Revised Common Lectionary (Complementary)
దావీదుకు అభిమాన కావ్యము.
16 దేవా నేను నీమీద ఆధారపడ్డాను గనుక నన్ను కాపాడుము.
2 “యెహోవా, నీవు నా యజమానివి
నాకు గల ప్రతి మంచిది నీ నుండి నాకు లభిస్తుంది”
అని నేను యెహోవాతో చెప్పాను.
3 మీరు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధుల గురించి కూడా చెప్పారు,
“వారు నాకు గోప్పవారు, వారే నన్ను సంతోషపెట్టువారు.”
4 కాని ఇతర దేవుళ్లను పూజించుటకు పరుగులెత్తే మనుష్యులకు అధిక బాధ కలుగుతుంది.
ఆ దేవతలకు వారు ఇచ్చే రక్తపు అర్పణల్లో నేను భాగం పంచుకోను.
ఆ దేవతల పేర్లు కూడ నేను పలుకను.
5 నా భాగం, నా పాత్ర యెహోవా దగ్గర్నుండి మాత్రమే వస్తుంది.
యెహోవా, నీవే నన్ను బలపరచావు.
యెహోవా, నీవే నా వంతు నాకు ఇమ్ము.
6 నా వంతు చాలా అద్భుతమయింది.
నా స్వాస్థ్యము చాలా అందమయింది.
7 యెహోవా నాకు చక్కగా నేర్పించాడు. కనుక నేను ఆయనను స్తుతిస్తాను.
రాత్రియందు, నా అంతరంగపు లోతుల్లోనుండి ఉపదేశములు వచ్చాయి.
8 నేను ఎల్లప్పుడూ యెహోవాను నా యెదుట ఉంచుకొంటాను.
ఎందుకనగా ఆయన నా కుడి ప్రక్కన వున్నాడు.
నేను ఎన్నడూ కదల్చబడను. ఆయన కుడిప్రక్కను నేను ఎన్నడూ విడువను.
9 కనుక నా ఆత్మ, నా హృదయము ఎంతో సంతోషంగా ఉన్నాయి.
నా శరీరం కూడ క్షేమంగా బ్రతుకుతుంది.
10 ఎందుకంటే, యెహోవా, నీవు నా అత్మను చావు స్థలంలో విడిచిపెట్టవు గనుక.
నీ పరిశుద్ధుడిని సమాధిలో కుళ్లిపోనీయవు.
11 సరైన జీవిత విధానాన్ని నీవు నాకు నేర్పిస్తావు.
యెహోవా, నీతో ఉండటమే నాకు సంపూర్ణ సంతోషం కలిగిస్తుంది.
నీ కుడిప్రక్కన ఉండటం నాకు శాశ్వత సంతోషం కలిగిస్తుంది.
అహజ్యాకు సందేశం
1 అహాబు మరణానంతరం, ఇశ్రాయేలు మీద మోయాబు తిరుగుబాటు చేసింది.
2 ఒకరోజు షోమ్రోనులోని తన ఇంటి పై భాగాన అహజ్యా ఉన్నాడు. ఆ ఇంటి కప్పునుండి కొయ్యకడ్డీల గుండా అహజ్యా క్రిందపడి, బాగా గాయపడ్డాడు. అహజ్యా తన దూతల్ని పిలిచి వాళ్లతో, “ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకుల దగ్గరకి వెళ్లండి. నా గాయాలనుండి నేను బయట పడగలుగుతానో లేదో వారిని అడగండి” అనిచెప్పాడు.
3 కాని తిష్బీయుడైన ఏలీయాతో యెహోవా దూత ఇలా చెప్పాడు: “షోమ్రోను నుంచి అహజ్యా రాజు కొందరు దూతలను పంపాడు. ఆ మనుష్యుల్ని కలుసుకో. ‘ఇశ్రాయేలులో దేవుడున్నాడు. కనుక ఎక్రోను దేవుని బయల్జెబూబుల యాజకులను అడగటానికి ఎందుకు మీరు అక్కడికి వెళుతున్నారు? అని వారిని అడుగుము. 4 మరియు అహజ్యా రాజుతో ఈ విషయాలు చెప్పమని ఆ దూతలకు ఆజ్ఞాపించుము. బయల్జెబూబును అడగటానికి నీవు దూతలను పంపించావు. నీవీ విధంగా చేయడంవలన నీవు పడకనుంచి లేవవు, నీవు మరణిస్తావు అని యెహోవా చెప్పాడు.’” తర్వాత అక్కడనుంచి వెళ్లి ఆ మాటలు అహజ్యా సేవకులకు ఏలీయా చెప్పాడు.
