Revised Common Lectionary (Complementary)
ఎజ్రాహివాడైన ఏతాను ధ్యానగీతం.
89 యెహోవా ప్రేమను గూర్చి నేను ఎల్లప్పుడూ పాడుతాను.
ఆయన నమ్మకత్వం గూర్చి శాశ్వతంగా, ఎప్పటికీ నేను పాడుతాను!
2 యెహోవా, నీ ప్రేమ శాశ్వతంగా నిలుస్తుందని నేను నిజంగా నమ్ముతాను.
నీ నమ్మకత్వం ఆకాశాలవలె కొనసాగుతుంది!
3 దేవుడు చెప్పాడు, “నేను ఏర్పరచుకొన్న రాజుతో నేను ఒడంబడిక చేసుకొన్నాను.
నా సేవకుడైన దావీదుకు నేను ఒక వాగ్దానం చేసాను.
4 ‘దావీదూ, నీ వంశం శాశ్వతంగా కొనసాగేట్టు నేను చేస్తాను.
నీ రాజ్యాన్ని శాశ్వతంగా ఎప్పటికీ నేను కొనసాగింపజేస్తాను.’”
5 యెహోవా, నీవు చేసే అద్భుత కార్యాలను గూర్చి ఆకాశాలు స్తుతిస్తున్నాయి.
పరిశుద్ధుల సమాజం నీ నమ్మకత్వం గూర్చి పాడుతుంది.
6 పరలోకంలో ఎవ్వరూ యెహోవాకు సమానులు కారు.
“దేవుళ్లు” ఎవ్వరూ యెహోవాకు సాటికారు.
7 యెహోవా పరిశుద్ధ దూతలను కలిసినప్పుడు
ఆ దేవ దూతలు భయపడి యెహోవాను గౌరవిస్తారు.
వారు ఆయన పట్ల భయముతో నిలబడుతారు.
8 సర్వశక్తిమంతుడైన యెహోవా, దేవా, నీ అంతటి శక్తిగలవారు ఒక్కరూ లేరు.
మేము నిన్ను పూర్తిగా నమ్మగలము.
9 ఉప్పొంగే మహా సముద్రపు అలలపై నీవు అధికారం చేస్తావు.
దాని కోపపు అలలను నీవు నిమ్మళింప జేయగలవు.
10 దేవా, నీవు రహబును[a] ఓడించావు.
నీ మహా శక్తితో, నీవు నీ శత్రువును ఓడించావు.
11 దేవా, ఆకాశంలోనూ, భూమి మీదనూ ఉన్న సర్వం నీదే.
ప్రపంచాన్నీ, అందులో ఉన్న సర్వాన్నీ నీవు చేశావు.
12 ఉత్తర దక్షిణాలను నీవే సృష్టించావు.
తాబోరు పర్వతం, హెర్మోను పర్వతం నీ నామాన్ని కీర్తిస్తాయి. స్తుతి పాడుతాయి.
13 దేవా, నీకు శక్తి ఉంది!
నీ శక్తి గొప్పది!
విజయం నీదే!
14 సత్యం, న్యాయం మీద నీ రాజ్యం కట్టబడింది.
ప్రేమ, నమ్మకత్వం నీ సింహాసనం ఎదుట సేవకులు.
15 దేవా, నమ్మకమైన నీ అనుచరులు నిజంగా సంతోషంగా ఉన్నారు.
వారు నీ దయ వెలుగులో జీవిస్తారు.
16 నీ నామం వారిని ఎల్లప్పుడూ సంతోష పరుస్తుంది.
వారు నీ మంచితనాన్ని స్తుతిస్తారు.
17 నీవే వారి అద్భుత శక్తివి,
వారి శక్తి నీ నుండే లభిస్తుంది.
18 యెహోవా, నీవే మమ్మల్ని కాపాడేవాడవు.
ఇశ్రాయేలీయుల పరిశుద్ధుడు మా రాజు.
