Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Semicontinuous)

Daily Bible readings that follow the church liturgical year, with sequential stories told across multiple weeks.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 46

సంగీత నాయకునికి: కోరహు కుమారుల అలామోతు రాగ గీతం.

46 దేవుడు మా ఆశ్రయం, మా శక్తి.
    ఆయన యందు, మాకు కష్ట కాలంలో ఎల్లప్పుడూ సహాయం దొరుకుతుంది.
అందుచేత భూమి కంపించినప్పుడు,
    మరియు పర్వతాలు సముద్రంలో పడినప్పుడు మేము భయపడము.
సముద్రాలు పొంగినను, చీకటితో నిండినను,
    భూమి, మరియు పర్వతాలు కంపించినను మేము భయపడము.

ఒక నది ఉంది. దాని కాలువలు దేవుని నివాసానికి,
    మహోన్నత దేవుని పరిశుద్ధ పట్టణానికి సంతోషం తెచ్చి పెడ్తాయి.
ఆ పట్టణంలో దేవుడు ఉన్నాడు. కనుక అది ఎన్నటికీ నాశనం చేయబడదు.
    సూర్యోదయానికి ముందే దేవుడు సహాయం చేస్తాడు.
రాజ్యాలు భయంతో వణకుతాయి.
    యెహోవా గద్దించగా ఆ రాజ్యాలు కూలిపోతాయి. భూమి పగిలిపోతుంది.
సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

యెహోవా చేసే మహత్తర కార్యాలు చూడండి.
    ఆ కార్యాలు భూమి మీద యెహోవాను ప్రసిద్ధి చేస్తాయి.
భూమి మీద ఎక్కడైనా సరే యుద్ధాలను యెహోవా ఆపివేయగలడు.
    సైనికుల విల్లులను, వారి ఈటెలను ఆయన విరుగగొట్టగలడు. రథాలను ఆయన అగ్నితో కాల్చివేయగలడు.

10 దేవుడు చెబుతున్నాడు, “మౌనంగా ఉండి, నేను దేవుణ్ణి అని తెలుసుకొనండి.
    రాజ్యాలతో నేను స్తుతించబడతాను.
    భూమిమీద మహిమపర్చబడతాను.”

11 సర్వశక్తిమంతుడైన యెహోవా మనతో ఉన్నాడు.
    యాకోబు దేవుడు మనకు ఆశ్రయం.

ఆదికాండము 1:1-2:4

ప్రపంచ ప్రారంభం

మొట్ట మొదట దేవుడు ఆకాశాన్ని భూమిని చేశాడు. భూమి మొత్తం శూన్యంగా ఉండెను. భూమిమీద ఏమీ ఉండలేదు. మహా సముద్రాన్ని చీకటి ఆవరించి ఉండెను. దేవుని ఆత్మ నీళ్లమీద సంచరిస్తూ ఉండెను.

మొదటి రోజు-వెలుగు

అప్పుడు దేవుడు, “వెలుగు కలుగును గాక!” అన్నాడు. వెలుగు ప్రకాశించటం మొదలయింది. దేవుడు ఆ వెలుగును చూశాడు. ఆయనకు అది చక్కగా కనబడింది. అప్పుడు దేవుడు ఆ వెలుగును చీకటి నుండి వేరు చేశాడు. వెలుగుకు “పగలు” అని, చీకటికి “రాత్రి” అని దేవుడు పేరు పెట్టాడు.

అస్తమయము అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మొదటి రోజు.

రెండవ రోజు-ఆకాశం

అప్పుడు దేవుడు, “జలములను రెండు భాగములుగా చేయుటకు అంతరిక్షం[a] ఉండును గాక!” అన్నాడు. కనుక దేవుడు అంతరిక్షాన్ని చేసి, నీళ్లను వేరుపర్చాడు. కొంత నీరు అంతరిక్షం పైగాను, కొంత నీరు అంతరిక్షం క్రిందను ఉంది. దేవుడు ఆ అంతరిక్షానికి “ఆకాశం” అని పేరు పెట్టాడు. అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది రెండవ రోజు.

