Revised Common Lectionary (Complementary)
దావీదు కీర్తన.
29 దేవుని కుమారులారా, యెహోవాను స్తుతించండి.
ఆయన మహిమ ప్రభావాలను స్తుతించండి.
2 యెహోవాను స్తుతించండి, ఆయన నామాన్ని కీర్తించండి.
మీరు ప్రత్యేక వస్త్రాలు ధరించి, ఆయన్ని ఆరాధించండి.
3 యెహోవా సముద్రం వద్ద తన స్వరం వినిపింపజేస్తున్నాడు.
మహిమగల దేవుని స్వరం మహా సముద్రం మీద ఉరుమువలె వినిపిస్తుంది.
4 యెహోవా స్వరం ఆయన శక్తిని తెలుపుతుంది.
ఆయన స్వరం ఆయన మహిమను తెలుపుతుంది.
5 యెహోవా స్వరం దేవదారు మహా వృక్షాలను ముక్కలుగా విరుగ గొట్టుతుంది.
లెబానోను దేవదారు మహా వృక్షాలను యెహోవా విరగ్గొడతాడు.
6 లెబానోను పర్వతాలను యెహోవా కంపింపజేస్తాడు. అవి గంతులు వేస్తున్న దూడలా కనిపిస్తాయి.
షిర్యోను కంపిస్తుంది. అది మేకపోతు గంతులు వేస్తున్నట్టు కనిపిస్తుంది.
7 యెహోవా స్వరం అగ్ని జ్వాలలను మండిస్తుంది.
8 యెహోవా స్వరం అరణ్యాన్ని కంపింపజేస్తుంది.
యెహోవా స్వరాన్ని విని కాదేషు అరణ్యం వణకుతుంది.
9 యెహోవా స్వరం లేళ్ళను భయపడేటట్టు చేస్తుంది.
ఆయన అరణ్యాలను నాశనం చేస్తాడు.
ఆయన ఆలయంలో ఆయన మహిమను గూర్చి ప్రజలు పాడుతారు.
10 వరదలను యెహోవా అదుపు చేసాడు.
మరియు యెహోవా ఎల్లప్పుడూ సమస్తాన్నీ తన అదుపులో ఉంచుకొనే రాజు.
11 యెహోవా తన ప్రజలను కాపాడును గాక.
యెహోవా తన ప్రజలకు శాంతినిచ్చి ఆశీర్వదించును గాక.
పవిత్ర పెట్టె ఆలయానికి తేబడటం
2 ఇశ్రాయేలు పెద్దలందరిని, వంశనాయకులందరినీ ఇశ్రాయేలులో వున్న వంశపెద్దలందరినీ సొలొమోను పిలిపించాడు. వారందరినీ యెరూషలేములో సమావేశ పర్చాడు. యెహోవా ఒడంబడిక పెట్టెను దావీదు నగరం నుండి తెప్పించే ఏర్పాట్లు చేసేటందుకు సొలొమోను ఈ సమావేశం ఏర్పాటు చేశాడు. దావీదు నగరానికే సీయోను అని పేరు. 3 ఈ సందర్భంగా ఏర్పాటైన ఒక పర్ణశాల పండుగలో ప్రజలంతా రాజైన సొలొమోనును కలిశారు. ఆ సంవత్సరం ఏడవ నెలలో ఈ విందు ఏర్పాటు చేయబడింది.
