Revised Common Lectionary (Complementary)
యెహోవా యొక్క ప్రత్యేకమైన సేవకుడు
42 “నా సేవకుణ్ణి చూడండి!
నేను అతన్ని బలపరుస్తాను.
నేను ఏర్పరచుకొన్నవాడు అతడే.
అతని గూర్చి నేను ఎంతో ఆనందిస్తున్నాను.
నా ఆత్మను నేను అతనిలో ఉంచాను.
జనాలన్నింటికి అతడు న్యాయం చేకూరుస్తాడు.
2 అతడు వీధుల్లో కేకలు వేయడు
అతడు గట్టిగా అరిచి శబ్దం చేయడు.
3 అతడు సౌమ్యుడు. అతడు నలిగిన గడ్డిపరకను గూడ విరువడు.
మిణుకు మిణుకు మంటున్న మంటనుగూడ అతడు ఆర్పడు.
అతడు న్యాయాన్ని ప్రయోగించి ఏది సత్యమో తెలుసుకొంటాడు.
4 లోకానికి న్యాయం చేకూర్చేవరకు
అతడు బలహీనం కాడు, నలిగిపోడు.
దూర స్థలాల్లోని ప్రజలు అతని ఉపదేశాలను విశ్వసిస్తారు.”
ప్రపంచాన్ని చేసినవాడు, పరిపాలించేవాడు యెహోవా
5 యెహోవా, సత్యదేవుడు ఈ సంగతులు చెప్పాడు: (ఆకాశాలను యెహోవా చేశాడు. ఆకాశాలను భూమిమీద విస్తరింపజేసినవాడు యెహోవా. ఆయనే భూమిమీద సమస్తం చేసాడు. భూమిమీద మనుష్యులందరికి ఆయనే జీవం ప్రసాదిస్తాడు. భూమిమీద నడిచే ప్రతి వ్యక్తికి ఆయనే ప్రాణం పోస్తాడు.)
6 “మీరు సరైనది చేయాలని నిన్ను పిలిచింది నేనే, యెహోవాను.
నేను నీ చేయి పట్టుకొంటాను. నేను నిన్ను కాపాడుతాను.
ప్రజలతో నాకు ఒక ఒడంబడిక ఉంది అని తెలియజేసేందుకు నీవే ఒక సంకేతం.
నీవు ప్రజలందరి కోసం ప్రకాశించే వెలుగుగా ఉంటావు.
7 గుడ్డివాళ్ల కళ్లు నీవు తెరుస్తావు. వాళ్లు చూడగలుగుతారు.
అనేక మంది ప్రజలు చెరలో ఉన్నారు. ఆ ప్రజలను నీవు విడుదల చేస్తావు.
అనేక మంది ప్రజలు చీకట్లో జీవిస్తున్నారు. ఆ బందీ గృహంనుండి నీవు వారిని బయటకు నడిపిస్తావు.
8 “నేను యెహోవాను.
నా పేరు యెహోవా.
నేను నా మహిమను మరొకరికి ఇవ్వను.
నాకు చెందాల్సిన స్తుతిని విగ్రహాలకు (అబద్ధపు దేవుళ్ళకు) చెందనివ్వను.
9 కొన్ని సంగతులు జరుగుతాయని మొదట్లోనే నేను చెప్పాను,
ఆ సంగతులు జరిగాయి.
ఇప్పుడు, భవిష్యత్తులో జరుగబోయే సంగతులను గూర్చి,
అవి జరుగక ముందే నేను మీకు వాటిని గూర్చి చెబుతాను.”
5 యెహోవా, నీ నిజమైన ప్రేమ ఆకాశాల కంటె ఉన్నతమైనది.
నీ నమ్మకత్వం మేఘాలకంటె ఉన్నతం.
6 యెహోవా, నీ నీతి “దేవతల పర్వతాల కంటె ఉన్నతమైనది.”
నీ న్యాయం లోతైన మహాసముద్రం కంటె లోతైనది.
యెహోవా, నీవు మానవులను, జంతువులను కాపాడుతావు.
