Revised Common Lectionary (Complementary)
సంగీత నాయకునికి: మాహలతు రాగంలో పాడదగిన దావీదు ధ్యానం.
53 తెలివి తక్కువ వాడు మాత్రమే దేవుడు లేడని తలుస్తాడు.
అలాంటి మనుష్యులు చెడిపోయిన వారు, చెడు విషయాలను చేస్తారు.
సరియైనదాన్ని చేసేవాడు ఒక్కడూ లేడు.
2 నిజంగా దేవుడు పరలోకంలో ఉండి మనల్ని చూస్తూ ఉన్నాడు.
దేవునికొరకు చూసే జ్ఞానంగలవాళ్లు ఎవరైనా ఉన్నారేమో అని
కనుగొనేందుకు దేవుడు చూస్తూ ఉన్నాడు.
3 కాని ప్రతి మనిషీ దేవునికి వ్యతిరేకంగా తిరిగి పోయాడు.
ప్రతి మనిషీ చెడ్డవాడే.
మంచి చేసేవాడు లేడు.
ఒక్కడూ లేడు.
4 దేవుడు చెబుతున్నాడు, “ఆ దుర్మార్గులకు సత్యం బాగా తెలుసు.
కాని వారు నన్ను ప్రార్థించరు.
ఆ దుర్మార్గులు వారి భోజనం తినటానికి ఎంత సిద్ధంగా ఉంటారో నా ప్రజలను నాశనం చేయటానికి కూడ అంత సిద్ధంగా ఉంటారు.”
5 కాని ఆ దుర్మార్గులు ఇంతకు ముందెన్నడూ
భయపడనంతగా భయపడిపోతారు.
ఆ దుర్మార్గులు ఇశ్రాయేలీయులకు శత్రువులు. దేవుడు ఆ దుర్మార్గులను నిరాకరించాడు.
కనుక మీరు వారిని ఓడిస్తారు.
దేవుడు మీ శత్రువుల ఎముకలను చెదరగొట్టేస్తాడు.
6 ఇశ్రాయేలు ప్రజలారా,
సీయోనుకు విజయాన్ని ఎవరిస్తారు?
దేవుడు తన ప్రజలను తిరిగి వర్ధిల్లజేసేటప్పుడు
యాకోబు సంతోషిస్తాడు.
ఇశ్రాయేలు బహుగా ఆనందిస్తాడు.
భూమికి విశ్రాంతి సమయం
25 సీనాయి కొండ దగ్గర యెహోవా మోషేతో మాట్లాడాడు. యెహోవా చెప్పాడు: 2 “ఇశ్రాయేలు ప్రజలతో చెప్పు: నేను మీకు ఇవ్వబోతున్న దేశంలో మీరు ప్రవేశిస్తారు. ఆ సమయంలో మీరు భూమికి ఒక ప్రత్యేక విశ్రాంతి సమయాన్ని కేటాయించాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ఒక ప్రత్యేక సమయంగా ఉంటుంది. 3 ఆరు సంవత్సరాలు మీరు మీ భూమిలో విత్తనాలు చల్లుకోవాలి. మీ ద్రాక్షా తోటల్లోని తీగెలను ఆరు సంవత్సరాలు మీరు కత్తిరించుకొంటూ, దాని ఫలాన్ని కూర్చుకోవాలి. 4 అయితే ఏడో సంవత్సరం మీరు భూమిని విశ్రాంతి తీసుకోనివ్వాలి. ఇది యెహోవాను ఘనపర్చేందుకు ప్రత్యేక విశ్రాంతి సమయంగా ఉంటుంది. మీరు మీ పొలాల్లో విత్తనాలు చల్లకూడదు లేక మీ ద్రాక్షాతోటల్లో తీగలను కత్తిరించకూడదు. 5 మీ పంట కోత అయిపోయిన తర్వాత వాటంతట అవే పెరిగే పంటను మీరు కోయకూడదు. కత్తిరించ బడని ద్రాక్షాతీగెలనుండి ద్రాక్షా పండ్లను మీరు కూర్చగూడదు. భూమికి అది విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది.
6 “భూమికి ఒక సంవత్సరం విశ్రాంతి సంవత్సరంగా ఉంటుంది గాని మీకు మాత్రం యింకా సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ ఆడ, మగ సేవకులందరికీ సరిపడినంత ఆహారం ఉంటుంది. మీ కూలి వాళ్లకు, మీ దేశంలో నివసించే విదేశీయులకు ఆహారం ఉంటుంది. 7 మీ పశువులు, ఇతర జంతువులు తినేందుకు సరిపడినంత ఆహారం ఉంటుంది.
