Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 140

సంగీత నాయకునికి: దావీదు స్తుతి కీర్తన.

140 యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము.
ఆ మనుష్యులు కీడు పనులు చేయాలని ఆలోచిస్తున్నారు.
    వాళ్లు ఎల్లప్పుడూ కొట్లాటలు మొదలు పెడ్తారు.
వారి నాలుకలు విషసర్పాల నాలుకల్లాంటివి
    వారి నాలుక క్రింద సర్పవిషం ఉంది.

యెహోవా, దుర్మార్గుల నుండి నన్ను రక్షించుము.
    కృ-రుల నుండి నన్ను కాపాడుము. ఆ మనుష్యులు నన్ను తరిమి, బాధించుటకు ప్రయత్నిస్తారు.
ఆ గర్విష్ఠులు నా కోసం ఉచ్చు పెడతారు.
    నన్ను పట్టుకొనేందుకు వాళ్లు వల పన్నుతారు.
    నా దారిలో వారు ఉచ్చు పెడతారు.

యెహోవా, నీవు నా దేవుడవని నీతో చెప్పుకొన్నాను.
    యెహోవా, నా ప్రార్థన ఆలకించుము.
యెహోవా, నీవు నాకు బలమైన ప్రభువు. నీవు నా రక్షకుడవు.
    నీవు ఇనుప టోపివలె యుద్ధంలో నా తలను కాపాడుతావు.
యెహోవా, ఆ దుర్మార్గులు కోరినట్టుగా వారికి జరగనివ్వవద్దు.
    వారి పథకాలు నెగ్గనీయకు.

యెహోవా, నా శత్రువులను గెలువనియ్యకుము.
    ఆ మనుష్యులు చెడు కార్యాలు తలపెడుతున్నారు. అయితే ఆ చెడుగులు వారికే సంభవించునట్లు చేయుము.
10 వాళ్ల తలలమీద మండుచున్ననిప్పులు పోయుము.
    నా శత్రువులను అగ్నిలో పడవేయుము.
    వారు ఎన్నటికీ ఎక్కిరాలేని గోతిలో వారిని పడవేయుము.
11 యెహోవా, ఆ అబద్దికులను బ్రతుకనియ్యకుము.
    ఆ దుర్మార్గులకు చెడు సంగతులు జరుగనిమ్ము.
12 పేదవాళ్లకు యెహోవా న్యాయంగా తీర్పు తీరుస్తాడని నాకు తెలుసు.
    నిస్సహాయులకు దేవుడు సహాయం చేస్తాడు.
13 యెహోవా, మంచి మనుష్యులు నీ నామాన్ని స్తుతిస్తారు.
    నీ సన్నిధానంలో వారు నివసిస్తారు.

