Revised Common Lectionary (Complementary)
జ్ఞానము, ఒక మంచి స్త్రీ
8 జ్ఞానం మిమ్మల్ని పిలుస్తుంది, వినండి!
మీరు వినాలని తెలివి మిమ్మల్ని పిలుస్తోంది.
2 మార్గం ప్రక్కగా, దారులు కలిసే చొట
కొండ శిఖరము మీద అవి నిలబడ్డాయి.
3 పట్టణంలోకి ద్వారాలు తెరచుకొనే చోట అవి వున్నాయి.
తెరువబడిన ద్వారాల్లోనుంచి అవి పిలుస్తున్నాయి.
4 జ్ఞానము చెబుతోంది: “పురుషులారా, మిమ్మల్ని
నేను పిలుస్తున్నా మనుష్యులందరినీ నేను పిలుస్తున్నా.
22 “ఆదిలో మొట్టమొదటగా చాలా కాలం క్రిందట
యెహోవాచేత చేయబడింది నేనే
23 నేను (జ్ఞానము) ఆదిలో చేయబడ్డాను.
ప్రపంచం ప్రారంభం గాక ముందే నేను చేయబడ్డాను.
24 నేను (జ్ఞానము) మహా సముద్రాలు పుట్టక ముందే పుట్టాను.
నీళ్లు లేక ముందు నేను చేయబడ్డాను.
25 నేను (జ్ఞానము) పర్వతాలకంటె ముందు పుట్టాను. కొండలు రాక మందే నేను పుట్టాను.
26 యెహోవా భూమిని చేయకముందే నేను (జ్ఞానము) పుట్టాను. పొలాలకంటె ముందు నేను పుట్టాను.
ప్రపంచంలోని మొదటి ధూళిని, దేవుడు చేయక ముందే నేను పుట్టాను.
27 యెహోవా ఆకాశాలను చేసినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
యెహోవా భూమి చుట్టూరా సరిహద్దు వేసినప్పుడు,
మహా సముద్రానికి ఆయన హద్దులు నిర్ణయించినప్పుడు
నేను (జ్ఞానము) అక్కడ ఉన్నాను.
28 ఆకాశంలో యెహోవా మేఘాలను
ఉంచకముందే నేను పుట్టాను.
మహా సముద్రంలో యెహోవా నీళ్లు ఉంచినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
29 సముద్రాలలో నీళ్లకు యెహోవా హద్దులు పెట్టినప్పుడు
నేను అక్కడ ఉన్నాను.
యెహోవా అనుమతించిన దానికంటె నీళ్లు ఎత్తుగా పోవు,
భూమికి యెహోవా పునాదులు వేసినప్పుడు నేను అక్కడ ఉన్నాను.
30 నైపుణ్యంగల పనివానిలా నేను ఆయన ప్రక్కనే ఉన్నాను. నా మూలంగా యెహోవా ప్రతి రోజూ సంతోషించాడు.
ఆయన ముందు నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాను.
31 యెహోవా తాను చేసిన ప్రపంచాన్ని చూచి ఉప్పొంగి పోయాడు.
అక్కడ ఆయన మనుష్యుల విషయమై సంతోషించాడు.
సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.
8 యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
2 పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
3 యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
4 మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
నీవు వానిని గమనించటం ఎందుకు?
5 అయితే మానవుడు నీకు ముఖ్యం.
వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
6 నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
7 గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
8 ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
9 మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!
దేవునితో స్నేహము
5 మనలో విశ్వాసము ఉండటం వలన దేవుడు మనము నీతిమంతులమని తీర్పు చెప్పాడు. ఆ కారణంగా, మన యేసు క్రీస్తు ప్రభువు ద్వారా మనకు దేవునితో స్నేహం కలిగింది. 2 మనం ప్రస్తుతం జీవిస్తున్న జీవితం దేవుని అనుగ్రహం వల్ల సంభవించింది. ఇది విశ్వాసంగల మనకు యేసు క్రీస్తు ద్వారా లభించింది. దేవుని తేజస్సులో భాగం పంచుకొంటామనే ఆశ మనలో ఉండటం వల్ల మనకు ఎంతో ఆనందం కలుగుతోంది. 3 అంతేకాదు, కష్టాలు సహనాన్ని పెంపొందింపచేస్తాయని మనకు తెలుసు. కనుక మనము కష్టాలు అనుభవించటంలో కూడా ఆనందాన్ని పొందుతున్నాము. 4 సహనం వల్ల దేవుని మెప్పు, మెప్పువల్ల ఆయన తేజస్సులో భాగం పంచుకొంటామనే నిరీక్షణ కలుగతోంది. 5 దేవుడు మనకిచ్చిన పరిశుద్ధాత్మ ద్వారా తన ప్రేమను మనపై కురిపించాడు. కనుక ఆ ఆశ విషయంలో మనకు నిరాశ కలుగదు.
12 “నేను మీకు చెప్పవలసిన విషయాలు ఎన్నోఉన్నాయి. కాని వాటికి మీరు ప్రస్తుతం తట్టుకొనలేరు. 13 కాని సత్యాన్ని ప్రకటించే ఆత్మ వచ్చాక మిమ్మల్ని సంపూర్ణంగా సత్యంలోకి నడిపిస్తాడు. ఆయన స్వతహాగ మాట్లాడడు. తాను విన్న వాటిని మాత్రమే మాట్లాడుతాడు. జరుగనున్న వాటిని గురించి మీకు చెబుతాడు. 14 నా సందేశం మీకు తెలియజేయుటవల్ల ఆయన నన్ను మహిమ పరుస్తాడు. 15 తండ్రికి చెందినవన్నీ నావి. అందువల్లే ఆత్మ నా సందేశం తీసుకొని మీకు తెలియచేస్తాడని చెప్పాను.
© 1997 Bible League International