7 ప్రేమగల నీ దయకంటె ఎక్కువ ప్రశస్తమైనది ఇంకేది లేదు.
కాపుదల కోసం మనుష్యులు, దేవ దూతలు నీ దగ్గరకు వస్తారు.
8 యెహోవా, నీ ఇంటిలోని సమృద్ధియైన ఆహారంనుండి వారు నూతన బలం పొందుతారు.
అధ్బుతమైన నీ నదిలోనుండి నీవు వారిని త్రాగనిస్తావు.
9 యెహోవా, జీవపు ఊట నీ నుండి ప్రవహిస్తుంది.
నీ వెలుగు మమ్మల్ని వెలుగు చూడనిస్తుంది.
10 యెహోవా, వాస్తవంగా నిన్ను ఎరిగినవారిని ప్రేమించటం కొనసాగించుము.
నీకు నమ్మకంగావుండే ప్రజలకు నీ మేలు కలుగనిమ్ము.
11 యెహోవా, గర్విష్ఠుల మూలంగా నన్ను పట్టుబడనివ్వకుము.
దుర్మార్గుల చేత తరుమబడనియ్యకుము.
యేసు రక్తం
11 దేవుడు చేసిన మంచి పనులు సాగించటానికి క్రీస్తు ప్రధాన యాజకుడై పరలోకంలోని గుడారానికి వెళ్ళాడు. ఆ గుడారం చాలా పెద్దది. శ్రేష్ఠమైనది. అది మానవుడు నిర్మించింది కాదు. 12 ఆయన మేకల రక్తం ద్వారా, దూడల రక్తం ద్వారా ఆ గుడారంలోకి వెళ్ళలేదు. తన స్వంత రక్తంతో అతి పవిత్రమైన ఆ స్థలాన్ని శాశ్వతంగా ప్రవేశించి, మనకు శాశ్వతమైన రక్షణ కలిగించాడు.
13 మేకల రక్తాన్ని, ఎద్దుల రక్తాన్ని, దూడలను కాల్చిన బూడిదను, అపవిత్రంగా ఉన్నవాళ్ళపై ప్రోక్షించి, వాళ్ళను పవిత్రం చేసేవాళ్ళు. ఇలా చేయటం వల్ల వాళ్ళు బాహ్యంగా మాత్రమే పవిత్రులౌతారు. 14 కాని, నిష్కళంకుడైన యేసు శాశ్వతమైన తన ఆత్మను దేవునికి అర్పించుకొన్నాడు. తద్వారా క్రీస్తు రక్తం మన చెడు అంతరాత్మల్ని కూడా పరిశుద్ధం చేస్తోంది. మనము సజీవుడైన దేవుణ్ణి ఆరాధించాలని ఆయనీవిధంగా చేసాడు.
15 ఈ కారణంగా క్రీస్తు క్రొత్త ఒడంబడికకు మధ్యవర్తి అయ్యాడు. ఈయన దేవుడు పిలిచినవాళ్ళకు దేవుడు వాగ్దానం చేసిన శాశ్వత వారసత్వం లభించేటట్లు చేస్తాడు. మొదటి ఒడంబడిక చెలామణిలో ఉండగా ప్రజలు చేసిన పాపాలకు తన ప్రాణాన్ని వెలగా చెల్లించి వాళ్ళకు స్వేచ్ఛ కలిగించాడు.
యేసు బేతనియలో తన స్నేహితులతో
(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. 6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. 8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
లాజరుకు విరోధముగా కుట్ర
9 ఇంతలో పెద్ద యూదుల గుంపు ఒకటి యేసు అక్కడవున్నాడని విని అక్కడికి వచ్చింది. ఆయన కోసమే కాకుండా ఆయన బ్రతికించిన లాజరును కూడా చూడటానికి వచ్చారు. 10-11 తద్వారా ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని పన్నాగం పన్నారు. ఎందుకంటే యితని కారణంగానే చాలామంది యూదులు యేసు దగ్గరకు వెళ్ళి ఆయన యందు నమ్మకం ఉంచారు.
© 1997 Bible League International