ఆదికాండము 24:34-41

రిబ్కా కోసం సంప్రదింపు

34 ఆ సేవకుడు చెప్పింది ఇది: “నేను అబ్రాహాము సేవకుడను. 35 అన్ని విషయాల్లోను యెహోవా నా యజమానిని ఎంతో గొప్పగా ఆశీర్వదించాడు. నా యజమాని మహా ఘనుడయ్యాడు. గొర్రెల మందలు, పశువుల మందలు విస్తారంగా యెహోవా అబ్రాహాముకు ఇచ్చాడు. అబ్రాహాముకు వెండి బంగారాలు విస్తారంగా ఉన్నాయి. చాలా మంది ఆడ, మగ సేవకులు ఉన్నారు. ఒంటెలు, గాడిదలు చాలా ఉన్నాయి. 36 నా యజమాని భార్య శారా. ఆమె చాలా వృద్ధాప్యంలో ఒక కుమారుని కన్నది. నా యజమాని తన ఆస్తి సర్వం ఆ కుమారునికి ఇచ్చాడు. 37 నేను ఒక వాగ్దానం చేయాలని నా యజమాని నన్ను బలవంతం చేశాడు. నా యజమాని ‘నా కుమారుణ్ణి కనాను అమ్మాయిల్లో ఎవర్నీ చేసుకోనివ్వగూడదు. మనం ఆ ప్రజల మధ్య నివసిస్తున్నాం కాని కనాను అమ్మాయిల్నెవరినీ అతడు చేసుకోవటం నాకు ఇష్టం లేదు. 38 కనుక నీవు నా తండ్రి దేశానికి వెళ్తానని వాగ్దానం చేయాలి. నా వంశం వారి దగ్గరకు వెళ్లి, నా కుమారుని కోసం భార్యను కుదుర్చు’ అని నాతో చెప్పాడు. 39 ‘ఒక వేళ ఆ స్త్రీ నాతో కలిసి ఈ దేశానికి రాదేమో’ అని నేను నా యజమానితో అన్నాను. 40 అయితే నా యజమాని నాతో ఇలా చెప్పాడు, ‘నేను యెహోవాను సేవిస్తాను, యెహోవా తన దూతను నీతో కూడ పంపి నీకు సహాయం చేస్తాడు. అక్కడి ప్రజలలో నా కుమారుని కోసం భార్యను నీవు కనుక్కొంటావు. 41 కాని నీవు నా తండ్రి దేశం వెళ్లాక, నా కుమారుని కోసం భార్యను ఇచ్చేందుకు వారు నిరాకరిస్తే, అప్పుడు ఈ ప్రమాణ బాధ్యత నీకు ఉండదు.’

ఆదికాండము 24:50-67

50 అప్పుడు లాబాను, బెతూయేలు జవాబిచ్చారు. “ఇది యెహోవా నుండి వచ్చినట్లు మేము చూస్తున్నాము. కాబట్టి దీన్ని మార్చమని మేము చెప్పుటకు ఏమీలేదు. 51 రిబ్కా నీ ముందే వుంది. ఆమెను తీసుకొని వెళ్లు. నీ యజమాని కుమారుణ్ణి ఆమె పెళ్లి చేసుకొంటుంది. ఇదే యెహోవా కోరేది.”

52 అబ్రాహాము సేవకుడు ఈ మాటలు విని, యెహోవా యెదుట నేలపై సాగిలపడ్డాడు.

53 అప్పుడు ఆ సేవకుడు తాను తెచ్చిన కానుకలను రిబ్కాకు ఇచ్చాడు. బంగారు, వెండి నగలు, ఎన్నో అందమైన బట్టలు అతడు రిబ్కాకు యిచ్చాడు. ఆమె సోదరునికి, తల్లికి కూడ చాలా ఖరీదైన కానుకలు అతడు ఇచ్చాడు. 54 ఆ సేవకుడు, అతనితోనున్న సేవకులు భోజనము చేసి, ఆ రాత్రి అక్కడే ఉండిపోయారు. మర్నాడు ఉదయం వారు లేచి, “ఇప్పుడు మేము తిరిగి మా యజమాని దగ్గరకు వెళ్తాం” అని అన్నారు.

55 అప్పుడు రిబ్కా తల్లి, సహోదరుడు ఈ విధంగా చెప్పారు, “రిబ్కాను కొన్నాళ్లు మా దగ్గర ఉండనివ్వు. పది రోజులు ఉండనివ్వు. ఆ తర్వాత ఆమె వెళ్లవచ్చు.”

56 కానీ ఆ సేవకుడు, “నన్ను ఇంక ఆపవద్దు. నా ప్రయాణాన్ని యెహోవా విజయవంతం చేశాడు. కనుక ఇప్పుడు నా యజమాని దగ్గరకు నన్ను వెళ్లనివ్వండి” అని వారితో చెప్పాడు.

57 “రిబ్కాను పిలిచి, ఆమె ఇష్టం ఏమిటో మేము అడుగుతాం” అన్నారు రిబ్కా అన్న మరియు తల్లి. 58 వారు రిబ్కాను పిలిచి, “నీవు ఈ మనుష్యునితో కలిసి ఇప్పుడే వెళ్తావా?” అని అడిగారు.

“అవును, నేను వెళ్తాను” అంది రిబ్కా.