ఉత్సవ కాలము-విమోచన సంవత్సరం (50వ సంవత్సర పండుగ కాలం)
8 “ఏడేసి సంవత్సరాల చొప్పున ఏడు ఏడుల సంవత్సరాలనుకూడ మీరు లెక్కించాలి. అది 49 సంవత్సరాలు అవుతుంది. ఆ సమయంలో దేశంలో ఏడు సంవత్సరాలు విశ్రాంతి ఉంటుంది. 9 ప్రాయశ్చిత్తం రోజున పొట్టేలు కొమ్మును మీరు ఊదాలి. అది ఏడో నెల పదోరోజు. పొట్టేలు కొమ్మును మీరు దేశ వ్యాప్తంగా ఊదాలి. 10 50వ సంత్సరాన్ని మీరు ఒక ప్రత్యేక సంవత్సరంగా చేయాలి. మీ దేశంలో నివసించే మనుష్యులందరికీ మీరు స్వతంత్రం ప్రకటించాలి. ఇది బూరధ్వని చేసే మహోత్సవ కాలం అని పిలువబడుతుంది. మీలో ప్రతి ఒక్కరూ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి. మరియు మీలో ప్రతి ఒక్కరూ తన కుటుంబానికి తిరిగి వెళ్లాలి. 11 50వ సంవత్సరం మీకు ప్రత్యేక సంబరంగా వుంటుంది. ఆ సంవత్సరములో విత్తనాలు చల్లవద్దు. వాటంతట అవే మొలిచే మొక్కల్ని కోయవద్దు. కత్తిరించబడని ద్రాక్షావల్లులనుండి ద్రాక్షాపండ్లు కూర్చవద్దు. 12 అది బూరధ్వని చేసే 50వ సంవత్సర పండుగ మహోత్సవ కాలం. అది మీకు పవిత్ర సమయంగా ఉంటుంది. పొలంనుండి వచ్చే పంటలను మీరు తినాలి. 13 బూరధ్వని చేసే మహోత్సవ కాలంలో ప్రతి వ్యక్తీ తన స్వంత ఆస్తిని తిరిగి పొందాలి.
14 “నీ పొరుగువానికి మీ భూమిని అమ్మినప్పుడు నీవు అతనికి మోసం చేయవద్దు. మరియు నీవు అతని వద్ద భూమిని కొన్నప్పుడు అతడ్ని నిన్ను మోసం చేయనీయకు. 15 నీ పొరుగువాని భూమిని నీవు కొనాలనుకొన్నప్పుడు, గడచిన బూరధ్వని చేసే మహోత్సవ కాలంనుండి ఎన్ని సంవత్సరాలు అయిందో లెక్కచూచి, దాన్ని బట్టి ధర నిర్ణయం చేయాలి. ఒకవేళ నీవు భూమి అమ్మితే, పంటలు కోసిన సంవత్సరాలు లెక్కించి, ఆ లెక్క ప్రకారం ధర నిర్ణయించాలి. 16 చాలా సంవత్సరాలు ఉంటే, ఖరీదు ఎక్కువ ఉంటుంది. సంవత్సరాలు తక్కువ ఉంటే ఖరీదు తగ్గించాలి. ఎందుచేతనంటే నీ పొరుగువాడు నిజానికి కొన్ని పంటలు మాత్రమే నీకు అమ్ముతున్నాడు. వచ్చే ఉత్సవంలో ఆ భూమి తిరిగి అతని కుటుంబ పరం అవుతుంది. 17 మీరు ఒకరికి ఒకరు మోసం చేయకూడదు. మీ దేవుణ్ణి మీరు ఘనపర్చాలి. నేను యెహోవాను మీ దేవుణ్ణి.
18 “నా ఆజ్ఞలు, నియమాలు జ్ఞాపకం ఉంచుకోండి. వాటికి విధేయులుగా ఉండండి. అప్పుడు మీరు మీ దేశంలో క్షేమంగా ఉంటారు. 19 మరియు భూమి మీకు మంచి పంటను ఇస్తుంది. అప్పుడు మీకు ఆహారం సమృద్ధిగా ఉంటుంది. మీరు దేశంలో క్షేమంగా ఉంటారు.
9 ఆ తదుపరి దూత నాతో, “ఇది వ్రాయి. గొఱ్ఱెపిల్ల పెళ్ళి విందుకు ఆహ్వానింపబడ్డ వాళ్ళు ధన్యులు.” అతడు యింకా ఇలా అన్నాడు, “ఇవి నిజంగా దేవుని మాటలు.”
10 ఇది విన్నాక అతన్ని ఆరాధించాలని నేను అతని కాళ్ళ మీద పడ్డాను. కాని అతడు నాతో, “అలా చేయవద్దు. నేను నీ తోటి సేవకుణ్ణి. యేసు చెప్పిన దాన్ని అనుసరించే సోదరుల సహచరుణ్ణి. దేవుణ్ణి ఆరాధించు. యేసు చెప్పిన విషయాలనే ప్రవక్తలు కూడా చెప్పారు” అని అన్నాడు.
© 1997 Bible League International