Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: దావీదు కీర్తన.
20 నీకు కష్టాలు కలిగినప్పుడు సహాయంకోసం నీవు చేసే ప్రార్థనకు యెహోవా నీకు జవాబు ఇచ్చును గాక.
యాకోబు దేవుడు నీ పేరును ప్రసిద్ధి చేయును గాక.[a]
2 దేవుడు తన పవిత్ర స్థలం నుండి నీకు సహాయం పంపించునుగాక.
సీయోను[b] నుండి ఆయన నిన్ను బలపర్చునుగాక!
3 నీవు అర్పించిన కానుకలు అన్నింటినీ దేవుడు జ్ఞాపకం చేసుకొనునుగాక.
నీ బలి అర్పణలు అన్నింటిని ఆయన స్వీకరించును గాక.
4 నీకు నిజంగా కావల్సిన వాటిని దేవుడు నీకు అనుగ్రహించును గాక.
నీ పథకాలన్నింటినీ ఆయన నెరవేర్చును గాక.
5 దేవుడు నీకు జయము నిచ్చినప్పుడు మనం సంతోషించుదుముగాక.
దేవుని నామమునకు స్తోత్రము కలుగును గాక.
నీవు అడిగినది అంతా యెహోవా నీకు అనుగ్రహించును గాక.
6 ఇప్పుడు, యెహోవా ఏర్పాటు చేసుకొన్న రాజుకు ఆయనే సహాయం చేస్తాడని నాకు తెలుసు.
దేవుడు తన పవిత్ర పరలోకంలో నుండి, ఆయన ఏర్పాటు చేసుకొన్న రాజుకు జవాబు ఇచ్చాడు.
ఆ రాజును రక్షించుటకు దేవుడు. తన మహత్తర శక్తిని ప్రయోగించాడు.
7 కొందరు మనుష్యులు వారి రథాలను నమ్ముకొంటారు. మరికొందరు వారి గుర్రాలను నమ్ముకొంటారు.
కాని మనం మన దేవుడైన యెహోవాను నమ్ముకొంటాము.
8 ఆ మనుష్యులు ఓడించబడ్డారు, వారు యుద్ధంలో మరణించారు.
కాని మనం గెలిచాము! మనం విజయులముగా నిలిచాము!
9 దేవుడు రాజును రక్షించును గాక!
మేము సహాయము కొరకు పిలుచునప్పుడు మాకు ఉత్తర మిమ్ము.
యోతాము కథ
7 షెకెము పట్టణ నాయకులు అబీమెలెకును రాజుగా చేసారని యోతాము విన్నాడు. అతడు ఇది విన్నప్పుడు వెళ్లి గెరిజీము కొండ శిఖరం మీద నిలబడ్డాడు. యోతాము ఈ కథను గట్టిగా అరచి, ప్రజలకు ఇలా చెప్పాడు:
“షెకెము పట్టణ నాయకులారా, నా మాట వినండి. తర్వాత దేవుడు మీ మాట వినును.
8 “ఒకనాడు వృక్షాలన్నీ వాటిని ఏలేందుకు ఒక రాజును ఏర్పాటు చేసుకోవాలని అనుకొన్నాయి. ఆ చెట్లు, ‘నీవే మా రాజుగా ఉండు’ అని ఒలీవ చెట్టుతో అన్నాయి.
9 “కాని ఒలీవ చెట్టు అంది: ‘నా తైలం కోసం మనుష్యులు, దేవుళ్లు నన్ను పొగడుతారు. కేవలం నేను వెళ్లి ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగేందుకోసం నా తైలాన్ని తయారు చేయడం నేను మానివేయాలా?’
10 “అప్పుడు ఆ చెట్లు అంజూరపు చెట్టుతో, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని అడిగాయి.
11 “కాని, ‘కేవలం ఇతర చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం మధురమైన నా మంచి ఫలం ఫలించటం మానివేయాలా?’ అన్నది ఆ అంజూరపు చెట్టు.
12 “అప్పుడు ఆ చెట్లు, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ద్రాక్షావల్లితో, అన్నాయి.
