Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
12 పిమ్మట గాలి (ఆత్మ) నన్ను పైకి లేపింది. అప్పుడు వెనుక నుండి నేనొక స్వరం విన్నాను. అది ఉరుములా చాలా బిగ్గరగా ఉంది. ఆ స్వరం, “యెహోవా మహిమ ధన్యమైనది!” అని పలికింది. 13 ఆ తరువాత జంతువుల రెక్కలు కదలసాగాయి. రెక్కలు ఒక దానితో ఒకటి తాకగా అవి చాలా గట్టిగా శబ్దం చేశాయి. వాటి ముందునున్న చక్రాలు కూడ పెద్ద శబ్దం చేశాయి. ఆ శబ్దం ఉరుము ఉరిమినట్లుగా ఉంది. 14 గాలి (ఆత్మ) నన్ను పైకెత్తి దూరంగా తీసుకొని వెళ్లింది. నేను ఆ స్థలాన్ని వదిలిపెట్టాను. నేను నా ఆత్మలో దుఃఖించి తల క్రిందులయ్యాను! యెహోవా ప్రభావం నాలో శక్తివంతంగా పనిచేస్తూ ఉంది! 15 టెల్ అవీవ్‌కు[a] బలవంతంగా తీసుకొనిపోబడి, అక్కడ ప్రవాసంలోవున్న ఇశ్రాయేలీయుల వద్దకు వెళ్లాను. ఆ ప్రజలు కెబారు కాలువ వద్ద నివసించారు. ఆ ప్రజలను నేను పరామర్శించాను. అక్కడ నేను వాళ్ల మధ్యలో ఏడు రోజులు భయంతోనూ, మౌనంతోనూ కూర్చుంటిని.
ఇశ్రాయేలు కావలివాడు
16 ఏడు రోజుల తరువాత యెహోవా వాక్కు నాకు వినవచ్చింది. ఆయన ఇలా చెప్పాడు: 17 “ఓ నరపుత్రుడా, ఇశ్రాయేలుకు నిన్ను కావలివానిగా చేస్తున్నాను. వారికి జరుగబోయే కీడును గూర్చి నేను నీకు తెలియజేస్తాను. కనుక ఆ పరిణామాలను గూర్చి నీవు వారికి హెచ్చరిక చేయాలి. 18 ‘ఈ దుష్ట వ్యక్తి చనిపోతాడు.’ అని నేను చెప్పితే, నీవతనిని హెచ్చరించాలి.! అతని జీవన విధానం మార్చుకొని, పాపం చేయటం మానమని చెప్పాలి. నీవతనిని హెచ్చరించకపోతే, ఆ వ్యక్తి చనిపోతాడు. అతడు పాపం చేశాడు గనుక అతడు చనిపోతాడు. కాని అతని చావుకు నిన్ను కూడా బాధ్యుణ్ణి చేస్తాను! ఎందుకంటే, నీవతని వద్దకు వెళ్లి అతనిని హెచ్చరిస్తే అతని ప్రాణం రక్షింపబడేది.
19 “ఒకవేళ నీవా వ్యక్తి వద్దకు వెళ్లి అతని జీవిత విధానాన్ని మార్చుకోమనీ, చెడు కార్యాలు చేయటం మానమనీ చెప్పావనుకో. ఆ వ్యక్తి నీమాట వినక పోవచ్చు. అప్పుడతడు చనిపోతాడు. అతడు పాపి గనుక చనిపోతాడు. అయినా నీవతనిని హెచ్చరించావు. అందువల్ల నిన్ను నీవు రక్షించుకున్నవాడివవుతావు.
20 “లేదా, ఒక మంచి వ్యక్తి మధ్యలో మంచి పనులు చేయడం మానివేసి చెడుపనులు చేస్తాడు. అప్పుడు నేను అతని ముందు ఏదైనా తగిలి పడటానికి (పాపంలో పడటానికి) ఉంచవచ్చు. అతడు చెడుకార్యాలు చేయటం మొదలు పెడతాడు. దానితో అతడు చనిపోతాడు. తన పాపాల కారణంగా అతడు చనిపోతాడు. దానికి తోడు నీవతనిని హెచ్చరించలేదు. అందువల్ల అతని చావుకు నిన్ను బాధ్యుణ్ణి చేస్తాను. చివరికి అతడు చేసిన మంచి పనులేవీ ప్రజలు గుర్తు పెట్టుకోరు.
21 “నీవొక మంచి మనిషిని పాపం చేయవద్దని హెచ్చరిస్తావనుకో; అతడు పాపం చేయటం మానితే అతడు రక్షించబడతాడు. ఎందువల్లనంటే నీవతనికి హెచ్చరిక చేయటం, అతడు నీ మాటను వినటం జరిగాయి గనుక. ఈ విధంగా నీవు నీ ప్రాణాన్ని కాపాడుకుంటావు.”
పేతురు యేసును క్రీస్తు అని చెప్పటం
(మత్తయి 16:13-19; మార్కు 8:27-29)
18 ఒకరోజు యేసు ఏకాంతంగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరకు వచ్చారు. ఆయన ప్రార్థించటం ముగించాక వాళ్ళతో, “ప్రజలు నేను ఎవర్నని అంటున్నారు?” అని అడిగాడు.
19 వాళ్ళు, “కొందరు బాప్తిస్మము నిచ్చే యోహాను అని అంటున్నారు. మరికొందరు పూర్వకాలం నాటి ప్రవక్త బ్రతికి వచ్చాడు అని అంటున్నారు” అని సమాధానం చెప్పారు.
20 “మీ సంగతేమిటి? మీరేమంటారు?” అని ఆయన అడిగాడు.
పేతురు, “మీరు దేవుడు పంపిన క్రీస్తు” అని సమాధానం చెప్పాడు.
21 “ఈ విషయం ఎవ్వరికీ చెప్పవద్దు” అని యేసు ఖండితంగా చెప్పాడు.
యేసు తన మరణాన్ని గురించి చెప్పటం
(మత్తయి 16:21-28; మార్కు 8:31–9:1)
22 ఆయన వాళ్ళతో, “మనుష్య కుమారుడు ఎన్నో కష్టాలు అనుభవిస్తాడు. పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రులు ఆయన్ని తిరస్కరిస్తారు. ఆయన చంపబడి మూడవ రోజున బ్రతికింపబడతాడు” అని అన్నాడు.
23 ఆ తర్వాత వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “నా వెంట రావాలనుకొన్నవాడు తన కోరికల్ని చంపుకొని, తన సిలువను ప్రతిరోజు మోసుకొంటూ నన్ను అనుసరించాలి. 24 తన ప్రాణాన్ని రక్షించుకోవాలనుకొన్నవాడు దాన్ని పోగొట్టుకొంటాడు. కాని నా కోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనువాడు దాన్ని రక్షించుకొంటాడు. 25 ప్రపంచాన్నంతా జయించి తనను పోగొట్టుకొని, తన జీవితాన్ని నాశనం చేసుకొంటే దానివల్ల కలిగే లాభమేమిటి? 26 నన్ను, నా సందేశాన్ని అంగీకరించటానికి సిగ్గుపడిన వాళ్ళ విషయంలో, మనుష్యకుమారుడు తన తేజస్సుతో, తండ్రి తేజస్సుతో, పవిత్రమైన దేవదూతల తేజస్సుతో వచ్చినప్పుడు సిగ్గుపడతాడు. 27 ఇది నిజం. ఇక్కడ నిలుచున్న వాళ్ళలో కొందరు దేవుని రాజ్యాన్ని చూడకుండా మరణించరు.”
© 1997 Bible League International