Revised Common Lectionary (Complementary)
దేవుడు తన ప్రజలను మరల రక్షిస్తాడు
16 యెహోవా సముద్రంలో మార్గాలు వేస్తాడు. కల్లోలిత జలాలలో గూడ ఆయన తన ప్రజలకు ఒక బాట వేస్తాడు. మరియు యెహోవా చెబుతున్నాడు, 17 “రథాలు, గుర్రాలు, సైన్యాలతో నాకు విరోధంగా యుద్ధం చేసేవారు ఓడించబడతారు. వాళ్లు మళ్లీ ఎన్నటికీ లేవరు. వారు నాశనం చేయబడతారు. క్రొవ్వువత్తి మంట ఆర్పినట్టుగా వారు ఆర్పివేయబడతారు. 18 కనుక మొదట్లో జరిగిన సంగతులను జ్ఞాపకం చేసుకోవద్దు. చాలా కాలం క్రిందట జరిగిన ఆ సంగతులను గూర్చి ఆలోచించవద్దు. 19 ఎందుకంటే నేను నూతన కార్యాలు చేస్తాను. ఇప్పుడు మీరు క్రొత్త మొక్కలా ఎదుగుతారు. ఇది సత్యమని మీకు గట్టిగా తెలుసు. నేను నిజంగానే అరణ్యంలో బాట వేస్తాను. నిజంగానే నేను ఎడారిలో నదులు ప్రవహింపజేస్తాను. 20 అడవి జంతువులు కూడ నాకు కృతజ్ఞత కలిగి ఉంటాయి. నిప్పుకోళ్లు, పెద్ద జంతువులు నన్ను ఘనపరుస్తాయి. అరణ్యంలో నేను నీళ్లను ప్రవహింప చేసినప్పుడు అవి నన్ను ఘనపరుస్తాయి. ఎడారిలో నేను నదులను ప్రవహింప జేసినప్పుడు అవి ఘనపరుస్తాయి. నేను ఏర్పరచుకొన్న నా ప్రజలకు నీళ్లు ఇవ్వటానికి నేను దానిని చేస్తాను. 21 వీరే నేను చేసిన మనుష్యులు. ఈ ప్రజలు నన్ను స్తుతించుటకు పాటలు పాడతారు.
యాత్ర కీర్తన.
126 యెహోవా మమ్మల్ని దేశ బహిష్కరణ నుండి
తిరిగి వెనుకకు తీసుకొని వచ్చినప్పుడు అది ఒక కలలా ఉంది!
2 మేము నవ్వుకుంటున్నాము.
మరియు మేము అకస్మాత్తుగా సంతోషగానాలు పాడటం మొదలుపెట్టేవాళ్లము.
“దేవుడు ఇశ్రాయేలు ప్రజల కొరకు గొప్ప కార్యాలు చేశాడు.”
3 ఇతర రాజ్యాల ప్రజలు దాన్ని గూర్చి చెప్పుకొన్నారు. “ఇశ్రాయేలు ప్రజల కోసం యెహోవా మాకు ఆశ్చర్యకరమైన పనులు చేశాడు” అని ఆ ప్రజలు చెప్పారు. మేము చాలా ఆనందంగా ఉన్నాము!
4 యెహోవా మేము ఖైదీలముగా ఉన్నాము.
ఇప్పుడు ఎడారిని వికసింప చేసే నీటి ప్రవాహంలా మమ్మల్ని తిరిగి స్వతంత్రులుగా చేయుము.
5 విత్తనాలు నాటేటప్పుడు ఒకడు దుఃఖముగా ఉండవచ్చు,
కాని పంట కూర్చుకొనేటప్పుడు సంతోషంగా ఉంటాడు.
6 అతడు బయట పొలాల్లోనికి విత్తనం మోసికొని పోవునప్పుడు ఏడ్వవచ్చు,
కాని పంటను ఇంటికి తెచ్చునప్పుడు అతడు సంతోషిస్తాడు.
4 కాని అలాంటి ఆచారాలను విశ్వసించటానికి నాకు కారణాలు ఉన్నాయి. బాహ్యమైన ఈ ఆచారాలను నమ్మటం ముఖ్యమని యితరులు అనుకొంటున్నట్లయితే వాటిని నమ్మటానికి వాళ్ళకన్నా నాకు ఎక్కువ కారణాలు ఉన్నాయి. 5 నేను పుట్టిన ఎనిమిదవ రోజు నాకు సున్నతి చేసారు. నేను బెన్యామీను తెగకు చెందిన వాణ్ణి. పుట్టుకతో ఇశ్రాయేలు దేశస్థుణ్ణి. హెబ్రీయులకు జన్మించిన హెబ్రీయుణ్ణి. ధర్మశాస్త్రాన్ని అనుసరించే పరిసయ్యుణ్ణి. 6 ఉత్సాహంతో సంఘాన్ని హింసించిన వాణ్ణి. ధర్మశాస్త్రాల్లోని నియమాలను పాటించటంలో నేను ఒక్క తప్పు కూడా చేయలేదు.
