Print Page Options
Previous Prev Day Next DayNext

Revised Common Lectionary (Complementary)

Daily Bible readings that follow the church liturgical year, with thematically matched Old and New Testament readings.
Duration: 1245 days
Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)
Version
కీర్తనలు. 8

సంగీత నాయకునికి: గితీత్ రాగం. దావీదు కీర్తన.

యెహోవా నా ప్రభువా! నీ పేరు భూమి అంతా ప్రసిద్ధి పొందింది.
పరలోకమంతా నీ కీర్తి బాలురు, చంటి పిల్లల నోళ్లనుండి వెలికి వస్తున్నది.
    నీ శత్రువుల నోరు మూయించడానికి నీవు యిలా చేస్తావు.
యెహోవా, నీవు నీ చేతులతో చేసిన ఆకాశాలవైపు నేను చూస్తున్నాను.
    నీవు సృష్టించిన చంద్ర నక్షత్రాలను నేను చూచి ఆశ్చర్య పడుతున్నాను.
మానవుడు ఎందుకు నీకు అంత ప్రాముఖ్యుడు?
    నీవు వానిని ఎందుకు జ్ఞాపకం చేసుకొంటావు?
మానవమాత్రుడు నీకెందుకు అంత ముఖ్యం?
    నీవు వానిని గమనించటం ఎందుకు?
అయితే మానవుడు నీకు ముఖ్యం.
    వానిని నీవు దాదాపు దేవుని అంతటి వానిగా చేశావు.
    మరియు మహిమా ఘనతలు నీవు వానికి కిరీటంగా ధరింప జేసావు.
నీవు చేసిన సమస్తము మీద మనుష్యునికి అధికారమిచ్చియున్నావు.
    ప్రతిదానిని నీవు వాని అధీనంలో ఉంచావు.
గొర్రెలు, పశువులు, అడవి మృగాలు అన్నింటిమీద ప్రజలు ఏలుబడి చేస్తారు.
ఆకాశంలోని పక్షుల మీద, మహా సముద్రంలో ఈదుచుండే
    చేపల మీద వారు ఏలుబడి చేస్తారు.
మా దేవా, యెహోవా భూలోమంతటిలో కెల్లా నీ నామము మహా అద్భుతమైనది!

సామెతలు 4:1-9

జ్ఞానము గూర్చి తండ్రి సలహా

కుమారులారా, “మీ తండ్రి ఉపదేశములు వినండి.” మీరు గ్రహించగలుగునట్లు గమనించండి. ఎందుకనగా నేను మీకు నేర్పిస్తున్న సంగతులు ప్రాముఖ్యమైనవి, మంచివి. అందుచేత నా ఉపదేశములు ఎన్నడూ మరువవద్దు.

నేను నా తండ్రికి పసివాడను. నేను నా తల్లికి ఒకే కూమారుణ్ణి. నా తండ్రి నాకు నేర్పిస్తూ నాతో ఇలా చెప్పాడు: “నేను చెప్పే సంగతులు జ్ఞాపకం ఉంచుకో, నీవు నా ఆజ్ఞలకు విధేయుడవైతే జీవిస్తావు. జ్ఞానము, వివేకం సంపాదించు! నా మాటలు మరువకు. నా ఉపదేశాలు ఎల్లప్పుడూ పాటించు. జ్ఞానమునుండి తొలగిపోవద్దు. అప్పుడు జ్ఞానము నిన్ను కాపాడుతుంది. జ్ఞానాన్ని ప్రేమించు, జ్ఞానము నిన్ను భద్రంగా కాపాడుతుంది.

“జ్ఞానము సంపాదించాలని నీవు తీర్మానించినప్పుడే జ్ఞానము మొదలవుతుంది. అందుచేత జ్ఞానము సంపాదించేందుకు నీకున్న సమస్తం వినియోగించు, అప్పుడు నీవు జ్ఞానివి అవుతావు. జ్ఞానాన్ని ప్రేమించు. జ్ఞానం నిన్ను గొప్పవాణ్ణి చేస్తుంది. జ్ఞానాన్ని అతి ముఖ్యమైనదిగా ఎంచు, జ్ఞానము నీకు ఘనత తెచ్చి పెడుతుంది. ఆమె (జ్ఞానము) అందమైన మాలను నీతల మీద ఉంచుతుంది. సోగసైన కిరీటమును నీకు బహూకరిస్తుంది.”

లూకా 2:41-52

పన్నెండు ఏండ్ల తర్వాత

41 ప్రతి సంవత్సరం ఆయన తల్లిదండ్రులు పస్కా పండుగకు యెరూషలేము వెళ్ళేవాళ్ళు. 42 కనుక ఎప్పటిలాగే అలవాటు ప్రకారం యేసుకు పన్నెండు సంవత్సరాలున్నప్పుడు వాళ్ళు పండుగ కోసం యెరూషలేముకు వెళ్ళారు. 43 పండుగ తర్వాత ఆయన తల్లిదండ్రులు తిరిగి తమ ఊరికి వెళ్ళటానికి ప్రమాణమయ్యారు. కాని యేసు యెరూషలేములోనే ఉండిపొయ్యాడు. తల్లిదండ్రులకు ఇది తెలియదు. 44 తమ గుంపులో ఉన్నాడనుకొని వాళ్ళు ఒక రోజంతా ప్రయాణం చేసారు. తమతో లేడని గ్రహించాక వాళ్ళు తమ స్నేహితులతో, బంధువులతో ఉన్నాడనుకొని వాళ్ళలో వెతకసాగారు. 45 ఆయన కనిపించక పోయే సరికి వాళ్ళు ఆయన్ని వెతకటానికి యెరూషలేము తిరిగి వెళ్ళారు.

46 మూడు రోజులు వెతికాక ఆయన వాళ్ళకు మందిరంలో కూర్చొని వాళ్ళు చెప్పినవి వింటూ, వాళ్ళను ప్రశ్నిస్తూ ఉండగా కన్పించాడు. 47 ఆయనలో ఉన్న గ్రహింపు శక్తికి, ఆయన సమాధానాలకు అక్కడవున్న వాళ్ళంతా ఆశ్చర్యపోయారు. 48 ఆయన తల్లిదండ్రులు కూడా ఆయన్ని చూసి చాలా ఆశ్చర్య పోయారు. యేసు తల్లి ఆయనతో, “ఇలా ఎందుకు చేసావు బాబు? నేను, మీ నాన్న దిగులుపడి అన్ని చోట్లా వెతికాము!” అని అన్నది.

49 యేసు, “నా కోసం ఎందుకు వెతికా రమ్మా! నేను నా తండ్రి పనిలో ఉండాలని మీకు తెలియదా?” అని అన్నాడు. 50 వాళ్ళకు ఆయన అన్న మాటలు అర్థం కాలేదు.

51 ఆ తర్వాత ఆయన వాళ్ళ వెంట నజరేతుకు వెళ్ళాడు. వినయ విధేయతలతో నడుచుకునే వాడు. కాని ఆయన తల్లి జరిగిన ఈ సంఘటనల్ని తన మనస్సులో ఆలోచిస్తూ ఉండేది. 52 యేసు జ్ఞానంలో, బలంలో, అభివృద్ధి చెందుతూ పెరగసాగాడు. దేవుని మెప్పు, ప్రజల మెప్పు సంపాదించాడు.

Telugu Holy Bible: Easy-to-Read Version (TERV)

© 1997 Bible League International