59 కనుక అబ్రాహాము సేవకునితో, అతని మనుష్యులతో కలిసి రిబ్కా వెళ్లటానికి వారు అనుమతించారు. రిబ్కా దాది కూడ వారితో వెళ్లింది. 60 వారు వెళ్తున్నప్పుడు రిబ్కాతో వారు ఇలా చెప్పారు:

“మా సోదరీ, వేలమందికి, పది వేలమందికి నీవు తల్లివి అవుదువు గాక.
    నీ సంతానము వారి శత్రువులను ఓడించి, వారి పట్టణాలను స్వాధీనం చేసుకొందురు గాక!”

61 అప్పుడు రిబ్కా, ఆమె దాది ఒంటెలను ఎక్కి ఆ సేవకుని, అతని మనుష్యులను వెంబడించారు. ఆ విధంగా ఆ సేవకుడు రిబ్కాను తోడుకొని తిరుగు ప్రయాణమయ్యాడు.

62 అప్పటికి ఇస్సాకు బెయేర్ లహాయిరోయి విడిచి, నెగెవులో నివసిస్తున్నాడు. 63 ఒక సాయంకాలం ఇస్సాకు ధ్యానించుట కోసం అలా బయటకు పోలాల్లోకి వెళ్లాడు. ఇస్సాకు తలెత్తి చూచేటప్పటికి అంత దూరంలో వస్తున్న ఒంటెలు కనిపించాయి.

64 రిబ్కా తలెత్తి ఇస్సాకును చూసింది. అప్పుడామె ఒంటె మీద నుండి క్రిందికి దిగింది. 65 “మనలను కలుసుకొనేందుకు ఆ పొలాల్లో నడిచి వస్తున్న యువకుడు ఎవరు?” అంటూ ఆమె సేవకుని అడిగింది.

“ఆయనే నా యజమాని కుమారుడు” అని చెప్పాడు ఆ సేవకుడు. కనుక రిబ్కా తన ముఖం మీద ముసుగు కప్పుకొంది. 66 జరిగిన సంగతులన్నీ ఇస్సాకుతో ఆ సేవకుడు చెప్పాడు. 67 అప్పుడు ఇస్సాకు ఆ అమ్మాయిని తన తల్లి గుడారంలోకి తీసుకు వచ్చాడు. ఆ రోజు రిబ్కా ఇస్సాకు భార్య అయ్యింది. ఇస్సాకు ఆమెను చాలా ప్రేమించాడు. తన తల్లి మరణించిన తర్వాత అప్పుడు ఇస్సాకు దుఃఖనివారణ పొందాడు.

1 యోహాను 2:7-11

మనం యితరుల్ని ప్రేమించాలని యేసు చెప్పాడు

ప్రియ మిత్రులారా! నేను మీ కోసం క్రొత్త ఆజ్ఞను వ్రాయటం లేదు. మొదటినుండి మీ దగ్గర ఉన్న పాత ఆజ్ఞనే వ్రాస్తున్నాను. మీరు విన్న సందేశమే ఈ పాత ఆజ్ఞ. అయినా, ఆ ఆజ్ఞను ఒక క్రొత్త ఆజ్ఞగా మీ కోసం వ్రాస్తున్నాను. దాని సత్యం అందరిలో కనిపిస్తోంది. చీకటి గతిస్తోంది. నిజమైన వెలుగు ప్రకాశించటం మొదలు పెట్టింది.

తాను వెలుగులో ఉన్నానని చెప్పుకొంటూ తన సోదరుణ్ణి ద్వేషించేవాడు యింకా అంధకారంలో ఉన్నాడన్నమాట. 10 సోదరుణ్ణి ప్రేమించేవాడు వెలుగులో జీవిస్తాడు. అతనిలో ఏ ఆటంక కారణం ఉండదు. 11 కాని సోదరుణ్ణి ద్వేషించేవాడు అంధకారంలోనే ఉండిపోతాడు. అంటే, ఆ అంధకారంలోనే తిరుగుతూ ఉంటాడన్న మాట. చీకటి అతణ్ణి గ్రుడ్డివానిగా చేసింది కాబట్టి తానెక్కడికి వెళ్తున్నది అతనికే తెలియదు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International