5 దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు.
6 దూతలు అహజ్యాతో ఇట్లన్నారు: “మమ్మల్ని కలుసుకునేందుకు ఒక వ్యక్తి వచ్చాడు. మమ్మల్ని పంపించిన రాజుకి యెహోవా చెప్పిన మాటలు చెప్పమని అతను చెప్పాడు. ‘ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు, అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబుని ప్రశ్నలడగటం దేనికి? ఇట్లు చేయడంవల్ల నీవు పడక నుండి లేవవనియు, నీవు మరణిస్తావనియు యెహోవా చెప్పాడు!’”
7 “మిమ్మల్ని కలుసుకుని మీకు ఈ మాటలు చెప్పిన ఆ వ్యక్తి ఎలా వున్నాడు?” అని అహజ్యా దూతలను అడిగాడు.
8 “ఆవ్యక్తి వెంట్రుకలతో చేసిన వస్త్రము ధరించాడు. నడుముకి ఒక తోలు నడికట్టు ధరించాడు” అని అహజ్యాకు దూతలు సమాధానమిచ్చారు.
తర్వాత అహజ్యా, “తిష్బీయుడయిన ఏలీయానే అది” అని అన్నాడు.
అహజ్యా పంపిన నాయకులను అగ్ని నాశనము చేయుట
9 అహజ్యా ఏలియా వద్దకు ఒక నాయకుని మరియు ఏభై మంది మనుష్యుల్ని పంపాడు. ఆ నాయకుడు ఏలీయావద్దకు వెళ్లాడు. అప్పుడు ఏలీయా ఒక కొండ పై భాగాన కూర్చొని వున్నాడు. నాయకుడు, “దేవుని మనిషీ, ‘క్రిందికి దిగమని రాజు చెప్పాడు’” అని పలికాడు.
10 ఏలీయా ఏభైమంది మనుష్యులను, ఆ నాయకుని చూచి, “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ, నీ ఏభై మందిని నాశనం చేయునుగాక” అన్నాడు.
అందువల్ల పరలోకం నుండి అగ్ని వచ్చి ఆ నాయకుని, ఏభై మందిని నాశనం చేసింది.
11 అహజ్యా మరల ఏభై మందితో మరొక నాయకుని ఏలీయా వద్దకు పంపాడు. ఆ నాయకుడు ఏలీయాతో, “దేవుని మనిషీ, క్రిందికి త్వరగా రమ్ము అని రాజు చెప్పాడు” అని పలికాడు.
12 ఏలీయా ఆ నాయకుని అతని ఏభై మంది మనుష్యులతో “నేనే కనుక దేవుని మనిషినైతే, పరలోకం నుంచి అగ్ని వచ్చి నిన్నూ నీ ఏభై మంది మనుష్యులను నాశనము చేయుగాక!” అన్నాడు.
అప్పుడు దేవుని అగ్ని పరలోకం నుండి వచ్చి వారిని నాశనము చేసింది.
13 అహజ్యా మూడవ నాయకుని ఏభై మంది మనుష్యులతో పంపాడు. ఆ మూడవ నాయకుడు ఏలీయా వద్దకు వచ్చాడు. ఆ నాయకుడు మోకరిల్లి ఏలీయాను అర్థించాడు: “దేవుని మనిషీ, నా జీవితమూ నా ఏభై మంది సేవకుల జీవితములు నీకు విలువగలవై వుండునుగాక! 14 పరలోకం నుండి అగ్ని వచ్చి మొదటి ఇద్దరు నాయకులను వారి ఏభై మంది మనుష్యులను నాశనం చేసింది. మా మీద కరుణ చూపి మమ్ము బ్రతకనిమ్ము.”