మూడవ రోజు-పొడి నేల, మొక్కలు

అప్పుడు దేవుడు, “పొడి నేల కనబడునట్లు, ఆకాశం క్రింద ఉండే నీరు ఒక్క చోట చేరునుగాక!” అన్నాడు. అలాగే జరిగింది. 10 ఆ పొడి నేలకు “భూమి” అని దేవుడు పేరు పెట్టాడు. మరియు ఒక్క చోట చేరిన నీటికి “సముద్రాలు” అని దేవుడు పేరు పెట్టాడు. ఆయనకు ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది. 11 అప్పుడు దేవుడు, “భూమి గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను, ఫలవృక్షాలను మొలిపించును గాక, ఫలవృక్షాలు విత్తనాలుగల పండ్లను పండిస్తాయి. మరియూ ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాన్ని రూపొందిస్తుంది. ఈ మొక్కలు భూమిమీద పెరుగును గాక” అన్నాడు. అలాగే జరిగింది. 12 గడ్డిని, ఆహార ధాన్యపు మొక్కలను భూమి మొలిపించింది. మరియు అది విత్తనాలుగల పండ్ల చెట్లను మొలిపించింది. ప్రతి మొక్క తన స్వంత రకం విత్తనాలను రూపొందించింది. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.

13 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది మూడవ రోజు.

నాలుగవ రోజు-సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు

14 అప్పుడు, “ఆకాశంలో జ్యోతులు ఉండును గాక. ఈ జ్యోతులు రాత్రి నుండి పగలును వేరు చేస్తాయి. జ్యోతులు ప్రత్యేక సంకేతాలను, ప్రత్యేక సమావేశాల[b] ప్రారంభాన్ని సూచించేందుకు ఉపయోగించబడతాయి. మరియు రోజులను సంవత్సరాలను తెలుపుటకు అవి ఉపయోగించబడతాయి. 15 భూమి మీద వెలుగును ప్రకాశింప చేయుటకు ఈ జ్యోతులు ఆకాశంలో ఉంటాయి” అని దేవుడు అన్నాడు. అలాగే జరిగింది.

16 కనుక ఆ రెండు పెద్ద జ్యోతులను దేవుడు చేశాడు. పగటి వేళను ఏలుటకు దేవుడు పెద్ద జ్యోతిని చేశాడు. రాత్రి వేళను ఏలుటకు ఆయన చిన్న జ్యోతిని చేశాడు. దేవుడు నక్షత్రాలను కూడా చేశాడు. 17 భూమి మీద ప్రకాశించుటకు ఈ జ్యోతులను దేవుడు ఆకాశంలో ఉంచాడు. 18 పగటిని, రాత్రిని ఏలుటకు ఈ జ్యోతులను ఆకాశంలో ఉంచాడు. ఈ జ్యోతులు చీకటి నుండి వెలుగును వేరు చేశాయి. దేవునికి ఇది చక్కగా ఉన్నట్లు కనబడింది.

19 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది నాలుగవ రోజు.

అయిదవ రోజు-చేపలు, పక్షులు

20 అప్పుడు, “నీళ్లు అనేక ప్రాణులతో నిండి పోవును గాక. మరియు భూమికి పైగా గాలిలో ఎగురుటకు పక్షులు ఉండును గాక!” అని దేవుడు అన్నాడు. 21 కనుక దేవుడు సముద్రపు పెద్ద జంతువులను చేశాడు. సముద్రంలో సంచరించే ప్రతి ప్రాణిని దేవుడు చేశాడు. సముద్ర జంతువులు ఎన్నో రకాలు ఉన్నాయి. వాటన్నిటినీ దేవుడు చేశాడు. ఆకాశంలో ఎగిరే ప్రతి రకం పక్షిని కూడ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.

22 ఈ జంతువులను దేవుడు ఆశీర్వదించాడు. అవి అనేక పిల్లల్ని పెట్టి, సముద్రాలు నిండిపోవాలని దేవుడు వాటితో చెప్పాడు.