4 ఇశ్రాయేలు పెద్దలంతా వచ్చిన పిమ్మట లేవీయులు ఒడంబడిక పెట్టెను లేవదీశారు. 5 పిమ్మట యాజకులు, లేవీయులు కలిసి ఒడంబడిక పెట్టెను యెరూషలేముకు మోశారు. యాజకులు, లేవీయులు సన్నిధి గుడారాన్ని, దానిలో వున్న పవిత్ర వస్తువులను యెరూషలేముకు తెచ్చారు. 6 రాజైన సొలొమోను, ఇశ్రాయేలు ప్రజలు ఒడంబడిక పెట్టెముందు గుమికూడారు. రాజైన సొలొమోను, ఇశ్రాయేలీయులు గొర్రెలను, గిత్తలను, బలియిచ్చారు. బలి యిచ్చిన గొర్రెలు, గిత్త దూడలు ఎవ్వరూ లెక్కపెట్టలేనన్ని వున్నాయి. 7 తరువాత యాజకులు యెహోవా ఒడంబడిక పెట్టెను, దానికై నిర్దేశించిన స్థలానికి తీసుకొని వచ్చారు. ఆ స్థలమే ఆలయంలోని అతి పవిత్ర స్థలం. ఒడంబడిక పెట్టె అతి పవిత్ర స్థలంలో కెరూబుల రెక్కల క్రింద వుంచారు. 8 ఒడంబడిక పెట్టె వుంచబడిన స్థలంమీద కెరూబుల రెక్కలు విప్పివున్నాయి. కెరూబులు ఒడంబడిక పెట్టెమీద, దానిని మోసే కర్రమీద నిలబడివున్నాయి. 9 అతి పవిత్ర స్థలం ముందు నుంచి చూస్తే వాటి చివరలు కనబడేటంత పొడవుగా పెట్టెను మోసే కర్రలు వున్నాయి. కాని ఆలయం బయట నుంచి ఎవ్వరూ ఆ కర్రలను చూడలేరు. ఈనాటికీ ఆ కర్రలు అక్కడ వున్నాయి. 10 ఒడంబడిక పెట్టెలో రెండు శిలాఫలకాలు తప్ప మరేమీ లేవు. (అవి దేవుని పది ఆజ్ఞలున్న ఫలకాలు). హూరేబు పర్వతం మీద ఆ రెండు ఫలకాలను మోషే ఒడంబడిక పెట్టెలో వుంచాడు. ఇశ్రాయేలు ప్రజలతో యెహోవా ఒక ఒడంబడిక చేసికొన్న చోటే ఈ హోరేబు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఈజిప్టు నుండి స్వతంత్రులై బయటకు వచ్చిన పిమ్మట జరిగింది.
11 పిమ్మట అతి పవిత్ర స్థలంలోనికి వెళ్లిన యాజకులంతా బయటకు వచ్చారు. వారంతా శుభ్రంగా వున్నారు. అప్పట్లో వారు యాజకులలో ఏ వర్గానికి చెందిన వారు అన్నది ముఖ్యంగాదు. వారంతా అతి పవిత్ర స్థలంలో నుంచి బయటికి వచ్చి తమకు తాము పరిశుద్ధులైనారు. 12 బలిపీఠానికి తూర్పు దిశలో లేవీయులకు చెందిన గాయకులంతా నిలబడ్డారు. ఆసాపు, హేమాను, యెదూతూను వర్గాలకు చెందిన గాయక బృందాల వారంతా అక్కడ వున్నారు. వారి కుమారులు, బంధువులు కూడా అక్కడ వున్నారు. లేవీ గాయకులంతా సన్నని నారతో నేసిన తెల్లని వస్త్రాలు ధరించారు. వారి చేతుల్లో పెద్ద పెద్ద తాళాలు, తంబురలు, సితారలు వున్నాయి. లేవీ గాయకులతో పాటు నూటఇరవై మంది యాజకులున్నారు. ఆ నూట ఇరవై మంది యాజకులు బూరలు ఊదారు. 13 బూరలు ఊదిన వారు, పాటలు పాడినవారు, సొంపుగా ఒక్క మనిషివలె ఊది, పాడారు. వారు యెహోవాకి స్తోత్రం చేసినప్పుడు కృతజ్ఞతలు పలికినప్పుడు ఏక కంఠంగా వినిపించింది. బూరలతోను, తాళాలతోను, ఇతర వాద్య విశేషాలతోను వారు పెద్ద శబ్దం వచ్చేలా చేశారు. వారు యిలా పాడారు:
“ప్రభువు మంచివాడు,
దేవుని కరుణ శాశ్వత మైనది!”