15 యెహోవా దూత ఏలీయాతో, “ఆ నాయకునితో పొమ్ము, అతనికి భయపడకుము” అన్నాడు.
అందువల్ల ఏలీయా ఆ నాయకునితో కూడా అహజ్యా రాజుని చూడటానికి వెళ్లాడు.
16 అహజ్యాతో ఏలీయా, “యెహోవా నీ విషయమై ఈలాగున చెప్పెను, ఇశ్రాయేలులో ఒక దేవుడున్నాడు. అందువల్ల ఎక్రోను దేవుడైన బయల్జెబూబు వద్దకు ప్రశ్నలడగమని దూతలను ఎందుకు పంపావు? నీవు ఇట్లు చేయడం వలన, నీవు నీ పడకనుండి లేవవు. నీవు మరణిస్తావు” అన్నాడు.
గలతీయుల పట్ల పౌలు శ్రద్ధ
8 ఇదివరలో మీకు నిజమైన దేవుణ్ణి గురించి తెలియదు. కనుక మీరు వట్టి దేవుళ్ళకు బానిసలై జీవించారు. 9 కాని యిప్పుడు మీకు దేవుడెవరో తెలుసు. లేక దేవుడు మిమ్మల్ని తెలుసుకొన్నాడు. అలాంటప్పుడు బానిసలు కావటానికి నిస్సారమైన, నిరర్థకమైన ఆ శక్తుల వైపు మళ్ళీ ఎందుకు వెళ్తున్నారు? 10 మీరు ప్రత్యేకమైన దినాలను, నెలలను, ఋతువులను, సంవత్సరాలను యింకా పాటిస్తున్నారు. 11 మిమ్మల్ని చూస్తే నాకు దిగులు వేస్తోంది. మీకోసం వ్యర్థంగా శ్రమపడ్డానేమోనని అనిపిస్తోంది.
12 సోదరులారా! నేను మీలా అయ్యాను. కనుక మీరు నాలా కావాలని విన్నవించుకుంటున్నాను. మీరు నా పట్ల ఏ అపరాధమూ చెయ్యలేదు. 13 నాకు అనారోగ్యంగా ఉండటం వల్ల నేను మీ దగ్గరకు వచ్చాను. తద్వారా మీకు మొదట సువార్త ప్రకటించే అవకాశం నాకు కలిగింది. 14 నా అనారోగ్యం మీకు కష్టం కలిగించినా మీరు నన్ను తిరస్కరించలేదు. విసుక్కోలేదు. దానికి మారుగా నేనొక దేవదూతనైనట్లు, నేను యేసు క్రీస్తునైనట్లు నాకు స్వాగతం చెప్పారు. 15 మీ ఆనందం ఏమైంది? మీరు నా సహాయం కోసం మీ కళ్ళు కూడా పీకి నాకిచ్చి ఉండేవాళ్ళు. ఇది నేను ఖచ్చితంగా చెప్పగలను. 16 నిజం చెప్పటంవల్ల యిప్పుడు నేను మీ శత్రువునయ్యానా?
17 వాళ్ళు మిమ్మల్ని లోబరచుకోవాలని గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దానివల్ల మీకు మంచి కలుగదు. మానుండి మిమ్మల్ని వేరు చెయ్యాలని వాళ్ళ ప్రయత్నం. మీరు వాళ్ళను మాత్రమే అనుసరించాలని వాళ్ళ ఉద్దేశ్యం. 18 ఉద్దేశ్యం మంచిదైతే పట్టుదలతో ఉండటం మంచిదే. కనుక నేను మీతో ఉన్నప్పుడు మాత్రమే కాకుండా ఎప్పుడూ అదే విధంగా ఉండండి. 19 నా ప్రియమైన బిడ్డలారా! క్రీస్తులో మీరు మరలా రూపం దాల్చే వరకూ నేను మీకోసం మళ్ళీ ఈ ప్రసవవేదన పడ్తూ ఉండవలసిందే. 20 మీ విషయంలో నాకు చాలా దిగులుగా ఉంది. కనుక మీతో ప్రత్యక్షంగా మాట్లాడాలని, మరొక విధంగా మీకు చెప్పాలని ఉంది.
© 1997 Bible League International