యూదా రాజుగా మనష్షే
33 మనష్షే యూదా రాజయ్యేనాటికి పన్నెండు సంవత్సరాలవాడు. యెరూషలేములో అతడు ఏబైయైదు సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. 2 యెహోవా దృష్టికి చెడ్డవైన పనులన్నీ మనష్షే చేశాడు. అన్యదేశాల వారి భయంకరమైన, పాప భూయిష్టమైన ఆచారాలన్నిటినీ అతడు అనుసరించాడు. ఆ రాజ్యాల వారిని ఇశ్రాయేలీయుల ఎదుటనుండి యెహోవా బయటకు వెడల గొట్టినాడు. 3 తన తండ్రి హిజ్కియా తొలగించిన ఉన్నత స్థలాలన్నీ మనష్షే మళ్లీ నిర్మించాడు. బయలు దేవతలకు పూజా పీఠాలను, అషేరా దేవతా స్తంభాలను మనష్షే నిర్మించాడు. నక్షత్ర మండలాలకు ప్రణమిల్లి, వాటిని అతడు ఆరాధించాడు. 4 యెహోవా ఆలయంలో బూటకపు దేవతలకు మనష్షే బలిపీఠాలు నిర్మించాడు. కాని “నా నామము యెరూషలేములో శాశ్వతంగా వుంటుంది” అని యెహోవా తన ఆలయ విషయంలో చెప్పియున్నాడు. 5 రెండు ఆలయ ఖాళీ స్థలాలలోను ప్రతి నక్షత్ర మండలానికి ఒక్కొక్కటి చొప్పున మనష్షే బలిపీఠాలను నిర్మించాడు. 6 బెన్‌హిన్నోము లోయలో[a] మనష్షే తన స్వంత పిల్లలను కూడ దేవతలకు బలియిచ్చాడు. మనష్షే భవిష్యత్తును తెలిసికోవటానికి మంత్రతంత్ర విద్యలను ఆశ్రయించి, సోదె చెప్పు వారిని, చిల్లంగి వాండ్రను సంప్రదించాడు. కర్ణపిశాచి విద్యలను పాటించే వారిని సోదెచెప్పు వారిని ప్రోత్సహించి వారి సలహాలు తీసికొన్నాడు. దేవుని దృష్టిలో చాలా హేయమైన పనులు చేశాడు. మనష్షే పాపాలు యెహోవాకు కోపం వచ్చేటట్లు చేశాయి. 7 అతడు ఒక దేవతా విగ్రహాన్ని కూడ చేయించి దానిని ఆలయంలో నెలకొల్పాడు. ఈ ఆలయాన్ని గురించి యెహోవా దావీదుకు, అతని కుమారుడు సొలొమోనుకు యిలా చెప్పినాడు: “ఈ ఆలయంలోను, యెరూషలేములోను నా నామమును స్థిరంగా ప్రతిష్టించుతాను. ఇశ్రాయేలు కుటుంబాల వారుంటున్న స్థానములన్నిటిలోను నేను యెరూషలేమును ఎంపిక చేసికొన్నాను. 8 ఇశ్రాయేలీయుల పూర్వీకులకు యివ్వడానికి నిశ్చయించిన ఈ రాజ్యంనుండి మరెన్నడూ నేను వారిని బయటకు వెళ్ల గొట్టను. కాని వారికి నేను ఆజ్ఞాపించిన విషయాలన్నిటినీ వారు తప్పక పాటించాలి. ఇశ్రాయేలు ప్రజలకు అందజేయమని నేను మోషేకు ఇచ్చిన ధర్మాశాస్త్రాన్ని, నియమ నిబంధనలను, ఆజ్ఞలను వారు తప్పక అనుసరించాలి.”
9 యూదా ప్రజలను, యెరూషలేము వాసులను తప్పుడు పనులు చేయటానికి మనష్షే ప్రోత్సహించాడు. ఇశ్రాయేలీయుల ముందు నుండి యెహోవా చేత బలవంతంగా వెళ్లగొట్టబడి నాశనం గావింపబడిన వారి కంటె వారు ఎక్కువ పాపాలు చేశారు.
10 యెహోవా మనష్షేతోను, అతని ప్రజలతోను మాట్లాడినాడు గాని, వారు దేవుని మాట వినటానికి నిరాకరించారు. 11 అందువల్ల అష్షూరు రాజు సైన్యాధికారులను యూదాపై దండెత్తటానికి యెహోవా రప్పించాడు. ఆ అధికారులు మనష్షేను పట్టుకుని, అతనికి సంకెళ్లు వేశారు. మనష్షే చేతులకు వారు ఇత్తడి గొలుసులు తగిలించారు. వారతనిని బందీగా బబులోనుకు పట్టుకుపోయారు.
12 మనష్షే చాలా బాధ అనుభవించాడు. ఆ సమయంలో తన దేవుడగు యెహోవాను వేడుకున్నాడు. తన పితరుల దేవుని ముందర మనష్షే మిక్కిలి విధేయుడైనాడు 13 మనష్షే దేవునికి ప్రార్థన చేసి, తనకు సహాయపడమని వేడుకున్నాడు. యెహోవా మనష్షే మనవి ఆలకించి, అతని విషయంలో బాధపడినాడు. యెహోవా అతనిని యెరూషలేముకు తిరిగి వచ్చి తన సింహాసనాన్ని మళ్లీ అలకరించేలా చేసినాడు. యెహోవాయే నిజమైన దేవుడని మనష్షే అప్పుడు తెలిసికొన్నాడు.
