Revised Common Lectionary (Complementary)
కోరహు కుమారుల స్తుతి పాట.
48 యెహోవా గొప్పవాడు.
మన దేవుని పట్టణంలో, ఆయన పరిశుద్ధ పట్టణంలో స్తుతులకు ఆయన పాత్రుడు.
2 దేవుని పరిశుద్ధ పర్వతం అందమైనది, ఎత్తైనది.
అది భూమి అంతటికీ సంతోషాన్ని తెస్తుంది.
సీయోను పర్వతం దేవుని నిజమైన పర్వతం.[a]
అది మహారాజు పట్టణం.
3 ఇక్కడ ఆ పట్టణంలోని
భవనాలలో దేవుడు కోట అని పిలువబడుతున్నాడు.
4 ఒకప్పుడు రాజులు కొందరు సమావేశమయ్యారు.
వారు ఈ పట్టణంపై దాడి చేయాలని పథకం వేసారు.
వారంతా కలసి ముందుకు వచ్చారు.
5 ఆ రాజులు చూసారు. వారు ఆశ్చర్యపోయారు,
వారు బెదిరిపోయారు. మరియు వారంతా పారిపోయారు!
6 ఆ రాజులందరికీ భయం పట్టుకొంది.
ప్రసవ వేదన పడుతున్న స్త్రీలలా వారు వణికారు.
7 దేవా, బలమైన తూర్పుగాలితో
తర్షీషు ఓడలను బ్రద్దలు చేశావు.
8 మేము ఏమి విన్నామో, దాన్ని మహా శక్తిగల దేవుని పట్టణంలో
మన సర్వశక్తిమంతుడైన యెహోవా పట్టణంలో చూశాము.
దేవుడు ఆ పట్టణాన్ని శాశ్వతంగా బలపరుస్తాడు.
9 దేవా, నీ ప్రేమ, కనికరాలను గూర్చి మేము నీ ఆలయంలో జాగ్రత్తగా ఆలోచిస్తాము.
10 దేవా, నీవు ప్రఖ్యాతిగలవాడవు.
భూలోకమంతటా ప్రజలు నిన్ను స్తుతిస్తారు.
నీ కుడిచేయి నీతితో నిండియున్నది.
11 సీయోను పర్వతం సంతోషిస్తుంది.
మరియు యూదా నగరాలు ఆనందంగా ఉన్నాయి. దేవా, ఎందుకంటే నీవు మంచి తీర్పులు చేశావు.
12 సీయోను చుట్టూ తిరుగుతూ
ఆ పట్టణాన్ని చూడండి, గోపురాలు లెక్కించండి.
13 ఎత్తైన గోడలు చూడండి.
సీయోను రాజనగరుల ద్వారా వెళ్ళండి.
అప్పుడు తరువాత తరాలకు మీరు దాన్ని గూర్చి చెప్పగలుగుతారు.
14 ఈ విషయాలు దేవుడు ఎటువంటి వాడు అనేది మనకు తెలియజేస్తున్నాయి:
ఆయన ఎప్పటికీ మన దేవుడు, ఆయన ఎల్లప్పుడు మనలను కాపాడుతాడు.
బిలాము మూడో సందేశం
24 ఇశ్రాయేలును యెహోవా ఆశీర్వదించాలనే కోరుతున్నట్టు బిలాము గమనించాడు. కనుక ఎలాంటి మంత్రాలు ప్రయోగించినా గాని దానిని బిలాము మార్చదలచుకోలేదు. కానీ బిలాము పక్కకు తిరిగి అరణ్యం చూసాడు. 2 బిలాము అరణ్యాన్ని చూచి, అక్కడున్న ఇశ్రాయేలు ప్రజలందర్నీ చూసాడు. వారు, వారి కుటుంబాలతో ఆ ప్రదేశాల్లో నివసిస్తున్నారు. అప్పుడు దేవుని ఆత్మ బిలాము మీదికి రాగా 3 బిలాము ఈ విషయాలు చెప్పాడు:
“బెయోరు కుమారుడు ఈ విషయాలు చెబుతున్నాడు.
