Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 113

113 యెహోవాను స్తుతించండి!
యెహోవా సేవకులారా, ఆయనను స్తుతించండి!
    యెహోవా నామాన్ని స్తుతించండి.
ఇప్పుడు, ఎల్లప్పుడూ, యెహోవా నామము స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
తూర్పున ఉదయించే సూర్యుడి దగ్గర్నుండి,
    సూర్యుడు అస్తమించే స్థలం వరకు యెహోవా నామం స్తుతించబడాలని నేను కోరుతున్నాను.
యెహోవా జనాలన్నింటికంటె ఉన్నతమైనవాడు.
    ఆయన మహిమ ఆకాశాలంత ఉన్నతం.
ఏ మనిషి మన యెహోవా దేవునిలా ఉండడు.
    దేవుడు పరలోకంలో ఉన్నతంగా కూర్చుంటాడు.
ఆకాశాలను, భూమిని దేవుడు చూడాలంటే
    ఆయన తప్పక కిందికి చూడాలి.
దేవుడు పేదవారిని దుమ్ములో నుండి పైకి లేపుతాడు.
    భిక్షగాళ్లను చెత్తకుండీలో నుండి బయటకు తీస్తాడు.
ఆ మనుష్యులను దేవుడు ప్రముఖులుగా చేస్తాడు.
    ఆ మనుష్యులను దేవుడు ప్రముఖ నాయకులుగా చేస్తాడు.
ఒక స్త్రీకి పిల్లలు లేకపోవచ్చును.
    కాని దేవుడు ఆమెకు పిల్లలను ఇచ్చి ఆమెను సంతోషపరుస్తాడు.

యెహోవాను స్తుతించండి!

నిర్గమకాండము 23:1-9

23 “ప్రజలకు వ్యతిరేకంగా అబద్ధాలు చెప్పకండి. న్యాయస్థానంలో మీరు సాక్షులుగా ఉంటే, ఒక దుర్మార్గుడు అబద్ధాలు చెప్పేందుకు సహాయం చేయడానికి ఒప్పుకోవద్దు.

“మిగిలిన వారంతా చేస్తున్నారనిచెప్పి నీవు ఏదీ చేయవద్దు. ఒక గుంపు ప్రజలు తప్పు చేస్తుంటే, నీవు వారితో కలువ వద్దు. నీవు చెడ్డ పనులు చేసేటట్టు ఆ ప్రజలు నిన్ను ఒప్పించనియ్యవద్దు. సరియైనది, న్యాయమైనది నీవు చెయ్యాలి.

“ఒక పేదవానికి తీర్పు జరుగుతుంటే, కొన్నిసార్లు అతని విషయంలో జాలిపడి, కొందరు అతణ్ణి బలపరుస్తారు. నీవు అలా చేయకూడదు. (అతనిది సరిగ్గా ఉంటేనే బలపర్చు.)

“తప్పిపోయిన ఒక ఎద్దును లేక గాడిదను నీవు చూస్తే, దాన్ని దాని యజమానికి నీవు తిరిగి అప్పగించాలి. ఆ యజమాని నీకు శత్రువైనా సరే, నీవు ఇలా చేయాల్సిందే. మోయలేనంత భారం ఉండడం చేత ఒక జంతువు నడవలేక పోతున్నట్టు నీవు చూస్తే, నీవు ఆగి ఆ జంతువుకు సహాయం చేయాలి. ఆ జంతువు నీ శత్రువులలో ఒకనికి చెందినా సరే నీవు దానికి సహాయం చేయాలి.

“ఒక పేదవానికి ప్రజలు అన్యాయం చేయకూడదు. ఇతరులు ఎవరికైనా తీర్చినట్టే తీర్పు తీర్చాలి.

“ఏదైనా విషయంలో ఒకడు నేరస్థుడు అని నీవు చెబితే, నీవు చాల జాగ్రత్తగా ఉండాలి. ఒకడి మీద అబద్ధపు నిందలు వేయవద్దు. నిర్దోషియైన ఒకడ్ని తాను చేయని పనికి శిక్షగా ఎన్నడూ మరణించనివ్వవద్దు. ఒక నిర్దోషిని చంపేవాడు ఎవడైనా సరే చెడ్డవాడే, ఆ మనిషిని నేను క్షమించను.

“ఒకడు తప్పు చేస్తూ నీవు అతనితో ఏకీభవించాలని చెప్పి, నీకు డబ్బు ఇవ్వ జూస్తే, ఆ డబ్బు తీసుకోవద్దు. అలా చెల్లించిన డబ్బు న్యాయమూర్తులు సత్యాన్ని చూడకుండా చేస్తుంది. అలా చెల్లించిన డబ్బు మంచివాళ్లు అబద్ధాలు చెప్పేటట్టు చేస్తుంది.

“విదేశీయుని యెడల నీవు ఎన్నడూ తప్పు చేయకూడదు. మీరు ఈజిప్టు దేశంలో నివసించినప్పుడు మీరు పరాయి వాళ్లేనని జ్ఞాపకం ఉంచుకోవాలి. (ఒకడు తన స్వంతంకాని దేశంలో వుంటే వాడికి ఎలా వుంటుందో మీరు అర్థం చేసుకోవాలి.)

రోమీయులకు 3:1-8

సున్నతి పొందినవాళ్ళలో ఏదైనా ప్రత్యేకత ఉందా? లేదు. మరి అలాంటప్పుడు యూదులుగా ఉండటంవల్ల వచ్చిన లాభమేమిటి? ఎంతో లాభం ఉంది. అన్నిటికన్నా ముఖ్యమేమిటంటే దేవుడు వాళ్ళకు తన సందేశాన్ని అప్పగించాడు. మరి వాళ్ళల్లో కొందరు నమ్మతగనివాళ్ళున్నంత మాత్రాన దేవుడు నమ్మతగనివాడని అనగలమా? అలా అనలేము. ప్రతి ఒక్కడూ అసత్యం చెప్పినా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడుగా ఉంటాడు! ఈ విషయమై ఇలా వ్రాయబడి ఉంది:

“నీవు మాట్లాడినప్పుడు నిజం చెప్పావని రుజువౌతుంది.
    నీపై విచారణ జరిగినప్పుడు నీవు గెలుస్తావు!”(A)

మనం అధర్మంగా ఉన్నాము కనుకనే దేవునిలో ఉన్న ధర్మం స్పష్టంగా కనిపిస్తోందంటే ఏమనగలము? దేవుడు మనల్ని శిక్షించి తప్పు చేస్తున్నాడనగలమా? నేను మానవ నైజం ప్రకారం తర్కిస్తున్నాను. ఎన్నటికీ కాదు. అలాగైనట్లైతే దేవుడు ప్రపంచంపై ఎలా తీర్పు చెప్పగలడు?

“నేను అసత్యవంతునిగా ఉండటం వల్ల దేవుడు సత్యవంతుడనే కీర్తి పెరుగుతున్నట్లైతే, నేను పాపినని ఇంకా ఎందుకంటున్నారు? మంచి కలగటానికి మనం పాపంచేద్దాం” అని అనకూడదు. మేమీవిధంగా బోధించినట్లు కొందరు మమ్మల్ని నిందించి అవమానిస్తున్నారు. వాళ్ళకు తగిన శిక్ష లభిస్తుంది.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International