Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.
140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము.
2 ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
3 వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.
4 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
5 ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
నా దారిలో వారు ఉచ్చు పెడతారు.
6 యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
7 యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
8 యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
వారి పథకాలు నెగ్గనీయకు.
9 యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.
15 అప్పుడు మీకు నూతన కాపరులను (పాలకులు) ఇస్తాను. ఆ పాలకులు నాకు విశ్వాస పాత్రులై ఉంటారు. వారు జ్ఞానంతోను, అవగాహనతోను మిమ్మల్ని నడిపిస్తారు. 16 ఆ రోజుల్లో, రాజ్యంలో మీ సంతతి పెరిగి మీరనేకులై ఉంటారు.” ఈ వాక్కు యెహోవాది.
“ఆ సమయంలో ప్రజలు తాము దేవుని నిబంధన మందసాన్ని కలిగివున్న రోజులు గుర్తున్నట్లు చెప్పరు. ఆ యెహోవా ఒడంబడికను గూర్చి వారెంత మాత్రం తలంచరు. వారు దానిని గుర్తుంచుకోరు. పోగొట్టు కోరు. వారు మరో పవిత్ర ఒడంబడికను చేయరు. 17 ఆ సమయంలో యెరూషలేము నగరం ‘యెహోవా సింహాసనం’ అని పిలువబడుతుంది. దేశ దేశాల ప్రజలు యెరూషలేము నగరంలో కలిసి యెహోవాను స్మరించి ఆయన నామాన్ని గౌరవిస్తారు. ప్రజలు తమ మొండి హృదయాలను ఇక ఎంత మాత్రం అనుసరించరు. 18 ఆ రోజుల్లో యూదా వంశం ఇశ్రాయేలు వంశంతో కలుస్తుంది వారు ఉత్తర ప్రాంతంలో ఒకే చోటునుండి కలిసి వస్తారు. వారి పితరులకు నేనిచ్చిన రాజ్యంలోకి వారు వస్తారు.”
6 వట్టిమాటలతో మిమ్మల్నెవరూ మోసం చెయ్యకుండా జాగ్రత్తపడండి. దేవుని పట్ల అవిధేయత ఉన్నవాళ్ళు శిక్షింపబడతారు. 7 వాళ్ళు చేస్తున్న పనుల్లో పాల్గొనకండి. 8 ఒకప్పుడు మీరు చీకట్లో జీవించారు. కాని ప్రభువులో ఐక్యత కలిగినందువల్ల ప్రస్తుతం వెలుగులో జీవిస్తున్నారు. వెలుగు సంతానంవలె జీవించండి. 9 ఎందుకంటే వెలుగునుండి మంచితనము, నీతి అనే ఫలాలు లభిస్తాయి. 10 ప్రభువుకు ఏది ఇష్టమో తెలుసుకొని ఆ ప్రకారము వెలుగు సంబంధులవలే చేయండి. 11 చీకటికి సంబంధించిన కార్యాలు చెయ్యకండి. వాటి వల్ల ఉపయోగం లేదు. అలాంటి కార్యాలు చేస్తున్నవాళ్ళను గురించి అందరికీ చెప్పండి. 12 అవిధేయులు రహస్యంగా చేసినవాటిని గురించి మాట్లాడటం కూడా అవమానకరం. 13 వాటిని వెలుగులోకి తెస్తే వాటి నిజస్వరూపం బయటపడుతుంది. 14 వెలుగు అన్నీ కనిపించేలా చేస్తుంది. అందువల్లే ఈ విధంగా వ్రాయబడింది:
“నిద్రిస్తున్న ఓ మనిషీ, మేలుకో!
బ్రతికి లేచిరా!
క్రీస్తు నీపై ప్రకాశిస్తాడు.”
15 మీరు ఏ విధంగా జీవిస్తున్నారో జాగ్రత్తగా గమనించండి. బుద్ధిహీనుల్లాకాక, బుద్ధిగలవారిలా జీవించండి. 16 ఇవి మంచి రోజులు కావు. కనుక వచ్చిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకోండి. 17 మూర్ఖంగా ప్రవర్తించకండి. ప్రభువు ఆంతర్యాన్ని తెలుసుకోండి. 18 మత్తు పదార్థాలు త్రాగుతూ, త్రాగుబోతుల్లా జీవించకండి. త్రాగుబోతుతనం వ్యభిచారానికి దారితీస్తుంది. కనుక దానికి మారుగా పరిశుద్ధాత్మతో నింపబడండి. 19 స్తుతిగీతాలతో, పాటలతో, ఆత్మీయ సంకీర్తనలతో హెచ్చరింపబడుతూ, ప్రభువును మీ మనస్సులలో కీర్తిస్తూ, స్తుతిగీతాలు, పాటలు పాడండి. 20 మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట తండ్రియైన దేవునికి అన్ని వేళలా కృతజ్ఞతలు చెల్లించండి.
© 1997 Bible League International