అటు తర్వాత ఆలయాన్ని ఒక మేఘం ఆవరించింది. 14 ఆ మేఘంవల్ల యాజకులు తమ సేవా కార్యక్రమాన్ని నిర్వహించలేకపోయారు. దానికి కారణమేమనగా యెహోవా యొక్క మహిమ ఆలయాన్ని నింపివేసింది.
పౌలు తన సేవనుగూర్చి చెప్పటం
19 “అందువల్ల అగ్రిప్ప రాజా! ఆకాశంనుండి వచ్చిన దివ్య దర్శనమును నేను అతిక్రమించలేను. 20 మారు మనస్సు పొంది దేవుని వైపు మళ్ళమని, తమ నిజమైన పశ్చాత్తాపం మారు మనస్సు అన్న విషయం పనుల ద్వారా రుజువు చేయమని ఉపదేశించాను. ఈ ఉపదేశం డెమాస్కసు ప్రజలతో మొదలు పెట్టి యెరూషలేములోని ప్రజలకు, యూదయలోని యితర ప్రజలకు, యూదులు కానివాళ్ళకు చెప్పాను.
21 “ఆ కారణంగా యూదులు నన్ను మందిరంలో పట్టుకొని చంపాలని ప్రయత్నించారు. 22 కాని దేవుని దయ ఈనాటికీ నా మీద ఉంది. కనుక చిన్నా, పెద్దా అనే భేధం లేకుండా అందరికీ దీన్ని గురించి చెబుతున్నాను. మోషే, మరియు ప్రవక్తలు జరుగనున్న వాటిని గురించి ముందే ఈ విధంగా చెప్పారు: 23 ‘క్రీస్తు మరణించవలసి వస్తుంది. కాని బ్రతికి వచ్చినవాళ్ళలో ఆయన మొదటివాడౌతాడు. తన ప్రజలకు, యూదులు కానివాళ్ళకు వెలుగునివ్వటానికి వచ్చాడని చెపుతున్నాను.’ నేను వీళ్ళు చెప్పినవి తప్ప వేరే విషయాలు చెప్పటం లేదు.”
పౌలు అగ్రిప్పను ఒప్పించుటకు ప్రయత్నించటం
24 పౌలు తన రక్షణార్థం ఈ విధంగా మాట్లాడుతుండగా, ఫేస్తు పౌలుతో వాదన ఆపమంటూ, “నీకు మతిపోయింది పౌలూ! నీ పాండిత్యం నిన్ను పిచ్చివాణ్ణి చేస్తుంది” అని బిగ్గరగా అన్నాడు.
25 పౌలు, “మహా ఘనత పొందిన ఓ ఫేస్తూ! నేను పిచ్చివాణ్ణి కాదు. సక్రమంగానే మాట్లాడాను. సత్యం చెప్పాను. 26 రాజుకు యివన్నీ తెలుసు. నేను రాజుతో స్వేచ్ఛగా మాట్లాడగలను. ఇవి అతని దృష్టినుండి తప్పించుకోలేవన్న నమ్మకం నాకుంది. ఎందుకంటే యివి రహస్యంగా సంభవించలేదు. 27 అగ్రిప్ప రాజా! నీవు ప్రవక్తలు వ్రాసిన వాటిని నమ్ముచున్నావా? అవును, నమ్ముచున్నావని నాకు తెలుసు” అని పౌలు అన్నాడు.
28 అగ్రిప్ప, “అంత సులభంగా నన్ను క్రైస్తవునిగా చెయ్యాలనుకుంటున్నావా?” అని అన్నాడు.
29 పౌలు, “సులభమో, కష్టమో! నీవే కాదు, ఈ రోజు నా మాటలు వింటున్న ప్రతి ఒక్కడూ ఈ సంకెళ్ళు తప్ప మిగిలిన వాటిలో నావలె కావాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను” అని అన్నాడు.
© 1997 Bible League International