Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
64 దేవా, నా ప్రార్థన ఆలకించుము.
నా శత్రువులను గూర్చి నేను భయపడుతున్నాను. నా ప్రాణమును కాపాడుము.
2 నా శత్రువుల రహస్య పన్నాగాల నుండి నన్ను కాపాడుము.
ఆ దుర్మార్గుల బారి నుండి నన్ను దాచి పెట్టుము.
3 వారు నన్ను గూర్చి ఎన్నో చెడ్డ అబద్ధాలు చెప్పారు.
వారి నాలుకలు వాడిగల కత్తులవలె ఉన్నాయి, వారి కక్ష మాటలు బాణాల్లా ఉన్నాయి.
4 వారు దాక్కొని ఆ తరువాత తమ బాణాలను సామాన్యమైన ఒక నిజాయితీపరుని మీద వేస్తారు.
అతడు దానిని గమనించకముందే అతడు గాయ పరచబడతాడు.
5 అతన్ని ఓడించుటకు వారు చెడ్డ పనులు చేస్తారు.
వారు వారి ఉరులను పెడతారు. “వారిని ఎవరూ పట్టుకోరని, చూడరని” వారనుకొంటారు.
6 మనుష్యులు చాలా యుక్తిగా ఉండగలరు.
మనుష్యులు ఏమి తలస్తున్నారో గ్రహించటం ఎంతో కష్టం.
7 కాని దేవుడు తన “బాణాలను” వారిమీద వేయగలడు.
అది వారు గమనించకముందే దుర్మార్గులు గాయపరచబడతారు.
8 దుర్మార్గులు ఇతరులకు కీడు చేయుటకు పథకం వేస్తారు.
కాని దేవుడు వారి పథకాలను పాడుచేయగలడు.
ఆ కీడు వారికే సంభవించేలా ఆయన చేయగలడు.
అప్పుడు వారిని చూసే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో వారి తలలు ఊపుతారు.
9 దేవుడు చేసిన వాటిని మనుష్యులు చూస్తారు.
వారు దేవుని క్రియలను ప్రకటిస్తారు.
అప్పుడు ప్రతి ఒక్కరూ దేవుని గూర్చి ఎక్కువగా తెలిసికొంటారు.
ఆయనకు భయపడి గౌరవించడం వారు నేర్చుకొంటారు.
10 మంచివాళ్లు యెహోవాయందు సంతోషంగా ఉండాలి.
వారు ఆయన్ని నమ్ముకోవాలి.
మంచి మనుష్యుల్లారా, మీరంతా యెహోవాను స్తుతించండి.
యోబుకు బిల్దదు జవాబు
18 అప్పుడు షూహీ దేశస్తుడైన బిల్దదు యోబుకు ఇలా జవాబు చెప్పాడు:
2 “యోబూ! ఈ మాటలన్నీ ఎప్పుడు చాలిస్తావు?
నీవు మౌనంగా ఉండి వినాలి. అప్పుడు మనం మాట్లాడుకోవచ్చు
3 మేము పశువుల్లా బుద్ధిహీనులం అని నీవు ఎందుకు తలస్తావు?
4 యోబూ! నీ కోపంతో నీకు నీవే హాని చేసుకొంటున్నావు.
కేవలం నీ కోసం మనుష్యులు ఈ భూమిని విడిచిపోవాలా?
కేవలం నిన్ను తృప్తి పరచటం కోసం దేవుడు పర్వతాలను కదిపిస్తాడని నీవు తలస్తున్నావా?
5 “అవును నిజమే, దుర్మార్గుని దీపం ఆరిపోతుంది.
అతని అగ్ని కాలకుండా ఆగిపోతుంది.
6 అతని ఇంటిలోని వెలుగు చీకటి అవుతుంది.
అతని ప్రక్కగా ఉన్న దీపం ఆరిపోతుంది.
7 ఆ మనిషి అడుగులు మరల గట్టిగా, వేగంగా ఉండవు. కానీ అతడు నిధానంగా నడుస్తాడు, బలహీనంగా ఉంటాడు.
అతని స్వంత దుర్మార్గపు ఆలోచనలే అతడు పడిపోయేట్టు చేస్తాయి.
8 అతని స్వంత పాదాలే అతనిని వలలో పడదోస్తాయి.
అతడు బోనులోనికి నడచి, అందులో చిక్కుకొంటాడు.
9 ఒక బోను అతని మడిమెను పట్టేస్తుంది.
ఒక బోను అతన్ని గట్టిగా బంధిస్తుంది.
10 అతని కోసం నేలమీద ఒక తాడు దాచబడి ఉంటుంది.
అతని తోవలో ఒక బోను సిద్ధంగా ఉంది.
11 అతని చుట్టూరా భయం పొంచి ఉంది.
అతడు వేసే ప్రతి అడుగు వెనుక భయం ఉంటుంది.
12 చెడ్డ కష్టాలు అతని కోసం ఆకలితో వున్నాయి.
అతడు పడిపోయినప్పుడు పతనం, నాశనం అతని కోసం సిద్ధంగా ఉన్నాయి.
13 భయంకర రోగం అతని చర్మంలో కొన్ని భాగాలను తినివేస్తుంది.
అది అతని చేతులను, కాళ్లను కుళ్లిపోచేస్తుంది.
14 దుర్మార్గుడు క్షేమంగా ఉన్న తన ఇంటిలో నుండి తీసుకొని పోబడతాడు.
భయాన రాజును ఎదుర్కొనేందుకు అతడు నడిపించబడతాడు.
15 అతనికి తన ఇంటిలో ఏమీ విడిచిపెట్టబడదు.
