Revised Common Lectionary (Complementary)
112 యెహోవాను స్తుతించండి.
యెహోవాకు భయపడి. ఆయనను గౌరవించే వ్యక్తి చాలా సంతోషంగా ఉంటాడు.
ఆ వ్యక్తికి దేవుని ఆదేశాలంటే ఇష్టం.
2 ఆ మనిషి సంతతివారు భూమి మీద చాలా గొప్పగా ఉంటారు.
మంచివారి సంతతివారు నిజంగా ఆశీర్వదించబడతారు.
3 ఆ వ్యక్తి కుటుంబీకులు చాలా ధనికులుగా ఉంటారు.
అతని మంచితనం శాశ్వతంగా కొనసాగుతుంది.
4 మంచివాళ్లకు దేవుడు చీకట్లో ప్రకాశిస్తున్న వెలుతురులా ఉంటాడు.
దేవుడు మంచివాడు, దయగలవాడు, జాలిగలవాడు.
5 ఒక మనిషికి దయగా ఉండటం, ధారాళంగా ఇచ్చే గుణం కలిగి ఉండటం, అతనికి మంచిది.
తన వ్యాపారంలో న్యాయంగా ఉండటం అతనికి మంచిది.
6 ఆ మనిషి ఎన్నటికీ పడిపోడు.
ఒక మంచి మనిషి ఎల్లప్పుడు జ్ఞాపకం చేసికోబడతాడు.
7 మంచి మనిషి చెడు సమాచారాలకు భయ పడాల్సిన అవసరం లేదు.
ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు, యెహోవాను నమ్ముకొంటాడు.
8 ఆ మనిషి ధైర్యంగా ఉంటాడు. అతడు భయపడడు.
అతడు తన శత్రువులను ఓడిస్తాడు.
9 ఆ మనిషి పేదవారికి వస్తువులను ఉచితంగా ఇస్తాడు.
అతడు చేసే మంచి పనులు శాశ్వతంగా కొనసాగుతాయి.
10 దుష్టులు ఇది చూచి కోపగిస్తారు.
వారు కోపంతో పళ్లు కొరుకుతారు, అప్పుడు వారు కనబడకుండా పోతారు.
దుష్టులకు ఎక్కువగా కావాల్సిందేదో అది వారికి దొరకదు.
21 (రైతులు తమ పొలాలకు నీళ్లు పెట్టటానికి చిన్న చిన్న కాలువలు త్రవ్వుతారు. ఒక కాలువను మూసి ఇంకొక కాలువకు నీళ్లు మళ్లిస్తారు) నీరు ప్రవహించు కాలువలాగ రాజు హృదయము యెహోవా చేతిలో వున్నది. ఆయన తన ఇష్టము వచ్చిన వైపుకు తిప్పుతాడు.
2 ఒక మనిషి తాను చేసేది అంతా సరైనదే అనుకొంటాడు. అయితే మనుష్యులు చేసే వాటికి అసలైన కారణాలను యెహోవా చెబుతాడు.
3 సరైనవి, న్యాయమైనవి చేయుము. బలులకంటె వాటిని యెహోవా ఎక్కువ ప్రేమిస్తాడు.
4 ఇతరులు పనికిమాలిన వాళ్లు అన్నట్టు కళ్లతోను, హృదయ నేత్రాలతోను చూచేవారు పాపులు. ఇతరుల కంటె మేము మంచివాళ్లం అని నమ్మే హృదయం పాప భూయిష్టం.
24 ఇతరులకంటే తానే మంచివాడిని అనుకొనే వాడు గర్విష్ఠి. తాను చేసే పనుల ద్వారా అతడు తను దుర్మార్గుడని చూపిస్తాడు.
25-26 సోమరి తను ఇంకా ఇంకా కావాలని కోరినప్పుడు తనను తానే నాశనం చేసికొంటాడు. అతడు వాటికోసం పనిచేసేందుకు నిరాకరిస్తాడు గనుక, తనను తానే నాశనం చేసికొంటాడు. కాని మంచి మనిషికి పుష్కలంగా ఉంటుంది గనుక అతడు యివ్వగలడు.
ఒక తల్లి కోరిన కోరిక
(మార్కు 10:35-45)
20 ఆ తర్వాత జెబెదయి భార్య తన కుమారులతో కలిసి యేసు దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి ఒక ఉపకారం చెయ్యమని కోరింది.
21 యేసు, “నీకేం కావాలి?” అని అడిగాడు.
ఆమె, “మీ రాజ్యంలో, నా ఇరువురు కుమారుల్లో ఒకడు మీ కుడిచేతివైపున, మరొకడు మీ ఎడమచేతి వైపున కూర్చునేటట్లు అనుగ్రహించండి” అని అడిగింది.
22 యేసు, “మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు. నా పాత్రలో దేవుడు కష్టాల్ని నింపాడు. నేను త్రాగటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు త్రాగగలరా?” అని అడిగాడు.
“త్రాగగలము” అని వాళ్ళు సమాధానం చెప్పారు.
23 యేసు వాళ్ళతో, “మీరు నిజంగానే త్రాగవలసి వస్తుంది. కాని నా కుడిచేతివైపున కూర్చోవటానికి, లేక ఎడమచేతివైపు కూర్చోవటానికి అనుమతి యిచ్చే అధికారం నాకు లేదు. ఈ స్థానాల్ని నా తండ్రి ఎవరికోసం నియమించాడో వాళ్ళకే అవి దక్కుతాయి” అని అన్నాడు.
24 మిగతా పదిమంది ఇది విని ఆ ఇరువురు సోదరుల పట్ల కోపగించుకొన్నారు. 25 యేసు వాళ్ళను పిలిచి, “యూదులుకాని రాజులు తమ ప్రజలపై అధికారం చూపుతూ ఉంటారు. వాళ్ళ పెద్దలు వాళ్ళను అణచిపెడ్తూ ఉంటారు. ఈ విషయం మీకు తెలుసు. 26 మీరు అలాకాదు. మీలో గొప్పవాడు కాదలచినవాడు మీ సేవకునిగా ఉండాలి. 27 మీలో ముఖ్యుడుగా ఉండ దలచిన వాడు బానిసగా ఉండాలి. 28 మనుష్యకుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు. సేవచెయ్యటానికివచ్చాడు. అనేకుల విమోచన కోసం తన ప్రాణాన్ని ఒక వెలగా చెల్లించడానికి వచ్చాడు” అని అన్నాడు.
© 1997 Bible League International