నా కళ్లు తేటగా చూస్తున్నాయి కనుక ఈ మాటలు పలుకుతున్నాను.
4 నేను దేవుని మాటలు వింటున్నాను కనుక ఈ మాటలు చెబుతున్నాను.
నేను చూడాలని ఆ సర్వశక్తిమంతుడు కోరుతున్న వాటిని నేను చూడ గలుగుతున్నాను.
నేను సాగిలపడి తేటగా చూసినవాటిని చెబుతున్నాను.
5 “యాకోబు ప్రజలారా, మీ గుడారాలు చాలా అందంగా ఉన్నాయి.
ఇశ్రాయేలు ప్రజలారా, మీ నివాసాలు అందంగా ఉన్నాయి.
6 భూమి మీద మీ గుడారాలు లోయల్లా
పరచుకొన్నాయి.
అవి నదీ తీరంలో
తోటలా ఉన్నాయి.
యెహోవా నాటిన అది చక్కటి
సువాసనగల మొక్కలా ఉంది.
అది నీళ్ల దగ్గర పెరిగే
అందమైన చెట్లలా ఉంది.
7 మీకు ఎల్లప్పుడూ తాగటానికి కావాల్సినంత నీరు ఉంటుంది.
మీ ఆహారం పండించుకోవటానికి కావాల్సినంత నీరు ఎల్లప్పుడూ ఉంటుంది మీకు.
ఆ ప్రజల రాజు అగాగుకంటె గొప్పవాడుగా ఉంటాడు.
వారి రాజ్యం చాలా గొప్పది అవుతుంది.
8 “ఆ ప్రజలను ఈజిప్టునుండి దేవుడే బయటకు తీసుకొచ్చాడు.
వారు అడవి ఆవు అంతటి బలంగలవారు. తమ శత్రువులందర్నీ వారు ఓడిస్తారు.
వారి శత్రువుల ఎముకల్ని వారు విరుగగొడ్తారు.
వారి బాణాలు వారి శత్రువుల్ని చంపేస్తాయి.
9 తన ఆహారం మీదికి ఎగబడటానికి సిద్ధంగా వున్న సింహంలా ఇశ్రాయేలీయులున్నారు.
వారు నిద్రపోతున్న కొదమ
సింహంలా ఉన్నారు.
దానిని మేల్కొలి పేందుకు
ఎవడికి ధైర్యం చాలదు.
నిన్ను ఆశీర్వదించే వారు
ఆశీర్వాదం పొందుతారు.
నిన్ను ఎవరైనా శపిస్తే వారికి
గొప్ప కష్టాలు వస్తాయి.”
10 అప్పుడు బాలాకు బిలాముమీద చాల కోపపడ్డాడు. బిలాముతో బాలాకు అన్నాడు: “నిన్ను వచ్చి నా శత్రువులను శపించుమని పిలిచాను. కానీ నీవు వాళ్లను ఆశీర్వదించావు. వాళ్లను మూడు సార్లు నీవు ఆశీర్వదించావు. 11 ఇప్పుడు ఇంటికి వెళ్లిపో. నీకు చాలా ఇస్తానని నేను నీతో చెప్పాను. అయితే నీవు నీ ప్రతిఫలం పోగొట్టుకొనేటట్టు చేసాడు యెహోవా.”