13 “కాని ద్రాక్షావల్లి, ‘నా ద్రాక్షారసం మనుష్యులను, రాజులను సంతోష పెడుతుంది. కేవలం నేను వెళ్లి ఆ చెట్ల మీద అటూ ఇటూ ఊగటం కోసం నా ద్రాక్షరసం తయారు చేయటం నేను మానివేయాలా?’ అన్నది.
14 “చివరికి చెట్లన్నీ కలసి, ‘వచ్చి మా మీద రాజుగా ఉండు’ అని ముళ్లకంపతో అన్నాయి.
15 “కాని ఆ ముళ్లకంప, ‘మీరు నన్ను నిజంగా మీ మీద రాజుగా చేయాలని కోరితే మీరు వచ్చి నా నీడలో ఆశ్రయం తీసుకోండి. కాని అలా చేయటం ఇష్టం లేకపోతే అప్పుడు ముళ్ల కంపలో నుండి అగ్ని వచ్చునుగాక. ఆ అగ్ని లెబానోను దేవదారు వృక్షాలను కూడా కాల్చి వేయును గాక’ అని ఆ చెట్లతో చెప్పినది.
క్రీస్తు విరోధుల విషయంలో జాగ్రత్త
18 బిడ్డలారా! ఇది చివరి గడియ. క్రీస్తు విరోధి రానున్నాడని మీరు విన్నారు. ఇప్పటికే క్రీస్తు విరోధులు చాలా మంది వచ్చారు. తద్వారా యిది చివరి గడియ అని తెలిసింది. 19 క్రీస్తు విరోధులు మననుండి విడిపొయ్యారు. నిజానికి, వాళ్ళు మనవాళ్ళు కారు. ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళైనట్లయితే మనతోనే ఉండిపొయ్యేవాళ్ళు. వాళ్ళు వెళ్ళిపోవటం, వాళ్ళలో ఎవ్వరూ మనవాళ్ళు కారని తెలుపుతోంది.
20 కాని దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. తద్వారా మీరంతా సత్యాన్ని గురించి తెలుసుకొన్నారు. 21 మీకు సత్యాన్ని గురించి తెలియదని భావించి నేను మీకు వ్రాస్తున్నాననుకోకండి. సత్యాన్ని గురించి మీకు తెలుసు. పైగా సత్యంనుండి అసత్యం బయటకు రాదు.
22 అసత్యమాడేవాడెవ్వడు? యేసే క్రీస్తు కాదని అనేవాడు. అతడే క్రీస్తు విరోధి. అలాంటి వ్యక్తి తండ్రిని, కుమారుణ్ణి నిరాకరిస్తాడు. 23 కుమారుణ్ణి నిరాకరించే వ్యక్తికి తండ్రి రక్షణ ఉండదు. కుమారుణ్ణి అంగీకరించే వ్యక్తికి తండ్రి రక్షణ తోడుగా ఉంటుంది.
24 మొదట మీరు విన్నవి మీలో ఉండిపోయేటట్లు చూసుకోండి. అప్పుడే మీరు కుమారునిలో, తండ్రిలో జీవించగలుగుతారు. 25 పైగా ఆయన మనకు నిత్యజీవం గురించి వాగ్దానం చేసాడు.
26 ఇవన్నీ మిమ్మల్ని తప్పుదారి పట్టించటానికి ప్రయత్నం చేస్తున్నవాళ్ళను గురించి వ్రాస్తున్నాను. 27 ఇక మీ విషయం అంటారా? దేవుడు మిమ్మల్ని అభిషేకించాడు. దానివల్ల కలిగిన ఫలం మీలో ఉంది. మీకెవ్వరూ బోధించవలసిన అవసరం లేదు. ఆ అభిషేకం వల్ల మీలో జ్ఞానం కలుగుతుంది. దేవుడు మీకు నిజంగా అభిషేకమిచ్చాడు. అది అసత్యం కాదు. ఆయన బోధించిన విధంగా ఆయనలో నివసించండి.
28 బిడ్డలారా! ఆయన ప్రత్యక్ష్యమైనప్పుడు మనలో ధైర్యం ఉండేటట్లు, ఆయన సమక్షంలో సిగ్గు పడకుండా ఉండేటట్లు ఆయనలో జీవిస్తూ ఉండండి.
© 1997 Bible League International