Revised Common Lectionary (Complementary)
146 యెహోవాను స్తుతించండి!
నా ప్రాణమా! యెహోవాను స్తుతించు!
2 నా జీవిత కాలమంతా నేను యెహోవాను స్తుతిస్తాను.
నా జీవిత కాలమంతా నేను ఆయనకు స్తుతులు పాడుతాను.
3 సహాయం కోసం మీ నాయకుల మీద ఆధారపడవద్దు.
మనుష్యులు నిన్ను రక్షించలేరు గనుక మనుష్యులను నమ్ముకోవద్దు.
4 మనుష్యులు చనిపోయి, పాతిపెట్టబడతారు.
అప్పుడు నీకు సహాయం చేసేందుకు వారు వేసిన పథకాలన్నీ పోయినట్టే.
5 సహాయం కోసం దేవుణ్ణి అడిగేవారు చాలా సంతోషంగా ఉంటారు.
ఆ మనుష్యులు వారి దేవుడైన యెహోవా మీద ఆధారపడతారు.
6 భూమిని, ఆకాశాన్ని యెహోవా చేశాడు.
సముద్రాన్నీ, అందులో ఉన్న సమస్తాన్నీ యెహోవా చేశాడు.
యెహోవా వాటిని శాశ్వతంగా కాపాడుతాడు.
7 అణచివేయబడిన ప్రజలకు యెహోవా సరియైన సహాయం చేస్తాడు.
ఆకలితో ఉన్న ప్రజలకు దేవుడు ఆహారం ఇస్తాడు.
చెరలోవున్న ప్రజలను యెహోవా విడుదల చేస్తాడు.
8 గుడ్డివారు మరల చూచుటకు యెహోవా సహాయం చేస్తాడు.
కష్టంలో ఉన్న ప్రజలకు యెహోవా సహాయం చేస్తాడు.
మంచి మనుష్యులను యెహోవా ప్రేమిస్తాడు.
9 మన దేశంలో నివసిస్తున్న పరాయి వాళ్లను యెహోవా కాపాడుతాడు.
విధవరాండ్రు, అనాథల విషయమై యెహోవా శ్రద్ధ తీసికొంటాడు.
అయితే దుర్మార్గుల పథకాలను యెహోవా నాశనం చేస్తాడు.
10 యెహోవా శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
సీయోనూ, నీ దేవుడు శాశ్వతంగా పాలిస్తాడని నేను ఆశిస్తున్నాను.
యెహోవాను స్తుతించండి!
3 ఒక అధికారి తన బీద ప్రజలకు కష్టం కలిగిస్తే, అతడు పంటలను పాడు చేసే భారీ వర్షంలా ఉంటాడు.
4 న్యాయచట్టానికి లోబడేందుకు నీవు తిరస్కరిస్తే, నీవు దుర్మార్గుల పక్షాన ఉన్నట్టే. కాని నీవు న్యాయచట్టానికి లోబడితే, నీవు వారికి విరోధంగా ఉన్నట్టే.
5 దుర్మార్గులు న్యాయాన్ని అర్థం చేసికోరు. యెహోవాను ప్రేమించే వారు దానిని అర్థం చేసుకొంటారు.
6 ధనికుడై దుర్మార్గునిగా ఉండటంకంటె, దరిద్రుడై నిజాయితీగా ఉండటం మేలు.
7 న్యాయచట్టానికి విధేయుడయ్యే మనిషి తెలివి గలవాడు. కాని పనికిమాలిన వాళ్లతో స్నేహం చేసే వ్యక్తి తన తండ్రికి అవమానం తెస్తాడు.
8 పేద ప్రజలను మోసం చేసి మరి వారిపై ఎక్కువ వడ్డీ వేసి నీవు ధనికుడవైతే నీ ధనం పోగొట్టుకొంటావు. వారి యెడల దయగల మరో మనిషికి అది చెందుతుంది.
9 ఒక మనిషి దేవుని ఉపదేశాలు వినేందుకు తిరస్కరిస్తే, అప్పుడు దేవుడు అతని ప్రార్థనలు వినేందుకు తిరస్కరిస్తాడు.
10 ఒక చెడ్డ మనిషి ఒక మంచి మనిషికి హాని చేసేందుకు పథకాలు వేయవచ్చు. కాని ఆ చెడ్డ మనిషి తన గోతిలో తానే పడిపోతాడు. మరియు మంచి మనిషికి మంచి సంగతులే సంభవిస్తాయి.
క్రీస్తులో పునర్జీవం
2 ఇక మీ విషయమా! ఇదివరలో మీరు మీ పాపాల్లో, అతిక్రమాల్లో మరణించారు. 2 అప్పుడు మీరు ప్రపంచాన్ని అనుసరించి జీవించారు. వాయుమండలాధికారిని అనుసరించే వాళ్ళు. ఆ వాయుమండలాధికారి ఆత్మ దేవునికి అవిధేయతగా ఉన్నవాళ్ళలో ఇప్పుడూ పని చేస్తుంది. 3 నిజానికి మనం కూడా మన మానవ స్వభావంవల్ల కలిగే వాంఛల్ని, శారీరక వాంచల్ని, మన ఆలోచనల వల్ల కలిగే వాంఛల్ని తృప్తి పరుచుకుంటున్నవాళ్ళలా జీవించాము. కాబట్టి వాళ్ళలా మనము కూడా దేవుని కోపానికి గురి అయ్యాము.
4 కాని దేవుడు కరుణామయుడు. ఆయనకు మనపై అపారమైన ప్రేమ ఉంది. 5 మనము అవిధేయత వల్ల ఆత్మీయ మరణం పొందినా ఆయన మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. ఆయన అనుగ్రహం మిమ్మల్ని రక్షించింది. 6 మనకు యేసు క్రీస్తులో కలిగిన ఐక్యత వల్ల పరలోకంలో తనతో కలిసి రాజ్యం చెయ్యటానికి మనల్ని క్రీస్తుతో పాటు బ్రతికించాడు. 7 యేసు క్రీస్తు ద్వారా తన అనుగ్రహాన్ని తెలియజేసి, తన అపారమైన దయ మనపై చిరకాలం ఉంటుందని నిరూపించాడు.
8 మీరు ఆయన అనుగ్రహం వల్ల రక్షింపబడ్డారు. మీలో విశ్వాసం ఉండటంవల్ల మీకా అనుగ్రహం లభించింది. అది మీరు సంపాదించింది కాదు. దాన్ని దేవుడు మీకు ఉచితంగా యిచ్చాడు. 9 అది మీ కృషివల్ల లభించింది కాదు. కనుక గొప్పలు చెప్పుకోవటానికి అవకాశం లేదు. 10 దేవుడు మన సృష్టికర్త. ఆయన యేసు క్రీస్తులో మనలను సత్కార్యాలు చేయటానికి సృష్టించాడు. ఆ సత్కార్యాలు ఏవో ముందే నిర్ణయించాడు.
© 1997 Bible League International