12 బాలాకుతో బిలాము అన్నాడు: “నీవు నా దగ్గరకు మనుష్యుల్ని పంపించావు. నన్ను రమ్మని వాళ్లు అడిగారు. 13 కానీ వారితో నేను, ‘బాలాకు అతి సుందరమైన తన భవనాన్ని వెండి, బంగారాలతో నింపి ఇచ్చినా కానీ నేను మాత్రం నన్ను చెప్పమని యెహోవా నాకు చెప్పిన మాటలే చెబుతాను మంచిగాని చెడుగాని, నా అంతట నేనే ఏదీ చెయలేను. యెహోవా ఆజ్ఞాపించినట్లు నేను చేసి తీరాల్సిందే’ అన్నాను. ఈ సంగతులు నేను నీ మనుష్యులతో చెప్పటం నీకు జ్ఞాపకంలేదా? 14 ఇప్పుడు నేను నా స్వంత ప్రజల దగ్గరకు వెళ్తున్నాను. అయితే నేను నీకు ఒక హెచ్చరిక ఇస్తున్నాను. నీకూ, నీ ప్రజలకూ ఇశ్రాయేలు ప్రజలు ఇక ముందు ఏమి చేస్తారో నేను నీకు చెబుతాను.”
యేసు జన్మిస్తాడని ప్రవచనం
26 ఎలీసబెతు ఆరు నెలల గర్భంతో ఉంది. అప్పుడు దేవుడు గాబ్రియేలు అనే దేవదూతను గలిలయలోని నజరేతు అనే పట్టణంలో ఉన్న ఒక కన్య దగ్గరకు పంపాడు. 27 దావీదు వంశస్థుడైన యోసేపు అనే వ్యక్తితో ఈ కన్యకు పెళ్ళి నిశ్చయమైంది. ఈ కన్య పేరు మరియ. 28 ఈ దేవదూత ఆమె దగ్గరకు వెళ్ళి ఆమెతో, “నీకు శుభం కలుగుగాక! ప్రభువు నిన్ను అనుగ్రహించాడు. ఆయన నీతో ఉన్నాడు” అని అన్నాడు.
29 దేవదూత మాటలు విని మరియ కంగారు పడి ఇతని దీవెనకు అర్థమేమిటా అని ఆశ్చర్యపడింది.
30 ఇది చూసి దేవదూత ఆమెతో యిలా అన్నాడు: “భయపడకు మరియా! దేవుడు నిన్ను అనుగ్రహించాడు. 31 నీవు గర్భం దాల్చి మగ శిశువును కంటావు. ఆయనకు యేసు అని పేరు పెట్టు. 32 ఆయన చాలా గొప్ప వాడై సర్వోన్నతుడైన దేవుని కుమారుడని పిలువబడతాడు. ప్రభువైన దేవుడు ఆయన పూర్వికుడైన దావీదు సింహాసనాన్ని ఆయనకు యిస్తాడు. 33 యాకోబు వంశానికి చెందిన వాళ్ళందర్ని ఈయన చిరకాలం పాలిస్తాడు. ఆయన రాజ్యం ఎన్నటికీ అంతరించదు.”
34 “నా కింకా పెండ్లి కాలేదే! ఇది ఎట్లా సాధ్యమవుతుంది?” అని మరియ దేవదూతను అడిగింది.
35 ఆ దేవదూత ఈ విధంగా సమాధానం చెప్పాడు: “పవిత్రాత్మ నీ మీదికి వచ్చునప్పుడు సర్వోన్నతుడైన దేవుని శక్తి నిన్ను ఆవరిస్తుంది. అందువలన నీకు పుట్టబోయే శిశువు పవిత్రంగా ఉంటాడు. ఆ శిశువు దేవుని కుమారుడని పిలువబడతాడు. 36 నీ బంధువు ఎలీసబెతు తన వృద్ధాప్యంలో తల్లి కాబోతోంది. గొడ్రాలని పిలవబడే ఆమె యిప్పుడు ఆరు నెలల గర్భంతో ఉంది. 37 దేవునికి సాధ్యం కానిది ఏదీ లేదు.”
38 మరియ, “నేను దేవుని సేవకురాలను. మీరన్న విధంగానే జరుగనీ!” అని సమాధానం చెప్పింది. ఆ తర్వాత దేవదూత వెళ్ళిపోయాడు.
© 1997 Bible League International