెలియదు. పాపాత్ములారా! నా ముందు నుండి వెళ్లిపొండి’ అని స్పష్టంగా చెబుతాను.
తెలివిగలవాడు, తెలివిలేనివాడు
(లూకా 6:47-49)
24 “అందువల్ల నా మాటలు విని వాటిని ఆచరించే ప్రతి ఒక్కడూ బండపై తన యింటిని కట్టుకొన్న వానితో సమానము. 25 ఆ ఇల్లు రాతి బండపై నిర్మించబడింది. కనుక వర్షాలుపడి, వరదలు వచ్చి తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టినా ఆయిల్లు పడిపోలేదు.
26 “కాని నా మాటలు విని వాటిని ఆచరించని ప్రతి ఒక్కడూ యిసుకపై తన యింటిని నిర్మించుకొన్న మూర్ఖునితో సమానము. 27 వర్షాలు వచ్చి, వరదలు వచ్చి, తుఫాను గాలులు వీచి ఆ యింటిని కొట్టాయి. ఆ యిల్లు కూలి నేలమట్టమైపోయింది” దాని పతనం భయంకరమైనది.
28-29 యేసు చెప్పటం ముగించాడు. ఆయన వాళ్ళ శాస్త్రులవలే కాకుండా అధికారమున్న వానిలాగ బోధించాడు. కనుక ప్రజలు ఆయన ఉపదేశాలు విని ఆశ్చర్యపడ్డారు.
© 1997 Bible League International