23 అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఐదవ రోజు.

ఆరవ రోజు-భూజంతువులు, మనుష్యులు

24 అప్పుడు దేవుడు, “భూమి అనేక ప్రాణులను చేయును గాక. అనేక రకాల జంతువులు ఉండును గాక. పెద్ద జంతువులు, ప్రాకే అన్ని రకాల పురుగులు, చిన్న జంతువులు ఉండును గాక! మరియు ఈ జంతువులన్నీ యింకా వాటి రకపు జంతువుల్ని ఎక్కువగా వృద్ధి చేయునుగాక” అని దేవుడు అన్నాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.

25 కనుక దేవుడు ప్రతి రకపు జంతువును చేశాడు. క్రూర జంతువులను, సాధు జంతువులను, ప్రాకుచుండు చిన్న వాటన్నింటినీ దేవుడు చేశాడు. మరియు ఇది చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.

26 అప్పుడు, “ఇప్పుడు మనం మనిషిని చేద్దాం. మనం మన పోలికతో మనుష్యుల్ని చేద్దాం. మనుష్యులు మనలా ఉంటారు. సముద్రంలోని చేపలన్నింటి మీద, గాలిలోని పక్షులన్నింటి మీద వారు ఏలుబడి చేస్తారు. భూమి మీద పెద్ద జంతువులన్నింటి మీదను, ప్రాకు చిన్న వాటన్నింటిమీదను వారు ఏలుబడి చేస్తారు” అని చెప్పాడు.

27 కనుక దేవుడు తన స్వంత రూపంలో మనుష్యుల్ని చేశాడు. తన ప్రతిరూపంలో దేవుడు మనుష్యుల్ని చేశాడు. దేవుడు వారిని మగ, ఆడ వారిగా చేశాడు. 28 దేవుడు, వారిని “ఇంకా అనేక మంది ప్రజలు ఉండునట్లు పిల్లలను కనండి. భూమిమీద నిండిపోయి, దానిని స్వాధీనం చేసుకోండి. సముద్రంలో చేపల మీద, గాలిలో పక్షుల మీద ఏలుబడి చేయండి. భూమి మీద సంచరించే ప్రతి ప్రాణిమీద ఏలుబడి చేయండి” అని ఆశీర్వదించాడు.

29 “ఆహార ధాన్యపు మొక్కలన్నింటిని, ఫలవృక్షాలు అన్నింటిని నేను మీకు ఇస్తున్నాను. ఆ చెట్లు విత్తనాలు గల పండ్లను పండిస్తాయి. ఈ ఆహార ధాన్యం, పండ్లు మీ ఆహారం అవుతుంది. 30 మరియు పచ్చ మొక్కలు అన్నింటిని జంతువులకు నేను ఇస్తున్నాను. ఆ పచ్చ మొక్కలు వాటికి ఆహారం అవుతాయి. భూమిమీద ప్రతి జంతువు, గాలిలో ఎగిరే ప్రతి పక్షి, భూమిమీద ప్రాకుచుండు చిన్న ప్రాణులు అన్నీ ఆ ఆహారాన్ని తింటాయి” అని దేవుడు చెప్పాడు. ఈ సంగతులు అన్నీ జరిగాయి.

31 దేవుడు తాను చేసినది అంతా చూశాడు. అది అంతా చాలా చక్కగా ఉన్నట్లు దేవునికి కనబడింది.

అస్తమయం అయింది, ఆ తర్వాత ఉదయం అయింది. ఇది ఆరవ రోజు.

ఏడవ రోజు-విశ్రాంతి

కనుక భూమి, ఆకాశం, వాటిలోని ప్రతిదీ పూర్తయింది. దేవుడు తాను చేస్తున్న పని ముగించాడు. కనుక ఏడవ రోజున దేవుడు తన పని నుండి విశ్రాంతి తీసుకొన్నాడు. ఏడవ రోజును దేవుడు ఆశీర్వదించి, దానిని పవిత్ర దినంగా చేశాడు. దేవుడు ప్రపంచాన్ని చేసేటప్పుడు జరిగించిన పని అంతటి నుండి ఆ రోజున విశ్రాంతి తీసుకొన్నాడు గనుక, ఆ రోజును ఆయన ప్రత్యేకమైనదిగా చేశాడు.