7 నేను క్రీస్తు విశ్వాసిని అయినందుకు, ఇదివరలో లాభంగా పరిగణించిన వాటిని నేను ప్రస్తుతం నష్టంగా పరిగణిస్తున్నాను. 8 అంతేకాక, నా ప్రభువైన యేసు క్రీస్తును తెలుసుకోవటం చాలా గొప్ప విషయం. ఆయనతో పోల్చి చూస్తే అన్నీ వృథా అనిపిస్తుంది. ఆయన కొరకు నేను అన్నీ వదిలి వచ్చాను. క్రీస్తును పొందాలని వాటిని చెత్తగా పరిగణిస్తున్నాను. 9 ఆయనలో ఐక్యత పొంది ఉండటమే నా ఉద్దేశ్యము. ధర్మశాస్త్రాన్ని అనుసరించి పొందే నీతి నాకు అనవసరం. క్రీస్తులో విశ్వాసం ఉండటంవల్ల లభించే నీతి నాకు కావాలి. 10 నాకు క్రీస్తును తెలుసుకోవాలని ఉంది. చావునుండి బ్రతికి రాగల శక్తిని గురించి తెలుసుకోవాలని ఉంది. ఆయన పొందిన కష్టాల్లో పాలుపంచుకొని ఆయనతో స్నేహం పొందాలని ఉంది. ఆయనతో మరణించి ఆయనలా అయిపోవాలని ఉంది. 11 ఇవన్నీ చేసి తిరిగి బ్రతికి రావాలని ఉంది. దీన్ని ఏదో ఒక విధంగా సాధించాలని ఉంది.
గమ్యం వైపు పరుగెత్తటం
12 వీటన్నిటిని నేను యింకా సాధించలేదు. నాలో పరిపూర్ణత యింకా కలుగలేదు. కాని క్రీస్తు దేనికోసం నన్ను ఎన్నుకొన్నాడో దాన్ని నేను చేజిక్కించుకోవాలని పట్టుదలతో సాగిపోతున్నాను. 13 సోదరులారా! అది నాకు చిక్కిందని నేను అనుకోవటం లేదు. కాని ఒకటి మాత్రం నేను చేస్తున్నాను. గతాన్ని మరచిపోయి భవిష్యత్తులో ఉన్న దానికోసం కష్టపడుతున్నాను. 14 గమ్యాన్ని చేరుకొని బహుమతి పొందాలని ముందుకు పరుగెత్తుతున్నాను. దేవుడు నేను ఈ గమ్యాన్ని చేరుకోవాలని యేసు క్రీస్తు ద్వారా నన్ను పరలోకం కొరకు పిలిచాడు.
యేసు బేతనియలో తన స్నేహితులతో
(మత్తయి 26:6-13; మార్కు 14:3-9)
12 పస్కా పండుగకు ఆరు రోజుల ముందే యేసు బేతనియ చేరుకున్నాడు. యేసు బ్రతికించిన లాజరు యింతకు పూర్వం ఆ గ్రామంలో నివసిస్తూ ఉండేవాడు. 2 అక్కడ యేసు గౌరవార్థం ఒక విందు ఏర్పాటు చేయబడింది. మార్త వడ్డిస్తూ ఉంది. యేసుతో సహా కూర్చున్న వాళ్ళలో లాజరు ఒకడు. 3 మరియ జటామాంసి చెట్టుతో చేయబడిన ఒక సేరున్నర విలువైన మంచి అత్తరు యేసు పాదాల మీద పోసి, తన తల వెంట్రుకలతో పాదాలను తుడుచింది. ఇల్లంతా అత్తరు వాసనతో నిండిపోయింది.
4-5 యూదా ఇస్కరియోతు యేసు శిష్యుల్లో ఒక్కడు. యేసుకు ద్రోహం చెయ్యబోయేవాడు వీడే. యూదా, “ఈ అత్తరు అమ్మి, ఆ డబ్బు పేద వాళ్ళ కెందుకివ్వలేదు. ఆ అత్తరు వెల మూడువందల దేనారా లన్నా ఉంటుంది కదా!” అని అన్నాడు. 6 యూదాకు పేద వాళ్ళపై కనికరం ఉండుటవలన యిలా అనలేదు. వీడు దొంగ. డబ్బు సంచి తన దగ్గర ఉండటంవల్ల దానిలోవున్న డబ్బు దొంగలించే వాడు.
7 యేసు, “ఆమె ఈ అత్తరుతో నన్ను సమాధికి సిద్ధం చెయ్యటానికి ఈనాటి దాకా దాన్ని దాచి ఉంచింది. 8 మీతో పేదవాళ్ళు ఎప్పటికీ ఉంటారు. కాని నేను ఎల్లకాలం మీతో ఉండను” అని అన్నాడు.
© 1997 Bible League International