14 ఇది జరిగిన పిమ్మట మనష్షే దావీదు నగరానికి బయట ఒక గోడ కట్టించాడు. (కిద్రోను) లోయలో మత్స్యద్వారం ముంగిట నున్న గిహోను నీటి బుగ్గకు పశ్చిమంగా ఈ గోడవుంది. మనష్షే ఈ గోడను ఓపెలు కొండ చుట్టూ కట్టించాడు. ఈ గోడ చాలా ఎత్తుగా కట్టించాడు. పిమ్మట యూదాలో వున్న కోటలన్నిటిలో అతడు సైనికాధికారులను నియమించాడు. 15 ఇతర దేవుళ్ల విగ్రహాలన్నిటినీ మనష్షే తీసి పారవేశాడు. ఆలయంలో వున్న విగ్రహాన్ని అతడు తీసివేశాడు. యెరూషలేములో ఆలయ ప్రాకారం మీద అతను నెలకొల్పిన బలిపీఠాలన్నీ తొలగించాడు. ఆ బలిపీఠాలన్నిటినీ యెరూషలేము నగరంనుండి తీసి బయట పారవేశాడు. 16 పిమ్మట అతడు యెహోవా బలిపీఠాన్ని ప్రతిష్ఠించి దాని మీద సమాధానబలులు, కృతజ్ఞతార్పణలు సమర్పించాడు. ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను ఘనంగా ఆరాధించుమని మనష్షే యూదా ప్రజలందరికి ఆజ్ఞాపించాడు. 17 ప్రజలు ఉన్నత స్థలాలలో బలులు యివ్వటం కొనసాగించారు గాని వారు అవన్నీ వారి దేవుడగు యెహోవాకే అర్పించారు.
విశ్వాసము
11 ఆశించినవి తప్పక లభిస్తాయని నమ్మటం, మనకు కనిపించనివాటిని ఉన్నాయని నమ్మటం. ఇదే విశ్వాసం. 2 మన పూర్వికుల్లో యిలాంటి విశ్వాసముంది కనుకనే దేవుడు వాళ్ళను మెచ్చుకొన్నాడు.
3 దేవుడు ఆజ్ఞాపించటం వల్ల ఈ ప్రపంచం సృష్టింపబడిందని మనము విశ్వసిస్తున్నాము. అంటే, కనిపించనివాటితో కనిపించేది సృష్టింపబడిందన్న మాట.
4 హేబెలుకు దేవుని పట్ల విశ్వాసముంది గనుకనే అతడు కయీను అర్పించిన బలికన్నా విలువైన బలిని దేవునికి అర్పించాడు. హేబెలు అర్పించిన బలిని దేవుడు మెచ్చుకొని అతణ్ణి నీతిమంతునిగా పరిగణించాడు. అందుకే హేబెలు మరణించినా అతనిలో ఉన్న విశ్వాసం ద్వారా యింకా మాట్లాడుతునే ఉన్నాడు.
5 హనోకు దేవుణ్ణి విశ్వసించాడు కాబట్టే దేవుడతణ్ణి సజీవంగా పరలోకానికి తీసుకు వెళ్ళాడు. ఆ కారణంగానే అతడు ఎవ్వరికీ కనపడలేదు. పరలోకానికి వెళ్ళకముందు అతడు దేవుణ్ణి సంతోషపరచినందుకు దేవుడు అతణ్ణి మెచ్చుకొన్నాడు. 6 విశ్వాసం లేకుండా దేవుణ్ణి ఆనందపరచటం అసంభవం. దేవుని దగ్గరకు రావాలనుకొన్నవాడు ఆయనున్నాడని, అడిగినవాళ్ళకు ప్రతిఫలం యిస్తాడని విశ్వసించాలి.
7 నోవహు దేవుణ్ణి విశ్వసించినందువల్ల దేవుడతనికి, “ప్రళయం రాబోతున్నది” అని ముందే చెప్పాడు. అతనిలో భయభక్తులుండటం వల్ల అతడు దేవుని మాట విని, తన కుటుంబాన్ని రక్షించటానికి ఒక ఓడను నిర్మించాడు. అతనిలో ఉన్న విశ్వాసము ప్రపంచం తప్పు చేసిందని నిరూపించింది. ఆ విశ్వాసం మూలంగా అతడు నీతిమంతుడయ్యాడు.
© 1997 Bible League International