ఎందుకంటే అతని ఇంటినిండా, మండుతున్న గంధకం చల్లబడుతుంది.
16 క్రింద అతని వేర్లు ఎండిపోతాయి.
పైన అతని కొమ్మలు చస్తాయి.
17 భూమి మీద మనుష్యులు అతనిని జ్ఞాపకం చేసుకోరు.
ఏ వ్యక్తికూడ అతన్ని ఇంకెంత మాత్రం జ్ఞాపకం చేసుకోడు.
18 మనుష్యులు అతనిని వెలుతురు నుండి నెట్టివేస్తారు.
అతడు చీకటిలోనికి శిక్షించబడతాడు.
వారు అతన్నిలోకంలో నుండి తరిమివేస్తారు.
19 అతనికి పిల్లలు లేక మనుమలు ఎవ్వరూ ఉండరు.
అతని కుమారుల నుండి వారసులు ఉండరు.
అతనియింట యింకా సజీవంగా ఉండే మనుష్యులు ఎవ్వరూ ఉండరు.
20 దుర్మార్గునికి సంభవించిన దానిని గూర్చి విన్నప్పుడు పడమట ఉన్న ప్రజలు అదిరిపోతారు.
తూర్పున ఉన్న ప్రజలు భయంతో మెత్తబడి పోతారు.
21 ఇది నిజం, దుర్మార్గునికి, అతని ఇంటికి ఇలాగే జరుగుతుంది.
దేవుని గూర్చి లక్ష్యపెట్టని వానికి ఇలాగే జరుగుతుంది!”
నిజమైన జ్ఞానము
18 ఎందుకంటే, క్రీస్తు సిలువను గురించిన సందేశము నశించిపోయే వాళ్ళకు నిష్ప్రయోజనంగా కనిపిస్తుంది. కాని రక్షింపబడుతున్న మనకు అది దేవుని శక్తి. 19 దీన్ని గురించి ప్రవచనాల్లో ఈ విధంగా వ్రాయబడి ఉంది:
“విజ్ఞానుల్లో ఉన్న విజ్ఞానాన్ని నేను నాశనం చేస్తాను.
పండితుల్లో ఉన్న తెలివిని నిష్ప్రయోజనం చేస్తాను.”(A)
20 మరి విజ్ఞానులు ఏమయ్యారు? పండితులు ఏమయ్యారు? సమకాలిక తర్క శాస్త్రజ్ఞులు ఏమయ్యారు? అంటే, దేవుడు ఈ ప్రపంచంలో ఉన్న జ్ఞానం నిష్ప్రయోజనమని రుజువు చేసినట్లే కదా! 21 తనను జ్ఞానంతో కనుక్కోవటం సాధ్యం కారాదని దేవుడే నిర్ణయించాడు. దానికి మారుగా ప్రజలు “మూర్ఖత్వం” అని భావిస్తున్న “మా సందేశాన్ని” విశ్వసించినవాళ్ళు రక్షింపబడాలని ఆయన నిర్ణయించాడు.
22 యూదులు మహిమలు అడుగుతారు. గ్రీకులు జ్ఞానాన్ని అన్వేషిస్తారు. 23 మేమైతే, సిలువపైనున్న క్రీస్తును ప్రకటిస్తాము. మా సందేశం యూదులకు ఒక ఆటంకంగాను, యూదులుకాని వాళ్ళకు అర్థం లేనిదానిగాను కనిపిస్తుంది. 24 కాని దేవుడు పిలిచిన యూదులకు, యూదులుకానివాళ్ళకు “క్రీస్తు” దేవుని శక్తితో, ఆయన జ్ఞానంతో సమానము. 25 దేవుని అవివేకం, నిజానికి మానవుని జ్ఞానం కన్నా శ్రేష్ఠమైనది. దేవుని బలహీనత మానవుల బలంకన్నా శక్తివంతమైనది.
26 సోదరులారా! మిమ్నల్ని పిలిచినప్పుడు మీరు ఏ విధంగా ఉన్నారో జ్ఞాపకం ఉందా? ప్రపంచం మిమ్మల్ని జ్ఞానులుగా పరిగణించలేదు. మీకు పేరు ప్రతిష్ఠలు లేవు. మీరు ఉన్నత కుటుంబాలకు చెందలేదు. 27 కాని దేవుడు విజ్ఞానుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని మూర్ఖుల్ని ఎన్నుకొన్నాడు. బలవంతుల్ని సిగ్గుపరచాలని ప్రపంచంలోని బలహీనుల్ని ఎన్నుకొన్నాడు. 28 ప్రపంచం ముఖ్యమైనవాళ్ళని భావిస్తున్న మనుష్యుల ప్రాముఖ్యతను తీసివేయటానికి, దేవుడు ఈ లోకంలో చిన్నచూపుతో చూడబడేవాళ్ళనూ, ఏవగించుకొనబడేవాళ్ళనూ, లెక్క చెయ్యబడనివాళ్ళను ఎన్నుకొన్నాడు. 29 తనముందు ఎవ్వరూ గర్వించరాదని ఆయన ఉద్దేశ్యం. 30 కాని దేవుని కారణంగా మీకు యేసు క్రీస్తులో ఐక్యత కలిగింది. దేవుడు క్రీస్తును మీకు జ్ఞానంగా యిచ్చాడు. క్రీస్తు మనకు నీతి, పవిత్రత, విమోచన కలిగిస్తాడు. 31 అందువల్ల లేఖనాల్లో వ్రాయబడినట్లు. “గర్వించాలనుకొన్నవాడు ప్రభువు విషయంలో గర్వించాలి.”(B)
© 1997 Bible League International