మొదటి మనిషి, ఏదెను తోట

ఇదే భూమి, ఆకాశం చరిత్ర. భూమిని, ఆకాశాన్ని దేవుడు చేసినప్పుడు జరిగిన సంగతుల విషయం ఇది.

రోమీయులకు 2:17-29

యూదులు, వాళ్ళ ధర్మశాస్త్రము

17 నీవు యూదుడవని చెప్పుకొంటావు. ధర్మశాస్త్రాన్ని నమ్ముకొన్నావు. దేవునితో నీకు ఉన్న సంబంధాన్ని గురించి గర్వంగా చెప్పుకుంటావు. 18 నీవు ధర్మశాస్త్రం ప్రకారము శిక్షణ పొందావు. దేవుని ఉద్దేశ్యం తెలుసుకొన్నావు. మంచిని గుర్తించ గలుగుతున్నావు. 19 అంధులకు మార్గదర్శివని, చీకట్లో ఉన్నవాళ్ళకు వెలుగువంటివాడవని నీవనుకొంటున్నావు. 20 మీ ధర్మశాస్త్రంలో జ్ఞానం, సత్యం ఉన్నాయి కనుక నీవు మూర్ఖులను సరిదిద్దగలననుకొంటున్నావు. అజ్ఞానులకు బోధించగలననుకొంటున్నావు. 21 ఇతర్లకు బోధించే నీవు స్వయంగా నీకు నీవే ఎందుకు బోధించుకోవటం లేదు? దొంగతనము చేయరాదని బోధించే నీవు దొంగతనము చేయవచ్చా? 22 వ్యభిచారం చేయరాదని బోధించే నీవు వ్యభిచారం చేయవచ్చా? విగ్రహారాధనను అసహ్యించుకునే నీవు మందిరాలు దోచుకోవచ్చా? 23 ధర్మశాస్త్రాన్ని గురించి గర్వంగా చెప్పుకొనే నీవు ధర్మశాస్త్రాన్ని అతిక్రమించి దేవుణ్ణి అగౌరవపరచవచ్చా? 24 ఈ విషయంపై, “నీ కారణంగా దేవుని పేరు యూదులుకానివాళ్ళ మధ్య దూషింపబడింది”(A) అని వ్రాయబడి ఉంది.

25 ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తే సున్నతికి[a] విలువ ఉంది. కాని నీవు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘిస్తే, నీ సున్నతికి విలువలేదు. 26 కనుక సున్నతి చేయించుకోనివాళ్ళు ధర్మశాస్త్ర నియమాల్ని పాటిస్తే వాళ్ళు సున్నతి చేయించుకొన్నవాళ్ళతో సమానము కదా? 27 యూదులైన మీ దగ్గర ధర్మశాస్త్రం వ్రాత మూలంగా ఉంది. మీరు సున్నతి చేయించుకుంటారు. అయినా, మీరు ధర్మశాస్త్రాన్ని ఉల్లంఘించారు కనుక, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్న వ్యక్తి, అతడు సున్నతి పొందని వాడైనా మీరు తప్పు చేస్తున్నారని రుజువు చేస్తున్నాడు.

28 నిజమైన సున్నతి బాహ్యమైనది, శారీరకమైనది కాదు. అదేవిధంగా యూదునివలే బాహ్యంగా కనబడినంత మాత్రాన యూదుడు కాలేడు. 29 అంతరంగంలో యూదునిగా ఉన్నవాడే నిజమైన యూదుడు. హృదయపు సున్నతి అంటే పరిశుద్ధాత్మ ద్వారా సున్నతి పొందటం అన్నమాట. ధర్మశాస్త్ర నియమంతో కాదు. ఇలాంటివాణ్ణి దేవుడు మెచ్చుకొంటాడు. మానవులు కాదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International